Wednesday, August 26, 2015

Quizas, Quizas, Quizas

అతనికి
మాయమైన తన శిథిల శిశిరాలు
ఇంకా బాగా గురుతే
*
తుప్పు మూగిన
దుమ్ము మూసిన
ఆ గవాక్షాల్లోంచి
అతనే
ఆ ఉత్సవ వత్సరాలను
నెమరు వేసుకుంటాడు
*
మూసివున్న అదే కిటికీ ఊచలపై
రెక్కలూ అల్లార్చలేని చిట్టి గువ్వ మల్లే సోలి
గింజల్లా పోగేసుకుంటాడు
బతికిన క్షణాల మధురిమను

సోగుల్లా పేనుకుంటాడు
పడుగూ పేకా తనే అయి
పెనవేసుకుంటాడు బదనికలా
*
అతనిపుడు గురుతెరిగాడు
గతం దర్శించతగినదేననీ
స్పృశించ తరము కానిదనీ
*
ఇపుడంతా
అతని కంటికి
ఇన్నేళ్ళ
లో సాలీడు అల్లిన బూజు వెనుకే
మెల్లగా మసకబారుతున్న జతులు ఆ సంగతులు
*
అతనిక
గతం
దాచుకోలేడు
దాల్చలేడు
పోల్చుకోలేడు
రాల్చ లేడూ
కాల్చనూ లేడు
*
అతనితో
ఈ మహత్తర
రహస్యమూ
తనువు చాలించనుంది
కాలం చేయనుంది.
.......................................................
(Quizas, Quizas, Quizas అంటే బహుశా, బహుశా, బహుశా అని అర్థం.
అది స్పానిష్ కవి జో డేవిస్ రాసిన కవితా శీర్షిక.
దర్శకుడు వాంగ్ కార్ వై తీసిన చిత్రం in the mood for love లో ఈ పాట వాడారు.

ఈ నా కవితకు ప్రేరణ ఆ సినిమా ముగింపు వాఖ్యాలే.)

No comments: