Sunday, June 21, 2015

అనార్క లి


ప్రేమలో దహించుకుపోయే 

తనదే కానియ్యి
నీ జీవితాన్ని


మోహాతిరేకంగా మసలే ఈ పరిసరం
సఖి ఎదురుచూపులోనే మనమంది

జీవితం బుద్బుదం
జుర్రుకో సాంగత్య మాధుర్యం
లెక్క పెట్టకు గుండె లయను


ఈ పగలూ రేయీ మనమే అయినా
ఇల్లా తీరిక మనదే అవునా?

సంగమ శృతి విను
సంబర గతి చను
....................తెలుగు : అనంతు

Monday, June 15, 2015

ప్రాతినిధ్య

ప్రాతినిధ్య కథ 2014 సంకలనంలోని కథల సమీక్ష ; కథ 2 : తలుగు; రచయిత : వేంపల్లి షరీఫ్
.............................................
బహుశా రబ్ నే బనాదీ మోదీ బీఫ్ ని నిషేధించాలనుకున్న తరుణంలో షరీఫ్ గొడ్లు కోసుకుని బతుకీడ్చే దౌలూ నిరసనని రచియించాడు.
(ఈ నేలలో కులానికీ, మతానికీ అతీతంగా, సామాజిక ఆదరణలో నిమ్నులయినా సంఖ్యలో అధికులు తినే ఆహారం పేరే కల్యాణీ, దస్ నంబరీ, ఎద్దుకూర, లెల్లే, గొడ్డు మాంసం అలియాస్ బీఫ్.)
కరసేవకులు దూసిన దండాని ఆపే చేతులు మొలిచిన (కర్రెనుము కొమ్ముల సహితంగా) ఆశావహ ముగింపు తలుగులో షరీఫ్ చూపాడు. అయితే బీఫ్ నిషేధం అనే సమకాలీన సమస్యను ఇతివృత్తంగా చేసుకుని క్రమంగా దాన్నించి పక్కకు జరిగిపోయింది తలుగు కథనం.
నిస్సహాయులు సాగించే అనేకానేక రోజువారీ ఒంటరి పోరాటాలూ, వాటికి మన అహాలను తృప్త పరిచే విడి(isolated ) సాహసోపేత ఎండింగ్ లను సూచించే (పరోక్షంగా, subtle గానయినా) మరో మంచి ప్రిడిక్టబుల్ కథ తలుగు.
ఇలాంటి వందలాది(బహుశా వేలాది) ‘విప్లవ’ (సోకాల్డ్ ఫార్ములా) కథల తానులోకి తాజాగా రాయలసీమలోని కడప ప్రాంతం నుంచి చే(జా)రిన(?) కథే షరీఫ్ హాయిగా, సునాయసంగా, కూసుగా కూర్చిన ఆంధ్రప్రదేశ్ తెలుగు కథ తలుగు.
*
కష్టంగా, సంక్లిష్టంగా రాయడం నిజంగా చాలా సులభం. ఎందుకంటే అదంతా (ఉద్దేశ్యపూర్వంగా) మభ్యపెట్టేందుకు చేసే రచనా విన్యాసమే కాబట్టి. కానీ సాదాసీదాగా రాయడమే చాలా చాలా కష్టం. ఎందుకంటే అందుకు జీవితం పరిచయం అయ్యి, వివరం తెలిసి, విషయం మన లోపల జీర్ణమయ్యి, వివేకంగా వ్యక్తం అవ్వాలి కాబట్టి. ఈ కష్టాన్ని తన కథన శైలిలో సుసాధ్యం చేసుకున్నాడు షరీఫ్. కానీ పాత్రల సౌష్టవాలను అందుకోవడంలోనే కాక, వారి మనో నేత్రాలను సందర్శించడంలో షరీఫ్ మరో నాలుగు అడుగులు వేయాల్సి వున్నది మరి.
జీవితంలోని రోజువారీ కష్టాలను కూర్చడం, చిత్రీకరించడం కూడా చాలా సులభం. పైగా ఆలాంటి చిత్రీకరణలకు జనామోదం సత్వరం. (కర్టసీ ....మిర్రర్ న్యూరాన్స్). కానీ జీవితంలోని సాదాసీదాలను వడిసి పట్టుకోవడం అత్యంత దుస్సాధ్యం.
పైగా కన్నుకి దృగ్విషయమైనదీ, సాధ్యమయినదీ, పెన్నులోకి ఇంకి అక్షరాలుగా అనువాదం కావడం మరీ మరీ కష్టం.
ఆ అనువాదమే కాదా కథా రచయిత(త్రి) పరిణతికి, పరిపక్వతకీ సూచిక?
షరీఫ్ ప్రస్థానం మాత్రం (అంటే నా ఉద్దేశ్యంలో కడపలోని వేంపల్లె నుంచి కేంద్ర సాహిత్య అకాడమీకి అని కాదు; జుమ్మా(మసీదు) నుంచి తలుగు (దర్గా) కు చేరుకున్న యానమనే అర్థంలోనే) సమ్యక్ రచనల వైపు బలంగా పడుతున్న ఒక ప్రామిసింగ్ రచయిత అడుగులనే సూచిస్తున్నది. తలుగు కథ ఆ దారిలోని కీలక మైలురాయి.
*
తలుగు కథ మూడు శిబిరాల లౌక్యాల, లౌల్యాల, లాలూచీల, అవకాశాల, లావాదేవాల, అవకాశ వాదాల, ఆధిపత్యాల, పలాయనాల, పోరాటాల మధ్య జరిగే సంఘర్షణ.
శిబిరం 1 : దౌలు
శిబిరం 2 : వెంకటప్ప
శిబిరం 3: పంచాయితి పెద్దలు (లేదా చిన్నలు)
ఇస్లాం మతం ఈ దేశంలో అనివార్యంగా అనుకరించిన హైందవ నిచ్చెనలో కింది మెట్టులో పుట్టిన వెలివాడ జీవి బోరేవాలానే ఈ కథా నాయకుడు దౌలు. తల్లిలేని తన కొడుకును సాకుతున్న సింగిల్ మేన్. వృత్తి రీత్యా గొడ్డు మాంసం అమ్ముకుని బతికే చిరు వ్యాపారి. సమాజంలో మనం అతి సహజం, సామాన్యం అని అనుకునేవి ఎన్ని నిరాకరించబడ్డాయి ఇతనికి? ఇతని ముత్తాతలు, అవ్వలు అందమైన ఈత చాపలు అల్లి వుండవచ్చును గాక, ఇతను మాత్రం ఆత్మగౌరవాన్ని అల్లుకుందామనుకున్నాడు. అందుకు అందుబాటులో వున్న అన్ని పోరాట మార్గాలనూ అందుకున్నాడు. లౌక్యం తో మొదలుపెట్టి, స్వార్థ – వ్యాపార చింతనతో అవకాశవాదిలా సాగి, ప్రలోభ పెట్టి లాబీయింగ్ ని ఆశ్రయించి, బెడిసికొడితే లొంగిపోయి, వల్ల కాకపోతే ధిక్కరించేందుకు వెనుకానడని మామూలు, ఒంటరి సామాన్య నిమ్న వర్గీయుడే ఈ దౌలూ. గతంలో వెంకటప్పతో మోసపోయినా అనివార్యమైన వ్యాపార సంబంధాన్ని రేపటి కోసం కాపాడుకునేందుకు (కెరీర్) కొంత రిస్క్ చేసేందుకు వెనుకాడని లౌక్యుడు. తన బృందంలోని (ముస్లింల) ప్రధాన స్రవంతినుంచి తన అస్తిత్వాన్ని వినిర్మించుకోవాల్సిన అగత్యం వున్న ఒక ధిక్కారిగా రచయిత ఈ పాత్రను మలిచాడు.
‘బుద్ధిని బట్టి వుంటుంది కానీ తినే తిండిని బట్టి వుంటుందా యాలీసన్’ అని తన అస్థిత్వాన్ని నిర్వచించేందుకు కరీంసాబ్ తో బలంగా వాదించే దౌలూ హైదరాబాద్ లో ముస్లింల అస్థిత్వాన్ని మాత్రం తిండిని బట్టే నిర్వచించడాన్ని తన వాదనకు బలంగా తెచ్చుకోవడం దౌలూ స్వభావంలోని వైరుధ్యం. అంతా సవ్యంగా జరిగితే సాయంత్రం సారా పోయిస్తానని తనకు తోడుగా బలహీనులయినా సరే వెంకటప్పతో లాబీయింగ్ కోసం ఇద్దరు పెద్ద మనుషులను కుదుర్చుకున్నాడు దౌలూ. కొన్న ఎనుమును చనిపోయేలోపు జుబహా చేయించేందుకు సిద్ధపడి (ఓ ఆది వారం కాని రోజున)అదనపు వ్యాపారాన్ని ఆశించాడు దౌలూ. తీరా ఎనుము ఈనితే, తను వయసులో వున్నప్పుడు కన్న కలను (గొడ్లు కోసే పని మానుకుని పాడి ఎనుములు పెట్టుకోవాలనుకునే) సాకారం చేసుకోవానుకుంటాడు. ఇది అతని vertical mobility, లేదా seeking career outside caste/religion occupation కి సూచిక. ఒక్క మాటలో చెబితే ఎప్పటికయినా దౌలూ కల వెంకటప్ప కావడమే. గ్రామీణంలోని వుండే సహాయసహకార సంబంధ బాంధవ్యాలలోని (symbiosis) విభజన, దోపిడి, ఆధిపత్యాలను ఏక కాలంలో ప్రశ్నిస్తూ, అదే సమయంలో అవసరమయితే వాటిని తనకు అనుకూలంగ మలచుకోవాలని చూసే కింది స్థాయి సాదాసీదా మనిషిగానే దౌలూను తీర్చిదిద్దాడు రచయిత. సాదాసీదా మనుషుల్లో వుండే అనేక బలహీనతలు దౌలూలోనూ వున్నా అతనిలోని మంచితనం, కరుణ, నీతి, ఆత్మగౌరవాలు కొట్టవచ్చినట్టు కనిపించి, అతడిని నడిపించి అతని స్వభావాన్ని తీర్చిదిద్దాయి.
ఇక వెంకటప్ప. బతకడానికి మోసాన్ని, దోపిడిని, అక్రమాన్నీ బలహీనులపైన ఆయుధాలుగా వాడి లబ్ది పొందాలనుకునే ఒక స్టీరియో టైప్ దోపిడిదారుడు. దౌలూ వ్యాపారానికి వెంకటప్ప ఎంత అవసరమో, వెంకటప్ప వ్యాపారానికి దౌలూ కూడా అంతే అవసరం. కానీ ఈ ఇద్దరి మద్య వ్యాపార సూత్రాలను, న్యాయాన్యాలను నిర్వచించేది మాత్రం వెంకటప్పే. దౌలూ లాంటి వారు ఇతని ‘సహజ’ సామాజిక అధికారాన్ని అంగీకరించి, ప్రశ్నించనంత వరకు మాత్రమే బలవంతుడిగా చెలామణి అయ్యే దోపిడిదారుడు వెంకటప్ప.
అయితే దౌలూ స్వభావంలోని నలుపు తెలుపులనే కాక, గ్రే రీజియన్ ని కూడా చిత్రీకరించిన రచయిత, వెంక టప్ప విషయానికి వచ్చే సరికి అతని స్వభావంలోని నలుపునే ఎత్తి చూపడం ముందుస్తు బయాస్ నే పట్టి ఇస్తుంది. పాఠకులను ముందునుంచే ఈ పాత్రను ద్వేషించేందుకు సిద్ధం చేస్తుంది. దౌలూ స్వభావంలో వున్న షేడ్స్ ఈ పాత్రలో మిస్ కావడం వల్లే కథ ఫార్ములా అయ్యింది.
బహుశా తలుగు కథలో మటన్ మాత్రమే కొట్టి బతకగలిగి హిందూ పౌర సమాజం నుంచి ‘మర్యాద’ని పొందాలనుకుంటున్న ముస్లింల ప్రతినిధి కరీంసాబు. ఇతను సంఘ్ పరివారంలోకి హైందవీకరణ ఘర్ వాపిసీ సంక్షేమ పథకానికి తనకు తెలీకుండానే చేదోడు ప్రకటించిన ఓ ఆధిపత్య వర్గానికి ప్రతినిధి.
ఇక బలహీనంగానయినా సరే దౌలూను సమర్థించగల ఏకైక బృందం పంచాయితి పెద్దలు. ఈ పంచాయితీ పెద్దలు పౌరసమాజంలో న్యాయం పట్ల నిబడగలిగి మాట్లాడే అల్పసంఖ్యాక వర్గానికి పౌరసమాజ ప్రతినిధులు. వీరికి ఏ పాత్రా లేకుండా చేయడం వల్లే దౌలూ పోరాటం ఒంటరిదీ, వ్యక్తిగతమూ అయిపోయింది. మిగిలిపోయింది.
*
మరి దౌలూ వంటి నిస్సహాయుల వొంటరి పోరాటాలకూ, సాహసాలకు ముచ్చటపడే కూడలి దగ్గరే ఇంకా ఆగిపోదామా?
యధాతథ జీవన చిత్రీకరణకూ, ఆదర్శ ప్రకటనలకూ మధ్య పెరిగిన అంతరం పూడ్చడం సృజన కర్తవ్యం కాకుండాపోతోందా?
సారస్వతం జీవితాన్ని డౌన్ లోడ్ చేసే టూలూ కాదు, వెతికి పట్టించే కేవల సెర్చ్ ఇంజనూ కాదు;
అది శాఖోపశాఖల పవనాలను, వనాలను మొలిపించే విత్తనం కాదా?
శోధనకూ, విశ్లేషణకూ, హేతువుకూ, వికాసానికీ నోచుకోని కేవల జీవన చిత్రణ సృజనగా చెలామణీ అయితే ఇంకా ఆ జాతి డాక్యుమెంటేషన్ దశని దాటలేదనే అర్థం చేసుకోవాలా?
ఇరు రాష్ట్రాల తెలుగు కథకులు, విమర్శకులు వేసుకోవాల్సిన ప్రశ్నలు ఈ నాటికీ ఇవి కావా?
.............................................
15, జూన్, 15
తరువాతి కథా సమీక్ష..... వొదిలెళ్ళిన జోళ్ళు

Thursday, June 11, 2015