Monday, July 27, 2015

సాంగత్యంతరమ్మూర్తిళ్ళిన
మూత్రిళ్ళిన 
రాత్రుళ్ళంతటా
మూర్ఛిల్లి  
మూ 
     త్రిల్
    ల్లాలి

రాతిరి గురకకు
తెలి గరికలు 

సాంగత్యాల బైరాగిత్వాలకూ
పురా తత్వాలకూ
వాలుగా మురిసే చినుకు తమ సహవాసి
తడిసిన రెక్కల చిలుక తమ వనవాసి

గొందు గొంతు గోడు గుర్తు లేకపోతే
ఏ సమయమో రాలకపోతే
ఏ అనుస్పందన అనాకృత అక్షరమే
ఏకమైతే

అనువాద తోకల
శిరచ్ఛేదనల శబ్ద మార్గాల్లో
తొణకిసలాడే
చిత్రంకై ఎదురు చూసారు

చిత్రం మచ్చిక కాకపోయివుంటే
చేతులకూ రంగులవల్లిని అద్దివుండరు

వర్ణం వివర్ణమైనా 
ఇచ్ఛ చిలకరించక వుండరు 

తట్టేందుకు తలుపు ఎన్నడూ మూసిలేరు 
తట్టేందుకు మత్తిల్లిన దేహంతో లేరెన్నడూ

ప్రవక్తా
భస్మలేపనధారీ
ప్రాత: పాదచారీ
క్రితం క్రిత:

నర హంతక ప్రేయసీ
దారి మరలాను
మరిచాను దారు దారి శ్వాసని

క్రితం రాచపుండు
ప్రస్తుతమే నా ప్రార్థనా కణం

రెండింతల భూగోళ
అహంకారాన్నీ
ఇరు పక్షాల అమావాస్యనీ
నేనే

నేలకొరిగాను
కలల కేరింతలతో
నేల జారాను
మనసుల తడిలో

ఇరుపక్కలా  నల్లని గాలి 

అమ్మలేక 
నాన్న లేక
తేనే లేక
మూత్రమే కాక
కుక్క అరుపుల ప్రేమే లేకా
నిదుర లేక
ఇంకా ఇంకా ఇంకో ఇంకో వెతికిన కల ఏదో
కలతో కల
కల తోకలా

ఇలా
రాకపోయివుంటే 
రాసుకుపోలేక లతనూ
పోత పోసుకోకుండా కలనూ
కేవల ద్రిమ్మరికి నకలునయిపోయివుందును కదా

ఇలా
పోకపోయివుంటే
పూతకూ నోచుకోని నాగలిలా
చల్లుతూ పోదును విత్తులను
మొలక దఖలు పరచేందుకు

రాకపోకల నడిమ 
చిత్తము కడు చిత్రము 
గడుసరి గమ్మత్తు

నీ పరోక్షమే 
శ్మశానం
ఒక కనిపించని నిద్ర

ఏదీ లేక
ఏదో కాకా
ఏదో లేక
ఏది ఆవల ?
ఏది ఆ వల?

స్మరణ తృప్తితో
దిగంతాల అవశేషాల లెక్కింపులో
తలమునకల మునుగులో
మూలుగులో
బోన్ మ్యారో టుమారో
గ్రామఫోన్ గాడి గాఢ 

బాధిత బరిలో బర్రెనై బురదనై
తలంటు కోనీకుండా 
ప్రేయుసీ
సన్మాన అస్తికలేవో తగులుతున్నాయి 
ఆలింగనాల్లో

బతుకుకు కవల తృణీకరించబడింది

కదలికలే బదనికలు
మెతుకు ఎక్కడో సన్నగా 
నోటికి అందకుండా పండుతూనే వుంది

At my door
Perhaps, you have knocked 
When I was knocked out

చేతులే రాలేదు
అడ్డుపడేందుకు
అడ్డగీత గీసేందుకు
అంతిమ యానం ఎటు

బ్రతుకు రుతువు
మరణం కేవల క్రతువు

తలుపు మూసివున్నా తెరిచివున్నా 
చిద్భ్రమ

తెరిచీ మూయడమే 
పన్నాగం

అద్దంతో దస్తూరీ చెదిరిపోయింది
దహనఖానాలో అద్దం
సున్తీ చేసుకుంది

సూఫీ 
రాత్రికి పగటికీ మధ్య
అశూన్య స్మృతిని తెంపేయాలి 
గొప్ప సహనహంతో

ప్రేముఖీ
వంపు
జ్నాత చషకౌషది

సంస్పర్శల అభౌతికీ
వెడలిపో వికృత సమాస సంభాషణలతో
అల మరచిన అలసట ఏదో తీరంకై

ఇదేదో ఉండని సగం
ఊడని సంగమం

తిరగేయలేని అక్షరాలూ
తలకిందులైన నీడలు

అనీడల తలల కింద
మీగడల లో వేర్లు

గడవని ఉదయాలు
గడపని రాతవాతలు కనులకి

తలకిందులైన జాడలు
గుచ్చుకుంటున్న నడక
గుమ్మం ముందుట పడిగాపులు
కొమ్మచివరా అదేనా?

రెప్పలల్లార్చు
రెక్క లార్చు
చూపు నిప్పు

కొనలే అందని కౌగిలి

లోపలి నుంచి నడుచుకెల్ళిన ఎదురునీడ

నీటిని గిల్లి
కటిక ఆకాశ మాటల్లో దిగి
పుప్పొడి కాగడాల సమయంలో
చూడనిదంతా జీవితం
చూడాల్సిందంతా అజీవితం
సువాసనే కన్నెనుక

మరలిన కమలిని దారికేం తెలుసు
తొడల తోడు
మురిసీ కమిలిన దేహంకే తెలియదు 
గాలి నీడ

ప్రాప్తీ
అసంతృప్త సంప్రాప్తీ
శ్వాస నిష్పత్తుల అహంకారీ
ప్రియులెవరో
స్వప్న స్పర్శల జాలంలో
నిర్దేశ స్పందనే ఓ బింబం

అబింబం
మరో స్పందన

గాలి తమ చిరునామా
లాలి దాని వీలునామా

కాస్తో 
శాశ్వతమో 
నిదురపట్టేట్టు వుంది

............................................................................................................
అజయ్ ప్రసాద్
అనంతు
ఎంఎస్ నాయుడుSunday, July 5, 2015

gondola

i feel you in the stream
and in the sky
in the eyes and in their dreams
we are one

desires rake up
on the shores afar
as melodies linger within
times stand still

you are mine
and me a shadow of yours

gondola vacillate gently
while feelings jingle

today i feel a veena being strummed inside
elation galore
for today and forever
our union lasts eternal
...................................................
Telugu : neeti lonaa .....ningilonaa... song of 1965's film Vivaha Bandham

మీకు దండం, ఇక చాలు కవిత్వం!అకాల్పనికుల తుది శరణు కవనం

కవిత్వాని ఆవల కవిత్వం సమర్పించేది అల్పం

కవులు కవులే
ఎందుకంటే
మరో మెరుగయిన ఉనికి అయ్యేందుకు
లోన తోపు లేని జీవులే కవులు

పాఠకులు కృతి చమత్కారాలు

చెత్త కవిత్వం  కూడా నికార్సయిన ఉద్వేగాల చెలమనే

సహజత్వం అంటే వున్నదున్నట్టు
వున్నదున్నట్టుండటం అకళ

తక్కిని రచనలకి తమ రచన తెలియదు
కవనానికి మాత్రం తన కవనం ఎరుకే
ఇదే బాధాకరం

కళ ఒక సంభాషణ
పేటెంట్ కార్యాలయం కాదది

కవులది ప్రకటనల ప్రచురణల అవివేకం
కృతి పంచుకోవడం కన్నా
ఆకృతి పెంచుచుకోవడంలో తలమునకలయ్యే అల్పులు కవులు
20 వ శతాబ్దపు అత్యంత కీలక అద్భుత ఆవిష్కరణ కొల్లాజ్ తెలియదు కవులకు
కొల్లాజ్ అంటే కదంబం

పోయేదేమీ లేదు
కవులు కాలం చెల్లి పోవడం తప్ప

పంపకం లేనిదే పెంపకం చనదు

అపరిపక్వ కవులు అనుకరిస్తారు
పరిపక్వులు దొంగలిస్తారు

సైద్ధాంతికంగా
సిద్ధాంతానికీ, ఆచరణకూ అంతరం లేదు
కానీ
ఆచరణలోనే వుంది ఆ తేడా అంతా

నియమాలు చవటలకు మార్గదర్శకాలు

కవనంలో కండూతికి కండువా
దిగంబరతకు విస్మృతి

కవనం చేసే వమనం కవనం

కవనం తర్ఫీదు కవనంలోనే
కవనం గ్రహింపు కవనంలోంచే
ఇతర నుంచి నేర్వని జాతి కవులు

అందుకే
‘‘మీకేం తెలుసో అదే రాసి చావండి’’ అని ఎప్పుడూ కవులను నిలదీయకండి
‘‘చస్తారు’’

వారికేమీ తెలియదు,
అందుమూలంగానే వారు కవులు.

అసలు తమకంటూ
వాదించేందుకు ఒక సంగతి
వ్యక్తీకరంచేందుకు ఒక విషయం
తెలియబరిచేందుకు ఒక నిజం
పంచుకునేందుకు ఒక మాట
వుంటే

ఏ దగుల్బాజీ అయినా
కాలం చెల్లిన కవిత్వాన్ని
ఎందుకు ఎంచుకుంటాడో చెప్పండి?

………………………………………………..

- English : ' Please, No more Poetry' by Derek Beaulieu
- తెలుగు : anantu
Derek Alexander Beaulieu 1973 లో పుట్టిన కెనడా కవి

Wednesday, July 1, 2015

సెకండ్ హజ్బెండ్

ప్రాతినిథ్య కథలు సమీక్ష - 4
కథ: సెకండ్ హజ్బెండ్
రచన: కుప్పిలి పద్మ
......................................................................................
“A memory is what is left when something happens and does not completely unhappen.”
– Edward De Bono
అచ్చం ఇల్లాంటి గ్నాపకమే కుప్పిలి పద్మ కథ సెకండ్ హజ్బెండ్ లో రెండో భర్తా, రెండో భార్యా అయిన అనిల్, దక్షిణల మధ్య ఘర్షణకు కారణం అవుతుంది.
గతం తాలూకు ఎమోషనల్ బ్యాగేజి ఇద్దరు కొత్త దంపతుల మధ్య (రెండో పెల్ళయినా అది పదోదయినా వారిద్దరికీ అది కొత్తదే కదా) వివాదాస్పదమవుతుంది. ఎవరి గ్నాపకానికి అనుమతి (allowed) వుంది, ఎవరి గతానికి సమ్మతి (accepted)లేదు అన్నదే అసలు చర్చ ఈ కథలో.
రేప్ వితిన్ మ్యారేజ్ ఇతివృత్తంతో వచ్చిన కథగా సెకండ్ హజ్బెండ్ కథని వర్గీకరించవచ్చు.
కథ చదివితే ఈ ఇతివృత్తం గురతుకు రానంతగా ప్రధాన చర్చ పక్క దోవ పడుతుంది కాబట్టి ఆ వర్గీకరణలో ఇది పేలవమయిన కథే.
*
స్త్రీవాద కథలుగా వర్గీకరించబడిన కథలు దాదాపుగా పొలిమికల్ (స్త్రీవాదన )గానే సాగుతుంటాయి చాలా మటుకు.
అది స్త్రీవాదంలో తర్ఫీదు కాకపోవడం వల్ల, కేవలం వాదనే సంగ్రహించడం వల్ల కొనసాగుతున్న లోపం.
స్థ్రీ కోణం నుంచి వాదనను చర్చకు పెట్టడం, తమ అస్థిత్వాన్ని ascertain చేయడంలో తలమునకలయిపోవడం ఒక కామన్ ట్రెయిట్ తెలుగు స్త్రీవాద కథలలో.
అది వాదనకు అవసరం, కానీ కథలో అదే ఎక్కువభాగం తీసుకోకూడదు.
అంతే!
అందుకే చాలా స్త్రీ వాద కథలు స్త్రీ వాదన కథలుగానే మిగిలిపోయాయి.
నిలిచిపోలేదు.
అయితే ఈ పొలిమికల్ పాటర్న్ అంత బండగా, మొరటుగా, మొండిగా, ఆగ్రహంగా కాక కాస్త ఈస్తటిక్ గా, సోఫెస్టికేటెడ్ గా, కించిత్ కన్ విన్సింగ్ గా పరిణతి చెందిందని కుప్పిలి పద్మ కథ అవగతం చేస్తోంది.
ఈ పరణతిని తక్కిన ఇటీవలి స్త్రీ వాద కథల్లోనూ పరామర్శించవచ్చు.
వాటి ప్రస్తావన ఇక్కడ డీవియేషన్.
స్థ్రీవాద కథ ఎందుకు బండగా, మొరటుగా, మొండిగా, ఆగ్రహ ప్రకటనగా మాత్రమే వుండకూడదని అనుకుంటున్నాంటే,
స్త్త్రీవాద లక్ష్యం పురుషుల్ని నిర్మూలించడం కాదు, పురుషాధిక్యతని కాబట్టి.
అందుకే స్త్త్రీవాదన కేవలం పురుషాధిక్యాన్ని పాయింట్ అవుట్ చేసి, అటాక్ చేసే దగ్గరే ఆగి పోకుండా, పురుషాధిక్యతతో పెంచబడ్డ, కన్ స్ట్రక్ట్ కాబడిన తననీ, తన ఆపోజిట్ జెండర్ ని అర్థం చేసుకుని కాన్ఫిడెన్స్ లోకి తీసుకునే విధంగా ఆ సెన్సిటైజేషన్ జరగాలి.
ఈ వివేకం స్థ్రీలందరినుంచి ఆశించడం గొంతెమ్మ కోరికే కానీ, స్థ్రీ వాద రచయితలకు ఇన్నేల్ళ తర్వాతయినా ఈ బాధ్యత మాత్రం వుంది.
అలాంటి బాధ్యతతోనే రాస్తున్న స్త్త్రీ వాద రచయిత్రుల్లో మిత్రమ కుప్పిలిపద్మ ఒకరు.
*
రెండో పెళ్ళి చేసుకున్న ఇద్దరి కథే సెకండ్ హజ్బెండ్.
కథ పేరు సెకండ్ మ్యారేజ్ కాదు... సెకండ్ హజ్బెండ్.
కాబట్టే ఇది స్త్రీ పక్షపాతంగా సాగిన కథ.
*
అనిల్ అమెరికాలో వుండి వచ్చిన యువకుడు.
కారణాలు తెలియదు కానీ(అనవసరం కూడా)అతని భార్య చనిపోయింది.
తన భార్య గౌరిని బతికివున్నప్పుడు ఎంత ఆరాధనగా చూసుకునేవాడో తెలియదు కానీ, చనిపోయిన తర్వాత మాత్రం ఆమె ఫోటో పూజగదిలో వుంచాడు అనిల్.
అయితే ఆమె మరణించి ఆరునెలలు తిరక్కుండానే మ్యాట్రిమోనీలో మరో పెళ్ళి సంబంధం కోసం వెతుక్కుంటున్న ఇద్దరు పిల్లలున్న విడోవర్ అతను.
*
థర్టీ ప్లస్ దక్షిణ భర్తను కోల్పోయి రెండేల్ళయ్యింది.
మ్యాట్రిమోనీ కాలమ్ ద్వారా అనిల్ ని ఎంచుకుంది.
అనిల్ ముమ్మాటికీ దక్షిణ ఎంపికే.
*
అయితే రచయిత్రి ఈ ఇద్దరి పాత్రల సహచరులు చనిపోయారు అన్న వివరాన్ని చాల సూచన ప్రాయంగా చెబుతుంది తొలి, మలి ప్రస్తావనలో.
అనిల్ : ‘‘ఆమె మమ్మల్ని వదిలి వెళ్ళిపోయి ఆరునెలలయ్యింది.’’
దక్షిణ: ‘‘ దురదృష్ట వశాత్తూ తను వెళ్ళిపోయారు’’. ‘‘ఈ రోజు విశ్వాస్ వెళ్ళిపోయిన రోజు’’
ఈ వాక్యాలలో ఎక్కడా మృత్యువు ధ్వనించడం లేదు.
పైగా విడిపోవడం, లేదా వేరే వ్యక్తితో వెళ్ళిపోవడం లాంటి కథకు అస్సలు తోడ్పడని అర్థాలూ స్ఫురిస్తున్నాయి.
ఇది యాధృచ్చికంగా జరిగిందా? లేక రచయిత్రి ఉద్దేశ్యపూర్వకంగా చేసిందా? తెలియదు. ఇది అవాయిడబుల్.
చాలా సటిల్ గా చెప్పాలనుకున్న విషయంలో, తన ఉద్దేశ్యాలను చేరవేయని వివరాలున్నాయని పద్మ గుర్తించి వుండి వుంటే ఈ డీవియేషన్ వచ్చేది కాదు.
*
ఇక తన రెండో భర్త ఎలా వుండాలనుకుంటోంది దక్షిణ? అన్న ప్రశ్నకు కథలో సమాధానం లేదు.
కానీ అనిల్ తన రెండో భార్య నుంచి ఏమి ఆశిస్తున్నాడో మాత్రం పకడ్బందీగా స్పష్టం.
1. పెళ్ళయినా పిల్లలులేని విడో అయివుండాలి.
2. తన కులమే అయి వుండాలి (ఈ వివరం అనిల్ తల్లి హైమవతి ద్వారా ‘‘మన వాళ్ళే అనుకో’’ అని చెప్పిస్తుంది రచయిత్రి).
3. అంటే అనిల్ జనరల్ మ్యాట్రిమోనీలో వెతకడం లేదు తన సహచరిని. తన క్యాస్ట్ మ్యాట్రిమొనిలోనే వెతుక్కుంటున్నాడు. చాలా స్పెసిఫిక్ అండ్ క్లియర్.
4. అమ్మాయి పేరెంట్స్ ఆమె దగ్గర వుండకూడదు.
5. అమ్మాయి దగ్గరి నుంచి ఎలాంటి లగేజ్, ఎమోషనల్ బ్యాగేజ్ కూడా వద్దని సూటిగా చెప్పేసాడు అనిల్.
6. అమ్మాయి సేవింగ్స్ నామినీ ‘తన’ పిల్లల మీద మార్చుకొమ్మని దక్షిణకు ‘సలహా’ రూపంలో డిమాండ్ చేస్తాడు.
ఇవీ అనిల్ రిక్వైర్ మెంట్స్ అండ్ కండిషన్స్.
చాట్ లో, స్కైప్ లో అనిల్, దక్షిణలు కొంత కాలం మాట్లాడుకున్న తర్వాత, ముఖాముఖంగా ఈ షరతులన్నింటికీ ఒప్పేసుకున్నతర్వాతే దక్షిణ తన కుడి కాలు పెట్టి అనిల్ ఇంటి గుమ్మం తొక్కుతుంది.
అనిల్ కు వున్న ఇలాంటి రిక్వైర్ మెంట్స్ , కండిషన్స్, ఇంత క్లారిటీ దక్షిణకు వున్నట్టు కనిపించదు.
అయితే దక్షిణ మ్యాట్రిమోనిలో చూసి అనిల్ ని కనుక్కుంది కాబట్టి, ఆమె కూడా తన కాస్ట్ మ్యాట్రిమోనీ కాలమ్ లోనే తన సెకండ్ హజ్బెండ్ ని వెతుక్కుంటోందని అర్థం చేసుకోవచ్చు.
ఈ ఒక్క కండిషన్ లేదా జాగ్రత్త తప్ప దక్షిణ పాటించిన, వ్యక్తపరిచిన ఏ నియమమూ కానరాదు కథలో.
మరి దక్షిణ ఎందుకింత బ్లాంక్ గా, ఇన్ డెసిసివ్ గా వుంది?
ఈ ప్రశ్నకూ కథలోనే సమాధానం వుంది.
‘‘ముందు చూపు తక్కువనుకుంటాను. నాకు తక్షణమే ముఖ్యం’’ – ఇదీ దక్షిణ ఆలోచనా విధానం.
ఇలా ఆలోచించే దక్షిణ డెసిసివ్ గా మారే ప్రయాణమే ఈ కథ.
*
చాలా సూటిగా తన మనసులో మాటని నిజాయితీగా చెప్పే ప్రాక్టికల్ అండ్ డామినీరింగ్ పర్సనాలిటీ అనిల్ అయితే, స్పాంటేనియస్ అండ్ తన మనసులోని మాటను అంత తొందరగా బయట పెట్టలేని, పైగా వాయిదా వేసే మనస్త్తత్వం వున్న ఎమోషనల్ బీయింగ్ గా దక్షిణ పాత్ర కనిపిస్తుంది.
ఈ ఇద్దరికీ మధ్య విబేధం, ఘర్షణ, వాదన వాళ్ళ వర్తమాన జీవితం నుంచి రావు.
వాళ్ళ గత జీవితం తాలూకు వాళ్ళు ఇంకా మోయాలనుకుంటున్న ఎమోషనల్ బ్యాగేజ్ నుంచి వస్తుంది.
రెండో పెల్ళి చేసుకున్న తర్వాత కూడా అనిల్ తన మొదటి భార్య గౌరి కి ‘రోజూ పూలమాల వేసి దీపం’ పెడతాడు.
ఇలా స్మరించుకోవడం దక్షిణకి నచ్చుతుంది. ఆ ఇంటిపైన గౌరవాన్ని పెంచుతుంది. అందుకే మొదటి భార్య గౌరి జయంతిని ఎంతో నిష్టగా పాటిస్తుంది దక్షిణ. విచిత్రం ఏమిటంటే గౌరి వాళ్ళమ్మ గంగా దేవికే ఈ తంతు పెద్దగా నచ్చదు. కానీ దక్షిణకు మాత్రం ‘‘గౌరి గారిని గుర్తు చేసుకోవడం, ఆమెకి ఒక కంటిన్యుటి వుండడం’’ నచ్చుతుంది.
అందుకే చాలా నిజాయితిగా తన మొదటి భర్త విశ్వాస్ ని కూడా అదే మోతాదులో తన రెండో భర్త అనిల్ గౌరవించాలని భావిస్తుంది.
అందుకే విశ్వాస్ జయంతిని కూడా, గౌరి జయంతిలానే నిర్వహిస్తుంది.
ఇక్కడే పేచీ మొదలవుతుంది.
ఇది పేచీ అనడం కన్నా ఆమె తన మనోఫలకంలో అణచిన పోటీ.
గౌరి ఫోటోని తొలిసారి పూజ గదిలో చూసినప్పుడు దక్షిణ ఎలాంటి కంగారుకూ గురి కాలేదు.
కానీ విశ్వాస్ ది ‘చిన్న’ ఫోటో పెట్టినపుడు మాత్రం సెకండ్ హజ్బెండ్ అనిల్, అత్త అభ్యంతరం వ్యక్తం చేస్తారు ఇలా...
‘‘వున్నట్టుండి పూజగదిలో తెలియని వాళ్ళ ఫోటో కనిపిస్తే ఎవరికైనా కంగారుగానే వుంటుంది.’’
అంటే విశ్వాస్ గురించి అనిల్ కి గాని, సెకండ్ అత్త హైమవతికి కానీ ఏమాత్రం డిటైల్ ఇవ్వలేదు దక్షిణ.
అందుకే వారికి అది షాక్ లేదా సర్ ప్రైజ్.
పైగా ‘‘ముందే ఒక్క మాట చెప్పి వుంటే’’ బాగుండేది అని అత్త హైమవతి చేసే కౌన్సిలింగ్ కూడా దక్షిణకు పట్టదు.
ఎందుకంటే దక్షిణ బై నేచర్ తన మనసు ముందే చెప్పేసే రకం కాదు.
దాచుకునే లేదా వాయిదా వేసే మనస్తత్వం వున్న వ్యక్తి.
*
ఇద్దరికీ మధ్య ఘర్షణ కు దారితీసేది ఈ ఫోటోల వ్యవహారమే.
మరణించిన ఇద్దరు సహజరులను స్మరించుకోవడం కోసం దాంపత్యాన్ని చిక్కుల్లో పడేసుకుని అందులో వివిక్ష, ఆధిపత్యం గురించిన చర్చ చేసుకుంటారు అనిల్, దక్షిణలు.
అనిల్ తన అభ్యంతరాన్ని దాచుకోడు. దక్షిణకు అభ్యంతరమే లేదు.
ఈ వివాదంలో దక్షిణపై అత్యాచారం జరుగుతంది. రేప్ వితిన్ మ్యారేజ్.
కానీ దీని గురించి పల్లెత్తు మాట అయినా మాట్లాడదు ఈ కథ.
*
“The husband cannot be guilty of a rape committed by himself upon his lawful wife, for by their mutual matrimonial consent and contract, the wife hath given herself in kind unto the husband, whom she cannot retract.”
- Sir Mathew Hale, Chief Justice in England (1600 A.D.)
ఈ జడ్జిమెంట్ ఇంగ్లండ్ చీఫ్ జస్టిస్ సర్ మాథ్యూ హేల్ 1600 లో ఇచ్చింది.
దీనికి మన శిక్షాస్మృతి లోని 375 సెక్షన్ లోని ఎక్సెప్షన్ కి పేద్ద తేడా లేదు.
“Sexual intercourse by man with his own wife, the wife not being under 15 years of age, is not rape.”
దీన్ని కదా కథ చర్చించి వుండవలసింది. ఇంత ఘోరాన్ని కదా కథ నిలదీసి వుండవలసింది.
దక్షిణ తన పై జరిగిన రేప్ వితిన్ మ్యారేజ్ గురించి పోరాడదు సరికదా పూర్తిగా యు టర్న్ తీసుకుంటుంది.
ఆమె ఆత్మగౌరవ పోరాటం అనిల్ అబార్షన్ చేసుకోమన్నా చేసుకోకపోవడం దగ్గర ఆగిపోతుంది.
రేప్ చేసినా అనిల్ తో కలిగిన బిడ్డకు జన్మ నివ్వడం దగ్గర ఆమె సాహసం నిలిచిపోతుంది.
దక్షిణలాగా ఈ సంకటాల్లో వున్న ఏ మహిళకు ఏరకంగా మేలు చేసే ముగింపు కానే కాదిది.
*
......................................................................
తరువాతి సమీక్ష ... పూడూరి రాజి రెడ్డి ‘‘ రెక్కల పెళ్ళాం’’

వదిలెళ్ళిన జోల్ళు

ప్రాతినిథ్య కథా సంకలనం సమీక్ష - 3
కథ : వదిలెళ్ళిన జోల్ళు
రచన: మహిబెజవాడ
.................................................
‘‘జీవితం కాదు మారేది; మనం’’
- థోరో
*
ఒక తీరని కలగా మిగిలిపోయిన అద్భుతమైన కాల్పనికథే వదిలెల్లిన జోళ్ళు. జీవితంలో శరవేగంగా మాయమైపోయిన అపురూప, అరుదైన, అలవికాని అనురాగ, బాంధవ్య కుసుమాలు నజ్జ నజ్జు అయి కల్ళ ముందు నిలిచినప్పుడు కలిగే ఒక డిసూల్యూషన్ మెంట్ నుంచి పుట్టే అంతర్ నిరసనకు ప్రతి రూపమే మహిబెజవాడ మన ముందించిన ఈ సామూహిక స్వప్నం.
*
*
ఇదొక చైతన్య స్రవంతి శైలీ విన్యాసంలో సాగిన మెటారియలిస్టిక్ నేరేషన్. లేమి నుంచి కామి అయిన పాత్ర వ్యాసంగం. ఎంతో కవిత్వాత్మకంగా ఒక కొత్త బంగారు లోకాన్ని ఆవిష్కరిస్తూ మనల్ని తన వెంట తీసుకువెల్ళిన రచయిత చివరికి వచ్చే సరికి వాచ్యానికే దిగాడు. ఇలాంటి కల చెదిరిపోక తప్పదు... ఒక్కరే కంటే మాత్రం. కానీ అలా కల చెదరగొట్టడంలో కూడా రచయిత మకుటాన ప్రదర్శించిన సంయమనమే కడదాకా కాపాడుకోవాలి. అలా జరగలేదు. కథ క్రాష్ ల్యాండ్ అయింది. ఫలితంగా నోటు చుట్టూ జీవితం తిరుగుతోందని తేల్చేసింది కథ. నిజమే. రియాలిటీ బైట్స్. డబ్బులే (క్యాపిటలే) నిర్ధారిస్తోంది అంతా. కానీ అలా చెప్పడానికీ సౌందర్యం కావాలి. అయితే రచయిత మహి బెజవాడది బలమైన, నిజమైన గొంతుక అని తెలుస్తుంది కథ వింటుంటే. It is powerful and at the same time original, and thus wonderful.
*
అవును నిజంగానే శరీరం చాలా తేలికగా గాల్లో గాలిపటంలా ఎగురుతూ వుండేది.
మార్కెట్ మాంజా మన లోపలి పావురం గొంతుకోసి గాలిపటాన్ని చెట్టుకు ఉరేసింది.
లోనా, బయటా కనీస నిరసన సలపక చనిపోయే నిమిత్తమాత్రులం మనం.
*
దూరంగా కొండలు నున్నగా అచ్చం నారింజ రంగులోనే మెరుస్తూ గర్వంగా తలఎత్తుకుని భూమికే దిక్కు చూపే చుక్కానిలా నిలబడి కనబడేవి.
దురాశ పంజా మనకు బంజారా, జుబిలీ, మహేంద్రా, ల్యాంకో కొండలనే మిగిల్చింది; శపించింది.
అయినా ఎల్లాగయినా కాంక్రీట్ విల్లాల్లో బతకాలనే కలను పదిలంగా పదిమందికి పంచేసే రియల్ బ్రోకర్ గిరీ మనకు మాత్రమే సొంతం.
*
అవును అచ్చం మేఘాల వర్ణాలను తొడుక్కునేందుకు ఉవ్విళ్ళూరే నీళ్ళే అంతటా సెల పారేవి.
ఇప్పుడు జల జలగల దందా తాగే నీటికి రంగు, రుచి, వాసనా పులమింది.
హిమాలయాలనుంచి పారే రీజైకిల్డ్ ఫ్లేవర్డ్ నీల్ళనే కొందాం... తర తరాలుగా ఫ్లోరైడ్ తరాలనే, తలరాతలనే నిస్సిగ్గుగా ఇంకా ఇంకా కందాం.
*
అవును నిజంగానే నీటికన్నా నిర్మలంగా, పాలకన్నా స్వచ్ఛంగా అచ్చమైన మనుషులుండేవాళ్ళు.
ఇపుడంతా వినియోగదారులు, కొనుగోలు దారులు, ఆధార్ కార్డ్ హోల్డర్లు, పోటానుపోటీదారులు, కెరీరిస్టులు, సదా నిచ్చెనలే ఎక్కాలనుకునే పాములు, సక్సెస్ మంత్రా జపిస్తూ కిల్లింగ్ ఇన్ స్టింక్ట్ తో అనుక్షణం కట్ త్రోట్ బతకు నేరుస్తున్న తోడేలు ముఖాలుగా విడిపోయి వున్నారు మనుషులు.
*
సమూహాన్ని ఖండఖండాలుగా నరికేస్తున్నఒంటరి వీరుల ఏకాకి కుప్పలు మనుషులు.
*
గిరిగీసుకుని బరి లోకి దిగి పూర్ణ జీవితాన్ని శకలంలో దర్శించేందుకు సమాయత్తమైన కేవల పోరాటవీరులుగా మారిపోయారు మనుషులు.
*
జీవనాన చేష్టలుడిగి వనాన సాయుధులై సమరం సాగిస్తున్నారు మనుషులు.
*
కలవని తనాల అహంకారాల్లో (కంపా)అసార్ట్ మెంటలైజ్ అయిపోయి కకావికలయిపోయారు మనుషులు.
*
అవును నిజంగానే ఇళ్ళు భలే వింతగా తలుపుల్లేకుండా వుండేవి.
కానీ ఇప్పుడంతా గేటెడ్ కమ్యూనిటీస్ లోకి బిలబిలా వలసలు పోతున్నారు మనుషులు.
*
అవును ఆ ఇల్ళలో కిటికీలకు ఊచలుండేవి కావు.
ఇపుడంతా కాల్ళూ, చేతులూ, కలలూ కట్టేసే ఉక్కు ఊచలున్న విండోసే మిగుల్చుకున్నారు మనుషులు.
*
నిజంగానే మనుషులు ఆరడుగులకన్నా ఎత్తులో(పొడవులో కాదు) వుండేవారు.
ఇపుడంతా వినోదం విక్షించే మరుగుజ్జు ఊబకాయ కౌచ్ పొటాటోస్ గా పరిణామం చెందారు.
*
ఇలాంటి వింతలే మహి కథ నిండా.
మరి ఇందులో ఏవి వింతలు?
ఇప్పుడు వున్నవా? ఇప్పుడు మాయమయినవా?
*
కల. భలే బలహీనత మనిషికి.
అంతే బలం కూడా.
మహిబెజవాడ ఇదే మరో సారి గుర్తు చేసాడు.
మనిషి తన సౌఖ్యాన్ని కలగంటాడు.
అన్ని మతాల, సిద్ధాంతాల హామీ సారం అదే.
అయితే ఆ సౌఖ్యం సాంకేతికత ద్వారా (రేపటి నుంచి కాక), అనుభవాలతో(గతం తాలూకు, ప్రాకృతిక సాంగత్యాల; అంటే స్థూలంగా నిన్నటి నుంచీ) ఆశిస్తాడు.
మనిషి ఆకాంక్ష మనుగడ చారిత్రక నేపథ్యమే అది.
ఈ మానవ సహజాత ఆకాంక్షను ఛిద్రం చేసే, నిరాకరించే, నిర్ధారించే, నిర్ణయించే, శాసించే, ఆధిపత్యం చెలాయించే అన్ని ఆర్జన, దౌర్జన్య సమీకరణాలను మనిషి ధిక్కరించాలి.
మనుషులు ధిక్కరించారు.
కానీ ధిక్కరించడం అనే పోరాట రూపమే ఒంటరిగా మనలేదు.
అదే విషయాన్ని ఇలానే ప్రతి కలా మనకు చెబుతోదోందనుకుంటా.
శకలాలుగా.
శకలాల సముపార్జనే సాఫల్యం మనిషికి అంతిమ వెసులుబాటు అనుకుంటా.
ఇది సృజన నెరవేర్చాలంటే ఈ ఎరుకకు తర్ఫీదు అవసరం.
నేర్పరితనం దాని అర్హత.
నేర్పు అనివార్యం.
సమర్థత అన్ని కలల సాకారానికి గీటురాయి కాదా?
అది కనీస మనిషి మనుగడ కాదా?
అది క్యాపిటలిస్ట్ కల తాలూకు సామర్థ్యమా?
లేక తదుపరి ప్రతిపాదనా?
అన్న దానికీ సమర్థతే గీటురాయి.
తక్కినవ్నీ తమకే తెలియని, తేల్చలేని కలలు.
ప్రతిపాదనలు మాత్రమే.
తదుపరి జీవనానికీ అవి స్వాగతాలా?
వున్న, లేక లేని ప్రశ్నలకు అవి ఇప్పటికే నిరోధకాలా?
లేక కంటకాలా?
అని ప్రతి మనిషి అడుగుతూనే వుంటాడు.
తుదివరకు తన ఆలోచన ప్రయాణాన్ని మరణానికి జీవనాన్ని ఫణంగా పెట్టి మరీ.
అడగడం మనిషి మనుగడ కాబట్టి.
మెరుగైన తన తదుపరిని కనడం ఆలోచిస్తున్న ఈ మనుష జాతి అస్థిత్వం కావున.
ప్రతి తదుపరికీ ఆహ్వానమే పలుకుతుంది మనుగడ.
అత్యంత సహజాతంగా.
అయితే ప్రతి కంటకాన్నీ ఎదుర్కుంటుందా?
ప్రతి తదుపరినీ నిర్వచిస్తుందా?
ప్రతి ప్రతిదీ అనంతమైన సమ సౌఖ్యం కోసం తర్ఫీదు అయ్యేందుకు సమాయత్తం చేస్తుందా?
ఇవి కొత్తగా కల కనడం కోసం వేసుకోవాల్సాన నిర్మాణాత్మక ప్రశ్నలు.
కొత్త కలలకు కొత్త టెంప్లేట్ అవసరం.
అది అన్ అవాయిడబుల్ యాప్స్ లాగా మల్టీప్లై అయ్యేంత వైరల్ నేచర్ వున్నంత కల అవ్వడం అనివార్యం.
ఈ ప్రశ్నలు మహిబెజవాడ కనిన కల తాలూకు నే కన్న కలల ప్రశ్నలు.
*
Our ultimate desire seems to rush from simplicity to city.
‘‘గత కాలమె మేలు వచ్చు కాలము కంటెన్ ’’ అనే స్కెప్టిసిజానికి లోనవడం కాదు ఇది.
మనం మధ్యాహ్నం మన హాల్ లోని ఆపిల్ చెట్టుకింద తాపీగా టాప్ రేటెడ్ టీవీ సీరియల్ చూస్తున్నతీరికవేళల్లో మన చేతిలో అమాంతం రాలిపడిపోవడానికి ’మహోన్నత ఆదర్శ సమజీవనం‘ మాగిన పండేమీ కాదు మరి.
అందుకు మనం జోల్ళు తొడుక్కోవాలి.
కనీసం మనలోపలికి మహిబెజవాడ చూపించినట్టు వెల్ళి ఒక బంగారు కల కనేందుకయినా.
ఈ ఉక్కుపోతల్లో, ఉక్కపోతల్లో విరామమైన, తీరికయిన, తీరున్న కలివిడితనాల ఇలాంటి స్వచ్ఛమైన కల కనడం కూడా ఒక ఆంతరిక నిరసనే నా మటుకు నాకు.
మన నుంచి, ఇంటి నుంచి, మన బజారు నుంచి బయలు దేరి ఒక్క సారి బయట సన్నగా మోగుతున్న సామూహిక ధిక్కారాల స్వరాల బృందగానంలో గొంతు కలిపేందుకూ....మనం ఇప్పుడిక జోళ్ళు తొడుక్కోక తప్పదు.
’’జీవితం మారదు; కానీ దాన్ని మార్చుకునేది మాత్రం అంతిమంగా మనమే‘‘
..........................................................................
తరువాతి సమీక్ష కుప్పిలి పద్మ కథ ‘ సెకండ్ హజ్బెండ్’

తలుగు

ప్రాతినిధ్య కథ 2014 సంకలనంలోని కథల సమీక్ష ; కథ 2 : తలుగు; రచయిత : వేంపల్లి షరీఫ్
.............................................
బహుశా రబ్ నే బనాదీ మోదీ బీఫ్ ని నిషేధించాలనుకున్న తరుణంలో షరీఫ్ గొడ్లు కోసుకుని బతుకీడ్చే దౌలూ నిరసనని రచియించాడు.
(ఈ నేలలో కులానికీ, మతానికీ అతీతంగా, సామాజిక ఆదరణలో నిమ్నులయినా సంఖ్యలో అధికులు తినే ఆహారం పేరే కల్యాణీ, దస్ నంబరీ, ఎద్దుకూర, లెల్లే, గొడ్డు మాంసం అలియాస్ బీఫ్.)
కరసేవకులు దూసిన దండాని ఆపే చేతులు మొలిచిన (కర్రెనుము కొమ్ముల సహితంగా) ఆశావహ ముగింపు తలుగులో షరీఫ్ చూపాడు. అయితే బీఫ్ నిషేధం అనే సమకాలీన సమస్యను ఇతివృత్తంగా చేసుకుని క్రమంగా దాన్నించి పక్కకు జరిగిపోయింది తలుగు కథనం.
నిస్సహాయులు సాగించే అనేకానేక రోజువారీ ఒంటరి పోరాటాలూ, వాటికి మన అహాలను తృప్త పరిచే విడి(isolated ) సాహసోపేత ఎండింగ్ లను సూచించే (పరోక్షంగా, subtle గానయినా) మరో మంచి ప్రిడిక్టబుల్ కథ తలుగు.
ఇలాంటి వందలాది(బహుశా వేలాది) ‘విప్లవ’ (సోకాల్డ్ ఫార్ములా) కథల తానులోకి తాజాగా రాయలసీమలోని కడప ప్రాంతం నుంచి చే(జా)రిన(?) కథే షరీఫ్ హాయిగా, సునాయసంగా, కూసుగా కూర్చిన ఆంధ్రప్రదేశ్ తెలుగు కథ తలుగు.
*
కష్టంగా, సంక్లిష్టంగా రాయడం నిజంగా చాలా సులభం. ఎందుకంటే అదంతా (ఉద్దేశ్యపూర్వంగా) మభ్యపెట్టేందుకు చేసే రచనా విన్యాసమే కాబట్టి. కానీ సాదాసీదాగా రాయడమే చాలా చాలా కష్టం. ఎందుకంటే అందుకు జీవితం పరిచయం అయ్యి, వివరం తెలిసి, విషయం మన లోపల జీర్ణమయ్యి, వివేకంగా వ్యక్తం అవ్వాలి కాబట్టి. ఈ కష్టాన్ని తన కథన శైలిలో సుసాధ్యం చేసుకున్నాడు షరీఫ్. కానీ పాత్రల సౌష్టవాలను అందుకోవడంలోనే కాక, వారి మనో నేత్రాలను సందర్శించడంలో షరీఫ్ మరో నాలుగు అడుగులు వేయాల్సి వున్నది మరి.
జీవితంలోని రోజువారీ కష్టాలను కూర్చడం, చిత్రీకరించడం కూడా చాలా సులభం. పైగా ఆలాంటి చిత్రీకరణలకు జనామోదం సత్వరం. (కర్టసీ ....మిర్రర్ న్యూరాన్స్). కానీ జీవితంలోని సాదాసీదాలను వడిసి పట్టుకోవడం అత్యంత దుస్సాధ్యం.
పైగా కన్నుకి దృగ్విషయమైనదీ, సాధ్యమయినదీ, పెన్నులోకి ఇంకి అక్షరాలుగా అనువాదం కావడం మరీ మరీ కష్టం.
ఆ అనువాదమే కాదా కథా రచయిత(త్రి) పరిణతికి, పరిపక్వతకీ సూచిక?
షరీఫ్ ప్రస్థానం మాత్రం (అంటే నా ఉద్దేశ్యంలో కడపలోని వేంపల్లె నుంచి కేంద్ర సాహిత్య అకాడమీకి అని కాదు; జుమ్మా(మసీదు) నుంచి తలుగు (దర్గా) కు చేరుకున్న యానమనే అర్థంలోనే) సమ్యక్ రచనల వైపు బలంగా పడుతున్న ఒక ప్రామిసింగ్ రచయిత అడుగులనే సూచిస్తున్నది. తలుగు కథ ఆ దారిలోని కీలక మైలురాయి.
*
తలుగు కథ మూడు శిబిరాల లౌక్యాల, లౌల్యాల, లాలూచీల, అవకాశాల, లావాదేవాల, అవకాశ వాదాల, ఆధిపత్యాల, పలాయనాల, పోరాటాల మధ్య జరిగే సంఘర్షణ.
శిబిరం 1 : దౌలు
శిబిరం 2 : వెంకటప్ప
శిబిరం 3: పంచాయితి పెద్దలు (లేదా చిన్నలు)
ఇస్లాం మతం ఈ దేశంలో అనివార్యంగా అనుకరించిన హైందవ నిచ్చెనలో కింది మెట్టులో పుట్టిన వెలివాడ జీవి బోరేవాలానే ఈ కథా నాయకుడు దౌలు. తల్లిలేని తన కొడుకును సాకుతున్న సింగిల్ మేన్. వృత్తి రీత్యా గొడ్డు మాంసం అమ్ముకుని బతికే చిరు వ్యాపారి. సమాజంలో మనం అతి సహజం, సామాన్యం అని అనుకునేవి ఎన్ని నిరాకరించబడ్డాయి ఇతనికి? ఇతని ముత్తాతలు, అవ్వలు అందమైన ఈత చాపలు అల్లి వుండవచ్చును గాక, ఇతను మాత్రం ఆత్మగౌరవాన్ని అల్లుకుందామనుకున్నాడు. అందుకు అందుబాటులో వున్న అన్ని పోరాట మార్గాలనూ అందుకున్నాడు. లౌక్యం తో మొదలుపెట్టి, స్వార్థ – వ్యాపార చింతనతో అవకాశవాదిలా సాగి, ప్రలోభ పెట్టి లాబీయింగ్ ని ఆశ్రయించి, బెడిసికొడితే లొంగిపోయి, వల్ల కాకపోతే ధిక్కరించేందుకు వెనుకానడని మామూలు, ఒంటరి సామాన్య నిమ్న వర్గీయుడే ఈ దౌలూ. గతంలో వెంకటప్పతో మోసపోయినా అనివార్యమైన వ్యాపార సంబంధాన్ని రేపటి కోసం కాపాడుకునేందుకు (కెరీర్) కొంత రిస్క్ చేసేందుకు వెనుకాడని లౌక్యుడు. తన బృందంలోని (ముస్లింల) ప్రధాన స్రవంతినుంచి తన అస్తిత్వాన్ని వినిర్మించుకోవాల్సిన అగత్యం వున్న ఒక ధిక్కారిగా రచయిత ఈ పాత్రను మలిచాడు.
‘బుద్ధిని బట్టి వుంటుంది కానీ తినే తిండిని బట్టి వుంటుందా యాలీసన్’ అని తన అస్థిత్వాన్ని నిర్వచించేందుకు కరీంసాబ్ తో బలంగా వాదించే దౌలూ హైదరాబాద్ లో ముస్లింల అస్థిత్వాన్ని మాత్రం తిండిని బట్టే నిర్వచించడాన్ని తన వాదనకు బలంగా తెచ్చుకోవడం దౌలూ స్వభావంలోని వైరుధ్యం. అంతా సవ్యంగా జరిగితే సాయంత్రం సారా పోయిస్తానని తనకు తోడుగా బలహీనులయినా సరే వెంకటప్పతో లాబీయింగ్ కోసం ఇద్దరు పెద్ద మనుషులను కుదుర్చుకున్నాడు దౌలూ. కొన్న ఎనుమును చనిపోయేలోపు జుబహా చేయించేందుకు సిద్ధపడి (ఓ ఆది వారం కాని రోజున)అదనపు వ్యాపారాన్ని ఆశించాడు దౌలూ. తీరా ఎనుము ఈనితే, తను వయసులో వున్నప్పుడు కన్న కలను (గొడ్లు కోసే పని మానుకుని పాడి ఎనుములు పెట్టుకోవాలనుకునే) సాకారం చేసుకోవానుకుంటాడు. ఇది అతని vertical mobility, లేదా seeking career outside caste/religion occupation కి సూచిక. ఒక్క మాటలో చెబితే ఎప్పటికయినా దౌలూ కల వెంకటప్ప కావడమే. గ్రామీణంలోని వుండే సహాయసహకార సంబంధ బాంధవ్యాలలోని (symbiosis) విభజన, దోపిడి, ఆధిపత్యాలను ఏక కాలంలో ప్రశ్నిస్తూ, అదే సమయంలో అవసరమయితే వాటిని తనకు అనుకూలంగ మలచుకోవాలని చూసే కింది స్థాయి సాదాసీదా మనిషిగానే దౌలూను తీర్చిదిద్దాడు రచయిత. సాదాసీదా మనుషుల్లో వుండే అనేక బలహీనతలు దౌలూలోనూ వున్నా అతనిలోని మంచితనం, కరుణ, నీతి, ఆత్మగౌరవాలు కొట్టవచ్చినట్టు కనిపించి, అతడిని నడిపించి అతని స్వభావాన్ని తీర్చిదిద్దాయి.
ఇక వెంకటప్ప. బతకడానికి మోసాన్ని, దోపిడిని, అక్రమాన్నీ బలహీనులపైన ఆయుధాలుగా వాడి లబ్ది పొందాలనుకునే ఒక స్టీరియో టైప్ దోపిడిదారుడు. దౌలూ వ్యాపారానికి వెంకటప్ప ఎంత అవసరమో, వెంకటప్ప వ్యాపారానికి దౌలూ కూడా అంతే అవసరం. కానీ ఈ ఇద్దరి మద్య వ్యాపార సూత్రాలను, న్యాయాన్యాలను నిర్వచించేది మాత్రం వెంకటప్పే. దౌలూ లాంటి వారు ఇతని ‘సహజ’ సామాజిక అధికారాన్ని అంగీకరించి, ప్రశ్నించనంత వరకు మాత్రమే బలవంతుడిగా చెలామణి అయ్యే దోపిడిదారుడు వెంకటప్ప.
అయితే దౌలూ స్వభావంలోని నలుపు తెలుపులనే కాక, గ్రే రీజియన్ ని కూడా చిత్రీకరించిన రచయిత, వెంక టప్ప విషయానికి వచ్చే సరికి అతని స్వభావంలోని నలుపునే ఎత్తి చూపడం ముందుస్తు బయాస్ నే పట్టి ఇస్తుంది. పాఠకులను ముందునుంచే ఈ పాత్రను ద్వేషించేందుకు సిద్ధం చేస్తుంది. దౌలూ స్వభావంలో వున్న షేడ్స్ ఈ పాత్రలో మిస్ కావడం వల్లే కథ ఫార్ములా అయ్యింది.
బహుశా తలుగు కథలో మటన్ మాత్రమే కొట్టి బతకగలిగి హిందూ పౌర సమాజం నుంచి ‘మర్యాద’ని పొందాలనుకుంటున్న ముస్లింల ప్రతినిధి కరీంసాబు. ఇతను సంఘ్ పరివారంలోకి హైందవీకరణ ఘర్ వాపిసీ సంక్షేమ పథకానికి తనకు తెలీకుండానే చేదోడు ప్రకటించిన ఓ ఆధిపత్య వర్గానికి ప్రతినిధి.
ఇక బలహీనంగానయినా సరే దౌలూను సమర్థించగల ఏకైక బృందం పంచాయితి పెద్దలు. ఈ పంచాయితీ పెద్దలు పౌరసమాజంలో న్యాయం పట్ల నిబడగలిగి మాట్లాడే అల్పసంఖ్యాక వర్గానికి పౌరసమాజ ప్రతినిధులు. వీరికి ఏ పాత్రా లేకుండా చేయడం వల్లే దౌలూ పోరాటం ఒంటరిదీ, వ్యక్తిగతమూ అయిపోయింది. మిగిలిపోయింది.
*
మరి దౌలూ వంటి నిస్సహాయుల వొంటరి పోరాటాలకూ, సాహసాలకు ముచ్చటపడే కూడలి దగ్గరే ఇంకా ఆగిపోదామా?
యధాతథ జీవన చిత్రీకరణకూ, ఆదర్శ ప్రకటనలకూ మధ్య పెరిగిన అంతరం పూడ్చడం సృజన కర్తవ్యం కాకుండాపోతోందా?
సారస్వతం జీవితాన్ని డౌన్ లోడ్ చేసే టూలూ కాదు, వెతికి పట్టించే కేవల సెర్చ్ ఇంజనూ కాదు;
అది శాఖోపశాఖల పవనాలను, వనాలను మొలిపించే విత్తనం కాదా?
శోధనకూ, విశ్లేషణకూ, హేతువుకూ, వికాసానికీ నోచుకోని కేవల జీవన చిత్రణ సృజనగా చెలామణీ అయితే ఇంకా ఆ జాతి డాక్యుమెంటేషన్ దశని దాటలేదనే అర్థం చేసుకోవాలా?
ఇరు రాష్ట్రాల తెలుగు కథకులు, విమర్శకులు వేసుకోవాల్సిన ప్రశ్నలు ఈ నాటికీ ఇవి కావా?
.............................................
15, జూన్, 15
తరువాతి కథా సమీక్ష..... వొదిలెళ్ళిన జోళ్ళు

సూర్యుని నలుపు రంగు రెక్కలు.

ప్రాతినిధ్య కథ 2014 సంకలనంలోని కథల సమీక్ష
.................................................................
కథ 1 : సూర్యుని నలుపు రంగు రెక్కలు.
రచయిత : డా. వి. చంద్ర శేఖరరావు
కథ టైటిల్ అమితంగా నచ్చింది, అనడం కన్నా కథకి అమితంగా నప్పింది.
అకాలధర్మం చేసిన ఒక దళితుని కథ ఇది. అతని జీవన యానం మూడు సోర్స్ ల ద్వారా పాఠకులకు చేరుతుంది
(అంచెల, కంచెల, అగడ్తల కథన విన్యాసాల వల్ల కథ పాఠకులకు చేరువ అవడం ప్రశ్నార్థకమే.)
సోర్స్ 1 అతని కూతురు
సోర్స్ 2 అతని డైరీ
సోర్స్ 3 అతని ‘పాటల రాణి‘
20 ఏళ్ళ అతని కూతురు ‘ప్రపంచానికి ఒంటరిగా తెలిసిన’ తన నాన్న గురించి చెప్పే కథ ఇది.
మేరీ కరుణ నుంచి రాగశ్రీగా అటు పిదప ‘పాటల రాణి’ గా రూపాంతరీకరణ చెందబడిన, దాంపత్యానికి ఆవల వుండిపోయిన ఒక ప్రియరాలు చెప్పే కథ.
96 పేజీల నిడివి వుండీ, అందులోని 12 పేజీలు తప్ప తక్కిన పేజీలలోని అక్షరాలన్నీ వెలిసిపోయి, ఖాళీ ఖాళీగా వున్న అతని డైరీ చెప్పే క్రానికల్స్ ఈ కథ.
లెట్ మి కన్ ఫెస్...
ప్రాణమున్న రెండు(?) పాత్రలు చెప్పిన కథనం కన్నా... డైరీ చెప్పిన క్రానికల్స్ వల్ల ‘అతను’ మరింత దగ్గరగా అనిపిస్తాడు.
నిజానికి కథ ఏ నేరేటివ్ టెక్నీక్ తో చెప్పినప్పటికీ ఇది దశాబ్దం కాపురం చేసిన దంపతుల జీవనయానం.
దంపతుల్లో అతను దళితుడు. ఆమె ఇతర.
ఇద్దరూ విప్లవ వీచికలో దగ్గరయ్యి ‘so much alike’ గా వున్నామనుకున్న రుతువులో సహజీవించినవారే.
విప్లవకార్యాచరణ నుంచి కుల స్పృహతో బయటపడి దళిత మేధావిగా, కవిగా, పాటగాడిగా, కథకుడిగా చెందిన అతని పరిణామ క్రమాణ్ణి కథ విస్తారించింది.
ఇక అతని భార్య మాత్రం విప్లవోద్యమం నుంచే మొదలై ఆ తర్వాత కులం, వర్గం, వద్దంటూ తన కూతురితో పోట్లాడి, జన సమూహాలకు అవతల, ఆదివాసీల మధ్య చిన్న చిన్న ఉద్యమాలు నిర్మిస్తూ, కోర్టుల్లో దావాలు వేస్తూ తన ఒకనాటి సహచరుని అంతిమ యాత్రలో నలుగురి కంటా పడేందుకు కూడా ఇష్టపడని నైరూప్య, మార్మిక వ్యక్తిగా మిగిలింది.
కథకుడు అతని పాత్రతో చేసిన చెలిమి, ఆమె పాత్రతో ఎందుకు చేయలేదో తోచదు.
కథలో ఒక్క ‘పాటలరాణి’ కి తప్ప మరే పాత్రకూ నామకరణం చేయలేదు చంద్ర శేఖర రావు. కాబట్టి ఈ అనామక పాత్రలను సర్వనామం చేయాలనేది చంద్ర శేఖరరావు ప్రయత్నమని అవగతమవుతుంది.
పేరున్న ఆ ఒక్క పాత్రకీ పేరు ఎందుకో తరచూ సింగిల్ కోట్స్ లోకి ఇరికించబడిందో అర్థమవదు. పైగా ఈ పాత్ర ప్రస్తావనలో ఏదో అంతర్లీనంగానో, అప్రయత్నంగానో (బహుశా ఉద్దేశ్యపూర్వకంగా కూడా అయి వుండవచ్చు) Condescency (చిన్నచూపు, లోకువ ధ్వని) పలుకుతుంది. ఇదే చిన్న చూపు కథ చెబుతున్నప్పుడు కూతరు పాత్ర గొంతులో తన తల్లి ప్రస్తావనలోనూ కనిపిస్తుంది. బహుశా ఇది తల్లీ కూతుళ్ళ మధ్య కాలం చేసిన దూరం వల్ల కూడా కావచ్చు.
లేదా తను నాన్నలాగా నల్లగా, భూమిపుత్రిక(?)లా వున్నాను అనుకుని తండ్రి యోచన ధారను కొనసాగిస్తున్నానన్న ధీమాతో మాట్లాడే బయాస్ లోంచీ తొంగిచూసినదీ అయివుండవచ్చు.
కూతురు తండ్రి వైపు చూపించే ఆరాధ్య పూరిత మొగ్గు, తల్లి పట్ల ప్రదర్శించే dispassionate distance, ఈ రెండూ కూడా రచయిత చంద్ర శేఖర రావు ప్రకటించదలచుకున్న రాజకీయ దృక్పథానికి చెందినది.
చనిపోయిన దళిత మేధావి ఎలా బతికాడో, తనపై తానే విధించుకున్న సంచార జీవనస్రవంతిలో ఎంతమంది ఆత్మీయతానురాగాలను పొందాడో ప్రతీకాత్మకంగా కొంత, సూచన ప్రాయంగా ఇంకొంత, వాచ్యంగా మరి కొంత, కృత్రిమ వ్యాఖ్యానంలో మరింత విశదీకరిస్తూ నడుస్తుంది కథ.
అలా ఈ 20 ఏళ్ళలో తన కుటుంబం గురించి ఏనాడూ మాట్లాడకుండా పోయిన, తన ఊరిలోని స్వంత ఇంటి ముందు చప్టాపైనే జీవనం సాగించడానికి ఇష్టపడిన ఆ మహా ఒంటరి సామాజిక యానాన్ని పాఠకులకు పరిచయం చేసి మనసుల్లో ఆ పాత్ర పట్ల ఉదాత్తతను అంకురింపచేయడమే కథన ప్రధాన ఉద్దేశ్యంగా తోస్తుంది.
డైరీ ద్వారా కథా నాయకుడి గమనాన్ని వినిర్మించిన పద్ధతి మాత్రం అసమానం. మరీ ముఖ్యం రెక్కలు ఎపిసోడ్. అయితే రెక్కలు తొడిగిన కథా నాయకుడు అలా ఆకాశ వీధుల్లో విహరిస్తూ అంబేద్కర్ ను చేరుకున్న తర్వాత అతని రెక్కలు శక్తి కోల్పోవడం అనే metaphor ద్వారా చంద్ర శేఖర రావు రెండు విషయాలను చెప్పాడు. ఒకటి విప్లవ శిబిరం సమకాలిక కులస్పృహను అక్కున చేర్చుకోలేని వైకల్యానికి గురయ్యిందనీ, దళిత ఉద్యమ చైతన్యం రెక్కలు తొడిగి అంబేద్కర్ విగ్రహాల దగ్గరే శక్తులుడిగిపోయిందనీ. ఇది బలమైన రాజకీయ ప్రకటన. ప్రధాన కథలో చాలా తక్కువ నిడివే వున్నా రెక్కలు అనే ఎపిసోడ్ చదువుతున్నంత సేపూ అలెజాంద్రో జి ఇనర్రిటొ సినిమా బర్డ్ మెన్ (లేదా ది అన్ ఎక్స్ పెక్టెడ్ వర్చూ ఆఫ్ ఇగ్నోరెన్స్ ) గురుతుకు రాకమానదు. దాని ప్రభావమూ కథనంపై కనిపించకమానదు.
ఇక ఈ కథా నాయక పాత్ర ఏ దళిత మేధావి నిజ జీవన ప్రతిబింబమో కాదో పాఠకులకు పెద్దగా అవసరం లేదు. కానీ అలాంటి వాస్తవ జీవన దర్పణ భ్రమని కథకుడు పదే పదే కల్పించే ప్రయత్నం కథ ఆసాంతం సాగింది. ఫలితంగా కథానాయకుడిని పాఠకులు స్వతంత్రంగా బేరీజు వేసుకునేందుకు నిరాకరించేంతగా కథన శైలి సాగింది.
చంద్రశేఖర రావు గతంలోనూ తను కీలకం అనుకున్న, ప్రధాన చారిత్రక మలుపులు, మైలురాళ్ళు అనుకున్న కొన్ని యధార్థ సంఘటనలను, అందు పాల్గొన్న కొందరు చారిత్రక వ్యక్తులను తన కథలుగా తర్జుమా చేసే ప్రయత్నం చేసాడు. అదే అతని కథన శైలిగా సుస్థిరమయ్యింది. నిజానికి సమకాలీనతను తన గత కథల్లోలాగానే ఇందులోనూ చొప్పించేందుకు సృజనాత్మకంగా, సమర్థవంతంగా ప్రయత్నించాడు చంద్రశేఖరరావు. అయితే అతని గత ప్రయత్నాలలోని సృజన, సామర్థ్యాలకు సంబంధించిన విజయాల, వైఫల్యాల బేరీజు ఇప్పుడు అప్రస్తుతం. కానీ సూర్యుని నలుపు రంగు రెక్కలు కథ మాత్రం బలవంతంగా గుదిగుచ్చిన (ఒకచో కృత్రిమ) సన్నివేశాల, ఉద్వేగాల, భావాల, పాత్రల, సంబంధాల, దృక్పథాల, వాటి యానాల సముచ్ఛయం.


తాజా కలం:
ఇంతకీ కథానాయకుడు తన ఊరి ఇంటి ముందు వున్న చప్టాపైన పడుకునే ముందు కప్పుకునే శాలువా రంగు గాఢమైన దు:ఖపు రంగా? లేక కథ చివరిపేరాలో హడావిడిగా హఠాత్తుగా ఊరేగింపును చీల్చుకుని వచ్చి ఆమె కప్పే ఎర్ర రంగా? లేక జస్ట్ గ్యాలరీ కోసం క్లయిమాక్సా?
...........................
చింతలపల్లి అనంతు
11 జూన్ 2015
సమీక్ష లో తర్వాతి కథ ..... తలుగు