Tuesday, September 4, 2012

సారీ టీచర్

 (కత్తి నరసింహారెడ్డి సంకలనం చేసిన టీచర్ పుస్తక సమీక్ష)

బడికి పునాదులు లేకపోతే సర్కారుది నేరం...

విద్యకు పునాదులు లేకపోతే అయ్యవార్లదే నేరం- కా.జ.


పిల్లలు బడి మానేయడానికి చాలా మంది ఇప్పటికీ బలంగా నమ్ముతున్నట్టు, ప్రచారం చేస్తున్నట్టూ పేదరికం ప్రధాన కారణం కాదని చాలా నర్మగర్భంగా చెప్పిన చాసో కథ పుస్తకానికి తొట్టతొలిగా వుండటం భలేగా వుంది. డ్రాపవుట్స్.. నెవర్ ఎన్ రోల్డ్- ఈ రెండు వర్గాల పిల్లలూ బడి పుణ్యమే కదా! వీళ్లు టీచర్ల బాధ్యతే కదా! ఈ పిల్లలు మన చదువుల బాధితులే... ఆ పిల్లల కుటుంబంలో వున్న కష్ట నష్టాల కబోదితనం సంతరించుకున్న ఆ ప్రాంతపు పాఠశాల అలసత్వమే ఇందుకు కారణం కాదని అనగలమా? 14 ఏళ్ళ లోపు వయసున్న బడి బయటి పిల్లలంతా బాలకార్మికులే... వారంతా ఆ ప్రాంతలో(neighborhood) వున్న బడుల, టీచర్ల ఉత్పత్తులే.
కఠినంగా వున్నా సరే ఈ మాటలు నిజం. ఇప్పటికే జనాభా లెక్కలు, పోలియో చుక్కలూ, వేర్వేరు సర్వేలూ, కమ్యూనిటీ కౌన్సిలింగులూ, మెటీరియల్ ప్రిపరేషన్ వర్క్ షాపులూ, టీచింగ్ ఎయిడ్స్ తయారుచేసుకునేందుకు శిక్షణా తరగతులూ, ఇతర నానా డాషుల పేరుతో రిసోర్సు పనులూ, అడ్మినిష్ట్రేషను చాకిరీలు, రీసైకిల్ బిన్ లు మాత్రమే ఎదురు చూసే నానా చెత్త రిపోర్టులు రాస్తూ ఇలాంటి చాలా బోధనేతర బండ చాకిరీ చేస్తున్న ఉపాధ్యాయుల మనసు నొప్పించి వుండవచ్చు నేను అన్న మాటలు.
( అయితే నేను మీ మనసుకు ఊరట కలిగించేందుకు ఇంకేదో తియ్యని సంగతి  చెప్పే లోపు మీరు ఒక పని చేయవచ్చు. ఈ పుస్తకంలోని 225వ పేజీ తీసి మన మాజీ రాష్ట్రపతి... పైగా డ్రాప్ అవుట్ అవ్వాల్సి తృటిలో ఆ ప్రమాదం నుంచి వాళ్ళ అక్క నగల వల్ల గట్టెక్కిన అబ్దుల్ కలాంజీకి తన ప్రొఫెసర్ స్పాండర్ ఏం చెప్పాడో వినండి.)
పోనీ చాసో చెప్పిన కథలో కృష్ణుడు తనకు ఏం కావాలో నిర్ణయించుకుని చుట్టల వ్యసనపరుడయిన తన తండ్రి మనసును సమ్మె చేసి మరీ ఎలా మార్చాడో గ్రహించండి.
ఆ కథలో మీరే కృష్ణుడు అనుకుందాం కాసేపు... మీ తండ్రి ఈ ప్రభుత్వం అనుకుందాం.. చుట్ట తాగడం అన్న వ్యసనం, దాన్ని కొనసాగించేందుకు అయ్యే ఖర్చు వల్ల కృష్ణుడి సిసలైన చదువు భారం అవుతోంది. అదే కదా కథలో సారాంశం. మరి చుట్ట అలవాటు మాన్పించేందుకు మీ దగ్గర కనీసం కృష్ణుడి దగ్గర వున్న నిరసన అనే ఆయుధం కూడా లేకపోతే ఎలా? పైగా ఒక వేళ మీ నిరసనకు తల ఒగ్గితే ఈ సర్కారు(అంటే కథలో కృష్ణుడి తండ్రి) ఎదుట నిలబడి మీరు "ఎందుకు పారేస్తాను నాన్నా?" అని ధైర్యంగా అనేందుకు మీ జేబులో ఏం వుంది? ఒక సారి చూసుకోండి!
బోధనకు దూరమైన ఉపాధ్యాయుడు డ్రాపవుట్ అయిన పిల్లవాని కన్నా ఈ సమాజానికి ఎక్కువ నష్టం కాదా?
అలా టీచర్లను బోధన నుంచి దూరం చేసే అన్ని పనులనూ చేస్తున్న టీచర్లు బాలకార్మికుల కన్నా ఏం తక్కువ? ఇందు మూలముగా యావత్ టీచర్లు తెలుసుకోవసినది ఏమనగా... బడి బయటి టీచర్లంతా వే(త)దన కార్మికులే.

 *
సరిగ్గా ముప్పై ఏళ్ళ క్రితం మొదలైందనుకుంటా ఒక వ్యవహారం. పంతులు పాఠం చేప్పేందుకు ఒక పాఠ్య పుస్తకం వుండేది. అదీ అర్థం కాకపోతే అదే పంతులు ఇచ్చే నోట్స్ వుంటుంది. ఇంకా అదీ చాలదని ఆ పిల్లల తల్లిదండ్రునుకుంటేనో, లేదా అలా వాళ్ళు అనుకునేలా ఆ పంతులే చేయిచేసుకుంటేనో వేన్నీళ్ళకు చన్నీళ్ళుగా రోజూ సాయంత్రం ఆ పంతులుదే ట్యూషన్ కూడా వుండేది. అదీ తప్పితే రాఘవేంద్ర గైడ్ వుండేది. అదే పబ్లిషర్లు మరో పేరుతో అచ్చోసి అమ్ముకునే మరో క్వశ్చన్ బ్యాంక్ వుండేది.  ఈ వ్యాపారం చాలక ప్రభుత్వం అచ్చు వేసే పాఠ్యపుస్తకాలలోనే పూల గుర్తులున్న ప్రశ్నలు(marks ఇచ్చే star marks) కూడా  అధనంగా వుండేవి. ఇవన్నీ ఒకే ఒక్క ఏడాది ఒక సబ్జెక్టు సంబంధించి పిల్లలను ఉద్దేశ్యించి పాఠశాలలు అనుమతించిన బడా చోర్ మార్కెట్ ఇదే. ఇక్కడి నుంచే విద్య వ్యాపారం అయ్యింది... పరాయీ అయ్యింది. ఆ తర్వాత ఈ లాభాలు రుచి చూసిన పెట్టుబడి నేరుగా ప్రభుత్వాలకే మస్కా కొట్టి మస్కా-చస్కా (50-50) అనే సరి కొత్త విద్యా పథకాన్ని ప్రవేశపెట్టింది. 
పైన చెప్పిన పుస్తకాలన్నీ దాదాపు 30 ఏళ్ళ క్రితం ఏడవ తరగతి పిల్లల బోధనకు అందుబాటులో వున్నవి. ఎందుకంటే 5,6,8,9 తరగతులు బ్రహ్మానందరెడ్డి పాస్(అంటే ఈ తరగతుల పిల్లలు ఫెయిల్ అయినా పాస్ చేసేందుకు కాసు బ్రహ్మాందన రెడ్డి కల్పించిన వెసులుబాటు అది. అలా నేను తొమ్మిదవ వ తరగతిలో ఫెయిలయినా పాసయ్యాను.) ఇక ఏడవ తరగతి పబ్లిక్  పరీక్ష. అంటే బ్రహ్మానందరెడ్డి వల్ల కాదు కదా ఆ బ్రహ్మ చెప్పినా సరే పిల్లలు చచ్చినట్టు చదువుకుని పరీక్ష పాసవ్వాల్సిందే. సో అందుకే ఏడవ తరగతి నుంచే టెన్షన్ మొదలయ్యేది. ఆ కారణం వల్లే ఏడవ తరగతి నుంచి మార్కెట్లో ఇన్ని రకాల పుస్తకాలూ, గైడులూ అవతారమెత్తాయి. ఇవన్నీ కూడా తరగతి గదిలో టీచర్ బోధనను ఫెయిల్ చేసిన లేదా బోధన ఫెయిల్ అవ్వడం వల్ల పుట్టిన కుక్కమూతి పిందలే ... దొడ్డి దారులే.  ప్రతి దొడ్డి దారీ అవినీతినీ, హింసనీ, ప్రయివేటీకరణనీ, పరాయీకరణనీ కని, పెంచి, పోషిస్తుంది. ఇప్పుడు ఐఐటి పరీక్ష కోసం 8 వ తరగతి నుంచో ఆ పై/ కింది  తరగతి నుంచో కోచింగ్ ఇస్తే గిస్తే మాత్రం లోపం తరగతిది కాకుండా పోతుందా? తరగతి గదుల్లో బోధించాల్సిన అంశాలను బోధించాల్సిన రీతుల్లో బోధించని టీచర్లు అంతా దీనికి కబోదులే. కాదని ఏ టీచరూ అనలేరు. 

క్యోంకీ టీచర్ భీ కభీ స్టూండెంట్ థా.
సారీ టీచర్స్ ... మిమ్మల్ని ఇన్ని మాటలంటున్నందుకు క్షమించకండి. 

ఇదే పుస్తకంలో 65వ పేజి లో శ్రీరమణ తన గురువు శ్రీపాద  గోపాలకృష్ణ మూర్తి గారు తరగతి గదిలో శబ్దతరంగాలను వాటి ప్రయాణ తీరు తెన్నులను వివరించిన తీరు మీ తరగతి గది  బయటినుంచే వినవస్తోంది. ఊరికే కాసేపు వినండి. స్టాండ్ లోని అన్ని సైకిళ్ళూ పడిపోయిన శబ్దం మీ చెవులకు సోకిందా? ఆ చివర పడి పోయిన సైకిలే మీ విద్యార్థి. ఏమో ఆ విద్యార్థే ఒక భౌతిక శాస్త్రవేత్త కావొచ్చును. కానీ మీరు చెప్పని పాఠం వల్ల ఆ విద్యార్థి ఏమయితే మాత్రం మీకేం సుఖం... మీకేం సంతోషం... మీకేం గర్వం. శ్రీరమణ తన ఉపాధ్యాయులు ఎంతెంత విస్తీర్ణత, విపులత, చతురత, గరిమ వున్న వారో చెప్పుకొచ్చారు. నిజమేనేమో అనుకున్నాను. ఆశ్చర్య పడ్డాను.. అబ్బుర పడ్డాను.. ఈర్ష్య పడ్డాను. ఎందుకంటే నా తరానికి వచ్చేసరికే బహుశా అలా చదువుకున్న గురువులు బాగా తగ్గిపోయి కేవలం చదువు చెప్పేందుకే స్థిరపడిన గురువులే మిగిలారేమోనన్న బాధ నన్ను ఆవరించింది. కేవలం చదువుకున్న గురువులెప్పుడూ అప్పజెప్పే లఘువులనే కదా ఉత్పత్తి చేస్తారు. చదువుకున్న గురువులు మాత్రమే గురువులను మించిన శిష్యులను సమాజంలో నాటగలరనుకుంటా.
 *
తరగతి గది పిల్లల మధ్య తెలియని గిరి గీస్తున్నది... బరి ఏర్పరస్తున్నది. రోజుకు ఐదారు పీరియడ్ల టైం టేబుల్. తెలుగు సారు వేరు. ఇంగ్లీష్ సారు వేరు. లెక్కల సారు వేరు. సామాజిక శాస్త్ర పాఠ్య పుస్తకం ఆ తెలుగు సారో, ఇంగ్లీషు సారో, లెక్కల సారో అస్సలు చూడనట్టే సంవత్సరమంతా తమ నటన కొనసాగిస్తుంటారు. ఇది టీచర్లలో పెరుగుతూ పోతున్న కెరీరిజం. ఈ సెగ్మెంటేషన్, సెగ్రిగేషన్, స్పెషలైజేషన్ నిజానికి పీరియడ్ల విభజన వల్ల ఏర్పడవు పిల్లల మనసుల్లో. ఆయా పీరియడ్స్ లలో చెప్పే సబ్జెక్టుల మధ్య ఈ కృత్రిమ విభజన రేఖను టీచర్లే బలంగా, బలవంతంగా, అహంకారంతో, అభద్రతాభావంతో, అలసత్వంతో గీసుకుంటూ పోతున్నారు.
టీచర్లు తమకు తెలీకుండానే గీసుకుపోతున్న ఈ విభజనరేఖ వల్ల చాలా ప్రమాదాలు జరిగిపోయాయి. 
ఒక తరగతిలో టీచర్ ముందు కూర్చున్న నలభై మంది పిల్లల్లో కనీసం ఒక ఐన్ స్టీన్, లేదా ఒక ఠాగోర్, పోనీ ఒక కలాం, ఒక సునితా విలియమ్స్, లేదా ఒక ఘంటశాల, ఒక సరోజినీ నాయుడు, లేదా కనాకష్టంగా ఒక టెండూల్కర్ అయినా వుండి వుంటాడేమో అని కూడా అనుకోరనుకుంటా. నిజానికి ఇలా ఏ టీచరైనా అనుకుంటే గింటే  చాలన్న రాజీ మనస్తత్వానికి అలవాటుపడి పోయి అలా అనుకునే ఒకరిద్దరు టీచర్లనే మనం ఆదర్శ టీచర్లనీ సత్కరిస్తున్నాం అనుకుంటా. 
ఇలా కాకుండా  ఏ టీచరైనా తన ముందు వున్న విద్యార్థులందిరిలోనూ ఒక మైఖేల్ జాక్సన్, మరొక సత్యజిత్ రే, ఒక శకుంతల, ఒక సివి రామన్, ఒక ఏకె రామానుజం, ఒక ఏ ఆర్ రెహ్మాన్ లను పోల్చుకోగలిగితే ఆ తరగతి గది నుంచి ఒక మదర్ థెరిస్సా డ్రాప్ అవదు. మరో సర్వేపల్లి రాధాకృష్ణ బాలకార్మికుడిగా మారడు. ఇంకో న్యూటన్ ఇంటి వంటిట్లోనే తన చెల్లిని ఒడిలో పెట్టుకుని బేబీ సిట్టింగ్ చేస్తూ చాసో కథలో కృష్ణుడిలా తన నాన్న చుట్ట వ్యసనానికి బలైపోడు...చదువుకు దూరమూ కాడు.
ఈ వాదన కొంచెం అతిగా, కేవల ఆదర్శంగా, ఆచరణకు అసాధ్యంగా తోచవచ్చు టీచర్లకు. పైగా ఇంతటి అసాధ్యమైన ఆదర్శాన్ని టీచర్లకు అంటగట్టి ఇప్పటికే తడిసిమోపెడవుతున్న భారాన్ని వందింతలు చేస్తారా అని టీచర్లకు చెప్పలేనంత కోపం కూడా రావచ్చు. తరగతి గదిలో కొంత మందే చురుకైన వాళ్ళు, మరి కొందరు ఎప్పటికీ గురజాడ అప్పారావులు, సావిత్రిలూ, గుర్రం జాషువాలూ, రిత్విక్ ఘటక్ లూ, కొమరం భీం లూ, ఎంఎఫ్ హుస్సేన్ లూ కాలేరనుకుని ఆ పిల్లలకన్నా ముందే ఒక నిర్ణయానికి వచ్చేది ముమ్మాటికీ టీచర్లు కాదా? పిల్లల పట్ల ఏ మాత్రం నమ్మకం లేని టీచర్లలో పేరుకుపోయిన ఈ ఆలోచనా ధోరణి వల్లే కదా ఇంత మంది డ్రాపవుట్ అవుతున్నారు తరగతి గది నుంచి... బడి నుంచి... చదువునుంచి... సమాజం నుంచి...
టీచర్లు పిల్లల గురించి వచ్చే  ఈ తొందరపాటు అంచనా వల్లే ఒక తరగతి గదిలో కొంత మంది పిల్లలు మాత్రమే అద్భుతమనీ, చురుకనీ, చలాకీ అనీ, ఇంకొంత మంది పిల్లలు ఇంకా తర్ఫీదు చేయవలసిన వాళ్లనీ, ప్రోత్సహించవలసిన వాళ్ళనీ, చాలా మంది వదిలివేయదగ్గ వాళ్ళనీ(hope less) నిర్ణయించేసుకుంటారు టీచర్లు. ఇది వాళ్ళ తొలిచూపులోని అంచనా వల్ల జరగ వచ్చు, లేదా అనుభవం వల్లా, అనుబంధం వల్లా ఈ అంచనాకు రావచ్చు. అయితే ఈ అంచనాలు తప్పు. ఎందుకంటే గ్రెడేషన్స్ అనే ప్రమాదకరమైన అంశానికి అంకురార్పణ జరిగేది ఇక్కడే. అది తనకు తెలీకుండానే చేసేదీ టీచరే. ఒక టీచరు అసమర్థత వల్లా, ఏకాగ్రత సంధించలేకపోవడం వల్లా, పిల్లలతో అన్యోన్యత పెంచుకోలేకపోవడం వల్లా ఈ తొందరపాటు అంచనాలు, ప్రమాదకర గ్రేడింగ్స్ పురుడుపోసుకుంటున్నాయి. దీని వల్లే చాలా సార్లు పిల్లలకు పాఠం చెప్ప కుండానే టీచర్లు పాస్ మార్కులు, ఫెయిల్ మార్కులూ ఇచ్చేస్తున్నారు. ఏ పిల్లవాడి ఫెయిల్ మార్కులూ ఏ టీచరు పాస్ కు మరకలు కాకూడదు కదా?
ఆచరణ యోగ్యం కానిదేదీ మానవజాతి తన లక్ష్యంగా వుంచుకోలేదు మునుపెన్నడూ. కేవలం కొంత మంది సోమరిపోతులవల్లా, చొరవ శూన్యుల వల్లా కొన్ని లక్ష్యాలు కేవలం షోకేసు ఆదర్శాలుగా, అసాధ్యాలుగా, కేవల పూజనీయాలుగా మార్చేసారంతే.... సారూ.
ఈ ఉపాధ్యాయ దినోత్సవానికి కొంచెం ఆదరాబాదరాగా  కత్తి నరసింహారెడ్డి తీసుకువచ్చిన మంచి పుస్తకం టీచర్. ఇది ముఖ్యంగా టీచర్లను ఉద్దేశించి తీసుకు వచ్చిన పుస్తకం కాబట్టి ఇందులో ప్రతి అంశం తర్వాత వున్న గ్రాహ్యంశాలను విసర్జించమని నా మనవి. లేక పోతే టీచర్లు ఈ పుస్తకాన్ని కొత్తగా చదవలేరు. ఇది కొత్తగా అర్థమూ కాదు. 

ఎందుకంటే మంద బుద్ధి శిష్యుడు ఉత్తమ గురువు గురించి  నేర్చుకోగలిగిన దానికన్నా ఉత్తమ విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయుని నుంచి కూడా ఎక్కువ నేర్చుకోగలడని అబ్దుల్ కలాంజీకి తన తొలినాళ్ళ గురువు ఇయదురై సొలమోన్ తెలియజెప్పాడు.
గురుభ్యోనమః

తాజా కలం - ఈ పుస్తకంలో కొంచెం నిడివి ఎక్కువగా వున్న వ్యాసం కృష్ణకుమార్ది. అది ఓరియంట్ లాంజ్ఞన్ వారు వేసిన ట్రాక్ట్ ఫర్ ది టైమ్స్ అనే సీరీస్ లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వేసిన, నేను అనువాదం చేసిన పిల్లలకు పాఠాలు- పెద్దలకు గుణపాఠాలు అనే పుస్తకంలోనిది. దీని ఇంగ్లీష్ టైటిల్ learning from conflicts

(నా అన్ని తరగతుల బయటి గురుతుల్యులు చింతలపల్లి శేషఫణి,  సూరారం కృష్ణశర్మ, డాక్టర్ వివి సుబ్రహ్మణ్యం, జి. భార్గవలకు టీచర్స్ డే సందర్భంగా)