Wednesday, December 28, 2011

వొక తల్పం ...అంతస్తులు రెండు


ఆకస్మికంగా ప్రతీక అందదు
ఇప్పటికయితే
గాలికూగు ధాన్య గుచ్చమూ
కల తిరుగు పిచ్చుక

పోనీ పునరావృతమయిన
అనాచ్ఛాదిత సంజెలు

పరస్పరం తర్ముకున్న
చలనిశ్చల అవయవాల సంభాషణ
సల్సల తోలు రక్తనాళాల బిగిదోబూచులల్లాట

జన్మాంతర దప్పికని
అంతర్జల బావుల
పూడిక తీత కూలీలయి
రస్పరం తవ్వుకున్న
తర్వాతర్వాతర్వాతర్వాత
తూలిన గడియారపు గట్టు మీదొక
తీగల జతల తలమై

జుయ్ జుయ్ మని వెళ్తున్న
దేహమమై సమయా

దోసిలి పడతావు కానీ
లాక్కున్న జ్ఞాపకం తగలదు
-
నామాడి శ్రీధర్
అనంత్

( 18 జూన్ 1997)

Wednesday, December 21, 2011

Next day of rest of my life


కొంచెం మత్తిలాలి
కొండలా తూలాలి
గుండెలో బాణాసంచా పేల్చాలి
నావూరి పొలిమేరల
బాల్యపు వాగులా
ఆగడం మరవాలి

వాలినా సరే
మరోసారి మనోదారిలోనే ఎదురుడాలి
పాత పరిచయంతో
కొత్త భయంలో
నైతిక కంచెల్నీ
కంకాళాల్నీ
తూచ్ అనగల గలగలల్ నే
మాలగా అల్లాలి
ఇవన్నీ ఈది
తననే చేరాలి

చెప్పాలి
విప్పాలి
లోనదంతా తోడెయ్యాలి
పోగెయ్యాలి

ప్రేమలో పడటం మాటలా మరి

మాటల్ని ప్రేమలో పడేసి
కాసేపు మనం ఎగరెయ్యాలి

కేవల చూపుల్లో మాడి మసైపోవాలి
పిచ్చి మత్తులో కళ్ళప్పగించాలి జ్వరానికి
అహానికి ఇహానికీ పుటం పెట్టేయాలి
పడాలి ప్రేమలో
ఎంత సరదా
చిన్న పరదా చీల్చాలంతే
మిరమిట్ల మనో వీణియ మెట్లు ఎగబాకి
పీల్చేసేయాలంతే
సమస్త తంత్రుల్నీ

అసంబద్ధం
ఒక అబద్ధం
యుద్ధంలో
మరియూ
ప్రేమలో
-------------
(3-feb-2008)

Tuesday, December 20, 2011

అందనివి

గిరికొసన
గిరికీలాడే
రెండు రెక్కల సయ్యాట
కంటికి అందదు
@
గుసగుసలనూ
దవ్వున రువ్వే గాను అలికిడినీ
వినేందుకు
చెవులను తర్ఫీదు చేయొచ్చును
కానీ
గరికె సవ్వుడులు
దానికెన్నడవ్వాలి
పదనిసలు
@
గింగిరాల వొత్తయిన జుత్తు
వంకీలను అందుకునేందుకు
సాచే చేతులు
వేళ్ళను పురమాయిస్తాయే కానీ
గాలిలో గమకాలాడే
సఖుల వూసుల
సయ్యాటకు సై అనలేవు
@
ఏ మూలన
ఏం కాలినా
గురుతెరిగి ఎగిరే
ముకుపుటాలు
భయానికి మాత్రం
ఇంకా
తెలియని
పుటలే

-----------------
ఇంగ్లీష్- బ్లైండ్ స్పాట్స్-
ఎకె రామానుజం

Monday, December 19, 2011

untitled

తల్లుల ఆసరానే
లేకుండా
పిల్లలే
నాకుంటే
బాగుండనిపిస్తుంది

నా కోసమే వున్నారనుకున్న
పిల్లలు
ఎన్నడయినా
తల్లుల్ని తలచుకుంటే
బాధేస్తుంది

పిల్లల కోసమే ప్రార్థించే తండ్రులున్నా
పిల్లలే లేరని చింతించే తల్లులున్నా
దిగులే వీస్తుంది

పిల్లలు ఎల్లల్లేని చేపలు

మరి
తల్లులయినా
తండ్రులయినా

కనగలరా
ఏ మునిమాపయినా

పిల్లల్లా
'''''''''''''''''''''''''''''''''''''''''''''

(12-dec-2004 )

Friday, December 16, 2011

ఫస్ట్ డే ఆఫ్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్


యింతా చేసీ
ఈ రాత్రీ ముగించేది
నక్షత్రాలు రాలిన
మాటల రాతిరితో
ముచ్చటిస్తూనే
మవునంలో

తెరల్ పొరల్ గా
నెత్తుటి యోచన
రెక్కలేస్తుంది
లోన ఎక్కడో


ద్దరిలో
యిసుక మేటలపై
ముప్పిరిగొన్న పసిపాదమే
జాలిగల పురా ప్రవక్త వోదార్పు

ఛిద్రమైన విలాసమూ
బీటలువారిన సంశయాత్మా
కొన సాగదూ
తలదాచుకోనివ్వదూ

సంచారీ
యిదే వేళ

వొక వృత్తం పరి పక్వమయిన ప్రతిసారీ
తొలిసారే

పాకుడు శేషం కురచ కుబ్జ కంకర
కుతంత్రం అబంధం 
స్నేహం

అసంబంధనాలమీంచి
బయలుదేరాలి
వొఖడివే
ప్రతిసారీ తొలిసారిలానే

యిక
మళ్ళీ
తిరిగి
పరిసమాయత్తమవాలి

కలసి నడవడం
కలిసి రాలేదు

యిది
అశేష జీవితపు తొలిజామే

(12 january 2003 and 2011)

Wednesday, December 14, 2011

వొఖణ్ణే


దుఃఖంలో
దుర్మార్గంతో
దూరంగా
వొఖణ్ణే

చీకటిలో
చింతల్తో
శబ్దంలా
వొఖణ్ణే

దప్పికలో
ఆకల్తో
వొంటరిగా
వొఖణ్ణే

మోహాల్లో
మొహమాటాల్తో
రద్దీగా
వొఖణ్ణే

లోయల్లో
లోతుల్లో
కేకల్లా
వొఖణ్ణే

చిత్తుల్లో
మత్తుల్లో
గమ్మత్తయి
వొఖణ్ణే

కాలంతో
కామాల్లో
మొండిగా
వొఖణ్ణే

రాగాల్లో
గారంగా
పగిలినా
వొఖణ్ణే

కంచెల్లో
వంచనతో
భయంగా
వొఖణ్ణే

దారాల్లో
దారుల్తో
తప్పినా
వొఖణ్ణే

రాళ్ళలో
ప్రియురాళ్ళతో
రంజుగా
వొఖణ్ణే

దిగులుగా
పగిలినా
పలుగుతో
వొఖణ్ణే

కూడలిలో
కూటమితో
శిథిలంలా
వొఖణ్ణే

గురుతుల్లో
గాయాల్తో
కస్కసిగా
వొఖణ్ణే

మాటల్లో
బాకుల్తో
మవునంగా
వొఖణ్ణే

చరితల్లో
చిరుగుల్తో
దర్జాగా
వొఖణ్ణే

స్నేహాల్లో
హేయాల్తో
మచ్చికగా
వొఖణ్ణే

ఒలికినా
ఒరిగినా
లేచినా
పడినా
ఓడినా

వొఖణ్ణే
మళ్ళీ
వొఖణ్ణే

(21-july-2003)