Tuesday, October 23, 2012

పిల్ల చేపల కలల కడలి

మాయా
నాగరికత అంతం
క్యాలెండర్ కాండ్రించింది

ప్రేమ పేజీ తిప్పేసింది
ప్రేయసి మరో రోదసి

కానుక అనుకున్న జీవితం 

గానుగ

మన్నిక  కావాలి
                    మచ్చిక  కావాలి
లేదా
మనలేం
               మానలేం
                           
#

ఆపాలనుకున్న ఏదీ కాదు అంతం
ఆగటం అగత్యం
గతం అనంతం
ఆకర్షించే అహం స్పృహ
ఆహ్వానించదనేకదా
ఇంత బాధా!

#

కొండ చివరన
పాదం కొన మోపినప్పుడు
కాసిన
నీ వొక్కడిదీ
వొంటరి కాదు చూపు
నీ పాదం ఇంకా కానని
లోయ
          వైశాలి
 

కనుగొన్నదేదీ కన్నుదే కాదు
చూపు విస్తరి

#

దృశ్య దేహాలు మరుగున పడనీ
దేహాతీత దృగ్విషయాలే
మక్కువ వలయాలు
దరహాస హోమం ముందు
మృదుమాస గాయం
 

సోయ హొయలు అనిర్జీవమ్
ఎక్కడిదయినా సరే
ఓ రాత్రిని ఈ రాతిరికి
కొన్ని కలల సేదకు
అక్కున కునారిల్లనీయ్

#

బరువు జీవితం
అరువు కాగితం
సిరా కరిగే కడలి
వీపున శిలువే తీరం
మనో ఏకాంతరం నడుమ
మరో ద్వీపాంతర
                        వాసాలు
దిక్కు దీపం ఆర్పినా
దరి దారి కాలిని కననీయ్

#

స్నేక్స్ సాక్స్ విడిచినా
విషం సశేషం
తేలియాడే ఆడ ఆట
                            అవాక్యం

అమాటలేగా మిగిలేవీ
అకలలేగా మసిలేదీ

కని
      కరించని సత్యాలనే
కఠోరంగా అను
                   సరించాలి

#

ఆ పిర్ర నునుపు వంకరే
ఆ పిట్ట మనసు ముక్కెరే
 
ఎరిగే
ఎగిరే నిశ్శబ్ద దహన కాంక్షా వృత్తాల్లో

ఇటు విరిగి ఒరిగాం అంతే

అతి ప్రాతః మృత్యు కారాగారంలో
సరికొత్త ప్రాణ వాయువు

శ్లోకించు
స్తోత్రిం
చు
నును దేహ రశ్మి రజనును
 

వెనుతిరగడం నిషేధం

అద్దంలో నిరాకరించబడిన
వెన్ను దన్నుఆమేనా?

చూపెప్పుడూ
ఆరని నెత్తుటి దస్తూరీ

#

అధరం మాటున అచిత్రం
దేహ భాష వంచన ముఖచిత్రం
చేరాల్సిన రాల్చిన పగల్చిన
అద్దాల్లో
అదాహ ఆకృతి

పిల్లల పిలుపెక్కడ?
పిలుపులోని పిల్లలెక్కడ?

తోడు దిగులుగా
నీడ మిగులుగా
ఈ రాత్రి
             ఈ చెట్టు
                             గర్భవతి

పిల్లలే
ఏ అనుమతీ అక్కర్లేని
రెక్కలల్లార్చిన పిట్టలు

#

తిరగుతున్ననేలపైన
వాలలేని వానలే ఆనవాలై
దేహాలు ఆరబెట్టుకుంటున్న మేఘాలు
చడీ చప్పుడూ లేని
మౌనాలోచనాలు
ఎప్పటికప్పుడు
తలతిప్పేసుకునే
రక్త పాతరలు

#

వృక్ష వక్షోజాలపైనా
కుదురు ఎరుక రాకపోతే
చుట్టూ కల తిరుగు కనీసం
ఏదో మొక్కు వున్నట్టు
ముక్కలు ముక్కలుగా
మొక్కలు మొక్కలుగా
పగిలి విత్తులా
 

నిప్పుకు పుట్టిల్లే
విత్తు వళ్ళు
             కను

#

మరో వాలు తిరిగిన ఆకాశాన్ని
మరో చినుకు అడిగింది పాదముద్ర

దరి చేరే గాలి కలలో
సకాలం ఎవరిది?
విసర్జించని అక్షరాల్లో
మౌనం ఎవరిది?

మరో గాలం
జాలరి జీవితం
జారే వలే
చేప కలల కడలి

------------------
 

అనంతు
ఎం ఎస్ నాయుడు
అక్టోబర్ ఇరవై రెండు. పన్నెండు












Monday, October 22, 2012

song

సాకీ

ఉలసా పూలన్నీ
వలసెల్లి పోనాయే
    సెల్లిపోనాయే
        ఉలసా పూలన్నీ సిన్నారి
        వలసెల్లి పోనాయే వయ్యారి
        నీ రాక తెలిసాక సింగారి
        నిను కళ్ళ జూసాక బంగారి


పల్లవి


అనుకోని కానుక నువ్వా
కనులెదుట వేడుక మువ్వా
తొలివలపు వేకువ పువ్వా
ఎదలోతుల్లో ...తారాజువ్వా

తొలి చూపే వెలగే దీపం
ఏ చీకటి సోకని ద్వీపం
కళ్ళారా చూడాలంటే
కనులారు... చేయ్యాలంతే

ఏ మబ్బుల తలుపే లేని జాబిల్లీ నువ్వేనా
నిను చూసిన ఈ వేళే నేనేలేనే నాలోనా
                                                          

                                                            IIఅనుకోనిII

చరణం -1


నువ్వెందుకె ఇష్టం
అని మదినే అడిగితే
మాటలు లేవందే

నువ్విందుకె ఇష్టం
అని నిలువద్దంలో
నిన్నే చూపాలే

ఆ బైరన్ పద్యంలో
అందం బదులుగ
నీపేరే రాసా

ఆ న్యూటన్ సూత్రంలో
ఐస్కాంతవు నువ్వని
భూమిని తప్పించా

ఈ లోయల పువ్వుల్లోనా
జలపాతం ధారల్లోనా
సుడి తిరిగే దారుల్లో
కొండల్లో... కోనల్లో

ఏ చోటా నిను వెతకాలని
తడబాటుకు లోనయ్యానే
నిలువెత్తుగ నిజమయ్యిందే
ఇది కల కాదని రుజువయ్యిందే


                                                IIఅనుకోనిII

చరణం-2


ఎడబాటే కష్టం
చెరిసగమైనా
చేరే దరి ఒకటే

ఈ మౌనం  కష్టం
వినిపించాలే
ఒకటైనా  ఒకటై

ఆఫ్రెంచి శిల్పంలో
నీలో వున్నది
ఒకటీ లేదంటా

డావిన్సీ చిత్రంలో
ఆ మర్మం నీదని
నేనే గుర్తించా

కనిపించీ కరుణిస్తావని
దయచూపి దయచేస్తావని
నే చూడని దిక్కేలేదే
నేనే తీర్చని  మెక్కేలేదే

ఎన్నడుగులు నడిచేసామో
ఏ లెక్కలు లేకుండానే
ఏడడుగులు వేసెయ్యాలే
ఆ చొరవేదో చేసేయ్యాలే


                                                     IIఅనుకోనిII










Thursday, October 11, 2012

Mother


ఊపిరి నీవె...
తనువూ నీవె...
ఉనికీ నీదే తల్లీ

నను కడుపున దాల్చి
రూపం తీర్చి
 ప్రాణం పోసింది నీవె

నీ కంట చేరే ఒక్క నీటి బొట్టు కడలినె ముంచును తల్లీ

నీ కాలి ధూళి చాలే  తల్లీ స్వర్గం ఎందుకు నాకూ...

ఊపిరి నీవె...
తనువూ నీవె...
ఉనికీ నీదే తల్లీ

నింగిని మెరిసి...
నేలను మురిసి...
వానలో కురిసి
గాలై వీచే

భూమికి ఐనా నెమ్మది లేదని
దైవం పంపెను-2
తల్లిని ఇలకు

ఊపిరి నీవె...
తనువూ నీవె...
ఉనికీ నీదే తల్లీ


url: Tamil_Beautiful_Mother_s_Song_-_Unni_Krishnan_Awesome_Singing-1.mp4

(సామ్రాజ్య లక్ష్మికి )

Tuesday, September 4, 2012

సారీ టీచర్

 (కత్తి నరసింహారెడ్డి సంకలనం చేసిన టీచర్ పుస్తక సమీక్ష)

బడికి పునాదులు లేకపోతే సర్కారుది నేరం...

విద్యకు పునాదులు లేకపోతే అయ్యవార్లదే నేరం- కా.జ.


పిల్లలు బడి మానేయడానికి చాలా మంది ఇప్పటికీ బలంగా నమ్ముతున్నట్టు, ప్రచారం చేస్తున్నట్టూ పేదరికం ప్రధాన కారణం కాదని చాలా నర్మగర్భంగా చెప్పిన చాసో కథ పుస్తకానికి తొట్టతొలిగా వుండటం భలేగా వుంది. డ్రాపవుట్స్.. నెవర్ ఎన్ రోల్డ్- ఈ రెండు వర్గాల పిల్లలూ బడి పుణ్యమే కదా! వీళ్లు టీచర్ల బాధ్యతే కదా! ఈ పిల్లలు మన చదువుల బాధితులే... ఆ పిల్లల కుటుంబంలో వున్న కష్ట నష్టాల కబోదితనం సంతరించుకున్న ఆ ప్రాంతపు పాఠశాల అలసత్వమే ఇందుకు కారణం కాదని అనగలమా? 14 ఏళ్ళ లోపు వయసున్న బడి బయటి పిల్లలంతా బాలకార్మికులే... వారంతా ఆ ప్రాంతలో(neighborhood) వున్న బడుల, టీచర్ల ఉత్పత్తులే.
కఠినంగా వున్నా సరే ఈ మాటలు నిజం. ఇప్పటికే జనాభా లెక్కలు, పోలియో చుక్కలూ, వేర్వేరు సర్వేలూ, కమ్యూనిటీ కౌన్సిలింగులూ, మెటీరియల్ ప్రిపరేషన్ వర్క్ షాపులూ, టీచింగ్ ఎయిడ్స్ తయారుచేసుకునేందుకు శిక్షణా తరగతులూ, ఇతర నానా డాషుల పేరుతో రిసోర్సు పనులూ, అడ్మినిష్ట్రేషను చాకిరీలు, రీసైకిల్ బిన్ లు మాత్రమే ఎదురు చూసే నానా చెత్త రిపోర్టులు రాస్తూ ఇలాంటి చాలా బోధనేతర బండ చాకిరీ చేస్తున్న ఉపాధ్యాయుల మనసు నొప్పించి వుండవచ్చు నేను అన్న మాటలు.
( అయితే నేను మీ మనసుకు ఊరట కలిగించేందుకు ఇంకేదో తియ్యని సంగతి  చెప్పే లోపు మీరు ఒక పని చేయవచ్చు. ఈ పుస్తకంలోని 225వ పేజీ తీసి మన మాజీ రాష్ట్రపతి... పైగా డ్రాప్ అవుట్ అవ్వాల్సి తృటిలో ఆ ప్రమాదం నుంచి వాళ్ళ అక్క నగల వల్ల గట్టెక్కిన అబ్దుల్ కలాంజీకి తన ప్రొఫెసర్ స్పాండర్ ఏం చెప్పాడో వినండి.)
పోనీ చాసో చెప్పిన కథలో కృష్ణుడు తనకు ఏం కావాలో నిర్ణయించుకుని చుట్టల వ్యసనపరుడయిన తన తండ్రి మనసును సమ్మె చేసి మరీ ఎలా మార్చాడో గ్రహించండి.
ఆ కథలో మీరే కృష్ణుడు అనుకుందాం కాసేపు... మీ తండ్రి ఈ ప్రభుత్వం అనుకుందాం.. చుట్ట తాగడం అన్న వ్యసనం, దాన్ని కొనసాగించేందుకు అయ్యే ఖర్చు వల్ల కృష్ణుడి సిసలైన చదువు భారం అవుతోంది. అదే కదా కథలో సారాంశం. మరి చుట్ట అలవాటు మాన్పించేందుకు మీ దగ్గర కనీసం కృష్ణుడి దగ్గర వున్న నిరసన అనే ఆయుధం కూడా లేకపోతే ఎలా? పైగా ఒక వేళ మీ నిరసనకు తల ఒగ్గితే ఈ సర్కారు(అంటే కథలో కృష్ణుడి తండ్రి) ఎదుట నిలబడి మీరు "ఎందుకు పారేస్తాను నాన్నా?" అని ధైర్యంగా అనేందుకు మీ జేబులో ఏం వుంది? ఒక సారి చూసుకోండి!
బోధనకు దూరమైన ఉపాధ్యాయుడు డ్రాపవుట్ అయిన పిల్లవాని కన్నా ఈ సమాజానికి ఎక్కువ నష్టం కాదా?
అలా టీచర్లను బోధన నుంచి దూరం చేసే అన్ని పనులనూ చేస్తున్న టీచర్లు బాలకార్మికుల కన్నా ఏం తక్కువ? ఇందు మూలముగా యావత్ టీచర్లు తెలుసుకోవసినది ఏమనగా... బడి బయటి టీచర్లంతా వే(త)దన కార్మికులే.

 *
సరిగ్గా ముప్పై ఏళ్ళ క్రితం మొదలైందనుకుంటా ఒక వ్యవహారం. పంతులు పాఠం చేప్పేందుకు ఒక పాఠ్య పుస్తకం వుండేది. అదీ అర్థం కాకపోతే అదే పంతులు ఇచ్చే నోట్స్ వుంటుంది. ఇంకా అదీ చాలదని ఆ పిల్లల తల్లిదండ్రునుకుంటేనో, లేదా అలా వాళ్ళు అనుకునేలా ఆ పంతులే చేయిచేసుకుంటేనో వేన్నీళ్ళకు చన్నీళ్ళుగా రోజూ సాయంత్రం ఆ పంతులుదే ట్యూషన్ కూడా వుండేది. అదీ తప్పితే రాఘవేంద్ర గైడ్ వుండేది. అదే పబ్లిషర్లు మరో పేరుతో అచ్చోసి అమ్ముకునే మరో క్వశ్చన్ బ్యాంక్ వుండేది.  ఈ వ్యాపారం చాలక ప్రభుత్వం అచ్చు వేసే పాఠ్యపుస్తకాలలోనే పూల గుర్తులున్న ప్రశ్నలు(marks ఇచ్చే star marks) కూడా  అధనంగా వుండేవి. ఇవన్నీ ఒకే ఒక్క ఏడాది ఒక సబ్జెక్టు సంబంధించి పిల్లలను ఉద్దేశ్యించి పాఠశాలలు అనుమతించిన బడా చోర్ మార్కెట్ ఇదే. ఇక్కడి నుంచే విద్య వ్యాపారం అయ్యింది... పరాయీ అయ్యింది. ఆ తర్వాత ఈ లాభాలు రుచి చూసిన పెట్టుబడి నేరుగా ప్రభుత్వాలకే మస్కా కొట్టి మస్కా-చస్కా (50-50) అనే సరి కొత్త విద్యా పథకాన్ని ప్రవేశపెట్టింది. 
పైన చెప్పిన పుస్తకాలన్నీ దాదాపు 30 ఏళ్ళ క్రితం ఏడవ తరగతి పిల్లల బోధనకు అందుబాటులో వున్నవి. ఎందుకంటే 5,6,8,9 తరగతులు బ్రహ్మానందరెడ్డి పాస్(అంటే ఈ తరగతుల పిల్లలు ఫెయిల్ అయినా పాస్ చేసేందుకు కాసు బ్రహ్మాందన రెడ్డి కల్పించిన వెసులుబాటు అది. అలా నేను తొమ్మిదవ వ తరగతిలో ఫెయిలయినా పాసయ్యాను.) ఇక ఏడవ తరగతి పబ్లిక్  పరీక్ష. అంటే బ్రహ్మానందరెడ్డి వల్ల కాదు కదా ఆ బ్రహ్మ చెప్పినా సరే పిల్లలు చచ్చినట్టు చదువుకుని పరీక్ష పాసవ్వాల్సిందే. సో అందుకే ఏడవ తరగతి నుంచే టెన్షన్ మొదలయ్యేది. ఆ కారణం వల్లే ఏడవ తరగతి నుంచి మార్కెట్లో ఇన్ని రకాల పుస్తకాలూ, గైడులూ అవతారమెత్తాయి. ఇవన్నీ కూడా తరగతి గదిలో టీచర్ బోధనను ఫెయిల్ చేసిన లేదా బోధన ఫెయిల్ అవ్వడం వల్ల పుట్టిన కుక్కమూతి పిందలే ... దొడ్డి దారులే.  ప్రతి దొడ్డి దారీ అవినీతినీ, హింసనీ, ప్రయివేటీకరణనీ, పరాయీకరణనీ కని, పెంచి, పోషిస్తుంది. ఇప్పుడు ఐఐటి పరీక్ష కోసం 8 వ తరగతి నుంచో ఆ పై/ కింది  తరగతి నుంచో కోచింగ్ ఇస్తే గిస్తే మాత్రం లోపం తరగతిది కాకుండా పోతుందా? తరగతి గదుల్లో బోధించాల్సిన అంశాలను బోధించాల్సిన రీతుల్లో బోధించని టీచర్లు అంతా దీనికి కబోదులే. కాదని ఏ టీచరూ అనలేరు. 

క్యోంకీ టీచర్ భీ కభీ స్టూండెంట్ థా.
సారీ టీచర్స్ ... మిమ్మల్ని ఇన్ని మాటలంటున్నందుకు క్షమించకండి. 

ఇదే పుస్తకంలో 65వ పేజి లో శ్రీరమణ తన గురువు శ్రీపాద  గోపాలకృష్ణ మూర్తి గారు తరగతి గదిలో శబ్దతరంగాలను వాటి ప్రయాణ తీరు తెన్నులను వివరించిన తీరు మీ తరగతి గది  బయటినుంచే వినవస్తోంది. ఊరికే కాసేపు వినండి. స్టాండ్ లోని అన్ని సైకిళ్ళూ పడిపోయిన శబ్దం మీ చెవులకు సోకిందా? ఆ చివర పడి పోయిన సైకిలే మీ విద్యార్థి. ఏమో ఆ విద్యార్థే ఒక భౌతిక శాస్త్రవేత్త కావొచ్చును. కానీ మీరు చెప్పని పాఠం వల్ల ఆ విద్యార్థి ఏమయితే మాత్రం మీకేం సుఖం... మీకేం సంతోషం... మీకేం గర్వం. శ్రీరమణ తన ఉపాధ్యాయులు ఎంతెంత విస్తీర్ణత, విపులత, చతురత, గరిమ వున్న వారో చెప్పుకొచ్చారు. నిజమేనేమో అనుకున్నాను. ఆశ్చర్య పడ్డాను.. అబ్బుర పడ్డాను.. ఈర్ష్య పడ్డాను. ఎందుకంటే నా తరానికి వచ్చేసరికే బహుశా అలా చదువుకున్న గురువులు బాగా తగ్గిపోయి కేవలం చదువు చెప్పేందుకే స్థిరపడిన గురువులే మిగిలారేమోనన్న బాధ నన్ను ఆవరించింది. కేవలం చదువుకున్న గురువులెప్పుడూ అప్పజెప్పే లఘువులనే కదా ఉత్పత్తి చేస్తారు. చదువుకున్న గురువులు మాత్రమే గురువులను మించిన శిష్యులను సమాజంలో నాటగలరనుకుంటా.
 *
తరగతి గది పిల్లల మధ్య తెలియని గిరి గీస్తున్నది... బరి ఏర్పరస్తున్నది. రోజుకు ఐదారు పీరియడ్ల టైం టేబుల్. తెలుగు సారు వేరు. ఇంగ్లీష్ సారు వేరు. లెక్కల సారు వేరు. సామాజిక శాస్త్ర పాఠ్య పుస్తకం ఆ తెలుగు సారో, ఇంగ్లీషు సారో, లెక్కల సారో అస్సలు చూడనట్టే సంవత్సరమంతా తమ నటన కొనసాగిస్తుంటారు. ఇది టీచర్లలో పెరుగుతూ పోతున్న కెరీరిజం. ఈ సెగ్మెంటేషన్, సెగ్రిగేషన్, స్పెషలైజేషన్ నిజానికి పీరియడ్ల విభజన వల్ల ఏర్పడవు పిల్లల మనసుల్లో. ఆయా పీరియడ్స్ లలో చెప్పే సబ్జెక్టుల మధ్య ఈ కృత్రిమ విభజన రేఖను టీచర్లే బలంగా, బలవంతంగా, అహంకారంతో, అభద్రతాభావంతో, అలసత్వంతో గీసుకుంటూ పోతున్నారు.
టీచర్లు తమకు తెలీకుండానే గీసుకుపోతున్న ఈ విభజనరేఖ వల్ల చాలా ప్రమాదాలు జరిగిపోయాయి. 
ఒక తరగతిలో టీచర్ ముందు కూర్చున్న నలభై మంది పిల్లల్లో కనీసం ఒక ఐన్ స్టీన్, లేదా ఒక ఠాగోర్, పోనీ ఒక కలాం, ఒక సునితా విలియమ్స్, లేదా ఒక ఘంటశాల, ఒక సరోజినీ నాయుడు, లేదా కనాకష్టంగా ఒక టెండూల్కర్ అయినా వుండి వుంటాడేమో అని కూడా అనుకోరనుకుంటా. నిజానికి ఇలా ఏ టీచరైనా అనుకుంటే గింటే  చాలన్న రాజీ మనస్తత్వానికి అలవాటుపడి పోయి అలా అనుకునే ఒకరిద్దరు టీచర్లనే మనం ఆదర్శ టీచర్లనీ సత్కరిస్తున్నాం అనుకుంటా. 
ఇలా కాకుండా  ఏ టీచరైనా తన ముందు వున్న విద్యార్థులందిరిలోనూ ఒక మైఖేల్ జాక్సన్, మరొక సత్యజిత్ రే, ఒక శకుంతల, ఒక సివి రామన్, ఒక ఏకె రామానుజం, ఒక ఏ ఆర్ రెహ్మాన్ లను పోల్చుకోగలిగితే ఆ తరగతి గది నుంచి ఒక మదర్ థెరిస్సా డ్రాప్ అవదు. మరో సర్వేపల్లి రాధాకృష్ణ బాలకార్మికుడిగా మారడు. ఇంకో న్యూటన్ ఇంటి వంటిట్లోనే తన చెల్లిని ఒడిలో పెట్టుకుని బేబీ సిట్టింగ్ చేస్తూ చాసో కథలో కృష్ణుడిలా తన నాన్న చుట్ట వ్యసనానికి బలైపోడు...చదువుకు దూరమూ కాడు.
ఈ వాదన కొంచెం అతిగా, కేవల ఆదర్శంగా, ఆచరణకు అసాధ్యంగా తోచవచ్చు టీచర్లకు. పైగా ఇంతటి అసాధ్యమైన ఆదర్శాన్ని టీచర్లకు అంటగట్టి ఇప్పటికే తడిసిమోపెడవుతున్న భారాన్ని వందింతలు చేస్తారా అని టీచర్లకు చెప్పలేనంత కోపం కూడా రావచ్చు. తరగతి గదిలో కొంత మందే చురుకైన వాళ్ళు, మరి కొందరు ఎప్పటికీ గురజాడ అప్పారావులు, సావిత్రిలూ, గుర్రం జాషువాలూ, రిత్విక్ ఘటక్ లూ, కొమరం భీం లూ, ఎంఎఫ్ హుస్సేన్ లూ కాలేరనుకుని ఆ పిల్లలకన్నా ముందే ఒక నిర్ణయానికి వచ్చేది ముమ్మాటికీ టీచర్లు కాదా? పిల్లల పట్ల ఏ మాత్రం నమ్మకం లేని టీచర్లలో పేరుకుపోయిన ఈ ఆలోచనా ధోరణి వల్లే కదా ఇంత మంది డ్రాపవుట్ అవుతున్నారు తరగతి గది నుంచి... బడి నుంచి... చదువునుంచి... సమాజం నుంచి...
టీచర్లు పిల్లల గురించి వచ్చే  ఈ తొందరపాటు అంచనా వల్లే ఒక తరగతి గదిలో కొంత మంది పిల్లలు మాత్రమే అద్భుతమనీ, చురుకనీ, చలాకీ అనీ, ఇంకొంత మంది పిల్లలు ఇంకా తర్ఫీదు చేయవలసిన వాళ్లనీ, ప్రోత్సహించవలసిన వాళ్ళనీ, చాలా మంది వదిలివేయదగ్గ వాళ్ళనీ(hope less) నిర్ణయించేసుకుంటారు టీచర్లు. ఇది వాళ్ళ తొలిచూపులోని అంచనా వల్ల జరగ వచ్చు, లేదా అనుభవం వల్లా, అనుబంధం వల్లా ఈ అంచనాకు రావచ్చు. అయితే ఈ అంచనాలు తప్పు. ఎందుకంటే గ్రెడేషన్స్ అనే ప్రమాదకరమైన అంశానికి అంకురార్పణ జరిగేది ఇక్కడే. అది తనకు తెలీకుండానే చేసేదీ టీచరే. ఒక టీచరు అసమర్థత వల్లా, ఏకాగ్రత సంధించలేకపోవడం వల్లా, పిల్లలతో అన్యోన్యత పెంచుకోలేకపోవడం వల్లా ఈ తొందరపాటు అంచనాలు, ప్రమాదకర గ్రేడింగ్స్ పురుడుపోసుకుంటున్నాయి. దీని వల్లే చాలా సార్లు పిల్లలకు పాఠం చెప్ప కుండానే టీచర్లు పాస్ మార్కులు, ఫెయిల్ మార్కులూ ఇచ్చేస్తున్నారు. ఏ పిల్లవాడి ఫెయిల్ మార్కులూ ఏ టీచరు పాస్ కు మరకలు కాకూడదు కదా?
ఆచరణ యోగ్యం కానిదేదీ మానవజాతి తన లక్ష్యంగా వుంచుకోలేదు మునుపెన్నడూ. కేవలం కొంత మంది సోమరిపోతులవల్లా, చొరవ శూన్యుల వల్లా కొన్ని లక్ష్యాలు కేవలం షోకేసు ఆదర్శాలుగా, అసాధ్యాలుగా, కేవల పూజనీయాలుగా మార్చేసారంతే.... సారూ.
ఈ ఉపాధ్యాయ దినోత్సవానికి కొంచెం ఆదరాబాదరాగా  కత్తి నరసింహారెడ్డి తీసుకువచ్చిన మంచి పుస్తకం టీచర్. ఇది ముఖ్యంగా టీచర్లను ఉద్దేశించి తీసుకు వచ్చిన పుస్తకం కాబట్టి ఇందులో ప్రతి అంశం తర్వాత వున్న గ్రాహ్యంశాలను విసర్జించమని నా మనవి. లేక పోతే టీచర్లు ఈ పుస్తకాన్ని కొత్తగా చదవలేరు. ఇది కొత్తగా అర్థమూ కాదు. 

ఎందుకంటే మంద బుద్ధి శిష్యుడు ఉత్తమ గురువు గురించి  నేర్చుకోగలిగిన దానికన్నా ఉత్తమ విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయుని నుంచి కూడా ఎక్కువ నేర్చుకోగలడని అబ్దుల్ కలాంజీకి తన తొలినాళ్ళ గురువు ఇయదురై సొలమోన్ తెలియజెప్పాడు.
గురుభ్యోనమః

తాజా కలం - ఈ పుస్తకంలో కొంచెం నిడివి ఎక్కువగా వున్న వ్యాసం కృష్ణకుమార్ది. అది ఓరియంట్ లాంజ్ఞన్ వారు వేసిన ట్రాక్ట్ ఫర్ ది టైమ్స్ అనే సీరీస్ లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వేసిన, నేను అనువాదం చేసిన పిల్లలకు పాఠాలు- పెద్దలకు గుణపాఠాలు అనే పుస్తకంలోనిది. దీని ఇంగ్లీష్ టైటిల్ learning from conflicts

(నా అన్ని తరగతుల బయటి గురుతుల్యులు చింతలపల్లి శేషఫణి,  సూరారం కృష్ణశర్మ, డాక్టర్ వివి సుబ్రహ్మణ్యం, జి. భార్గవలకు టీచర్స్ డే సందర్భంగా)

Wednesday, July 25, 2012

ఇటీవలి కథ

ప్పుడు తెలుగు సాహిత్యానికి కథే vanguard. తెలుగు కథకులు సంఘటిత బృందం; కవులలాగా అసంఘటితం కాదు. అంటే కవులకు వుండిన  cardholderism, political affiliation  అన్న అంశాలు ఒక  mandate  ఏ మాత్రమూ కాదు కథకులకిప్పుడు. ఇది గత పదేళ్ళలో వచ్చిన మంచి మార్పు. మంచి - ఎందుకంటే సృజన పరిధి, దృక్పథ విస్తృతి మరింత విశాలం అయ్యింది కనుక. అలా అవ్వకపోవడం వల్ల కినుక మనకు వుండింది కనుక.
కవిత్వానికీ, కథకూ పోలిక ఎందుకంటే పదేళ్ళ ముందు ఈ ప్రక్రియల మధ్య పోటీ, కించిత్ వైరమూ వుండినాయి కనుక.
$
రాజకీయ దృక్పథం లేని సృజన లేనేలేదు, వుండదు. పైగా మాకు ఏ రాజకీయ దృక్పథమూ లేదని ఏ సృజనకారులయినా అంటే మాత్రం చెలామణీలో వున్న లేదా వ్యవహారంలో వున్న  (statusquo- యథాతథ) దృక్పథంతో సదరు బృందానికి ఏ పేచీలేనట్టే అన్న మాట!
అయితే కేవలం రాకీయ దృక్పథమే తనంతకదే సృజన కాలేదు, కాదు. ఇప్పుడు కథ నడుస్తున్న వాతావరణం చాలా ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైనది అని ధీమాగ చెప్పగలను.
ఎందుకంటే మొనోపొలీ దృక్పథాల కచ్చడాలను కథ దాటింది ఇప్పుడు. అంటే ఆ కచ్చడాలు కథని దాటలేదు సరి కదా, కనీసం తాకలేదని అర్థం. అందుకే ఇది మంచి పరిణామం.
$
పట్టుమని పది-పదైదు లైన్ల కవిత ప్రచురణకే నోచుకోక, దిన, వారపత్రికలల్లో సాహిత్యం space బాగా తగ్గిపోయిందని పదేళ్ల ముందు నుంచీ బాధపడ్డాం అంతా. అయితే అన్ని పత్రికల్లో సాహిత్యానికి హక్కుగా వుండాల్సిన ఈ  space ని కథ పదింతలు పెంచింది. ఇది కథ అనే నిడివి ఎక్కువ వున్న ప్రక్రియ విజయం మాత్రమే కాదు, మొత్తంగా తెలుగు సాహిత్య విజయం. మార్కెట్ విజయం కూడా. లేదా కథ చేసుకుంటున్న మార్కెటింగ్ విజయం కూడా. ఇంకా చెబితే కథ ఇప్పుడు నడుస్తున్నది ఒక రకమైన sponsored ambiance లోనే.
 ప్రజాస్వామ్యంలో సృజనకు వుండాల్సిన public spaceని కథ పరిణామాత్మకంగానే కాదు, గుణాత్మకంగా కూడా సాధించింది, పెంచింది, పోషిస్తోంది గత పదేళ్ళుగా.  ఏ జాతి అయినా సరే కథలతో సంభాషించే తత్వాన్ని అలవరచుకుంటుందంటే ఆ జాతి అభివ్యక్తి గవాక్షాలు విశాలమవుతున్నాయని లెక్క. ఇదీ తెలుగు కథ, కథకులు సాధించిన ఘన విజయం.
కథ రాస్తే చాలు- అది మంచిదయినా, కానిదయినా సరే ముందు వెలుగు చూసే వెసులుబాటును తెలుగు కథకులే కష్టించి కల్పించుకుంటున్నారు.
ఒకరకంగా చెబితే, ఇప్పుడు తెలుగు కథ చదవకపోతే తెలుగు సాహిత్యం, జీవితం  miss  అవుతున్నట్టే. ఇది పైకి sweeping statement గా అనిపించినా ఇదే వాస్తవం.
తెలుగు సామాజిక భౌతిక వాస్తవికతను ప్రతిబింబిస్తున్న బలమైన, విశాలమైన, ఏకైక తెలుగు సాహిత్య ప్రక్రియ ఇప్పుడు తెలుగు కథ మాత్రమే.
జీవితంతో సంబంధం తెగిపోయిన ఉద్యమాలు నడుస్తున్న కాలంలో వస్తున్న వాస్తవికథలివి. ఉద్యమాలతో ప్రత్యక్ష సంబంధం, అనుబంధం లేని కథకులు సృష్టిస్తున్న నికార్సయిన జీవితాలు ఇవి. ఇలా social concerns, social protests, dynamics of life and esthetics of living ని తెలుగు కథ ప్రతిఫలించడం ఒక నిశ్శబ్ద విప్లవమే.
$
ఇప్పటి తెలుగు కథలో chronicling, commenting  పాళ్ళు కొంచెం ఎక్కువే. ఇందులో కేవల నివేదన(plane reporting- reporting the unreported), documentation(for the sake of documentation), అస్పృశ్య జీవన ఆవిష్కరణ(exploring the unexplored) లాంటి లక్షణాలు తెలుగు కథలకు కొత్త వెలుగులు ఇచ్చాయి, తెచ్చాయి.
అయితే ఈ లక్షణాల వల్ల నవీన  జీవిత ఘర్షణ, మారిన సంఘర్షణాత్మక సామాజిక సంబంధాల ఆవిష్కరణ జరగవలసినంత నిర్మొహమాటంగా తెలుగు కథల్లో జరగలేదు. అయితే ఆ జీవితాల, ఆ ఘర్షణల గురించిన కొత్త వివరాలు మాత్రం విరివిగా తెలిసాయి. ఇదేం తక్కువగా చేసి చూడాల్సిన విషయం కానేకాదు. ఒకరకంగా కథ  journalistic/featuristic genre ని కూడా  బలంగా ఒక ప్రక్రియగా ముందుకు తీసుకువచ్చింది. ఇలాంటి లక్షణం వున్న కథలు  ఈ 20 ఏళ్ళలో చాలానే వచ్చాయి. ఈ మాటలేవీ చిన్నచూపుతో అంటున్నవి కావు. ఈ రచనాశైలులు కూడా కథకూ, కథకులకూ చాలా అవసరమే. కానీ ఇందులో కూడా తమను తాము తర్ఫీదు చేసుకోలేని(చేసుకోలేకపోతున్న) రచయితలే ఎక్కువగా తాజాగా తారసిల్లుతున్నారిప్పుడు.
నిజానికి  journalistic/featuristic రచనా శైలి కూడా కథా కథన సంవిధానాన్ని enhance చేసే ఒక బలమైన toolగా వాడుకున్నారు చాలా దేశాల్లో కథకులు. అయితే కథకు ఇది కూడా మరొక నగ అని చెబితే ఒప్పుకునే స్థితిలో చాలా మంది తెలుగు కథా రచయితలు లేకపోవడం వెనుక కొద్దిమంది కథకుల దాదాగిరీ కనిపిస్తోంది. ఇది దురదృష్టకరమే. పైగా వాళ్ళ రచనలు  journalistic/featuristic గా వున్నాయని కితాబు ఇస్తే అది తిట్టుగా భావించే రచయితలే చెలామణీ అవుతుండటం కొంచెం పాఠకులను కించపరచడమే. 
కథన శైలికి సంబంధించిన ఇలాంటి పొరలు వర్తమాన కథా రచయితలు తెలుసుకుంటే వస్తువుకు సంబంధించిన చాలా పొరలు తమంతట తామే తెరుచుకుంటాయి. ఈ మాట ఇప్పటి కథకులు నమ్మకపోవచ్చు. ఎందుకంటే కథకుల పుట్టుక, గిట్టుకా మార్కెట్ నిర్ధరిస్తోందిప్పుడే.
వీటిని గతంలో తెలియజెప్పి, చర్చించి నిగ్గుతేల్చిన కథా విమర్శ ఇప్పుడు దాదాపు గైర్హాజరే. ఐక్యరాజ్య సమితిలో నమోదు అయిన, ఇంకా కాని ఏ దేశ సాహిత్య చరిత్రలోనైనా సాహిత్య విమర్శ మరణం కథకులకు సోపానమవుతుందేమో కానీ కథకు మాత్రం కాదు.
తెలుగులో కథా విమర్శ total absence వల్లే దేని కదే(థే) compartmentalize అయ్యింది.
ఒక విప్లవకారా కథలో దళిత స్పృహ వున్న పాత్రను, అంటే కుల వివక్ష గురించిన చర్చ చేసే పాత్రను ఊహించలేం. లేదా ఓ ముస్లిం వాద స్పృహ వున్న కథలో దళిత క్రిష్టియన్ వెతలను చూడలేం. పోనీ ఓ ఫెమినిస్ట్ తన కథలో చేసే ఆర్గ్యుమెంటేషన్ లో social upbringing లో జెండర్ ఎలా మగతనం, ఆడతనం అయిపోయి విడిపోతోందో అన్న స్పృహ లేమి బాగా కనిపిస్తుంది. ఈ avoidance లో కొంచెం అజ్ఞానంతో కూడుకున్న బెరుకు వుంది. . ఫలానా వాదం ఫలానా వారే చూసుకుంటారు, మనకెందుకు అన్నట్టు నడుస్తుంటాయి చాలా కథల్లో పాత్రలు. దీని వల్ల ఆ జీవిత సంఘర్షణ, ఆవిష్కరణ censor అయిపోతూ వుంది. ఈ compartmentalization పోవాలంటే కథకులు తరచూ కలుసుకోవడం కాకుండా కథకుల ఆలోచనలు కలుసుకోవాలేమో. ఆ సంగమ స్థలిలోనే, ఆ ఇచ్చిపుచ్చకోవడంలోనే కదా కథ విస్తరించేది, కథకులు పరిణితి చెందేది.
Identity polemics ఒక బృందానికి assertion ఇవ్వడంతో పాటు ఇతరుల identity తాలూకు జీవితాన్ని చూడకుండా కట్టడి చేస్తోంది. అందుకే ఈ specialized రచయితల రచనలు అర్థ సహితాలే కాదు అర్ధరహితాలు కూడా.
ఈ compartmentalizationని తమ specialization అనుకునే రచయితలు ఎక్కువవుతున్నారిప్పుడు. పైగా తమ కుటుంబం, తమ ఊరు, మతం, కులం, తమ వాతావరణం తప్ప, తాము చూసిన జీవితం తప్ప ఇంకేది రాసినా పాపమే అనుకుంటారు ఈ తరహా కథకులు. ఎందుకంటే  వీళ్ళు  తమని తాము outsiders  అని అనుకుని ఆగిపోయి అదే తమ శైలి అని కూడా అనుకుంటున్నారు. ఈ ధోరణి తెలుగు కథకు చాలా చెడ్డ చేసింది, చేస్తోంది. తాము చూసిన జీవిత వివరాల చిత్రణకు పరిమితం కావడంలో తప్పేమీ లేదు. కానీ ఇతర జీవిత చిత్రణ, అధ్యయనం కొరవడితే ఇక కల్పనకు(fiction), ఊహకు (imagination) తావెక్కడ వుంటుంది. అసలు ఒక నివేదికకు, కథకూ వున్న తేడా అంతా అందులోని కల్పన, ఊహ వల్లే వస్తుంది అన్న విషయాన్ని మరచిపోతే ఎలా? ఇప్పుడు చాలా కథల్లో కొరవడింది ఈ కల్పన, ఊహ అని బలంగా చెప్పగలను. ఇవి లేక పోవడం వల్లే  చాలా కథలు బలహీనంగా తయారయ్యాయి.
$
ఆధునికత మన మూలాలను  uproot  చేస్తుంది. ఉద్యోగం, ఉపాధి ఎప్పుడూ వలసలనే కంటుంది. ఈ ఆధునికతే తెలుగు ఆధునికథల్లో విస్తారంగా పరుచుకుని వుంది. ఈ displacement నుంచి వచ్చిన సృజన తెలుగు కథను సుసంపన్నం చేసింది, చేస్తోంది, చేయాలి కూడా. ఈ అంశమే ఇప్పుడు తెలుగు కథను ఒక బలమైన, చర్చచేయకుండా వుండలేని సాహిత్య ప్రక్రియగా నిలబెడుతూ వుంది.
గ్లోబలైజేషన్ అనే పడికట్టు జడబంధంలో ఆధునికత, అభివృద్ధి సృష్టించిన భీభత్సాన్ని తెలుగు కథ చర్చ చేస్తున్నంతగా మేలైన మెతుకులతో పట్టి ఇస్తోందా అనేది మాత్రం ప్రశ్నార్థకమే. ఆధునికతతో పురుడు పోసుకున్న వలసలు, మూలాలను కోల్పోవడం, ఆధునీకరించబడటం అనే తతంగం అంతా మన ఐచ్ఛికతతో సంబంధం లేకుండా జరిగిపోతున్న ఒక అనివార్య సామాజిక పరిణామం అనుకుంటుంటాం. అయితే మన జీవితాలు ఒక మెగా సామాజిక పరిణామ ప్రక్రియలోని లాజికల్ ఎండ్ కు నెట్టివేయబడుతున్నాయనీ, ఆ బాటలో మనం ఏ సామాజిక నిరసనా తెలుపకుండా ప్రయాణిస్తున్న కేవల బాటసారులుగా మిగిలిపోతున్నామనీ మన కాళ్ళకు మరింత బలంగా, సరళంగా ఎరుక పరుస్తోంది కొంచెం తక్కువతెలివితోనయినా కథ అనే ప్రక్రియ మాత్రమే తెలుగులో. నిజానికి ఈ పని సామాజిక వ్యాస రచన, polemical writing తెలుగులో చేస్తూ వుండాల్సింది. కానీ  ఆ polemics ని కూడా కథే తన భుజాన వేసేసుకోవాల్సిన అగత్యం పట్టింది. ఇది బాధ్యతా రాహిత్యంగా కాలం వెళ్ళబుచ్చుతున్న తెలుగు విమర్శకుల విఫల కథ.
$
ఏ వలస అయినా nostalgia కు జన్మనిస్తుంది. అందుకనే nostalgia నేపధ్యాన్ని వలసల వెలుగులోనే కనాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. లేకపోతే రొమాంటిక్ గతానికి అబ్బురత ప్రదర్శించడంతోనో, మక్కువ పెంచుకోవడంతోనో ఆగిపోగళం. గత వైభవం లేదా నిన్నటి కష్టసుఖాల లోంచీ, ఆ తెలియని జీవిత వివరాల్లోంచీ పుట్టిన పాత్రల చమత్కారాలకు పడిపోయి, బాగా ఫిదా అయిపోయీ చప్పట్లు కొడుతూ వుండిపోతాం. ఆ అబ్బురతతో కూడా, ఆ చప్పట్లలోనూ తెలుగు కథ ఆవిష్కరిస్తున్న అనూహ్యత ఒక మంచి గెంతు మాత్రమే అని నమ్ముతున్నాను. అయితే ఆ గెంతే ఒక విప్లవం అనుకునేంత తృప్త ఆత్మలమయిపోతున్నారేమో కొదరు కథా రచయితలు అనిపిస్తోంది. ఈ తృప్తి అప్పుడే కొందరి కథకుల్లో, కొన్ని కథల్లో కనిపిస్తోంది. ఇది చాలా ప్రమాదం. ఈ ప్రమాదం ఊరికే వుండదు, ప్రమాదకరమైన కథకులనూ, వాళ్ళ అంతే దుర్మార్గమైన పాత్రలనూ కనబోతోంది రానున్న రోజుల్లో. ఆ కథా కాలుష్యం మన ముక్కుపుటాలకు అప్పుడే సోకుతోంది.
కథకులుగా, సామాజిక ఆలోచనాపరులుగా మనం  contemporary కావడానికి ఇప్పుడు మనం చేస్తున్న ప్రయత్నం- చరిత్రకు ఇంత వరకు తెలియని బతుకులను బలంగా తెలియజెప్పే వాహికగా కథను వినియోగించడమే. ఇందుకే కథలే రాస్తున్నాం, చదువుతున్నాం. అయితే తమ కథన చాతుర్యంలో (రాయడానికీ, చదవడానికీ) పడిపోయిన కొందరు కథా రచయితలు తమ కథలను వారికి తెలీకుండానే ఒక గత జీవిత సామాజిక విజ్ఞాన వినోద యాత్రగా ముగించిన సందర్భాలకూ మనమే పాఠకులం కాదా? 
వెనక్కి తిరిగి శోధించి, తోడి, గాలించి  తమ ముందున్న గ్యాలరీ కోసం మాత్రమే రాయాలనుకునే విచిత్ర విన్యాసానికీ ఇంకొందరు కథకులు లోనయిపోయీ, లోబడిపోయిన సందర్భాలూ వున్నాయి. పైగా అలా లోబడిపోవటమే ఒక కొత్త బడి (school of thought) అనుకునే తప్పుకూడా చేసారు మరికొందరు కథకులు. అయితే అది ఒక వొరవడే కానీ దానికదే ఎంత మాత్రం బడి కానే కాలేదు. అయితే ఈ తీవ్రవాదం ఇక్కడితో ఆగలేదు. ఇంకొందరు కథకులు వెనక్కి తిరిగి చూసుకుంటూ తమకు తామే తెగ మురిసిపోయి ఇక ఎన్నటికీ తల ముందుకు తిప్పుకోలేక కుప్పకూలిన తతంగమూ మనమే చూస్తున్నాం కదా?
గత ప్రభల ప్రవర వ్యాపారమైపోవడమూ ఇప్పుడొక ట్రెండ్. ఈ ట్రెండ్ వల్లే కథకులు కాలాతీత పుడింగులయి కూర్చుంటున్నారు పాఠకుల నెత్తులమీద.
ఒక్కసారి ఏదైనా  సరే వ్యాపారమైపోతే ఇక మంచి చెడులేముంటాయి. మహా అయితే లాభనష్టాలుంటాయి కానీ. గత కష్టాలూ. చమత్కారాలు, మిరియాలూ లేదా ఇప్పటి లాభ నష్టాలూ మాత్రమే కథ కాదు కదా? చూపు వెనక్కి సారించినా తల ముందుకు తిరగాలి కదా! లేకపోతే కాలికింద కరుగుతున్న నేల కనిపించడం కాలం నిరాకరిస్తుంది.
కథకుడు, మరీ ముఖ్యంగా వర్తమాన తెలుగు కథకుడు forward planning  ని విస్మరించకూడదని బలంగా నమ్ముతున్నాను. nostalgia మాత్రమే currency అయిపోయిన కాలానికి కొట్టుకుపోకూడదు, తలవొగ్గ కూడదు ఏ కథకుడైనా.  ఆ మజాలో, ఆ మార్కెట్లో, ఆ మాయలోనే వుండాలనుకునే కథ, తమను తాము ఆ మత్తులోనే వుంచుకోవాలనుకున్న కథకులూ కుంటుపడతారు. కుంటుతారు.
nostalgic writing అయినా, post-global వాతావరణంలో  forward planners గా వైచిత్రి వున్న techniqueలతో రాస్తున్న ఆధునికథకుల (most-modern story presenters) రచనలయినా గ్లోబలైజేషన్, ఆధునికత సృష్టించిన, సృష్టిస్తోన్న అనివార్యతలను, భీభత్సాన్నీ ఒకే మోతాదులోనే శక్తిమంతంగా నమోదు చేస్తున్నాయని చెప్పక తప్పదు. అయితే వర్తమాన కథల్లో పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలూ, సంబంధాలూ ఇంకా మొహమాటానికే గురవుతున్నాయనిపిస్తోంది. ఇందులో కూడా కథకుల self censorship  వుంది. రచయిత జీవితంతో సంబంధంలేని మానవ సంబంధాల చిత్రణో, రచయిత పాటించని, నమ్మని విలువలున్న పాత్రల చిత్రణో చేస్తున్నప్పుడు ఈ censorship మరింత ఎక్కువగా మొహమాటాల రూపంలో బయటపడుతుంటుంది. నిజానికి ఈ మొహమాటానికి మూలకారణం చాలా సార్లు అజ్ఞానమే. తెలుసుకోవాలని లేని తనం, చొరవలేమి లోంచే ఈ అజ్ఞానం పుడుతుంది.
Exposure  వల్ల మాత్రమే ఎవరి tolerance levels  అయినా పెరుగుతాయనకుంటా. అప్పుడే మన objectivity మరితం విశాలం అవుతుందనుకుంటా. నిజంగా అప్పుడే కథనంలో maturity ప్రతిఫలిస్తుందనుకుంటా. ఈ exposure ఇతర భాషల సాహిత్యానికి కావచ్చు, నాటకం, సినిమా లాంటి ఇతర ప్రక్రియలకూ కావచ్చు, కొత్త జీవనబంధనాల ఘర్షణకీ కావచ్చు. కానీ కథకులకు exposure మాత్రం అవసరం. కథకులు నిరంతరం తమకు అపరిచిత అంశాలను(unfamiliar) అనంత బాహువులతో ఆలింగనం చేసుకునేందుకు పరిశ్రమ చేయాలి, సాహసించాలి, విశాలించాలి. ఇందుకు అన్నింటికన్నా ముందు మొహమాటాలను గాలికి వదిలేయాలి. తర్వాతి తప్పు ఒప్పులను విమర్శకు వదిలేయాలి. మరక మంచిదే.
కొత్త సంఘర్షణనీ, చర్చనీ వివాదాలను, గందరగాళాలనూ అమాయకంగా, ఆత్మీయంగా ఆహ్వానించగలిగే వాతారణం, వివేకం ఇప్పుడు తెలుగు కథ మాత్రమే సృష్టించగలదని బలంగా నమ్ముతున్నాను నేను. అందులోంచయినా కొత్త కథా విమర్శ పురుడు పోసుకోవాలని కలకందాం. అలాంటి నికార్సయిన కథా విమర్శ లోంచే కొత్త సొబగులనూ, తాజా రచనా శైలులనూ, కథన దారులనూ తెలుగు కథ అద్దుకుంటుందని మనస్ఫూర్తిగా ఆశిద్దాం.

Wednesday, June 27, 2012

అంతే


తెలివిగలవాడు
చదువుకున్నవాడు
తాగున్నాడు  అంతే!

మనసు మెట్లమీదే వదిలి
దేహాన్ని మోసుకొచ్చాడు

ఆకలి పగలుది
దాహార్తి యీ రాత్రిదీ
వొక్క గ్లాసు నీళ్ళు చాలు అంతే!

యీ చీకటి వాడి తప్పు కాదు
ఆకాశం చూడు
మబ్బులెట్లా ముసురుకున్నాయో

కొంగుతో
వొక్కసారి తుడువు చాలు
మళ్ళీ అద్దంలా మెరుస్తాడు అంతే!


-వాసిరెడ్డి శరత్ బాబు
   27 జూన్ 2012
 
(సందర్భం తెలియదు కానీ ఈ కవిత నా గురించే రాసానని శరత్ చెప్పాడు.)

Monday, June 18, 2012

కెంపాయనె

కెంపాయనె ఎల్లలు కెంపాయనె
కెంపాయనె ఎల్లలు కెంపాయనె

పగటేల పైడికంటి
పగడాల పాటల్ల
ఊరూ ఏరూ మురిసి కెంపాయనె

కెంపాయనె ఎల్లలు కెంపాయనె

బాలింత బుగ్గాన
నీరెండ గోరింట
సెలకా సెలమాలన్నీ కెంపాయనె

కెంపాయనె ఎల్లలు కెంపాయనె

గోధూళి వేళల్లో
గోవుల్ల దారుల్లో
నీడా నింగీ తోడై కెంపాయనె

కెంపాయనె ఎల్లలు కెంపాయనె

మాపటేల గోగురిచ్చా
సెట్టుల్ల ఆటా సూసీ
పైరు పాపిటలన్నీ కెంపాయనె

కెంపాయనె ఎల్లలు కెంపాయనె


( షార్ట్ ఫిల్మ్ " పీర్లు" కోసం నే రాసిన పాట)

Saturday, June 16, 2012

wish


every  morning
into my mirror
i whisper,
-gimme wisdom
to
die will-

in the night
i murmer
-gimme strength
to
live well-


(16-06-12)

Friday, June 1, 2012

లేరు

మల్లెల్లా విరియలేరు
గువ్వల్లా గూడును  దిగుల్లేక వదల్లేరు
చెట్టుల్లా శాఖోపశాఖల్లో మరణం రెపరెపలాడలేరు
వేరుల్లా చిగురు పొదిమి విస్తరించలేరు
పైరుల్లాఎదని పచ్చపొడిపించలేరు
వీధుల్లా నడక నేర్పించలేరు

ఎవ్వరీ  శాపగ్రస్తులు

జవాబుల వాకబు తెలీని గదుల్లా అడుగు కాపాడుకోలేరు
సమాధాన పరచని సమాధుల్లా కేళి రేపలేరు
మాదిగల చర్చీల గంటల్లా రెండో రాకడ ఆశీర్వచనమీయలేరు
దూదేకుల దర్గాల్లా ప్రార్థన పలిఖించి దువా వచనమీయలేరు
 
ఎవ్వరీ  ముక్త పగ గ్రస్తులు
ఎవరీ పాప భూయిష్టులు

పడి లేయలేరు అలల్లా
వడి సడి చేయలేరు గాలుల్లా
సడికీ తడికీ తాకిడికీ తెలిసీ తెలియనట్టుండలేరు తీరాల్లా
నిటారుగా నిశ్చలించలేరు కొండల్లా
స్తబ్దుగా ఫిర్యాదు సలుపలేరు లోయల్లా
వాలుగా చనలేరు వాగుల్లా
 
ఎవ్వరీ  శోక తమస్సులు
ఎవరీ పందెంలో పారని పాచికలు

వాల లేరు గువ్వల్లా కొమ్మల్లో నడిరాతిరి
గుక్కతిప్పుకోలేరు పిల్లల్లా మలిరాతిరి
పగల్లేరు మొక్క మొనన పత్తిలా కాసేప్పటి రాతిరి
ఎగరలేరు ద్రిమ్మరి కొంగల్లా తెలవారి

వెలివాడల నుడికారపు బతుకు బాటల డొంకదారులు
కనలేరు... కని చ
లేరు... చని... పోలేరు
ఎవ్వరీ మరీచిక వీచికలు
ఎవరీ అధోముఖ సూచికలు

Wednesday, May 30, 2012

రాయీ రాయీ కరిగే వేళయింది( revised)

(విజయవాడ సాహితీ మత్రులు భమిడిపాటి జగన్నాథరావు, నవోదయ రామ్మోహనరావు, శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేవ్వరరావు, డాక్టర్ వి. చంద్రశేఖర్ రావు మరి కొందరు మిత్రులు కలిసి "కథ- సమయమూ- సందర్భమూ" పేరుతో ఒక కథా సంకలనం తీసుకువచ్చారు. ఇందులో పది కథలు, వాటి నేపథ్యాలు, ఒక్కో కథపై ఒక్కో ప్రముఖ విమర్శకుడి విశ్లేషణా వున్నాయి. ఈ కథల సంకలనానికి నేను నీహార్ ఆన్ లైన్ డాట్ కామ్ వెబ్ సైట్ కు రాసిని రివ్యూ ఇది. ఇది నా ఇతర రచనల లాగే మిస్ అయిపోతే అప్పటి నీహార్ ఎడిటర్, ఇప్పటికీ మంచి మిత్రురాలు వసంత లక్ష్మి దీన్ని జాగ్రత్తగా భద్రపరిచి నాకు అందచేసింది. అప్పట్లో దీన్ని బుక్ లెట్ గా తెద్దామని కొందరు మిత్రులు ప్రయత్నించి అంతే త్వరగా విరమించుకున్నారు.)

థ- సమయమూ సందర్భమూ సంకలనంలో పల్లె సందుల నుంచి బయలుదేరిన వెతలూ ఉన్నాయి. నగరం సందిగ్ధాల్లోంచి బయటపడాలన్న తపన కతలూ వున్నాయి. వొకరకంగా  వర్తమాన సమయాన్నీ, సందర్భాన్నీ కొంతలో కొంత సమగ్రంగా రెప్రజెంట్ చేస్తున్న సంకలనం ఇది. సామాజికార్థిక రాజకీయ పరిణామ క్రమాల నుంచీ , సమూహం నుంచే కాక మరింత emphasisతో వొంటరి జీవితాల నుంచీ, వాటిల్లో చితికిపోయిన 'నేను' కిటికీల్లోంచీ ఆవిష్కరించే ప్రయత్నం పుష్కలంగా కనిపిస్తుంది ఈ పుస్తకం అంతా, ఆయా కథకులు రాసిన నేపథ్యాలు, విమర్శకులు రాసిన విశ్లేషణల సహా.
ఇన్నాళ్లుగా అపరిచితంగా అనామకంగా మట్టికొట్టుకునిపోయిన సామూహిక సాహసిక కార్యావరణంలో చిక్కి శల్యమైన వ్యక్తుల్లోకీ, వ్యక్తిత్వాల్లోకీ, బయటికీ పయనమవుతున్నారు ఈ కథకులంతా. ఆ చీకటి  గుయ్యారాల్లోకే వెళ్ళి అక్కడి నుంచి కేకవేయాలని ఆ బూడిద వర్ణపు జీవితావిష్కరణలకే నడుంకడుతున్నారు. స్థూలంగా ఇవన్నీ కతలు కతలుగా చెప్పుకున్న నక్సల్బరానంతరమ్ కతలే.
కత, నేపథ్యం, విశ్లేషణల సహితంగా ప్రయోగాత్మకంగా వెలువడిని ఈ సంకలనంలో పట్టుమని పది కతలే వున్నా వొక్కోటి వర్తమాన జీవితపు ఒక్కో పార్శ్వాన్ని సున్నిశితంగా పటాపంచలు చేసి కొత్త పాఠకులను తయారు చేసిపెడుతున్నాయి తెలుగు కథకు.

నూతన ఆర్థిక  విధానాల రూపేణా రుచి చూస్తున్న కొత్త వరల్డ్ ఆర్డర్ లోంచీ, వర్గం అన్న స్తూలాస్థిత్వంలోంచీ బయలుదేరిన మన వివేచనకొడవళ్ళ ప్రశ్నలతో సమ్మెట దెబ్బలు చవిచూసింది. మన సామాజిక రాజకీయ వుద్యమాల మౌలిక భావజాలాలపైనా, సాహితీకళారంగాలలోనా, మానవ సంబంధాల మధ్యనా ఆ కొడవళ్లు, సమ్మెటలూ తళతళ మెరుస్తూనే వేలాడుతున్నాయి. నక్సల్బరీ తరానికి ఈ కొడవలి కోతలూ, సమ్మెట పోటులూ అనుభవంలోకి, జ్ఞానంలోకి వచ్చే చారిత్రక అవకాశం లేదు. దళిత, స్త్రీవాద దృక్కోణాల నుంచి మొదలై మన జాతి సమష్టి జ్ఞాన సంపదనంతా గూటం దెబ్బలతో తవ్వుకుని వినిర్మించుకోవాల్సి రావడం, తాజా అంచనాలతో, అనుమానాలతో, అలజడితో, తృష్ణతో తిరిగి 'చారిత్రక చౌరస్తా'లో నిలబడాల్సి రావడం ఈ తరానికి మాత్రమే అనివార్యమైంది. ఈ కతా రచయితలంతా, వారు కన్న పాత్రలంతా, తయారు చేసుకున్న పాఠకులంతా, ఆవిష్కరిస్తున్న జీవితాలంతా ఈ కొత్త చారిత్రక చౌరస్తాల్లోంచి వుత్పన్నమయినవే కాబట్టి వీటిని అంచనా కట్టేందుకు సాహసించేందుకు వీటి రాజకీయార్థిక సామాజిక నేపథ్యాలతోపాటు ఈ తరమ్ దేహం, గుండె, మెదడు పరిచయమయి వుండటం అనివార్యమయిన అర్హత అనుకుంటున్నాను.
ఈ కతలను అర్థం చేసుకునే ముందు ఈ 'వ్యక్తి' (నేను) నేపథ్యాన్ని అర్థం చేసుకుంటూ, దీన్ని అంచనా కట్టేందుకు కొత్త దేశీ పరకరాలను రూపొందించుకుని మనల్ని మనం పునర్పరిచయం చేసుకోవడం వర్తమాన కథా విమర్శనకు అనివార్యం.
భావజాల రంగంలో దళిత స్త్రీ వుద్యమాలు రేపిన తుపాను భీభత్సానికి దాదాపు సమాంతరంగానే నూతన ఆర్థిక విధానాలు సామాజిక ఆర్థిక రంగాలను అల్లకల్లోలం చేసాయి ఈ నేలలోనా, పైనా. ఈ సంక్షోభ సమయంలోనే, సందర్భంలోనే ఈ తరమూ, ఈ రచయితలూ, వారి పాత్రలూ, పాఠకులూ వాచ్యంగానో, మేధోపరంగానో టీన్స్ నుంచి గ్రోనప్స్ అవుతున్నారు. అందుకే 1980-2000 మద్య వున్న సంక్షుభిత కాలాన్ని , తరాన్ని, సృజననూ బేరీజు వేసే ముందు మనల్ని మనం ఈ కొత్త నేపథ్యంతో జ్ఞానపరచుకోవడం తప్పనిసరి.

సంకలనంలోనే ప్రతి కతకీ నేపథ్యమూ, సమీక్షా వున్నందున చర్విత చరణం కాకుండా విడివిడి కతలకు సంబంధించిన పరిశీలనజోలికి వెళ్ళకుండా వీటిల్లోని వస్తు, శిల్ప, సంవిధాన, కథనాల్లో కతను తీర్చిదిద్దిన(ట్రీట్మెంట్) ధోరణులనూ, ప్రయోగాలనూ, వైచిత్రినీ, నవ్యతనూ, తాత్విక ప్రతిపాదనలనూ మాత్రమే పంచుకునేందుకు పరిమితమవుతున్నాను.

ఈ సంకలనంలో స్థూలంగా రెండు రకాల నేపథ్యాలున్న కతలున్నాయి. పల్లెల నుంచి యెవ్వరికీ చెప్పకుండా గంపెడంత దుఃఖంతో వచ్చి దాహార్తుల్లా చెల్లాచెదురై నగరానికో, మరో దూరానికో విసిరేయబడ్డ యువకుల అంతరాత్మల వెతుకులాటే నేపథ్యమైన కతలు మొదటిరకం. కానగపూలవాన, న్యూ బాంబే టైలర్స్, డాగ్ ఫాదర్, త్రిభుజపు నాలుగో కోణం, దూరానికి దగ్గరగా, నోరుగల్ల ఆడది కతలు ఈ కోవలోకి వస్తాయి.
ఈ రచయితలూ, పాత్రలూ పల్లెల నుంచి ఎగిరిపోబడినవాళ్లు. అవసరానికో, అనివార్యంగానో ఆ మట్టి వీధుల నుంచి , వాసనల నుంచీ, ఉద్వేగపు బంధాల రెక్కలు తెగినా, లేదా ఇంకా  విచ్చుకోకున్నాసరే  'ఎగిరి పోవాలి తప్పదు' అని అనుకుని, అనుకోకుండానే పయనమైన వాళ్లే ఈ రచయితలంతా.

ఈ కతలు రాయడమంటే, చదవడమంటే కేవలం పల్లె జీవితాన్నీ, స్మృతులనూ నెమరు వేసుకోవడం కాదు. గత కాలపు మొహమాటాల్లేకుండా innocence తో వాటిని తిరిగి revisit  చేయడమే.
ఇక ఈ సంకలనంలో వున్న రెండో రకం కతలు- నగరపు ఆమ్ల  మేఘచ్ఛాయల్లోంచి, ఉక్కపోతల్లోంచి, ఉక్కుపోతల్లోంచీ సనసన్నగానైనా, వొకరొక్కరిగానైనా పక్కకు జరిగి ఔట్ సైడర్స్ గా, participant - observersగా నిండు ఊపిరితో, నిబిడీకృతమైన పెను దుఃఖంతో నగరపు జలతారు ముసుగుల్నీ, తెరల్నీ, కోటల్నీ, అంతఃపురాలనీ తీసి, చింపి, పేల్చి, రచ్చకీడుస్తున్న వైనమే నేపథ్యమైన కతలు.
ఇన్ స్టెంట్ లైఫ్, నువ్వు నేను పడమటి ఆకాశం, భారతీయుడు, ఆత్మహత్యల రుతువు కతలు భిన్నంగా, బలంగా ఈ ప్రయత్నం చేసాయి.
80-90 దశకంలో వచ్చిన కతల్లో కొట్టవచ్చినట్టు కనిపించే వొక మార్పు, మలుపు తెలుగు కత తొక్కుతున్న కొత్త పుంతల వల్లే సాధ్యమవుతోంది. సమాజంలో ఆత్మిక, సైద్ధాంతిక, భావజాల, రాజకీయ, ఆర్థిక రంగాలతో పాటు అంతరంగాలలోనూ చోటు చేసుకుంటున్న అనివార్యతే ఈ నవ్యతకు భూమిక; కారణం కూడా.
రెండు ప్రపంచ యుద్ధాల అనంతరం యూరప్ చవిచూసిన విలువల పతనం కన్నా పదునైన, భీభత్సం కన్నా భీకరమైన, విధ్వంసం కన్నా వినాశకరమైన, లోనైన జుగుప్స కన్నా అసహ్యకరమైన గగుర్పాటు, గందరగోళం, అభద్రత, పరాయీకరణ, అస్థిత్వ సంక్షోభం, వ్యక్తి కేంద్రత వర్తమాన భారత సమాజం ఎదుర్కుంటోంది.
రెండు ప్రపంచ యుద్ధాల్లో భౌతిక హింసకు, విచ్ఛిన్నానికి తల్లడిల్లిన ఆ తరమ్ ఆలోచనల్లో రూపుదిద్దుకున్న అబ్జర్డిటీ, ఎక్జిస్టెన్షియలిజం, సర్రియలిజం లాంటి తిరుగుబాటు ధోరణులు అణుబాంబులు వేసుకోవడం కన్నా హీనమైన మానసిక హింసకు లోనవుతున్న ఇక్కడి ఈ తరం ప్రతిఫలనాల్లో కొత్త అర్థంతో తిరిగి రిలవెంట్ అవుతున్నాయి.
ఈ అనిశ్చితత్వంలో కొట్టుమిట్టాడుతున్న ఈ తరమ్ సృజనలో ఈ ధోరణులన్నీ రీవిజిట్ చేస్తున్నాయి. చేయనున్నాయి. ఇందుకు రుజువుగా ఈ సంకలనంలోని వైవిధ్యాన్నే చూపవచ్చు. మరీ ముఖ్యంగా కానగపూల వాన, భారతీయుడు, న్యూ బాంబే టైలర్స్, నువ్వు నేను పడమటి ఆకాశం, ఆత్మహత్యల రుతువు కతల్లోని అభివ్యక్తి ఈ ధోరణుల ప్రతిఫలనాలను పట్టి ఇస్తోంది.
80-90 లలో వస్తున్న కతల్లో కనిపిస్తున్న, బలంగా ముందుకు వస్తున్న మరొక అంశం టెక్నిక్. నవ్యత కోసం పరితపించడం వల్లా, అపూర్వత కోసం ప్రయత్నించడం వల్లా టెక్నిక్ అన్నది సహజంగానే  ముందువరుస తీసుకుంటుంది. రచయితల్లో ఈ టెక్నిక్ స్పృహ పెరిగిన తర్వాత ముందటి కతల్లాగా వర్తమాన కతలు లీనియర్ గా నడవటం చాల అరుదు. ఈ కతా సంకలనంలోని అన్ని కతల్లోనూ టెక్నిక్ కాన్షియస్ నెస్ వేర్వేరు మోతాదుల్లో , తలాల్లో కనిపిస్తుంది.

ఈ సంకలనంలో నోరుగల్ల ఆడది, డాగ్ ఫాదర్, నువ్వు నేను పడమటి ఆకాశం, త్రిభుజానికి నాలుగో కోణం కతలను తీసుకుంటే వీటిని ఈ సంకలనంలోని తక్కిన కతలతో వేరు చేస్తున్న వొక విభజన రేఖ వుంది. అది ఈ కతలలో కార్య వర్ణణ/ నివేదన( report of action) పాళ్లు మోతాదుకు మించి ఉండటమే.  తత్ఫలితంగా రచయిత జోక్యం ఎక్కువైపోయి వొక్కో సందర్భంలో పాత్రల మధ్య, ఇంకోసారి పాత్రలకన్నా వెనకబడీ అలా దిక్కుతోచక, exhaust  అయిపోయి బిక్కమొఖం వేసి నిలబడిన వైనం లీలగానైనా కనిపిస్తుంది. ఈ void ని భర్తీ చేసేందుకు రచయిత external techniqueలను ఆశ్రయించిన తీరు బట్టబయలవుతుంది.
నోరుగల్ల ఆడది కతలో వల్లంపాట వెంకటసుబ్బయ్య పసిగట్టినట్టు విస్తారమైన కాల వ్యవధిని, సుదీర్ఘమైన చరిత్రను నవలలో కాక కతలో ఇమడ్చడానికి బలవంతంగా ప్రయత్నించడం వల్ల రచయిత చేయి చేసుకుని మరీ ఆ పాత్రలను హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. డాక్యుమెంటరీ తరహాలో రాసానని ఉమామహేశ్వరరావు చెప్పినప్పటికీ వాయిస్ ఓవర్ శృతిమించడం వల్ల దృశ్యం, పాత్రౌచిత్యం సన్నగిల్లాయి. ఆ కారణంగానే ముగింపుకొచ్చేసరికి వాచ్యానికి దిగి చేతులెత్తిన వైనం కనిపిస్తుంది. ఈ రచయిత క్రితం కతల్లో యేనాడూ చేయని వొక ప్రయోగం తొలిసారి ఈ కతలో చేసాడు. ఎందువల్లో టెక్నిక్ కాన్షియస్ అయ్యాడు. బహుశా తనశైలిని తనే రిపీట్ చేస్తున్నాననో, కాపీ కొడుతున్నాననో అనుకునే రచయితలందరూ లోనయ్యే వొక అవస్థకు ఉమా మహేశ్వర రావు కూడా గురయ్యాడేమో అనిపిస్తుంది. అందుకే కత డిమాండ్ చేయకపోయినా డాక్యుమెంటరీ టెక్నిక్ ని ఆశ్రయించి కతకు అన్యాయం చేసాడు. ఉమా ఇదివర్లో రాసిన మంచివాడు, బిడ్డలుగల తల్లి, ముక్కుపుల్ల, మొగుడూ పెళ్ళాల ప్రేమకతల్లో అంతర్భాగంగానే వొక వున్నతమైన పరిణితి చెందిన టెక్నిక్, సీనిక్ డిసిప్లిన్ వుంటాయి. ఆ డిసిప్లిన్ డిస్మాంటిల్ చేయమని కతే ప్రోద్బలం చేస్తే తప్ప external technique జోలికి పోకుంటే మరింత పరిణితి చెందిన పాత్రలను పాఠకులకు పరిచయం చేసి వెంటాడగలడు ఉమ. ఈ లోపం వల్లే నోరుగల్ల ఆడది నోరే వినిపించకుండా పోయింది కతలో.
ఇదే disturbance డాగ్ ఫాదర్, త్రిభుజానికి నాలుగో కోణం కతల్లోనూ కనిపిస్తుంది.అయితే నువ్వు నేను పడమటి ఆకాశం కత శైలి పరంగా  stream of self conscious fiction లాగా నడవటం వల్ల ఈ disturbance ను పసిగట్టడం కొంచెం కష్టమవుతుంది. ఇది పసిగట్టేందుకు ఎక్కువ కష్టపడకుండా ఇదే సంకలనంలోని దాదాపు ఇదే ధోరణిలో నడిచిన భారతీయుడు కత చదవాలి. యాధృచ్ఛికమే అయినా ఈ రెండు కతలూ యూనివర్సిటీ వాతావరణంలో వున్న ఇద్దరు రచయితల నుంచి వెలువడ్డాయి. నువ్వు నేను పడమటి ఆకాశం కత వెంటాడే ప్రతీలన్నీ ఒక రూపం తీసుకునేందుకు పెనుగులాడుతున్నప్పుడు కసిగా అబార్ట్ చేసిన కల తాలూకు అనువాదంలా అర్థం చేసుకవాలి. ఇందులో రచయిత తన చుట్టూ రెక్కలున్న చిలుపట్టిన ఇనుప మేకుల్లాంటి పరిశీలనలను, వ్యక్తలను, దృశ్యాలను ఢీ కొట్టిస్తూ వాటి మద్య నిలబడి రిపోర్ట్, కామెంట్ చేసే ఒక భద్ర తలంలో వుంటూ కతను నడిపిస్తాడు. ఇందులో రచయిత పక్షాతీతుడైన స్వచ్ఛంద ఔట్ సైడర్. ఇది ఇమడలేని తనంలో నుంచి వచ్చే నిస్సహాయత. కతలోని అసంఖ్యాకమైన పాత్రలను పాఠకుడే స్వశక్తితో ప్రేమించే, ద్వేషించే, అర్థం చేసుకునే ప్రివిలేజ్ నిరాకరించేంతగా రచయిత జోక్యం, వ్యాఖ్యానం వుంటాయి. 
 రెండో భాగం 
ఇక external technique తో పనిలేకుండా, పని లేదన్న స్పృహతోనే నడిచిన కతలు ఇన్ స్టంట్ లైఫ్, న్యూబాంబే టైలర్స్, దూరానికి దగ్గరగా. టెక్నిక్ కళ్ళలోంచి  చూస్తే ఇవి సాదాసీదా కతలుగా కనిపిస్తాయి. కానీ వీటి సీనిక్ ఆర్డరే వాటి ఆయువు. మరీ ప్రత్యేకించి న్యూ బాంబే టైలర్స్  కతలో ఖదీర్ దర్గామిట్ట కతల్లోని ఆర్డర్ నుంచి  బయటపడుతున్న వైనం కనిపిస్తుంది. స్వతహాగా ఖదీర్ ది మనోహర జీవన చైతన్యాన్నీ, అందులో కనిపించని చమత్కారాన్ని పసిగట్టి మనముందుకు తీసుకువచ్చి ఆశ్చర్యచకితులను చేసే చార్లీ చాప్లిన్ టెక్నిక్. ముఖాలపై నవ్వు ఆరిన మరుక్షణం వుండబట్టలేనంత దుఃఖం ముంచుకువచ్చి కమ్ముకుని మన చేతనాచేతనలను కాల్చి కాలి కిందనేలను లాగేసుకుంటుంది. న్యూ బాంబే టైలర్స్ కతలో ఈ భీభత్సం మరింత గుచ్చకునేంతగా పరిణితితో కనిపిస్తుంది. గ్లోబలైజేషన్ గ్రామీణ జీవన చిత్రాన్ని ఎలా ఛిద్రం చేసిందో ఆగిన న్యూ బాంబే టైలర్స్ మిషన్ చప్పుడు మనకు సూదులు గుచ్చి మరీ చెబుతుంది. బాల్యాన్ని పునరర్పించుకుని, వినిర్మించుకుని బయోగ్రఫికల్ స్కెచెస్ రాసే రచయితలను తన ఇన్ ఫ్లూయెన్స్ వలయాల్లోకి లాగేసుకుని వొక పట్టాన వదలక పీల్చి పిప్పి చేసే మిట్టూరి మాంత్రికుడి కామ పంజరం నుంచి బయటపడగలిగీ ఖదీర్ నిలదొక్కుకుంటున్నాడని న్యూ బాంబే టైలర్స్ కత దర్గా మిట్ట మీద నిలబడి మరీ చాటుతోంది.

ఈ సంకలనంలో ఒక అంచున 'కానుగ పూల వాన', మరో అంచున 'ఆత్మమత్యల రుతువు' వుండటం కేవలం యాధృచ్ఛికం కాదేమో! ఈ ఇద్దరు రచయితలను (మరీ ప్రత్యేకించి చంద్రశేఖరరావును) అర్థం చేసుకునేందుకు విశ్లేషకులు ఎక్కువగా వాడుతున్న మాట మ్యాజికల్ రియలిజమ్. ఈ మ్యాజికల్ రియలిజమ్ గురించి అభంశుభం తెలియని గోపిని కరుణాకర్ గురించి  తర్వాత ప్రస్తావిస్తాను. ముందు చంద్రశేఖరరావు సంగతి.
ఇటీవలి కాలంలో వొక ధోరణిగా చాలా మంది కతకుల దృష్టిలో ఒక 'స్కూల్ ఆఫ్ రైటింగ్'గా ముందుకు వచ్చిన కతకుడు చంద్రశేఖరరావు. ఇతని కతల్లో మనల్ని తీవ్ర మైన, ఘాడమైన ఉద్వేగాలలోకి తీసుకెళ్ళే విలక్షణమైన శిల్పం-శైలి మెరుస్తాయి. విభిన్న తలాలలో విహరించి వచ్చే సమాంతర కతాగమనమూ ఉపరితలంలో తళుక్కుమంటాయి. కత లోలోతుల్లో యేకాకితనం, పరాజితుల వేదన, మానసిక సంక్షోభం, రికామీ, పశ్చాత్తాపం, నిరాశ- లాంటి అనేకానేక ఉద్వేగాలతో, మనస్తాపాలతో, మనోవేదనలతో పాత్రలు పరిచయమవుతాయి. చివరికి పరిచయస్తుల్లానే మిగిలిపోతాయి. వొక్ మాటలో చెప్పాలంటే చంద్రశేఖరరావు కతల్లో 'అనంత శోక భీకర తిమిర లోకైక పతులూ, పత్నులే' ప్రొటాగనిస్ట్ లు, ఆంటగనిస్టులు. ఇతని పాత్రలు ఎప్పుడూ ఏదో తెలియని అన్వేషణలో వుంటాయి. అయితే అన్ని రకాల సైకలాజికల్ ట్రామాలనీ, ట్రాన్స్ఫర్మేషన్లనీ తన కతలలో నిర్మొహమాటంగా ఎంబలిష్ మెంట్స్ గా ( చంద్ర శేఖరరావు తన నేపథ్యంలో చెప్పుకున్నట్టు పోస్ట్ మాడ్రన్ అందాలను అద్దడం) చక్కగా, చాకచక్యంగా వొకింత కవితాత్మకంగా అమర్చుకునే నైపుణ్య ఇతనికుంది. అందువల్లే ఇతని పాత్రల అన్వేషణ ఛద్మవేషగవేశణమైపోయింది. భావన నిజీయితీ కోల్పోయి కేవల అలంకరణగానే మిగిలిపోయింది.
ఇక తన కతలో ఎన్నెన్ని ' మెటఫరికల్ డ్రామాలు, క్యాప్సల్ లోపలి మందులాంటి మూడ్స్, కత్తి ంచున సాగే నడకలాంటి గగుర్పొడిచే విన్యాసాలు, సింబాలిక్ మీనింగ్స్, మెటఫరికల్ ట్రాప్స్, ఇంప్లాంటేషన్లు, ఇంజెక్షన్లు, ఎక్స్ ప్రెషనిస్టిక్ ట్రిక్స్, ఫ్రాంజ్ కాఫ్కాలు, గాబ్రియేలా గార్షియా మార్క్వెజ్ లు, సామ్యూల్ బెకెట్ లు, కొలాజ్ టెక్నిక్కులు' వగైరా తదితర మొదలైన దినుసులు ఎన్నెన్నేసి ఏఏ మోతాదుల్లో నర్మగర్భంగా వున్నాయో చంద్రశేఖరరావే తన నేపథ్యంలో వొప్పుకున్నందుకు నాకింకేమీ మిగల్లేదు చెప్పడానికి.
తన ట్రిక్స్ మీదా, ట్రాప్స్ మీదా ఇంతేసి 'స్పష్టత' వున్నందువల్లేనేమో బహుశా చంద్రశేఖరరావు కతలు రీడర్ ఫ్రెడ్లీనెస్ నుంచి తప్పుకుని క్రిటిక్ కాన్షియస్‌ అయిపోతాయి. శైలీ పరంగా చంద్రశేఖరరావు విశ్వనాథ సత్యనారాయణకు పోస్ట్మాడ్రన్ కొనసాగింపు. పాఠకులు వఠ్ఠి వెర్రివెంగళప్పలు, అన్నీ మనమే చెప్పేడవాలి అనుకునే వేయిపడగల రచయిత శైలికీ చంద్రశేఖరరావు వైలికీ పొంతన వుంది. సమయం వచ్చినా రాకున్నా సందర్భం వున్నా లేకున్నా తనో, తన పాత్రల చేతనో, లేదా తను ప్రేమలో పడిన పదానికి టీకాటిప్పణి, వ్యుత్పత్తర్థము, విగ్రహ వాక్యము చెప్పడంలో విశ్వనాథవారికి తీసిపోరు చంద్రశేఖరరావు. ఉదాహరణకు requium  అనే మాటకు నిఘంటువు (బ్రౌణ్యో మరోటో) చూసుకుని అర్థం వెతుక్కునేంత తెలివితేటలున్న పాఠకుడుంటాడా ఈ లోకంలో అన్న దయతో కూడిన శంక వల్ల ఆ పదానికి అర్థం చెప్పి, అక్కడికీ అర్థం కాకుండా అశేష పాఠకులు మిగిలిపోయి వుంటారన్న వల్లమాటిన ప్రేమతో కొంత వ్యాఖ్యానాన్ని పొందుపరుస్తాడు. ఇట్లాంటిదే  qnxiety neurosis అన్నమరో  ఆంగ్ల పదబంధం. దీని గురించి కూడా వైవి (అంటే యదువంశి) అనే పాత్రతో విక చాంతాండంత ఉపన్యాసం ఇప్పించి చితక్కొట్టి చెవులు మూయిస్తాడుప కతను information counter  చేసేస్తాడు చంద్రశేఖరరావు.
నిఆనికి ఆత్మహత్యల రుతువు కతకే కాదు చంద్రవేఖరరావు రాసిన లెనిన్ ప్లేస్ లోని మరే కతకూ కూడా మ్యా.జికల్ రియలిజమ్ అనే దానితో సంబంధం లేదు. 'మ్యాజికల్ రియలిజమ్ అని దేన్ని అంటారో ఇక్కడ చర్చ అనవసరం' అన్న తిరుపతిరావు చేసిన ట్రిక్ నే నేనిక్కడ ప్లే చేయదలచుకున్నాను. మరయితే చంద్రశేకరరావు ఒక ధోరణి కాదా?  అంటే ముమ్మాటికీ అవుననే సమాధానం చెప్పాలి.
సినిమాను మణిరత్నం ఎలాగయితే టెక్నికల్ వండర్ చేసి,  A mess of interdependant techinicians గా మార్చి సినిమాను  technique in itself  చేసాడో తెలుగు కతా సాహిత్యంలో చంద్రశేకరరావు కత కూడా collage of promos గా మిగిలింది.
నిజానికి ఈ కతా సంకలనంలో మిగతా కతలన్నీ ఒక ఎత్తయితే కానగపూల వాన ఎంతో ఎత్తు.
గోపిని కతలు దుస్సార, తిప్ప తీగలతో అల్లుకున్న కంగుంది దృశ్యాలు. జీవిత సేవించిన కైపులో పాడే బైరాగి పాటలు, జక్కీకు పదాలు. టెక్నిక్ పరంగా ఉపరితలంలో, ఫస్ట్ ఇంప్రెషన్ లో మ్యాజికల్ రియలిజమ్ తాలూకు అడాప్టెడ్ అంశ ఏదో వున్నట్టు తోస్తుంది. దీనిక కారణం కతలకు, విమర్శకులకు మ్యాజికల్ రియలిజమ్ స్మరణ చేయడం తెలిసినంతగా జానపద మంత్ర మార్మికత పట్ల అవగాహన, ప్రేమ లేకపోవడమే.
గోపిని కరుణాకర్ కతలన్నింటిలోనూ  అవ్వ చెప్పిన కతలను తిరిగి పిల్లలు తమ కాల్పనిక జగత్తులోంచి నడిపించి చెప్పే వొక టెక్నిక్ వుంటుంది. పసితనపు అమాయకత్వంతో పాటు భౌతిక ప్రపంచపు విభజన రేఖలు తెలీని అచ్చమైన, స్వచ్ఛమైన తాజా కంఠమొకటి వినిపిస్తుంది గోపిని కథనంలో. ఈ పసి ప్రపంచపు అమాయత్వంలో కామం-ప్రేమ, దేహం-మనసు, ఆడ-మగ, సుఖం-దుఃఖం, మంత్రం-వాస్తవం, కలిమి-లేమి, కల-నిజం లాంటి బాహ్య ప్రపంచపు సామాజిక విభజనలు, ద్వంద్వాలు వుండవుప రద్దు చేయబడతాయి. పిల్లలకు ఈ రేఖలు, శృంఖలాల గురించి అస్సలేమీ తెలీదు. ఇదే స్థితి కానగపూల వాన కతలో కురుస్తుంది. నిజానికి మాదిగ లచ్చిమి, పెదబ్బలు రెండు దేహాలు, లింగాలు, తరహాలు, కులాలు, జీవితాలు, తలాలు, దుఃఖాలు, కలలు, నిజాలు. కానీ కత మాత్రం ఇవన్నీ ఒక సారి చెరిగిపోయిన, మరోసారి పెనవేసుకుపోయిన తలంలోంచే పలుకుతుంది.
అందుకే మాదిగ లచ్చిమి, పెదబ్బలు వొక్కే వ్యక్తికి రెండు దేహాలుగానూ, లేదా రెండు శరీరాలకు ఒక్కే వ్యక్తిగానూ నిలస్తారు.
మనుషులుగా సాధించాల్సిన ఈ స్థితిని లచ్చిమి, పెదబ్బలు మిన్నాగులై, గుర్రాలై, పక్షులై, చేపలై, సీతాకోక చిలుకలై, నెళ్లయి, చామలై, ఏనుగులై, పులులై, జింకలై సాక్షాత్కరింప చేసుకుంటారుప కానగపూల వానై జలజలమంటారు. ఈ కత లోపలి దృశ్య సమన్వయంలో వున్న ఈ ఐంద్రజాలిక మార్మికత, మంత్ర వాస్తవికత, గమనంలోని అంతః స్రవంతులు, సంవిధానంలోని అంతరాల అంతరాళాలు సంఘర్షణలూ కేవలం మౌఖిక జానపద కల్పనాత్మకే, చూపుకే, కళ్ళకే, దృష్టికే సాధ్యం. అందుకే గోపిని కరుణాకర్ వర్తమాన సమయంలో, సందర్భంలో, వాతావరణంలో జానపద శైలిలో ఎపిక్ స్టోరీస్ చెప్పగల సమర్థుడు. కతలోని సీనిక్ డివిజన్, ఫ్లో, సర్ కమ్ స్టెన్సెస్ చూస్తే గోపినికున్న సినిమా పరిజ్ఞానం ఎంత లోతైనదో, పరిణితమైనదో, స్వతఃసిద్ధమైనదో అర్థం చేసుకోవచ్చు. గోపిని కరుణాకర్ గొప్ప కతకుడు, ప్రామిసింగ్ రైటర్ అని అనడం కన్నా అతను మనం కోల్పోయిన అవ్వ, జానపదం, జీవితంలోని ఇంద్రజాలం, బతుకులోని మంత్రం.
ఇంతటి వైవిధ్యమున్న కతలను రెండు అట్టల మద్య మాగిన అక్బర్ గీతలతో అందించిన విజయవాడ సాహితీ మిత్రులు ముందు ముందు విశ్లేషణలు లేకుండా సంకలనం చేస్తారని ఆశిస్తాను. విశ్లేషణ, విమర్శ సృజనాత్మక ప్రక్రియలే అయినా సృజనను శాశించే దుర్మార్గం చేస్తూ వస్తున్నాయి ఈ నేలలో. మనకు విబేధించడానికీ, ద్వేషించడానికీ మధ్య తేడా తెలియకపోవడం వల్ల కూడా విమర్శ ముసుగులో ఈ డ్యామేజ్ జరిగిపోతోంది. ఈ డ్యామేజ్ ఈ కతా సంకలనంలోని విశ్లేషణల్లోనూ తేటతెల్లమవుతోంది. కనీసం కతా విమర్శ అయినా మొహమాటపు కంచెలు దాటి స్వచ్ఛంగా, తాజాగా, దేశీగా, సాహసంగా కూడలిలో నిలబడుతుందని ఆశిద్దాం.




Saturday, May 26, 2012

బిర్లాకు టాటా

నేల నేడు పది యుద్ధాలు
పిల్లలు ఆడుకునే చోటంతా
    ఇప్పుడు కుప్పకూలిన కొంపలు
గోరీలు    గోరీలు    గోరీలు
తెగవేసిన పసిబిడ్డల తలలు
బిడ్డల కళ్ళముందే
    చీలికలైన తల్లుల మానాలు

ఈ జాతరకంతా కారణం వుందని చాటిస్తున్నారు వాళ్ళు
కమ్యూనిజం చచ్చిపోయిందహో! అని

భూగోళం ఇప్పుడు వొక టైంబాంబు
టిక్ టిక్ టిక్ టిక్ టిక్
వాళ్ళ పెంట వేసే పెరటిదిబ్బ అట
    మన మూడో ప్రపంచం
వాళ్ళ యేసీ పిగోతీ  చల్లగా వుంటే చాలు
మన కడుపులు కాలిపోతేనేం
వొరే తిక్కలోడా
అసలుసిసలు మాటొకటి వుంది
అదే అదే కమ్యూనిజానికి కాలం చెల్లింది

ఇల్లు లేని వాళ్లను
వ్వెవ్వెవ్వెవ్వెవ్వెవ్వెవ్వెవ్వెవ్వెవ్వెవ్వెవ్వెవ్వె క్కిరిస్తాయి
మేడలపై  పై మేడలపై మేడలపై మేడలపై మొలిచిన మేడల తలలు
అందని ఐస్ క్రీముల మీదినుంచి
జారిపోయే అనాదల అలమటింపు చూపులు

బంగారు బిడ్డల కాక్షేపానికి
టీవీలో మమ్మీ కెల్లాగ్స్ తినిపిస్తోన్నా
పిడికెడు మెతుకుల కోసం
చెత్తకుప్పల్లో ఒక అమ్మ ఆకులు నెమకుతోన్నా సరే
కమ్యూనిజం ఓడిపోయింది... పోయింది... యింది... ది

సెక్సోత్సాహం కావాలా
హింసానందం కావాలా
ఏం కావాలి
రిమీట నొక్కితే చాలు
యెత్తేయ్ జెండా .... వేసేయ్ ఓటు
ఇంతకన్నా లేదు సాంస్కృతిక విప్లవం

నిజానికి ప్రపంచమే వొక పేద్ద ఛానల్
ఈ గోళం శ్రీమాన్ మర్డోక్ నవ్వులతో
గలగలలాడే చిన్న హుండీ
నో వండర్! క్యాపిటలిజం పూసుకువస్తోంది

ఈ లోకమే వొక మాయాబజార్
నిన్నుకొనేస్తా... లేకుంటే అమ్మేస్తా
ఎంత చెమటకంత పర్సెంట్ డిస్కౌంట్
స్వేచ్ఛా విఫణిలో పదేపదే  పాడే వేలం పాటొకటి వుంది
వొకటోసారి
    తక్కువ మనుషులు... ఎక్కువ చేతులు
రెండోసారి
    తక్కువ మనుషులు... ఎక్కువ చేతులు
మూడోసారి
    తక్కువ మనుషులు... ఎక్కువ చేతులు
వాతావరణమంతా స్పిరిట్ ఆఫ్ ఫ్రీడం
ఆఖరాఖరారాఖరారాఖరారాఖరారాఖరారాఖరికి
కమ్యూనిజం చచ్చింది

ఆడే రెక్కలకే కూలీ రేట్లంటే
మానవ మక్కులనే తుంగలో తొక్కడం
గతిలేక పిల్లలే వళ్ళొంచినపుడు
వాళ్ళ గల్లా పెట్టలు మైమరచి తైతక్కలాడతాయి
ఆహా! ధూళికన్నా కారుచవక కూలి
అది యెంతెంతో అదనపు విలువ
యెంతెంతెంతెంతెంతెంటే
స్వర్గకూపం అయిపోయిన ఈ గ్లోబంత
తీయ్ సీసా... సే ఛీర్స్
కమ్యూనిజం అమర్ రహే

అమ్మేస్తాం లేత యవ్వనాల్ని
వయసు తొమ్మిదా పంతొమ్మిది జానేదేవ్
నీ మనసైన రంగే
నలుపు... తెలుపు .. చామనచాయ
కళ్లేం పోవు ...పాపమూ కాదు
నీకు తెలియదా
భక్తునికీ భగవంతునికీ అనుసంధానమైనది
వ్యాపారబంధమేనని
కనుక
    కాబట్టి
        అందువలన
కమ్యూనిజం కాల ధర్మం చేసింది
పైగా వాళ్ళే దాన్ని పూడ్చింది

పూడ్చింది దాన్నేనా?
కాదు
వాళ్ళను రేయింబవళ్లు వెంటాడుతూనే వుంది
అపుడంత వాళ్ళ చేతుల్ని నెత్తుటిలో ముంచుతారు
అపుడంతా వాళ్ళొక పాటను కసిగా చంపుతారు
అపుడంతా వాళ్ళొక అమాయకుణ్ణి నక్జలైట్ చేస్తారు
అపుడంతా వాళ్లొక స్వప్నాన్ని చిదిమేస్తారు
అపుడంతా లోకకళ్యాణం గురించే ఊకదంపుడు
అపుడంతా వాళ్లొక దృక్పథాన్ని వల్లిస్తారు

ఇంతా చేస్తే హఠాత్తుగా దీన్నంతా పటాపంచలు చేస్తుంది
వొక మృతవీరుడి చిమ్మిన రక్తపులేచిన చేయి
యిక పగటికలలే వాళ్ళను పీడకలలై చుట్టుకుంటాయి
వాళ్లను ముంచెత్తివేసే
యెర్రెర్రని ఉత్పాతం అట్టడుగునుంచి
మనకు వినిపిస్తాయి
సర్పభూయిష్టమైన బుసబుసల హీనస్వరాలు
కమ్యూనిజం చచ్చిపోయింది

ఇంగ్లీష్- సత్యజిత్ భక్తాల్, స్వాతి
తెలుగు- అనంతు, సౌదా
22-03-1997, వార్త

english title- Tribute to Capitalism





Monday, May 14, 2012

ఏది అక్షరం? ఏది ఆయుధం?


పెట్టుబడికి అభిప్రాయాలుండవు. ప్రయోజనాలు మాత్రమే వుంటాయి. అవి మారినప్పుడల్లా అభిప్రాయాలు వాటంతటకవే మారిపోతుంటాయి ఆయా పత్రికలవీ, టివీలవి- పురాతన మీడియా సామెత

సాక్షి పత్రిక ప్రారంభం రాష్ట్రంలో దిన పత్రికల మార్కెట్ నే కాదు, ఒక వర్గం కొమ్ము కాస్తున్న ఏక శిలా (కులా) మీడియా ను కూడా చీల్చింది. ఇప్పుడు దిన పత్రికల 'పాలసీ' ఇదివరకటి సత్తెకాలంలోలాగా ముసుగులో లేదు. బాహాటంగానే తమ లైన్ ప్రకటించిన ప్రధాన స్రవంతి పార్టీలలాగే ఇక్కడి మీడియా సంస్థలూ వ్యవహరిస్తున్నాయి. చాలా కాలం వరకు ఒక కులమే గుత్తాధిపత్యంగా తమ చెప్పుల్లో, చేతల్లో మీడియాను పెట్టుకుంటూ వచ్చిందనేది తిరుగులేని సత్యం.
(అయితే కులం అని అనకుండా కొత్త మేలి ముసుగు వేసి చెలామణి చేస్తున్న ఈ "సామాజిక వర్గం" అన్న పదబంధం పుట్టుక 90 లనాటి ఆయా పత్రికల ఆస్థాన పండితుల సృష్టే. ఒక కులం నొచ్చుకోకుండా, పచ్చిగా కనిపించకుండా కొంత సౌకుమారతను అభినయించడం మొదలైంది సరిగ్గా ఈ నేలలో దళిత ఉద్యమం ఉధృతం దాలుస్తున్నప్పుడే కావడం కొసమెరుపు.)
ఈ కులమే కమ్మ కులం. ఇది ఏ సర్వేనో చేసి రుజువు చేయాల్సిన సత్యం కాదు. సర్వజనులకు తెలిసిన సత్యం. సాక్షి పత్రిక వచ్చిన తర్వాత ఈ కులం గుత్తాధిపత్యం రాత్రికి రాత్రే ప్రశ్నించబడింది. ప్రతి పెట్టుబడి వెనుకా కులం బలం మాత్రమే వుంటుంది. ఆ పెట్టుబడికి ఏకైక ప్రయోజనం ఆ కుల ప్రగతి మాత్రమే కాకపోవచ్చు కానీ అంతిమ ప్రయోజనం మాత్రం అదే. ఇప్పుడు నడుస్తున్నది మీడియా వార్ కాదు. పెట్టుబడుల వార్. కులాల ఆధిపత్యాల మధ్యా, లేదా ఆ ఆధిపత్యాలను ప్రశ్నించిన ఇంకో కులం ప్రయోజనాలకు మధ్య జరుగుతన్న యుద్దం. ఈ పత్రికల, టివిల యజమానులే కాదు రూపర్ట్ మర్డోక్ కూడా ఇదే యుద్ధాన్ని అధికారం కోసమో, తాను నమ్మిన అభిప్రాయాలనే వాస్తవాలుగా ఉత్పత్తి చేయడం  కోసమే అభినయించాలి.
పెట్టుబడి ఎలా ప్రవర్తిస్తుంది, అది అదనపు విలువను సృష్టించేందుకు కనీస విలువలను కూడా ఎలా చాకచక్యంగా తుంగలో తొక్కుతుంది అన్న విషయాలను నేను ఇక్కడ చర్చించను. కావాలంటే సాయంత్రం పూట ఓ అరగంట కామ్రేడ్ కార్ల్ మార్క్స్ తో క్లాస్ ఇప్పిస్తా.
పెట్టుబడులకు లాభాల పేరుతో మరింత పెట్టుబడిని పోగేసుకునే ఏకైక లక్ష్యం మాత్రమే వుండదు. ఒక వేళ వున్నా ఆ లక్ష్యం మీడియా గ్రూపులను నడపడం ద్వారా దొబ్బదు. అందుకే మీడియాలో డబ్బులు పెట్టే వేమూరి రాధాకృష్ణ లాంటి వారు కేవలం ఆర్థిక సంతృప్తి  సాధించడమే తమ లక్ష్యంగా పెట్టుకోరు. ఆత్మ సంతృప్తి సాధించడం అన్న స్వాంతన కార్యక్రమాన్ని తమ స్ర్కీన్ సేవర్లుగా చెలామణీ చేసుకుని నిస్సిగ్గుగా జర్నలిజాన్ని వాడుకునేందుకు వెనకంజవేయరు. ఇందుకు ప్రపంచంలో ఏ ప్రధాన స్రవంతి పత్రికా మినహాయింపు కాదు. ఎందుకంటే మీడియా ముమ్మాటికీ ఒక బిజినెస్సే, జర్నలిస్టులు జీతం తీసుకునే కార్మికులే.
ఈనాడు పత్రిక, టివిల పెట్టుబడిదారుడు రామోజీరావుకు, సాక్షి పెట్టుబడిదారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ , యజమానిగా, జర్నలిస్టుగా సమయానికి తగువిధంగా అభినయించే వేమూరి రాధాకృష్ణకు తమ తమ ప్రయోజనాలున్నాయి తమ మీడియా బిజినెస్ లలో. ఈ విషయం చెప్పడానికి ఏ విశ్లేషకుడు, నిపుణుడు అవసరం లేదు. ఈ పత్రికలను, టివిలను రోజూ వార్తల కోసం కాక వ్యాఖ్యానాలకోసం చదువుతున్న, చూస్తున్న కోట్లాది రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. వాటిని ఆయా పత్రికల్లో రోజూ రాస్తున్న జర్నలిస్టులకూ తెలుసు.
ఇప్పుడు గొడవ వేమూరి రాధాకృష్ణది. తనపై గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కక్ష సాధించాడని 'సాక్షాధారాల' తో సహా ఇప్పుడు చెబుతున్న రాధాకృష్ణదే అసలు గొడవ. తన పత్రిక సంకట స్థితిలో వున్నప్పుడు కొన్ని జర్నలిస్టు సంఘాలు సంఘీభావం తెలపనందుకు వారితోనూ గొడవ. అసలు గొడవలు ఇవైతే అక్కసు మాత్రం జర్నలిస్టులపైన వెళ్ళగక్కుతున్నాడు ఆదిత్య అలియాస్ ఆర్ కె ఉరఫ్ వేమూరి రాధాకృష్ణ తన తాజా చెత్త పలుకులో.
హజార్ చువ్వే ఖాకే బిల్లీ హజ్ జాతా హై
యాజమాన్యానికీ, సిబ్బందికీ మధ్య వున్న గీత చెరిపేసి జీతం కోసం పని చేసి పొట్టపోసుకునే జర్నలిస్టులను తన వాదనకోసం యాజమాన్యం తొత్తులనే సాహసం చేసాడు రిపోర్టర్ టర్నడ్ ఎండి రాధాకృష్ణ తన  తాజా కాలం కం ఎడిటోరియల్ లో. 
సెక్రటేరియట్ రిపోర్టర్ గా తన జర్నలిస్టు ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రాధాకృష్ణ గురించి మీడియా ఎంట్రీ గురించి ఒక పిట్ట కథ జర్నలిస్టు సర్కిల్స్ లోనే ప్రచారంలో వుంది.
ఆటవిడుపుకోసం ఆ పిట్టకత ఇప్పుడు మీ కోసం ప్రత్యేకం.
అనగనగా  ఎస్సై కావాలనుకున్న వేమూరి రాధాకృష్ణ. సక్రమంగా కుదరక సెక్రటేరియట్ లోని ఒక అవినీతి జర్నలిస్ట్ ను సంప్రదించగా అతను అక్షరాలా 24 వేల రూపాయలకు సదరు పోస్ట్ అమ్మే విధంగా(ఇప్పించే విధంగా) ఆఫర్ ఇచ్చాడు ఆ బ్రదర్. ప్రయాణ ఖర్చులు సహా పాతిక వేలు తల తాకట్టు పెట్టి సదరు జర్నలిస్టు మిత్రునికి ఇచ్చి ఎస్సై కలలు కన్నాడట విఆర్కే. అలా నెలలు గడుస్తున్నా వర్కవుట్ అవ్వకపోయేసరికి తన కన్నా పవర్ ఫుల్ అయిన ఆ జర్నలిస్ట్ మిత్రుడిపై కోపం పెంచుకున్నాడట. అయితే అతనిపై పెంచుకోవాల్సింది కోపం కాదు మోహం అని తెలుసుకున్న రాధాకష్ణ తన ఎస్సై కలకు గుడ్ బై చెప్పి జర్నలిస్ట్ అయిపోయాడట.
ఎలా వుంది ఆర్కే మీడియా ఎంట్రీ. అదరహో!
( ఆ నాటి నుంచి ఈ పద్ధతిలో జర్నలిస్టులైపోయిన వారే జర్నలిజం అంతు చూశారు ఆ తర్వాతి కాలంలో అదీ అనతి కాలంలోనే. వీళ్ళ వల్లే ఒక వర్గం జర్నలిస్టులు పెంపుడు జంతువులుగా, మరో వర్గం జర్నలిస్టులు పార్టీ కార్యకర్తలుగా మారిపోయారు. ఇక మిగిలింది బడుగు జీవులయిన కూలీ జర్నలిస్టులే.)

ఇక పిట్టకత నుంచి కట్టుకతకొద్దాం.
రాధాకృష్ణ తాజా చిలకపలుకులకు మూలం- సాక్షి పత్రిక, టివిలను నడుపుతున్న జగతి, జనని, ఇందిరా టెలివిజన్ సంస్థలను సిబిఐ ఫ్రీజ్ చేయడం అన్యాయమని జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు, ఇందుకు సంఘీభావం తెలిపిన ఇంకొంతమంది కలిసి తీసిన ఊరేగింపు. దీన్నే రాధాకృష్ణ తప్పుపట్టాడు. కారణం- సాక్షి అకౌంట్లను ఫ్రీజ్ చేయడం పత్రికా స్వేచ్ఛపైన దాడి కాదు. ఇదీ ఆర్కే వాదన. కాసేపు దీన్ని పక్కనపెడదాం.
సాక్షి మీడియా సంస్థలను నడుపుతున్న అకౌంట్లు సిబిఐ రాత్రికి రాత్రే ఫ్రీజ్ చేసింది. ఆ సంస్థలకు ఎలాంటి  ముందుస్తు నోటీసులు ఇవ్వకుండా ఇలా చేసింది. సాక్షి అకౌంట్లు వున్న ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లకు సిబిఐ లేఖా రూపంలో ఈ హుకుం జారీచేసింది. అంతే కాదు అదే లేఖలో ఆయా అకౌంట్లలో ఎంత మొత్తం వుంది తెలియజేస్తూ ఎలాంటి లావాదేవీలు లేకుండా తక్షణం వాటిని ఫ్రీజ్ చేయాలని కోరింది. ఆయా బ్యాంకులు సహజ భయంతో ఆగమేఘాలపైన అకౌంట్లను ఫ్రీజ్ చేశాయి. సాక్షి గ్రూప్ లో ఆ యాజమాన్యం చెప్పుకున్నట్టు పరోక్షంగా, ప్రత్యక్షంగా దాదాపు 60 వేల మంది సిబ్బంది వున్నారు. అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయన్న తక్షణం చాలా మంది సాక్షి సిబ్బంది ప్యానిక్ అయిపోయి తమ తమ అకౌంట్లలో వున్న జీతం సొమ్మును డ్రాచేసుకునేందుకు క్యూలు కట్టారు. యాజమాన్యానికి సంబంధించిన అకౌంట్లు మూసివేస్తే తమ సాలరీ అకౌంట్లకు వచ్చిన ఢోకా ఏమీ లేదని తెలియని అమాయకులైన జర్నలిస్టులేమీ కాదు వీరు. దాదాపు 10-20 సంవత్సరాల జర్నలిస్టు అనుభవం వున్న సీనియర్లు వీళ్ళంతా. అయినా బతుకు భయం, అభద్రత, జీతం మీద మాత్రమే ఆధార పడిన జీవితాలు, కుటుంబాలు వున్న సీనియర్ జర్నలిస్టులు కూడా వీళ్లు. తమ తెలివి ఎంత వారించినా ఎలాంటి చాన్స్ తీసుకోలేకే అలా చేసామని నాతో పలువురు సీనియర్లు చెప్పినప్పుడు నిజంగా కళ్ళలో సుళ్లు తిరిగాయి.
మరి తమకు జీతాలిచ్చే యాజమాన్యం అకౌంట్లను ఫ్రీజ్ చేస్తే ఆందోళన చెందడం, నిరసన తెలపడం, యాజమాన్యం పక్షాన నిలబడడం తప్పెలా అవుతుంది? ఆంధ్రజ్యోతి పత్రికో, ఛానలో ఇదే స్థితిలో వుంటే రాధాకృష్ణ తన సిబ్బంది నుంచి ఇదే కదా కోరుకుంటాడు. ఇప్పుడు నటన ఎందుకు? నిరసనకు దిగిన జర్నలిస్టులను చూసి ఎద్దేవా ఎందుకు?
ఇక సాక్షి అకౌంట్లు ఫ్రీజ్ చేయడం పత్రికా స్వేచ్ఛ పై దాడి అవునా ? కాదా? అన్న విషయానికి వద్దాం.
సిబిఐ ఆరోపణ ప్రకారం, ఆంధ్రజ్యోతి రోజూ అచ్చోసే అద్భుతమైన ఇన్ వెస్టిగేటివ్ విశ్లేషణాత్మక టాబ్లాయిడ్ బ్యానర్ ఐటమ్స్ ప్రకారం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నడుపుతున్న 67 కంపెనీలలో మూడు చిన్న కంపెనీలే జగతి, జనని, ఇందిరా టెలివిజన్. జగన్ చెబుతున్నట్టు తన ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనే రాజకీయ దురుద్దేశంతోనో, లేక సిబిఐ చెబుతున్నట్టు అనైతిక మార్గాల్లో కూడుకున్న పెట్టుబడులను నిలవరించడం కోసమో ఈ దాడులు, అకౌంట్ల ఫ్రీజ్ లు జరిగాయి. ఇదంతా సిబిఐకి, జగన్ కూ మధ్య, లేదా జగన్ చెబుతున్నట్టు అతనికీ, సోనియాకు మధ్య జరుగుతున్న గొడవే అనుకుందాం.
మరి జర్నలిస్టులు ఏం చేశారు? దాడులు ఎందుకు మీడియా సంస్థలపైనే జరుగుతున్నాయి? అకౌంట్ల ఫ్రీజ్ ఎందుకు మీడియా కంపెనీలపైనే జరిగింది? మిగతా కంపెనీల వల్ల జగన్ కు మహా అయితే ఆర్థిక లాభాలో, నష్టాలో వుంటాయి. అదే మీడియా సంస్థల వల్ల (ఆర్థిక నష్టాలున్నా సరే) ఎన్నికల సమయంలో ఎలాంటి లాభాలుంటాయో రాధాకృష్ణ కన్నా, ఆ మాటకొస్తే వై ఎస్ జగన్ కన్నా సోనియాకే అంటే  సిబిఐకే బాగా తెలుసు. అందుకే మొదటి అటాక్ మీడియా సంస్థలపైనే. అసలు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 102 ప్రకారం సిబిఐకి వున్న విచక్షణాధికారాలను ఇక్కడ వినియోగించుకోవడం కన్నా దుర్వినియోగమే చేసిందనేది నా ప్రగాఢ విశ్లేషణ. అయినా అదంతా కోర్టు చూసుకోవాల్సిన వ్యవహారం. మన మేధో విశ్లేషణలు చెల్లవు కాబట్టి ఆ మధనం అనవసరం.
ఇక సిబిఐ దృష్టిలోంచి చూసి ఇది కేవలం వైఎస్ జగన్ పై అటాక్ అని మాత్రమే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇక్కడ యజమాని ఎవరన్నది కేవలం సాంకేతిక విషయమే. అందుకే యజమానితో సంబంధం లేకుండా మీడియా పై దీన్ని సిబిఐ ధమ్కీ అనే అనుకోవాలి. అంటే పరోక్షంగా కేంద్ర ప్రభుత్వం మీడియాకు ఇచ్చిన ధమ్కీగానే అర్థం చేసుకోవాలి. రాత్రికి రాత్రే సాక్షి పత్రికకు వ్యాపార ప్రకటనలు ఆపేయడం కూడా తొందర పాటు చర్యే కాదు, ముమ్మాటికీ ఫోర్త్ ఎస్టేట్ ను కూల్చే చర్యే. ఇదంతా ఈ ప్రభుత్వానికీ - వై ఎస్ జగన్ కూ మధ్య వున్న తగవు అని ఎవరైనా అర్థం చేసుకుంటే ఆ జర్నలిస్టులంతా నాదృష్టిలో అమ్ముడిపోయినట్టే. అడ్వర్టయిజ్ మెంట్లను ఆపడం కచ్చితంగా మీడియాపై దాడే. పత్రికా స్వేచ్ఛను హరించడమే. జర్నలిస్టుల్లో అభద్రతను పెంచడమే. కలాలపై దాడి చేయడమే. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ప్రాథమిక హక్కులకు తూట్లు పొడవడమే. ఇది యాజమాన్యాల, వారి పెట్టుబడుల గొడవగా చూసి ఒడ్డుకు కూర్చునే జర్నలిస్టులు ముమ్మాటికీ ఆయా యాజమాన్యాల ముద్దుల పెంపుడు జంతువులే.
(పై వాక్యంలోని జర్నలిస్టులు అన్న జాబితాలో 'తగదునమ్మా' అంటూ చేరిపోయిన వేమూరి రాధాకృష్ణ లాంటి వారిని కూడా విశాల హృదయంతో అకామిడేట్ చేస్తూ.)
(ఇక సిబిఐ కేంద్ర ప్రభుత్వ తోక సంస్థ అని వేరే చెప్పక్కరర్లేదు. దానికి ఎలాంటి స్వయం ప్రతిపత్తి లేదు. కేంద్రం ఆదేశిస్తే తప్ప ఎటూ అడుగు కూడా కదపలేని తోలు బొమ్మ విచారణ సంస్థ సిబిఐ.)

నయా ముల్లా జియాదా ప్యాస్ ఖాతా హై
ఆదిత్య అనబడు వేమూరి రాధాకృష్ణ ఇప్పుడు ఆదర్శ జర్నలిస్టు అభినయానికి దిగాడు. అతను సందట్లో సడేమియా అంటూ పోషించాలనుకుంటున్నది అలాంటి ఇలాంటి పాత్ర కాదు. అచ్చం జర్నలిస్టులాగే అత్యంత సహజంగా జీవించేందుకు రాధాకృష్ణ చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా ముచ్చటేసే విషయమే. అయితే ఇప్పుడు జర్నలిస్టు పాత్ర పోషిస్తూ సాక్షి జర్నలిస్టుల ఆత్మగౌరవాన్నే దెబ్బతీసేందుకు ఒక కొత్త లాజిక్ లాగుతున్నాడు. ఒక పత్రిక లేదా టివి చానల్ కు పెట్టుబడి ఎక్కడినుంచి వస్తుంది? దాని మంచి చెడులేమిటి? అని తెలిసి ఆయా పత్రికల్లో, టివీల్లో చేరాలని జర్నలిస్టులకు గీతోపదేశం చేశారు వేమూరి వారు. నిజంగా ప్రపంచంలో ఎక్కడైనా కార్మికులకు యజమానులను ఎంచుకునే అవకాశం వుంటుందా? వారి పెట్టుబడుల మూలాలను ప్రశ్నించిన తర్వాతే ఉద్యోగంలో చేరేంత సీన్ వుంటుందా? కథలు చెప్పడం అంటే ఇదే మరి! 
అందుకే ఆదిత్యకు ఈ విషయం మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. సాక్షిలో పనిచేస్తున్న జర్నలిస్టులు కేవలం జీతం తీసుకునే కార్మికులే. ఆ యజమాని అక్రమ డబ్బులు పెట్టుబడిగా పెట్టినా, పవిత్ర పెట్టుబడులు పోగేసినా అప్పనంగా తిలాపాపం తలాపిడికెడు కూడా తీసుకునేందుకు ఏ మాత్రం అర్హత లేని కేవల కూలీలే అందులోని జర్నలిస్టులు.  ఇక సాక్షి పెట్టుబడుల మూలాలు, మంచి చెడ్డల గురించి అక్కసుతో మాట్లాడటం ఆపి కోర్టు మీద గౌరవం వుంచడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఆ విషయం తేల్చాల్సింది ఒక్క కోర్టు మాత్రమే.
విచిత్రమేమిటంటే ఆంధ్రజ్యోతిలో సిబ్బంది కూడా జీతాలే తీసుకుంటున్నారు.  కానీ వాళ్ళంతా వాటాలు తీసుకుంటున్నారన్నంత బిల్డప్ ఇస్తున్నారు వేమూరి వారు. ఆ జర్నలిస్టులు కూడా రాధాకృష్ణ పెట్టుబడులలో తిలాపాపం తలా పిడికెడు కూడా తీసుకునే హక్కు లేని కేవల కూలీలే. అయితే తన కుతర్కంతో ఇప్పడు జర్నలిస్టులను ముచ్చటగా మూడోసారి చీల్చేందుకు జర్నలిస్టు ముసుగునే తొడుక్కున్న ఆత్మవంచనాపరుడు, కుహనా పెట్టుబడిదారుడు రాధాకృష్ణ.  ఇప్పటికే రెండు సార్లు జర్నలిస్టులు చీల్చబడ్డారు. ఆయా పత్రికలు, టీవీలు కొమ్ముకాసే ఆయా పార్టీల కార్యకర్తలుగా,  ఆయా యూనియన్లు కొమ్ముకాసే పార్టీలకు బాకాలుగా ఇప్పటికే జర్నలిస్టులు రెండుసార్లు చీలిపోతే, ఇప్పుడు పత్రికలకు, పత్రికలకు మధ్యా, టివీకీ, టివీకీ మధ్య కూడా జర్నలిస్టుల్లో విభేదాలు సృష్టించేందుకు చాలా తెలివిగా కుట్ర పన్నుతున్నాడు వేమూరి ఆదిత్య.  రాధాకృష్ణ దుర్బుద్ధిని, చాణక్య నీతినీ తిప్పి కొట్టాల్సిన లేదా చావ కొట్టాల్సిన బాధ్యత ఈ సమాజపు దృక్పథాలను ప్రభావితం చేయగల బడుగు జర్నలిస్టులపైనే వుంది.  వైఎస్ జగన్ తో తేల్చుకోలేక తుమ్మితే ఊడిపోయే జర్నలిస్టులను అడ్డం పెట్టుకుంటున్న వేమూరి రాధాకృష్ణ ఒక తప్పుడు జర్నలిస్టే కాదు అత్యంత ప్రమాదకరమైన యజమాని కూడా.
ఇక జర్నలిస్ట్ నాయకులు దేవులపల్లి అమర్,  కె.శ్రీనివాసరెడ్డి గురించి వేమూరి మాట్లాడిన అవాకులు చెవాలకులను తిప్పికొట్టగల, చితక్కొట్టగల సమర్థత ఆ ఇద్దరు యూనియన్ లీడర్లకు వుంది కాబట్టి వారి మీద వేసిన నిందల జోలికి నేను వెళ్ళడం లేదు. ఒక బీట్ రిపోర్టర్ నుంచి ఎండి స్థాయికి వేమూరి రాధాకృష్ణ ఎదిగిన ప్రయాణంలో కాలం అతనికి ఒక ప్రధానమైన దశను నిరాకరించింది. అదే జర్నలిస్టు దశ. ఆ దశ రాకుండానే వేమూరి దశ తిరిగడం జర్నలింజం చేసుకున్న దురదృష్టం.

-అనంతు