ప్రాతినిథ్య కథలు సమీక్ష - 4
కథ: సెకండ్ హజ్బెండ్
రచన: కుప్పిలి పద్మ
......................................................................................
“A memory is what is left when something happens and does not completely unhappen.”
– Edward De Bono
అచ్చం ఇల్లాంటి గ్నాపకమే కుప్పిలి పద్మ కథ సెకండ్ హజ్బెండ్ లో రెండో భర్తా, రెండో భార్యా అయిన అనిల్, దక్షిణల మధ్య ఘర్షణకు కారణం అవుతుంది.
గతం తాలూకు ఎమోషనల్ బ్యాగేజి ఇద్దరు కొత్త దంపతుల మధ్య (రెండో పెల్ళయినా అది పదోదయినా వారిద్దరికీ అది కొత్తదే కదా) వివాదాస్పదమవుతుంది. ఎవరి గ్నాపకానికి అనుమతి (allowed) వుంది, ఎవరి గతానికి సమ్మతి (accepted)లేదు అన్నదే అసలు చర్చ ఈ కథలో.
రేప్ వితిన్ మ్యారేజ్ ఇతివృత్తంతో వచ్చిన కథగా సెకండ్ హజ్బెండ్ కథని వర్గీకరించవచ్చు.
కథ చదివితే ఈ ఇతివృత్తం గురతుకు రానంతగా ప్రధాన చర్చ పక్క దోవ పడుతుంది కాబట్టి ఆ వర్గీకరణలో ఇది పేలవమయిన కథే.
*
స్త్రీవాద కథలుగా వర్గీకరించబడిన కథలు దాదాపుగా పొలిమికల్ (స్త్రీవాదన )గానే సాగుతుంటాయి చాలా మటుకు.
అది స్త్రీవాదంలో తర్ఫీదు కాకపోవడం వల్ల, కేవలం వాదనే సంగ్రహించడం వల్ల కొనసాగుతున్న లోపం.
స్థ్రీ కోణం నుంచి వాదనను చర్చకు పెట్టడం, తమ అస్థిత్వాన్ని ascertain చేయడంలో తలమునకలయిపోవడం ఒక కామన్ ట్రెయిట్ తెలుగు స్త్రీవాద కథలలో.
అది వాదనకు అవసరం, కానీ కథలో అదే ఎక్కువభాగం తీసుకోకూడదు.
అంతే!
అందుకే చాలా స్త్రీ వాద కథలు స్త్రీ వాదన కథలుగానే మిగిలిపోయాయి.
నిలిచిపోలేదు.
అయితే ఈ పొలిమికల్ పాటర్న్ అంత బండగా, మొరటుగా, మొండిగా, ఆగ్రహంగా కాక కాస్త ఈస్తటిక్ గా, సోఫెస్టికేటెడ్ గా, కించిత్ కన్ విన్సింగ్ గా పరిణతి చెందిందని కుప్పిలి పద్మ కథ అవగతం చేస్తోంది.
ఈ పరణతిని తక్కిన ఇటీవలి స్త్రీ వాద కథల్లోనూ పరామర్శించవచ్చు.
వాటి ప్రస్తావన ఇక్కడ డీవియేషన్.
స్థ్రీవాద కథ ఎందుకు బండగా, మొరటుగా, మొండిగా, ఆగ్రహ ప్రకటనగా మాత్రమే వుండకూడదని అనుకుంటున్నాంటే,
స్త్త్రీవాద లక్ష్యం పురుషుల్ని నిర్మూలించడం కాదు, పురుషాధిక్యతని కాబట్టి.
అందుకే స్త్త్రీవాదన కేవలం పురుషాధిక్యాన్ని పాయింట్ అవుట్ చేసి, అటాక్ చేసే దగ్గరే ఆగి పోకుండా, పురుషాధిక్యతతో పెంచబడ్డ, కన్ స్ట్రక్ట్ కాబడిన తననీ, తన ఆపోజిట్ జెండర్ ని అర్థం చేసుకుని కాన్ఫిడెన్స్ లోకి తీసుకునే విధంగా ఆ సెన్సిటైజేషన్ జరగాలి.
ఈ వివేకం స్థ్రీలందరినుంచి ఆశించడం గొంతెమ్మ కోరికే కానీ, స్థ్రీ వాద రచయితలకు ఇన్నేల్ళ తర్వాతయినా ఈ బాధ్యత మాత్రం వుంది.
అలాంటి బాధ్యతతోనే రాస్తున్న స్త్త్రీ వాద రచయిత్రుల్లో మిత్రమ కుప్పిలిపద్మ ఒకరు.
*
రెండో పెళ్ళి చేసుకున్న ఇద్దరి కథే సెకండ్ హజ్బెండ్.
కథ పేరు సెకండ్ మ్యారేజ్ కాదు... సెకండ్ హజ్బెండ్.
కాబట్టే ఇది స్త్రీ పక్షపాతంగా సాగిన కథ.
*
అనిల్ అమెరికాలో వుండి వచ్చిన యువకుడు.
కారణాలు తెలియదు కానీ(అనవసరం కూడా)అతని భార్య చనిపోయింది.
తన భార్య గౌరిని బతికివున్నప్పుడు ఎంత ఆరాధనగా చూసుకునేవాడో తెలియదు కానీ, చనిపోయిన తర్వాత మాత్రం ఆమె ఫోటో పూజగదిలో వుంచాడు అనిల్.
అయితే ఆమె మరణించి ఆరునెలలు తిరక్కుండానే మ్యాట్రిమోనీలో మరో పెళ్ళి సంబంధం కోసం వెతుక్కుంటున్న ఇద్దరు పిల్లలున్న విడోవర్ అతను.
*
థర్టీ ప్లస్ దక్షిణ భర్తను కోల్పోయి రెండేల్ళయ్యింది.
మ్యాట్రిమోనీ కాలమ్ ద్వారా అనిల్ ని ఎంచుకుంది.
అనిల్ ముమ్మాటికీ దక్షిణ ఎంపికే.
*
అయితే రచయిత్రి ఈ ఇద్దరి పాత్రల సహచరులు చనిపోయారు అన్న వివరాన్ని చాల సూచన ప్రాయంగా చెబుతుంది తొలి, మలి ప్రస్తావనలో.
అనిల్ : ‘‘ఆమె మమ్మల్ని వదిలి వెళ్ళిపోయి ఆరునెలలయ్యింది.’’
దక్షిణ: ‘‘ దురదృష్ట వశాత్తూ తను వెళ్ళిపోయారు’’. ‘‘ఈ రోజు విశ్వాస్ వెళ్ళిపోయిన రోజు’’
ఈ వాక్యాలలో ఎక్కడా మృత్యువు ధ్వనించడం లేదు.
పైగా విడిపోవడం, లేదా వేరే వ్యక్తితో వెళ్ళిపోవడం లాంటి కథకు అస్సలు తోడ్పడని అర్థాలూ స్ఫురిస్తున్నాయి.
ఇది యాధృచ్చికంగా జరిగిందా? లేక రచయిత్రి ఉద్దేశ్యపూర్వకంగా చేసిందా? తెలియదు. ఇది అవాయిడబుల్.
చాలా సటిల్ గా చెప్పాలనుకున్న విషయంలో, తన ఉద్దేశ్యాలను చేరవేయని వివరాలున్నాయని పద్మ గుర్తించి వుండి వుంటే ఈ డీవియేషన్ వచ్చేది కాదు.
*
ఇక తన రెండో భర్త ఎలా వుండాలనుకుంటోంది దక్షిణ? అన్న ప్రశ్నకు కథలో సమాధానం లేదు.
కానీ అనిల్ తన రెండో భార్య నుంచి ఏమి ఆశిస్తున్నాడో మాత్రం పకడ్బందీగా స్పష్టం.
1. పెళ్ళయినా పిల్లలులేని విడో అయివుండాలి.
2. తన కులమే అయి వుండాలి (ఈ వివరం అనిల్ తల్లి హైమవతి ద్వారా ‘‘మన వాళ్ళే అనుకో’’ అని చెప్పిస్తుంది రచయిత్రి).
3. అంటే అనిల్ జనరల్ మ్యాట్రిమోనీలో వెతకడం లేదు తన సహచరిని. తన క్యాస్ట్ మ్యాట్రిమొనిలోనే వెతుక్కుంటున్నాడు. చాలా స్పెసిఫిక్ అండ్ క్లియర్.
4. అమ్మాయి పేరెంట్స్ ఆమె దగ్గర వుండకూడదు.
5. అమ్మాయి దగ్గరి నుంచి ఎలాంటి లగేజ్, ఎమోషనల్ బ్యాగేజ్ కూడా వద్దని సూటిగా చెప్పేసాడు అనిల్.
6. అమ్మాయి సేవింగ్స్ నామినీ ‘తన’ పిల్లల మీద మార్చుకొమ్మని దక్షిణకు ‘సలహా’ రూపంలో డిమాండ్ చేస్తాడు.
ఇవీ అనిల్ రిక్వైర్ మెంట్స్ అండ్ కండిషన్స్.
చాట్ లో, స్కైప్ లో అనిల్, దక్షిణలు కొంత కాలం మాట్లాడుకున్న తర్వాత, ముఖాముఖంగా ఈ షరతులన్నింటికీ ఒప్పేసుకున్నతర్వాతే దక్షిణ తన కుడి కాలు పెట్టి అనిల్ ఇంటి గుమ్మం తొక్కుతుంది.
అనిల్ కు వున్న ఇలాంటి రిక్వైర్ మెంట్స్ , కండిషన్స్, ఇంత క్లారిటీ దక్షిణకు వున్నట్టు కనిపించదు.
అయితే దక్షిణ మ్యాట్రిమోనిలో చూసి అనిల్ ని కనుక్కుంది కాబట్టి, ఆమె కూడా తన కాస్ట్ మ్యాట్రిమోనీ కాలమ్ లోనే తన సెకండ్ హజ్బెండ్ ని వెతుక్కుంటోందని అర్థం చేసుకోవచ్చు.
ఈ ఒక్క కండిషన్ లేదా జాగ్రత్త తప్ప దక్షిణ పాటించిన, వ్యక్తపరిచిన ఏ నియమమూ కానరాదు కథలో.
మరి దక్షిణ ఎందుకింత బ్లాంక్ గా, ఇన్ డెసిసివ్ గా వుంది?
ఈ ప్రశ్నకూ కథలోనే సమాధానం వుంది.
‘‘ముందు చూపు తక్కువనుకుంటాను. నాకు తక్షణమే ముఖ్యం’’ – ఇదీ దక్షిణ ఆలోచనా విధానం.
ఇలా ఆలోచించే దక్షిణ డెసిసివ్ గా మారే ప్రయాణమే ఈ కథ.
*
చాలా సూటిగా తన మనసులో మాటని నిజాయితీగా చెప్పే ప్రాక్టికల్ అండ్ డామినీరింగ్ పర్సనాలిటీ అనిల్ అయితే, స్పాంటేనియస్ అండ్ తన మనసులోని మాటను అంత తొందరగా బయట పెట్టలేని, పైగా వాయిదా వేసే మనస్త్తత్వం వున్న ఎమోషనల్ బీయింగ్ గా దక్షిణ పాత్ర కనిపిస్తుంది.
ఈ ఇద్దరికీ మధ్య విబేధం, ఘర్షణ, వాదన వాళ్ళ వర్తమాన జీవితం నుంచి రావు.
వాళ్ళ గత జీవితం తాలూకు వాళ్ళు ఇంకా మోయాలనుకుంటున్న ఎమోషనల్ బ్యాగేజ్ నుంచి వస్తుంది.
రెండో పెల్ళి చేసుకున్న తర్వాత కూడా అనిల్ తన మొదటి భార్య గౌరి కి ‘రోజూ పూలమాల వేసి దీపం’ పెడతాడు.
ఇలా స్మరించుకోవడం దక్షిణకి నచ్చుతుంది. ఆ ఇంటిపైన గౌరవాన్ని పెంచుతుంది. అందుకే మొదటి భార్య గౌరి జయంతిని ఎంతో నిష్టగా పాటిస్తుంది దక్షిణ. విచిత్రం ఏమిటంటే గౌరి వాళ్ళమ్మ గంగా దేవికే ఈ తంతు పెద్దగా నచ్చదు. కానీ దక్షిణకు మాత్రం ‘‘గౌరి గారిని గుర్తు చేసుకోవడం, ఆమెకి ఒక కంటిన్యుటి వుండడం’’ నచ్చుతుంది.
అందుకే చాలా నిజాయితిగా తన మొదటి భర్త విశ్వాస్ ని కూడా అదే మోతాదులో తన రెండో భర్త అనిల్ గౌరవించాలని భావిస్తుంది.
అందుకే విశ్వాస్ జయంతిని కూడా, గౌరి జయంతిలానే నిర్వహిస్తుంది.
ఇక్కడే పేచీ మొదలవుతుంది.
ఇది పేచీ అనడం కన్నా ఆమె తన మనోఫలకంలో అణచిన పోటీ.
గౌరి ఫోటోని తొలిసారి పూజ గదిలో చూసినప్పుడు దక్షిణ ఎలాంటి కంగారుకూ గురి కాలేదు.
కానీ విశ్వాస్ ది ‘చిన్న’ ఫోటో పెట్టినపుడు మాత్రం సెకండ్ హజ్బెండ్ అనిల్, అత్త అభ్యంతరం వ్యక్తం చేస్తారు ఇలా...
‘‘వున్నట్టుండి పూజగదిలో తెలియని వాళ్ళ ఫోటో కనిపిస్తే ఎవరికైనా కంగారుగానే వుంటుంది.’’
అంటే విశ్వాస్ గురించి అనిల్ కి గాని, సెకండ్ అత్త హైమవతికి కానీ ఏమాత్రం డిటైల్ ఇవ్వలేదు దక్షిణ.
అందుకే వారికి అది షాక్ లేదా సర్ ప్రైజ్.
పైగా ‘‘ముందే ఒక్క మాట చెప్పి వుంటే’’ బాగుండేది అని అత్త హైమవతి చేసే కౌన్సిలింగ్ కూడా దక్షిణకు పట్టదు.
ఎందుకంటే దక్షిణ బై నేచర్ తన మనసు ముందే చెప్పేసే రకం కాదు.
దాచుకునే లేదా వాయిదా వేసే మనస్తత్వం వున్న వ్యక్తి.
*
ఇద్దరికీ మధ్య ఘర్షణ కు దారితీసేది ఈ ఫోటోల వ్యవహారమే.
మరణించిన ఇద్దరు సహజరులను స్మరించుకోవడం కోసం దాంపత్యాన్ని చిక్కుల్లో పడేసుకుని అందులో వివిక్ష, ఆధిపత్యం గురించిన చర్చ చేసుకుంటారు అనిల్, దక్షిణలు.
అనిల్ తన అభ్యంతరాన్ని దాచుకోడు. దక్షిణకు అభ్యంతరమే లేదు.
ఈ వివాదంలో దక్షిణపై అత్యాచారం జరుగుతంది. రేప్ వితిన్ మ్యారేజ్.
కానీ దీని గురించి పల్లెత్తు మాట అయినా మాట్లాడదు ఈ కథ.
*
“The husband cannot be guilty of a rape committed by himself upon his lawful wife, for by their mutual matrimonial consent and contract, the wife hath given herself in kind unto the husband, whom she cannot retract.”
- Sir Mathew Hale, Chief Justice in England (1600 A.D.)
ఈ జడ్జిమెంట్ ఇంగ్లండ్ చీఫ్ జస్టిస్ సర్ మాథ్యూ హేల్ 1600 లో ఇచ్చింది.
దీనికి మన శిక్షాస్మృతి లోని 375 సెక్షన్ లోని ఎక్సెప్షన్ కి పేద్ద తేడా లేదు.
“Sexual intercourse by man with his own wife, the wife not being under 15 years of age, is not rape.”
దీన్ని కదా కథ చర్చించి వుండవలసింది. ఇంత ఘోరాన్ని కదా కథ నిలదీసి వుండవలసింది.
దక్షిణ తన పై జరిగిన రేప్ వితిన్ మ్యారేజ్ గురించి పోరాడదు సరికదా పూర్తిగా యు టర్న్ తీసుకుంటుంది.
ఆమె ఆత్మగౌరవ పోరాటం అనిల్ అబార్షన్ చేసుకోమన్నా చేసుకోకపోవడం దగ్గర ఆగిపోతుంది.
రేప్ చేసినా అనిల్ తో కలిగిన బిడ్డకు జన్మ నివ్వడం దగ్గర ఆమె సాహసం నిలిచిపోతుంది.
దక్షిణలాగా ఈ సంకటాల్లో వున్న ఏ మహిళకు ఏరకంగా మేలు చేసే ముగింపు కానే కాదిది.
*
......................................................................
తరువాతి సమీక్ష ... పూడూరి రాజి రెడ్డి ‘‘ రెక్కల పెళ్ళాం’’