Saturday, June 29, 2013

ఇంతే






అడుగు అడుగు కలిపీ
తోడై నీడై  కదిలీ
నడిచిన దారుల్లోనా
కంటికి రెప్పకు దూరం


                                ఇంతే ఇంతే ఇంతేనా
                                ఇంతే ఇంతేఇంతెలే


కలవని కనుపాపల్లోనా
కల చెదిరిన రుతువుల్లో నా
కడ తేరిన బాటల్లోనా
చిగురుకి  మోడుకి  దూరం







                                ఇంతే ఇంతే ఇంతేనా
                                ఇంతే ఇంతేఇంతెలే


చెరి సగమే విడి జగమైతే
ఇరు ఆశలు ఆడియాసైతే
ఎద పాటే ఎడబాటై తే
చెలిమికి  లేమికి దూరం

                             ఇంతే ఇంతే ఇంతేనా
                             ఇంతే ఇంతేఇంతెలే

-----------------------------------

టైటిల్ సాంగ్
 ఇంతే 
షార్ట్ ఫిల్మ్
15 జూన్ 2013
----------------------------------

 listen this title song stanza -1 at
 http://youtu.be/4vu36JjsVVE



Friday, June 14, 2013

కొనసాగిన ఆత్మహత్య







యువక ఇలా చావకూడదు.

ఈ మాట నా మనసు నాతో అనుకున్నప్పుడు 20 ఏళ్ళ సావాసంలోంచి
కారణాలు అనేకం ముసురుకున్నాయి.
ఒకే ఒక ముక్క పదే పదే చెప్పి నాకు నిమ్మళం కలిగించేందుకు నా మనసు ఇలా పలుకుడుబండయిపోయింది.
“యువక ఇలా బతికి వుండకూడదు.
యువక ఇప్పుడు జీవించి వుండకూడదు.
యువక అసలు ఇక్కడ పుట్టి వుండకూడదు.”
@
ఎందుకో అతను కొనసాగిన ఆత్మహత్యలా బతికాడు. మరీ ప్రత్యేకించి తన ప్రయాణపు చివరి రోజుల్లో.
అతను తీవ్ర ప్రేమి లేమితో జీవించాడు.
అతను మాల కుటుంబంలో పుట్టాడు. మగవాడిగా పుట్టాడు.
@
యువకది అసహజ మరణం. అతని స్వప్నం ప్రౌఢ. కాంక్ష ఎరుక కలిగినది. పుట్టుకకే మాల కానీ అతను నడిచిన దారి కదంబమే.
ఇలాంటి చావులు ఒక మేధోపరమైన ఖాళీ నుంచి పుడతాయేమో!
ఈ మేధోపరమైన ఖాళీ యువకలాంటి వ్యక్తుల వ్యక్తిగతమైనది కాదేమో!
ఒక తరానిదేమో!
ఏమో కానీ యవకది కూడా అకాల మరణమే.
ఎందుకంటే అతన్ని ఈ కాలం afford  చేయలేక పోయింది.
అతని సకల ఒంటరితనాలనీ, అందులోంచి వచ్చిన విపరీతమైన సంచారతనీ, దాని ప్రతిఫలనమైన విచ్చల’విడి’ తనాన్నీ, అంతర్ముఖతనీ, సదా మత్తులోమనుగడనీ, అనిబద్ధతనీ, అసంబద్ధతలనీ  ఈ కాలం భరించలేకపోయింది.
వ్యక్తి  స్వేచ్ఛ పేరుతో సమూహంనుంచీ, కలివిడి నుంచీ, గుంపులనుంచి, సంఘటితం నుంచీ చాలా వేగంగా, స్వచ్ఛందంగా తప్పుకుంటున్న ఈ ఏకాకుల కాలం యువకని భరించడం చాలా కష్టం అయిపోయింది.
ఎప్పటికప్పుడు కొత్త కొత్త ‘కృత్రిమ’ మార్పులను మనపై రుద్దుతూ, ఈ ‘సామాజిక’ మార్పులపై చర్చనే ప్రధాన అజెండాగా మార్చుతున్న ఈ అస్థిత్వ కాలం యువక లాంటి పరిత్యాగ జీవన శైలినీ, నిలకడలేని తనాలను, ఆర్జనపై(ధన, జ్ఞాన)  ఆకాంక్ష లేమినీ, ఎక్కడా ఇమడలేని తనాలనీ అక్కున చేర్చుకోలేక పోయింది.  
Central Processing Units ను ఆదమరచిన ఈ Screen Savers' times యువకను కొనసాగిన ఆత్మహత్యకు పురికొల్పాయనిపిస్తుంది.
అతని బతికిన జీవితానికి ఈ నడుస్తున్న కాలానికీ  మేధో పరమైన ఖాళీ ఏర్పడింది.  అతని మేధ ఎదుర్కోలేని, నిలబడలేని, గ్రహించలేని, పరిష్కరించలేని, అవగతం చేసుకోలేని అనేక ప్రశ్నలను శరపరంపరగా వ్యక్తులపైకి ఎక్కుపెట్టిన సంక్షోభ కాలం ఇది.
ఈ పెను సవాళ్ళ,  అపార క్షుభిత కాలంలో కనీసం బతకడం కూడా చాలా సాహసమే. అయితే అతని మేధలోని ఈ ఖాళీ అతనిది మాత్రమే కాదని సవినయంగా ఒప్పుకునేందుకు వెనకాడుతున్న ఈ కాలం  అతడిని ఆత్మహత్యకు వదిలేసిందేమో!
ఈ ఖాళీ ఒక కాలానిదీ, ఒక తరానిదీ.
అందుకే యువకది అకాల మరణం.
అదుకే అతనిది కొనసాగిన ఆత్మహత్య.
యువక ఇప్పుడు మనముందు కనిపించ కుండా పోయినందుకు మరణించాడని నిర్ధారించుకుంటున్నాం. కానీ మన మధ్యలో బతుకుతున్న చాలా మంది ఇదివరకే మరణించారన్న వార్త మనకింకా చేరడం లేదు. అంతే.
@
యువక ఇలా చనిపోవడం పట్ల నాకు ప్రత్యేకమైన జాలి లేదు. విపరీతమైన కోపమూ లేదు. కుంగిపోయేంత నిరాశా రాదు. నా లోన  ఇన్నాళ్ళూ యువక రగిలించిన ఆశా కొండెక్కదు. ఈ నా లోపలి ఉక్రోశం బహుశా మా సహచర్య  స్వార్థంలోంచో, లేదా నా మృత్యుభయంలోంచో ధ్వనించిందంతే.
@
నిష్కామకర్మ తో జీవించడం చాలా ఆదర్శం. కానీ మరణంలో ఇదే సూత్రం మాత్రం కంపితమనాన్ని మరింత రగిలిస్తుందని యువక మరణం గురిచేసిన గగుర్పాటు నాకు గుర్తుచేస్తోంది.
కేవలం గ్యాలరీల కోసం ఆదర్శంగా బతకాలని తెగ ప్రయత్నించడం కన్నా దర్జాగా చావడం మేలు. అలా అని యువక ఆత్మహత్యను వెనకేసుకురాడం లేదు.
మన ముందుకు తోస్తున్నానంతే.
అయినా మనలోని యువకలో, యువకలోని మన నేనులో, ఇలా యువకలా మరణించడం పట్ల మనకు విపరీత భయం, వ్యతిరేకత, ఆందోళన, అసహ్యం, కోపం.
ఇందుకే యువకలానే అతని మరణాన్నీ చాలా తక్కువ మందే అక్కున చేర్చుకున్నారు.
కానీ అతను ఇలా, ఇప్పుడు, ఇక్కడ మరణించి వుండాల్సిందేనా?
@
యువక చెప్పాల్సింది చెప్పకుండానే చని పోయాడు.
రాయాల్సింది రాయకుండానే మరణించాడు.
చేయాల్సింది చేయకుండానే అర్థంతరంగా నిష్క్రమించాడు.
వుండటమే పోరాటం అయిన కాలంలో చెప్పాపెట్టకుండా లేకుండా పోయాడు.
చెప్పడానికీ, రాయడానికీ, చేయడానికీ, వుండటానికీ కనీస శక్తిని కూడా లేకుండా చేసేసుకుంటూ ఎటో మాయమైపోయాడు.
ఎవరి మీదో తెలియని కోపంతో, అలకతో తనను తాను నిరాకరించుకుంటూ అస్తమించాడు యువక.
మంచి మనసున్న, మనకున్న  కొద్ది మంది ఒరిజినల్ థింకర్స్ లో వాడూ వుండిపోయాడో? మిగిలిపోయాడో ?
యువకది కేవలం అకాల, అసహజ మరణమే కాదు…. అనవసర  మరణం కూడా.
 ------------------------------------------------------------------------------------------------------
తాజా (మూగపోయిన) కలం :
యువక కేవలం నాకు 1994 నుంచి మొదలైన ఒక తీపీ చేదూ గీతలు చెరిపేసిన మహత్తరమైన జ్ఞాపకం మాత్రమే కాదు. అర్థంతరంగా ఆగిన మా అనేక ప్రయాణాల్లో నా సహచర్యం కూడా. 
ఆప్తుడు. మా కుటుంబ వ్యక్తి. నా కూతరుకు పేరు పెట్టిన వాడు.
తనకీ, నవతకీ పుట్టబోయే బిడ్డకు కవన అని పేరు పెట్టుకోవాలనుకున్నాడట.
బిడ్డ కోరికను కాలం నెరవేర్చలేకపోయింది కానీ పేరు ముచ్చటను మాత్రం నా బిడ్డ తీర్చింది.