Monday, May 14, 2012

ఏది అక్షరం? ఏది ఆయుధం?


పెట్టుబడికి అభిప్రాయాలుండవు. ప్రయోజనాలు మాత్రమే వుంటాయి. అవి మారినప్పుడల్లా అభిప్రాయాలు వాటంతటకవే మారిపోతుంటాయి ఆయా పత్రికలవీ, టివీలవి- పురాతన మీడియా సామెత

సాక్షి పత్రిక ప్రారంభం రాష్ట్రంలో దిన పత్రికల మార్కెట్ నే కాదు, ఒక వర్గం కొమ్ము కాస్తున్న ఏక శిలా (కులా) మీడియా ను కూడా చీల్చింది. ఇప్పుడు దిన పత్రికల 'పాలసీ' ఇదివరకటి సత్తెకాలంలోలాగా ముసుగులో లేదు. బాహాటంగానే తమ లైన్ ప్రకటించిన ప్రధాన స్రవంతి పార్టీలలాగే ఇక్కడి మీడియా సంస్థలూ వ్యవహరిస్తున్నాయి. చాలా కాలం వరకు ఒక కులమే గుత్తాధిపత్యంగా తమ చెప్పుల్లో, చేతల్లో మీడియాను పెట్టుకుంటూ వచ్చిందనేది తిరుగులేని సత్యం.
(అయితే కులం అని అనకుండా కొత్త మేలి ముసుగు వేసి చెలామణి చేస్తున్న ఈ "సామాజిక వర్గం" అన్న పదబంధం పుట్టుక 90 లనాటి ఆయా పత్రికల ఆస్థాన పండితుల సృష్టే. ఒక కులం నొచ్చుకోకుండా, పచ్చిగా కనిపించకుండా కొంత సౌకుమారతను అభినయించడం మొదలైంది సరిగ్గా ఈ నేలలో దళిత ఉద్యమం ఉధృతం దాలుస్తున్నప్పుడే కావడం కొసమెరుపు.)
ఈ కులమే కమ్మ కులం. ఇది ఏ సర్వేనో చేసి రుజువు చేయాల్సిన సత్యం కాదు. సర్వజనులకు తెలిసిన సత్యం. సాక్షి పత్రిక వచ్చిన తర్వాత ఈ కులం గుత్తాధిపత్యం రాత్రికి రాత్రే ప్రశ్నించబడింది. ప్రతి పెట్టుబడి వెనుకా కులం బలం మాత్రమే వుంటుంది. ఆ పెట్టుబడికి ఏకైక ప్రయోజనం ఆ కుల ప్రగతి మాత్రమే కాకపోవచ్చు కానీ అంతిమ ప్రయోజనం మాత్రం అదే. ఇప్పుడు నడుస్తున్నది మీడియా వార్ కాదు. పెట్టుబడుల వార్. కులాల ఆధిపత్యాల మధ్యా, లేదా ఆ ఆధిపత్యాలను ప్రశ్నించిన ఇంకో కులం ప్రయోజనాలకు మధ్య జరుగుతన్న యుద్దం. ఈ పత్రికల, టివిల యజమానులే కాదు రూపర్ట్ మర్డోక్ కూడా ఇదే యుద్ధాన్ని అధికారం కోసమో, తాను నమ్మిన అభిప్రాయాలనే వాస్తవాలుగా ఉత్పత్తి చేయడం  కోసమే అభినయించాలి.
పెట్టుబడి ఎలా ప్రవర్తిస్తుంది, అది అదనపు విలువను సృష్టించేందుకు కనీస విలువలను కూడా ఎలా చాకచక్యంగా తుంగలో తొక్కుతుంది అన్న విషయాలను నేను ఇక్కడ చర్చించను. కావాలంటే సాయంత్రం పూట ఓ అరగంట కామ్రేడ్ కార్ల్ మార్క్స్ తో క్లాస్ ఇప్పిస్తా.
పెట్టుబడులకు లాభాల పేరుతో మరింత పెట్టుబడిని పోగేసుకునే ఏకైక లక్ష్యం మాత్రమే వుండదు. ఒక వేళ వున్నా ఆ లక్ష్యం మీడియా గ్రూపులను నడపడం ద్వారా దొబ్బదు. అందుకే మీడియాలో డబ్బులు పెట్టే వేమూరి రాధాకృష్ణ లాంటి వారు కేవలం ఆర్థిక సంతృప్తి  సాధించడమే తమ లక్ష్యంగా పెట్టుకోరు. ఆత్మ సంతృప్తి సాధించడం అన్న స్వాంతన కార్యక్రమాన్ని తమ స్ర్కీన్ సేవర్లుగా చెలామణీ చేసుకుని నిస్సిగ్గుగా జర్నలిజాన్ని వాడుకునేందుకు వెనకంజవేయరు. ఇందుకు ప్రపంచంలో ఏ ప్రధాన స్రవంతి పత్రికా మినహాయింపు కాదు. ఎందుకంటే మీడియా ముమ్మాటికీ ఒక బిజినెస్సే, జర్నలిస్టులు జీతం తీసుకునే కార్మికులే.
ఈనాడు పత్రిక, టివిల పెట్టుబడిదారుడు రామోజీరావుకు, సాక్షి పెట్టుబడిదారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ , యజమానిగా, జర్నలిస్టుగా సమయానికి తగువిధంగా అభినయించే వేమూరి రాధాకృష్ణకు తమ తమ ప్రయోజనాలున్నాయి తమ మీడియా బిజినెస్ లలో. ఈ విషయం చెప్పడానికి ఏ విశ్లేషకుడు, నిపుణుడు అవసరం లేదు. ఈ పత్రికలను, టివిలను రోజూ వార్తల కోసం కాక వ్యాఖ్యానాలకోసం చదువుతున్న, చూస్తున్న కోట్లాది రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. వాటిని ఆయా పత్రికల్లో రోజూ రాస్తున్న జర్నలిస్టులకూ తెలుసు.
ఇప్పుడు గొడవ వేమూరి రాధాకృష్ణది. తనపై గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కక్ష సాధించాడని 'సాక్షాధారాల' తో సహా ఇప్పుడు చెబుతున్న రాధాకృష్ణదే అసలు గొడవ. తన పత్రిక సంకట స్థితిలో వున్నప్పుడు కొన్ని జర్నలిస్టు సంఘాలు సంఘీభావం తెలపనందుకు వారితోనూ గొడవ. అసలు గొడవలు ఇవైతే అక్కసు మాత్రం జర్నలిస్టులపైన వెళ్ళగక్కుతున్నాడు ఆదిత్య అలియాస్ ఆర్ కె ఉరఫ్ వేమూరి రాధాకృష్ణ తన తాజా చెత్త పలుకులో.
హజార్ చువ్వే ఖాకే బిల్లీ హజ్ జాతా హై
యాజమాన్యానికీ, సిబ్బందికీ మధ్య వున్న గీత చెరిపేసి జీతం కోసం పని చేసి పొట్టపోసుకునే జర్నలిస్టులను తన వాదనకోసం యాజమాన్యం తొత్తులనే సాహసం చేసాడు రిపోర్టర్ టర్నడ్ ఎండి రాధాకృష్ణ తన  తాజా కాలం కం ఎడిటోరియల్ లో. 
సెక్రటేరియట్ రిపోర్టర్ గా తన జర్నలిస్టు ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రాధాకృష్ణ గురించి మీడియా ఎంట్రీ గురించి ఒక పిట్ట కథ జర్నలిస్టు సర్కిల్స్ లోనే ప్రచారంలో వుంది.
ఆటవిడుపుకోసం ఆ పిట్టకత ఇప్పుడు మీ కోసం ప్రత్యేకం.
అనగనగా  ఎస్సై కావాలనుకున్న వేమూరి రాధాకృష్ణ. సక్రమంగా కుదరక సెక్రటేరియట్ లోని ఒక అవినీతి జర్నలిస్ట్ ను సంప్రదించగా అతను అక్షరాలా 24 వేల రూపాయలకు సదరు పోస్ట్ అమ్మే విధంగా(ఇప్పించే విధంగా) ఆఫర్ ఇచ్చాడు ఆ బ్రదర్. ప్రయాణ ఖర్చులు సహా పాతిక వేలు తల తాకట్టు పెట్టి సదరు జర్నలిస్టు మిత్రునికి ఇచ్చి ఎస్సై కలలు కన్నాడట విఆర్కే. అలా నెలలు గడుస్తున్నా వర్కవుట్ అవ్వకపోయేసరికి తన కన్నా పవర్ ఫుల్ అయిన ఆ జర్నలిస్ట్ మిత్రుడిపై కోపం పెంచుకున్నాడట. అయితే అతనిపై పెంచుకోవాల్సింది కోపం కాదు మోహం అని తెలుసుకున్న రాధాకష్ణ తన ఎస్సై కలకు గుడ్ బై చెప్పి జర్నలిస్ట్ అయిపోయాడట.
ఎలా వుంది ఆర్కే మీడియా ఎంట్రీ. అదరహో!
( ఆ నాటి నుంచి ఈ పద్ధతిలో జర్నలిస్టులైపోయిన వారే జర్నలిజం అంతు చూశారు ఆ తర్వాతి కాలంలో అదీ అనతి కాలంలోనే. వీళ్ళ వల్లే ఒక వర్గం జర్నలిస్టులు పెంపుడు జంతువులుగా, మరో వర్గం జర్నలిస్టులు పార్టీ కార్యకర్తలుగా మారిపోయారు. ఇక మిగిలింది బడుగు జీవులయిన కూలీ జర్నలిస్టులే.)

ఇక పిట్టకత నుంచి కట్టుకతకొద్దాం.
రాధాకృష్ణ తాజా చిలకపలుకులకు మూలం- సాక్షి పత్రిక, టివిలను నడుపుతున్న జగతి, జనని, ఇందిరా టెలివిజన్ సంస్థలను సిబిఐ ఫ్రీజ్ చేయడం అన్యాయమని జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు, ఇందుకు సంఘీభావం తెలిపిన ఇంకొంతమంది కలిసి తీసిన ఊరేగింపు. దీన్నే రాధాకృష్ణ తప్పుపట్టాడు. కారణం- సాక్షి అకౌంట్లను ఫ్రీజ్ చేయడం పత్రికా స్వేచ్ఛపైన దాడి కాదు. ఇదీ ఆర్కే వాదన. కాసేపు దీన్ని పక్కనపెడదాం.
సాక్షి మీడియా సంస్థలను నడుపుతున్న అకౌంట్లు సిబిఐ రాత్రికి రాత్రే ఫ్రీజ్ చేసింది. ఆ సంస్థలకు ఎలాంటి  ముందుస్తు నోటీసులు ఇవ్వకుండా ఇలా చేసింది. సాక్షి అకౌంట్లు వున్న ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లకు సిబిఐ లేఖా రూపంలో ఈ హుకుం జారీచేసింది. అంతే కాదు అదే లేఖలో ఆయా అకౌంట్లలో ఎంత మొత్తం వుంది తెలియజేస్తూ ఎలాంటి లావాదేవీలు లేకుండా తక్షణం వాటిని ఫ్రీజ్ చేయాలని కోరింది. ఆయా బ్యాంకులు సహజ భయంతో ఆగమేఘాలపైన అకౌంట్లను ఫ్రీజ్ చేశాయి. సాక్షి గ్రూప్ లో ఆ యాజమాన్యం చెప్పుకున్నట్టు పరోక్షంగా, ప్రత్యక్షంగా దాదాపు 60 వేల మంది సిబ్బంది వున్నారు. అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయన్న తక్షణం చాలా మంది సాక్షి సిబ్బంది ప్యానిక్ అయిపోయి తమ తమ అకౌంట్లలో వున్న జీతం సొమ్మును డ్రాచేసుకునేందుకు క్యూలు కట్టారు. యాజమాన్యానికి సంబంధించిన అకౌంట్లు మూసివేస్తే తమ సాలరీ అకౌంట్లకు వచ్చిన ఢోకా ఏమీ లేదని తెలియని అమాయకులైన జర్నలిస్టులేమీ కాదు వీరు. దాదాపు 10-20 సంవత్సరాల జర్నలిస్టు అనుభవం వున్న సీనియర్లు వీళ్ళంతా. అయినా బతుకు భయం, అభద్రత, జీతం మీద మాత్రమే ఆధార పడిన జీవితాలు, కుటుంబాలు వున్న సీనియర్ జర్నలిస్టులు కూడా వీళ్లు. తమ తెలివి ఎంత వారించినా ఎలాంటి చాన్స్ తీసుకోలేకే అలా చేసామని నాతో పలువురు సీనియర్లు చెప్పినప్పుడు నిజంగా కళ్ళలో సుళ్లు తిరిగాయి.
మరి తమకు జీతాలిచ్చే యాజమాన్యం అకౌంట్లను ఫ్రీజ్ చేస్తే ఆందోళన చెందడం, నిరసన తెలపడం, యాజమాన్యం పక్షాన నిలబడడం తప్పెలా అవుతుంది? ఆంధ్రజ్యోతి పత్రికో, ఛానలో ఇదే స్థితిలో వుంటే రాధాకృష్ణ తన సిబ్బంది నుంచి ఇదే కదా కోరుకుంటాడు. ఇప్పుడు నటన ఎందుకు? నిరసనకు దిగిన జర్నలిస్టులను చూసి ఎద్దేవా ఎందుకు?
ఇక సాక్షి అకౌంట్లు ఫ్రీజ్ చేయడం పత్రికా స్వేచ్ఛ పై దాడి అవునా ? కాదా? అన్న విషయానికి వద్దాం.
సిబిఐ ఆరోపణ ప్రకారం, ఆంధ్రజ్యోతి రోజూ అచ్చోసే అద్భుతమైన ఇన్ వెస్టిగేటివ్ విశ్లేషణాత్మక టాబ్లాయిడ్ బ్యానర్ ఐటమ్స్ ప్రకారం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నడుపుతున్న 67 కంపెనీలలో మూడు చిన్న కంపెనీలే జగతి, జనని, ఇందిరా టెలివిజన్. జగన్ చెబుతున్నట్టు తన ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనే రాజకీయ దురుద్దేశంతోనో, లేక సిబిఐ చెబుతున్నట్టు అనైతిక మార్గాల్లో కూడుకున్న పెట్టుబడులను నిలవరించడం కోసమో ఈ దాడులు, అకౌంట్ల ఫ్రీజ్ లు జరిగాయి. ఇదంతా సిబిఐకి, జగన్ కూ మధ్య, లేదా జగన్ చెబుతున్నట్టు అతనికీ, సోనియాకు మధ్య జరుగుతున్న గొడవే అనుకుందాం.
మరి జర్నలిస్టులు ఏం చేశారు? దాడులు ఎందుకు మీడియా సంస్థలపైనే జరుగుతున్నాయి? అకౌంట్ల ఫ్రీజ్ ఎందుకు మీడియా కంపెనీలపైనే జరిగింది? మిగతా కంపెనీల వల్ల జగన్ కు మహా అయితే ఆర్థిక లాభాలో, నష్టాలో వుంటాయి. అదే మీడియా సంస్థల వల్ల (ఆర్థిక నష్టాలున్నా సరే) ఎన్నికల సమయంలో ఎలాంటి లాభాలుంటాయో రాధాకృష్ణ కన్నా, ఆ మాటకొస్తే వై ఎస్ జగన్ కన్నా సోనియాకే అంటే  సిబిఐకే బాగా తెలుసు. అందుకే మొదటి అటాక్ మీడియా సంస్థలపైనే. అసలు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 102 ప్రకారం సిబిఐకి వున్న విచక్షణాధికారాలను ఇక్కడ వినియోగించుకోవడం కన్నా దుర్వినియోగమే చేసిందనేది నా ప్రగాఢ విశ్లేషణ. అయినా అదంతా కోర్టు చూసుకోవాల్సిన వ్యవహారం. మన మేధో విశ్లేషణలు చెల్లవు కాబట్టి ఆ మధనం అనవసరం.
ఇక సిబిఐ దృష్టిలోంచి చూసి ఇది కేవలం వైఎస్ జగన్ పై అటాక్ అని మాత్రమే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇక్కడ యజమాని ఎవరన్నది కేవలం సాంకేతిక విషయమే. అందుకే యజమానితో సంబంధం లేకుండా మీడియా పై దీన్ని సిబిఐ ధమ్కీ అనే అనుకోవాలి. అంటే పరోక్షంగా కేంద్ర ప్రభుత్వం మీడియాకు ఇచ్చిన ధమ్కీగానే అర్థం చేసుకోవాలి. రాత్రికి రాత్రే సాక్షి పత్రికకు వ్యాపార ప్రకటనలు ఆపేయడం కూడా తొందర పాటు చర్యే కాదు, ముమ్మాటికీ ఫోర్త్ ఎస్టేట్ ను కూల్చే చర్యే. ఇదంతా ఈ ప్రభుత్వానికీ - వై ఎస్ జగన్ కూ మధ్య వున్న తగవు అని ఎవరైనా అర్థం చేసుకుంటే ఆ జర్నలిస్టులంతా నాదృష్టిలో అమ్ముడిపోయినట్టే. అడ్వర్టయిజ్ మెంట్లను ఆపడం కచ్చితంగా మీడియాపై దాడే. పత్రికా స్వేచ్ఛను హరించడమే. జర్నలిస్టుల్లో అభద్రతను పెంచడమే. కలాలపై దాడి చేయడమే. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ప్రాథమిక హక్కులకు తూట్లు పొడవడమే. ఇది యాజమాన్యాల, వారి పెట్టుబడుల గొడవగా చూసి ఒడ్డుకు కూర్చునే జర్నలిస్టులు ముమ్మాటికీ ఆయా యాజమాన్యాల ముద్దుల పెంపుడు జంతువులే.
(పై వాక్యంలోని జర్నలిస్టులు అన్న జాబితాలో 'తగదునమ్మా' అంటూ చేరిపోయిన వేమూరి రాధాకృష్ణ లాంటి వారిని కూడా విశాల హృదయంతో అకామిడేట్ చేస్తూ.)
(ఇక సిబిఐ కేంద్ర ప్రభుత్వ తోక సంస్థ అని వేరే చెప్పక్కరర్లేదు. దానికి ఎలాంటి స్వయం ప్రతిపత్తి లేదు. కేంద్రం ఆదేశిస్తే తప్ప ఎటూ అడుగు కూడా కదపలేని తోలు బొమ్మ విచారణ సంస్థ సిబిఐ.)

నయా ముల్లా జియాదా ప్యాస్ ఖాతా హై
ఆదిత్య అనబడు వేమూరి రాధాకృష్ణ ఇప్పుడు ఆదర్శ జర్నలిస్టు అభినయానికి దిగాడు. అతను సందట్లో సడేమియా అంటూ పోషించాలనుకుంటున్నది అలాంటి ఇలాంటి పాత్ర కాదు. అచ్చం జర్నలిస్టులాగే అత్యంత సహజంగా జీవించేందుకు రాధాకృష్ణ చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా ముచ్చటేసే విషయమే. అయితే ఇప్పుడు జర్నలిస్టు పాత్ర పోషిస్తూ సాక్షి జర్నలిస్టుల ఆత్మగౌరవాన్నే దెబ్బతీసేందుకు ఒక కొత్త లాజిక్ లాగుతున్నాడు. ఒక పత్రిక లేదా టివి చానల్ కు పెట్టుబడి ఎక్కడినుంచి వస్తుంది? దాని మంచి చెడులేమిటి? అని తెలిసి ఆయా పత్రికల్లో, టివీల్లో చేరాలని జర్నలిస్టులకు గీతోపదేశం చేశారు వేమూరి వారు. నిజంగా ప్రపంచంలో ఎక్కడైనా కార్మికులకు యజమానులను ఎంచుకునే అవకాశం వుంటుందా? వారి పెట్టుబడుల మూలాలను ప్రశ్నించిన తర్వాతే ఉద్యోగంలో చేరేంత సీన్ వుంటుందా? కథలు చెప్పడం అంటే ఇదే మరి! 
అందుకే ఆదిత్యకు ఈ విషయం మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. సాక్షిలో పనిచేస్తున్న జర్నలిస్టులు కేవలం జీతం తీసుకునే కార్మికులే. ఆ యజమాని అక్రమ డబ్బులు పెట్టుబడిగా పెట్టినా, పవిత్ర పెట్టుబడులు పోగేసినా అప్పనంగా తిలాపాపం తలాపిడికెడు కూడా తీసుకునేందుకు ఏ మాత్రం అర్హత లేని కేవల కూలీలే అందులోని జర్నలిస్టులు.  ఇక సాక్షి పెట్టుబడుల మూలాలు, మంచి చెడ్డల గురించి అక్కసుతో మాట్లాడటం ఆపి కోర్టు మీద గౌరవం వుంచడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఆ విషయం తేల్చాల్సింది ఒక్క కోర్టు మాత్రమే.
విచిత్రమేమిటంటే ఆంధ్రజ్యోతిలో సిబ్బంది కూడా జీతాలే తీసుకుంటున్నారు.  కానీ వాళ్ళంతా వాటాలు తీసుకుంటున్నారన్నంత బిల్డప్ ఇస్తున్నారు వేమూరి వారు. ఆ జర్నలిస్టులు కూడా రాధాకృష్ణ పెట్టుబడులలో తిలాపాపం తలా పిడికెడు కూడా తీసుకునే హక్కు లేని కేవల కూలీలే. అయితే తన కుతర్కంతో ఇప్పడు జర్నలిస్టులను ముచ్చటగా మూడోసారి చీల్చేందుకు జర్నలిస్టు ముసుగునే తొడుక్కున్న ఆత్మవంచనాపరుడు, కుహనా పెట్టుబడిదారుడు రాధాకృష్ణ.  ఇప్పటికే రెండు సార్లు జర్నలిస్టులు చీల్చబడ్డారు. ఆయా పత్రికలు, టీవీలు కొమ్ముకాసే ఆయా పార్టీల కార్యకర్తలుగా,  ఆయా యూనియన్లు కొమ్ముకాసే పార్టీలకు బాకాలుగా ఇప్పటికే జర్నలిస్టులు రెండుసార్లు చీలిపోతే, ఇప్పుడు పత్రికలకు, పత్రికలకు మధ్యా, టివీకీ, టివీకీ మధ్య కూడా జర్నలిస్టుల్లో విభేదాలు సృష్టించేందుకు చాలా తెలివిగా కుట్ర పన్నుతున్నాడు వేమూరి ఆదిత్య.  రాధాకృష్ణ దుర్బుద్ధిని, చాణక్య నీతినీ తిప్పి కొట్టాల్సిన లేదా చావ కొట్టాల్సిన బాధ్యత ఈ సమాజపు దృక్పథాలను ప్రభావితం చేయగల బడుగు జర్నలిస్టులపైనే వుంది.  వైఎస్ జగన్ తో తేల్చుకోలేక తుమ్మితే ఊడిపోయే జర్నలిస్టులను అడ్డం పెట్టుకుంటున్న వేమూరి రాధాకృష్ణ ఒక తప్పుడు జర్నలిస్టే కాదు అత్యంత ప్రమాదకరమైన యజమాని కూడా.
ఇక జర్నలిస్ట్ నాయకులు దేవులపల్లి అమర్,  కె.శ్రీనివాసరెడ్డి గురించి వేమూరి మాట్లాడిన అవాకులు చెవాలకులను తిప్పికొట్టగల, చితక్కొట్టగల సమర్థత ఆ ఇద్దరు యూనియన్ లీడర్లకు వుంది కాబట్టి వారి మీద వేసిన నిందల జోలికి నేను వెళ్ళడం లేదు. ఒక బీట్ రిపోర్టర్ నుంచి ఎండి స్థాయికి వేమూరి రాధాకృష్ణ ఎదిగిన ప్రయాణంలో కాలం అతనికి ఒక ప్రధానమైన దశను నిరాకరించింది. అదే జర్నలిస్టు దశ. ఆ దశ రాకుండానే వేమూరి దశ తిరిగడం జర్నలింజం చేసుకున్న దురదృష్టం.

-అనంతు

10 comments:

Anonymous said...

బాగుంది మీ విశ్లేషణ సాక్షి జర్నలిస్ట్లు ప్యానిక్ కు గురయిన దానిపై రాశారు . ఆంధ్ర జ్యోతి పత్రిక పై మంద కృష్ణ దాడి చేసినప్పుడు స్వయానా ఆ పత్రిక ఎడిటర్ చెప్పుతో మంద కృష్ణ ఫోటోను కొట్టారు ఈ ఫోటో సాక్షిలో రావడం తో ఎడిటర్ ను అరెస్ట్ చేశారు . ఒక ఎడిటరు అలా ప్రవర్తించినప్పుడు జీతం డబ్బుల మీద బతికే సాధారణ జర్నలిస్టులు ఆ సమయం లో ప్యానిక్ కు గురి కావడం సహజమే. ఆంధ్ర జ్యోతి మూత పడే సమయం లో ఆయన జీతం ఆరేడు వేలు. ఆలాంటి వ్యక్తి జ్యోతి కొని తెరుస్తాననగానే ఉద్యోగం లో చేరారా ? లేక నీకు ఈ డబ్బు ఎలా వచ్చింది చెప్పు అని నిల దిశారా ? రాష్ట్రం లో రెడ్డి కమ్మ మధ్య పోరు సాగుతోంది . రాధ కృష్ణ బతుకు గురించి బాగా తెలిసిన వారు ఆతను చెప్పే నితులకు చిరాకు పడుతున్నారు . మూత పడిన పత్రికను ఎలాగో తీసుకు వచ్చి కొందరికి ఉద్యోగాలు ఇచ్చాడు అందుకు అభినందనలు. ఆ డబ్బు ఎవరిది తెర వెనుక ఎవరు అనేదాని కన్నా కొంత మందికి ఉపాది లభించింది అనే నేను అనుకుంటున్నాను

Anonymous said...

మీ కూపం సమంజశంగనె ఉంది. మీరె అన్నట్టు జౌర్నలిస్ట్ బదులు పత్రికా కార్మికులు గ సరి చెస్తె మీ విస్లెషణ అర్ధవంతం అవుతుంది

Ramana said...

మీ విశ్లేషణ బాగుంది. అది నిజం. ఆదిత్యాది అక్కసు తప్ప మరేమీ కాదు. కోర్టులో ఉన్న కేసుల విషయంలో తమ వ్యాఖ్యానాలు జోడించి అడ్డంగా రాయగల సమర్ధులు ఈ రాష్ట్రంలో ఇద్దరే ఉన్నారు. వారి ఆలోచనలు, అచ్చోసిన అబద్దాలు దేని చుట్టూ తిరుగుతాయో పాత్రికేయ మిత్రులకు ఎరుకే?

Anonymous said...

జ్యోతి, ఈనాడులమీద ఎంత పెంటైనా వేసుకోండి, జగన్ సాక్షిని వెనకేసుకుని రావడం దివాళాకోరుతనం కిందికి వస్తుంది. జర్నలిస్టుల అమాయకత్వం చూసి మీకు కళ్ళలో నీళ్ళుతిరగడం హాస్యాస్పదం. అలాటి వెధవలు జర్నలిస్టులుగా వుండటం కన్నా సినిమాహాళ్ళముందు బ్లాక్ టికెట్లు అమ్ముకోవడం మంచిది.

Anonymous said...

super ga undi brother.....

Anonymous said...

ananthama, adirindi.

kranthi said...

Anna,analysis bagundhi..

ravi said...

Whoever talks about journalist ethics nowadays, it is all humbug. Sakshi employees have every right to protest freezing of accounts. They are not protesting on whether jagan is right or right, they are only fighting that their jobs are protected. That is the truth. And Vemuri cannot blame the employees. I will not go into his background. Mr. Vemuri talks of the side effects of TV in his discussions.... and in the night his channel telecasts all A-songs. What kind of double standard is this? No ethics are involved in Sakshi employees agitation. It all boils down to one single issue.. their livelihood.

Anonymous said...

"జగన్ సాక్షిని వెనకేసుకుని రావడం దివాళాకోరుతనం కిందికి వస్తుంది. జర్నలిస్టుల అమాయకత్వం చూసి మీకు కళ్ళలో నీళ్ళుతిరగడం హాస్యాస్పదం. అలాటి వెధవలు జర్నలిస్టులుగా వుండటం కన్నా సినిమాహాళ్ళముందు బ్లాక్ టికెట్లు అమ్ముకోవడం మంచిది."
well said , funny that these bloody journalists talking about democracy and freedom of speech. no one is ready to believe now that these journalists use media as a tool to advance democracy and human rights. the so called journalists sold themselves to media houses, then why this bullshit cry that their freedom of speech is curtailed instead they should just demand for generous unemployment doles from government. it is dangerous to cry for freedom and want to become freedom fighters - there is huge exodus from villagers for want of livelihood and living- dont clamour over jagans rights it is shame on our democracy and your generation

Unknown said...

అనంత్ గారూ! మీ కసీ, క్రోదం,ఆక్రోశం బావున్నాయి. జర్నలిజం బాగానే వుంది. కాకుంటే ఈ చిన్న చిన్న పొరబాట్లు, ఈ చోటామోటా నీచుల చేతుల్లో లేకుంటే ఇంకా బావుండేది అన్నట్టు రాసారు. కాకుంటే మీ వ్యాసం చదివిన తరువాత నా కర్ధం అయిందేమిటంటే జర్నలిజం ప్రాణాలు ఇంకా వున్నాయి. జస్ట్ వెంటిలేషన్ మీద మాత్రమే వుంది కనుక. హోప్స్ పెట్టుకోవచ్చు అని రాసారు. గుడ్ ఇది కూడా ఒక వాదనే.