Wednesday, May 30, 2012

రాయీ రాయీ కరిగే వేళయింది( revised)

(విజయవాడ సాహితీ మత్రులు భమిడిపాటి జగన్నాథరావు, నవోదయ రామ్మోహనరావు, శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేవ్వరరావు, డాక్టర్ వి. చంద్రశేఖర్ రావు మరి కొందరు మిత్రులు కలిసి "కథ- సమయమూ- సందర్భమూ" పేరుతో ఒక కథా సంకలనం తీసుకువచ్చారు. ఇందులో పది కథలు, వాటి నేపథ్యాలు, ఒక్కో కథపై ఒక్కో ప్రముఖ విమర్శకుడి విశ్లేషణా వున్నాయి. ఈ కథల సంకలనానికి నేను నీహార్ ఆన్ లైన్ డాట్ కామ్ వెబ్ సైట్ కు రాసిని రివ్యూ ఇది. ఇది నా ఇతర రచనల లాగే మిస్ అయిపోతే అప్పటి నీహార్ ఎడిటర్, ఇప్పటికీ మంచి మిత్రురాలు వసంత లక్ష్మి దీన్ని జాగ్రత్తగా భద్రపరిచి నాకు అందచేసింది. అప్పట్లో దీన్ని బుక్ లెట్ గా తెద్దామని కొందరు మిత్రులు ప్రయత్నించి అంతే త్వరగా విరమించుకున్నారు.)

థ- సమయమూ సందర్భమూ సంకలనంలో పల్లె సందుల నుంచి బయలుదేరిన వెతలూ ఉన్నాయి. నగరం సందిగ్ధాల్లోంచి బయటపడాలన్న తపన కతలూ వున్నాయి. వొకరకంగా  వర్తమాన సమయాన్నీ, సందర్భాన్నీ కొంతలో కొంత సమగ్రంగా రెప్రజెంట్ చేస్తున్న సంకలనం ఇది. సామాజికార్థిక రాజకీయ పరిణామ క్రమాల నుంచీ , సమూహం నుంచే కాక మరింత emphasisతో వొంటరి జీవితాల నుంచీ, వాటిల్లో చితికిపోయిన 'నేను' కిటికీల్లోంచీ ఆవిష్కరించే ప్రయత్నం పుష్కలంగా కనిపిస్తుంది ఈ పుస్తకం అంతా, ఆయా కథకులు రాసిన నేపథ్యాలు, విమర్శకులు రాసిన విశ్లేషణల సహా.
ఇన్నాళ్లుగా అపరిచితంగా అనామకంగా మట్టికొట్టుకునిపోయిన సామూహిక సాహసిక కార్యావరణంలో చిక్కి శల్యమైన వ్యక్తుల్లోకీ, వ్యక్తిత్వాల్లోకీ, బయటికీ పయనమవుతున్నారు ఈ కథకులంతా. ఆ చీకటి  గుయ్యారాల్లోకే వెళ్ళి అక్కడి నుంచి కేకవేయాలని ఆ బూడిద వర్ణపు జీవితావిష్కరణలకే నడుంకడుతున్నారు. స్థూలంగా ఇవన్నీ కతలు కతలుగా చెప్పుకున్న నక్సల్బరానంతరమ్ కతలే.
కత, నేపథ్యం, విశ్లేషణల సహితంగా ప్రయోగాత్మకంగా వెలువడిని ఈ సంకలనంలో పట్టుమని పది కతలే వున్నా వొక్కోటి వర్తమాన జీవితపు ఒక్కో పార్శ్వాన్ని సున్నిశితంగా పటాపంచలు చేసి కొత్త పాఠకులను తయారు చేసిపెడుతున్నాయి తెలుగు కథకు.

నూతన ఆర్థిక  విధానాల రూపేణా రుచి చూస్తున్న కొత్త వరల్డ్ ఆర్డర్ లోంచీ, వర్గం అన్న స్తూలాస్థిత్వంలోంచీ బయలుదేరిన మన వివేచనకొడవళ్ళ ప్రశ్నలతో సమ్మెట దెబ్బలు చవిచూసింది. మన సామాజిక రాజకీయ వుద్యమాల మౌలిక భావజాలాలపైనా, సాహితీకళారంగాలలోనా, మానవ సంబంధాల మధ్యనా ఆ కొడవళ్లు, సమ్మెటలూ తళతళ మెరుస్తూనే వేలాడుతున్నాయి. నక్సల్బరీ తరానికి ఈ కొడవలి కోతలూ, సమ్మెట పోటులూ అనుభవంలోకి, జ్ఞానంలోకి వచ్చే చారిత్రక అవకాశం లేదు. దళిత, స్త్రీవాద దృక్కోణాల నుంచి మొదలై మన జాతి సమష్టి జ్ఞాన సంపదనంతా గూటం దెబ్బలతో తవ్వుకుని వినిర్మించుకోవాల్సి రావడం, తాజా అంచనాలతో, అనుమానాలతో, అలజడితో, తృష్ణతో తిరిగి 'చారిత్రక చౌరస్తా'లో నిలబడాల్సి రావడం ఈ తరానికి మాత్రమే అనివార్యమైంది. ఈ కతా రచయితలంతా, వారు కన్న పాత్రలంతా, తయారు చేసుకున్న పాఠకులంతా, ఆవిష్కరిస్తున్న జీవితాలంతా ఈ కొత్త చారిత్రక చౌరస్తాల్లోంచి వుత్పన్నమయినవే కాబట్టి వీటిని అంచనా కట్టేందుకు సాహసించేందుకు వీటి రాజకీయార్థిక సామాజిక నేపథ్యాలతోపాటు ఈ తరమ్ దేహం, గుండె, మెదడు పరిచయమయి వుండటం అనివార్యమయిన అర్హత అనుకుంటున్నాను.
ఈ కతలను అర్థం చేసుకునే ముందు ఈ 'వ్యక్తి' (నేను) నేపథ్యాన్ని అర్థం చేసుకుంటూ, దీన్ని అంచనా కట్టేందుకు కొత్త దేశీ పరకరాలను రూపొందించుకుని మనల్ని మనం పునర్పరిచయం చేసుకోవడం వర్తమాన కథా విమర్శనకు అనివార్యం.
భావజాల రంగంలో దళిత స్త్రీ వుద్యమాలు రేపిన తుపాను భీభత్సానికి దాదాపు సమాంతరంగానే నూతన ఆర్థిక విధానాలు సామాజిక ఆర్థిక రంగాలను అల్లకల్లోలం చేసాయి ఈ నేలలోనా, పైనా. ఈ సంక్షోభ సమయంలోనే, సందర్భంలోనే ఈ తరమూ, ఈ రచయితలూ, వారి పాత్రలూ, పాఠకులూ వాచ్యంగానో, మేధోపరంగానో టీన్స్ నుంచి గ్రోనప్స్ అవుతున్నారు. అందుకే 1980-2000 మద్య వున్న సంక్షుభిత కాలాన్ని , తరాన్ని, సృజననూ బేరీజు వేసే ముందు మనల్ని మనం ఈ కొత్త నేపథ్యంతో జ్ఞానపరచుకోవడం తప్పనిసరి.

సంకలనంలోనే ప్రతి కతకీ నేపథ్యమూ, సమీక్షా వున్నందున చర్విత చరణం కాకుండా విడివిడి కతలకు సంబంధించిన పరిశీలనజోలికి వెళ్ళకుండా వీటిల్లోని వస్తు, శిల్ప, సంవిధాన, కథనాల్లో కతను తీర్చిదిద్దిన(ట్రీట్మెంట్) ధోరణులనూ, ప్రయోగాలనూ, వైచిత్రినీ, నవ్యతనూ, తాత్విక ప్రతిపాదనలనూ మాత్రమే పంచుకునేందుకు పరిమితమవుతున్నాను.

ఈ సంకలనంలో స్థూలంగా రెండు రకాల నేపథ్యాలున్న కతలున్నాయి. పల్లెల నుంచి యెవ్వరికీ చెప్పకుండా గంపెడంత దుఃఖంతో వచ్చి దాహార్తుల్లా చెల్లాచెదురై నగరానికో, మరో దూరానికో విసిరేయబడ్డ యువకుల అంతరాత్మల వెతుకులాటే నేపథ్యమైన కతలు మొదటిరకం. కానగపూలవాన, న్యూ బాంబే టైలర్స్, డాగ్ ఫాదర్, త్రిభుజపు నాలుగో కోణం, దూరానికి దగ్గరగా, నోరుగల్ల ఆడది కతలు ఈ కోవలోకి వస్తాయి.
ఈ రచయితలూ, పాత్రలూ పల్లెల నుంచి ఎగిరిపోబడినవాళ్లు. అవసరానికో, అనివార్యంగానో ఆ మట్టి వీధుల నుంచి , వాసనల నుంచీ, ఉద్వేగపు బంధాల రెక్కలు తెగినా, లేదా ఇంకా  విచ్చుకోకున్నాసరే  'ఎగిరి పోవాలి తప్పదు' అని అనుకుని, అనుకోకుండానే పయనమైన వాళ్లే ఈ రచయితలంతా.

ఈ కతలు రాయడమంటే, చదవడమంటే కేవలం పల్లె జీవితాన్నీ, స్మృతులనూ నెమరు వేసుకోవడం కాదు. గత కాలపు మొహమాటాల్లేకుండా innocence తో వాటిని తిరిగి revisit  చేయడమే.
ఇక ఈ సంకలనంలో వున్న రెండో రకం కతలు- నగరపు ఆమ్ల  మేఘచ్ఛాయల్లోంచి, ఉక్కపోతల్లోంచి, ఉక్కుపోతల్లోంచీ సనసన్నగానైనా, వొకరొక్కరిగానైనా పక్కకు జరిగి ఔట్ సైడర్స్ గా, participant - observersగా నిండు ఊపిరితో, నిబిడీకృతమైన పెను దుఃఖంతో నగరపు జలతారు ముసుగుల్నీ, తెరల్నీ, కోటల్నీ, అంతఃపురాలనీ తీసి, చింపి, పేల్చి, రచ్చకీడుస్తున్న వైనమే నేపథ్యమైన కతలు.
ఇన్ స్టెంట్ లైఫ్, నువ్వు నేను పడమటి ఆకాశం, భారతీయుడు, ఆత్మహత్యల రుతువు కతలు భిన్నంగా, బలంగా ఈ ప్రయత్నం చేసాయి.
80-90 దశకంలో వచ్చిన కతల్లో కొట్టవచ్చినట్టు కనిపించే వొక మార్పు, మలుపు తెలుగు కత తొక్కుతున్న కొత్త పుంతల వల్లే సాధ్యమవుతోంది. సమాజంలో ఆత్మిక, సైద్ధాంతిక, భావజాల, రాజకీయ, ఆర్థిక రంగాలతో పాటు అంతరంగాలలోనూ చోటు చేసుకుంటున్న అనివార్యతే ఈ నవ్యతకు భూమిక; కారణం కూడా.
రెండు ప్రపంచ యుద్ధాల అనంతరం యూరప్ చవిచూసిన విలువల పతనం కన్నా పదునైన, భీభత్సం కన్నా భీకరమైన, విధ్వంసం కన్నా వినాశకరమైన, లోనైన జుగుప్స కన్నా అసహ్యకరమైన గగుర్పాటు, గందరగోళం, అభద్రత, పరాయీకరణ, అస్థిత్వ సంక్షోభం, వ్యక్తి కేంద్రత వర్తమాన భారత సమాజం ఎదుర్కుంటోంది.
రెండు ప్రపంచ యుద్ధాల్లో భౌతిక హింసకు, విచ్ఛిన్నానికి తల్లడిల్లిన ఆ తరమ్ ఆలోచనల్లో రూపుదిద్దుకున్న అబ్జర్డిటీ, ఎక్జిస్టెన్షియలిజం, సర్రియలిజం లాంటి తిరుగుబాటు ధోరణులు అణుబాంబులు వేసుకోవడం కన్నా హీనమైన మానసిక హింసకు లోనవుతున్న ఇక్కడి ఈ తరం ప్రతిఫలనాల్లో కొత్త అర్థంతో తిరిగి రిలవెంట్ అవుతున్నాయి.
ఈ అనిశ్చితత్వంలో కొట్టుమిట్టాడుతున్న ఈ తరమ్ సృజనలో ఈ ధోరణులన్నీ రీవిజిట్ చేస్తున్నాయి. చేయనున్నాయి. ఇందుకు రుజువుగా ఈ సంకలనంలోని వైవిధ్యాన్నే చూపవచ్చు. మరీ ముఖ్యంగా కానగపూల వాన, భారతీయుడు, న్యూ బాంబే టైలర్స్, నువ్వు నేను పడమటి ఆకాశం, ఆత్మహత్యల రుతువు కతల్లోని అభివ్యక్తి ఈ ధోరణుల ప్రతిఫలనాలను పట్టి ఇస్తోంది.
80-90 లలో వస్తున్న కతల్లో కనిపిస్తున్న, బలంగా ముందుకు వస్తున్న మరొక అంశం టెక్నిక్. నవ్యత కోసం పరితపించడం వల్లా, అపూర్వత కోసం ప్రయత్నించడం వల్లా టెక్నిక్ అన్నది సహజంగానే  ముందువరుస తీసుకుంటుంది. రచయితల్లో ఈ టెక్నిక్ స్పృహ పెరిగిన తర్వాత ముందటి కతల్లాగా వర్తమాన కతలు లీనియర్ గా నడవటం చాల అరుదు. ఈ కతా సంకలనంలోని అన్ని కతల్లోనూ టెక్నిక్ కాన్షియస్ నెస్ వేర్వేరు మోతాదుల్లో , తలాల్లో కనిపిస్తుంది.

ఈ సంకలనంలో నోరుగల్ల ఆడది, డాగ్ ఫాదర్, నువ్వు నేను పడమటి ఆకాశం, త్రిభుజానికి నాలుగో కోణం కతలను తీసుకుంటే వీటిని ఈ సంకలనంలోని తక్కిన కతలతో వేరు చేస్తున్న వొక విభజన రేఖ వుంది. అది ఈ కతలలో కార్య వర్ణణ/ నివేదన( report of action) పాళ్లు మోతాదుకు మించి ఉండటమే.  తత్ఫలితంగా రచయిత జోక్యం ఎక్కువైపోయి వొక్కో సందర్భంలో పాత్రల మధ్య, ఇంకోసారి పాత్రలకన్నా వెనకబడీ అలా దిక్కుతోచక, exhaust  అయిపోయి బిక్కమొఖం వేసి నిలబడిన వైనం లీలగానైనా కనిపిస్తుంది. ఈ void ని భర్తీ చేసేందుకు రచయిత external techniqueలను ఆశ్రయించిన తీరు బట్టబయలవుతుంది.
నోరుగల్ల ఆడది కతలో వల్లంపాట వెంకటసుబ్బయ్య పసిగట్టినట్టు విస్తారమైన కాల వ్యవధిని, సుదీర్ఘమైన చరిత్రను నవలలో కాక కతలో ఇమడ్చడానికి బలవంతంగా ప్రయత్నించడం వల్ల రచయిత చేయి చేసుకుని మరీ ఆ పాత్రలను హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. డాక్యుమెంటరీ తరహాలో రాసానని ఉమామహేశ్వరరావు చెప్పినప్పటికీ వాయిస్ ఓవర్ శృతిమించడం వల్ల దృశ్యం, పాత్రౌచిత్యం సన్నగిల్లాయి. ఆ కారణంగానే ముగింపుకొచ్చేసరికి వాచ్యానికి దిగి చేతులెత్తిన వైనం కనిపిస్తుంది. ఈ రచయిత క్రితం కతల్లో యేనాడూ చేయని వొక ప్రయోగం తొలిసారి ఈ కతలో చేసాడు. ఎందువల్లో టెక్నిక్ కాన్షియస్ అయ్యాడు. బహుశా తనశైలిని తనే రిపీట్ చేస్తున్నాననో, కాపీ కొడుతున్నాననో అనుకునే రచయితలందరూ లోనయ్యే వొక అవస్థకు ఉమా మహేశ్వర రావు కూడా గురయ్యాడేమో అనిపిస్తుంది. అందుకే కత డిమాండ్ చేయకపోయినా డాక్యుమెంటరీ టెక్నిక్ ని ఆశ్రయించి కతకు అన్యాయం చేసాడు. ఉమా ఇదివర్లో రాసిన మంచివాడు, బిడ్డలుగల తల్లి, ముక్కుపుల్ల, మొగుడూ పెళ్ళాల ప్రేమకతల్లో అంతర్భాగంగానే వొక వున్నతమైన పరిణితి చెందిన టెక్నిక్, సీనిక్ డిసిప్లిన్ వుంటాయి. ఆ డిసిప్లిన్ డిస్మాంటిల్ చేయమని కతే ప్రోద్బలం చేస్తే తప్ప external technique జోలికి పోకుంటే మరింత పరిణితి చెందిన పాత్రలను పాఠకులకు పరిచయం చేసి వెంటాడగలడు ఉమ. ఈ లోపం వల్లే నోరుగల్ల ఆడది నోరే వినిపించకుండా పోయింది కతలో.
ఇదే disturbance డాగ్ ఫాదర్, త్రిభుజానికి నాలుగో కోణం కతల్లోనూ కనిపిస్తుంది.అయితే నువ్వు నేను పడమటి ఆకాశం కత శైలి పరంగా  stream of self conscious fiction లాగా నడవటం వల్ల ఈ disturbance ను పసిగట్టడం కొంచెం కష్టమవుతుంది. ఇది పసిగట్టేందుకు ఎక్కువ కష్టపడకుండా ఇదే సంకలనంలోని దాదాపు ఇదే ధోరణిలో నడిచిన భారతీయుడు కత చదవాలి. యాధృచ్ఛికమే అయినా ఈ రెండు కతలూ యూనివర్సిటీ వాతావరణంలో వున్న ఇద్దరు రచయితల నుంచి వెలువడ్డాయి. నువ్వు నేను పడమటి ఆకాశం కత వెంటాడే ప్రతీలన్నీ ఒక రూపం తీసుకునేందుకు పెనుగులాడుతున్నప్పుడు కసిగా అబార్ట్ చేసిన కల తాలూకు అనువాదంలా అర్థం చేసుకవాలి. ఇందులో రచయిత తన చుట్టూ రెక్కలున్న చిలుపట్టిన ఇనుప మేకుల్లాంటి పరిశీలనలను, వ్యక్తలను, దృశ్యాలను ఢీ కొట్టిస్తూ వాటి మద్య నిలబడి రిపోర్ట్, కామెంట్ చేసే ఒక భద్ర తలంలో వుంటూ కతను నడిపిస్తాడు. ఇందులో రచయిత పక్షాతీతుడైన స్వచ్ఛంద ఔట్ సైడర్. ఇది ఇమడలేని తనంలో నుంచి వచ్చే నిస్సహాయత. కతలోని అసంఖ్యాకమైన పాత్రలను పాఠకుడే స్వశక్తితో ప్రేమించే, ద్వేషించే, అర్థం చేసుకునే ప్రివిలేజ్ నిరాకరించేంతగా రచయిత జోక్యం, వ్యాఖ్యానం వుంటాయి. 
 రెండో భాగం 
ఇక external technique తో పనిలేకుండా, పని లేదన్న స్పృహతోనే నడిచిన కతలు ఇన్ స్టంట్ లైఫ్, న్యూబాంబే టైలర్స్, దూరానికి దగ్గరగా. టెక్నిక్ కళ్ళలోంచి  చూస్తే ఇవి సాదాసీదా కతలుగా కనిపిస్తాయి. కానీ వీటి సీనిక్ ఆర్డరే వాటి ఆయువు. మరీ ప్రత్యేకించి న్యూ బాంబే టైలర్స్  కతలో ఖదీర్ దర్గామిట్ట కతల్లోని ఆర్డర్ నుంచి  బయటపడుతున్న వైనం కనిపిస్తుంది. స్వతహాగా ఖదీర్ ది మనోహర జీవన చైతన్యాన్నీ, అందులో కనిపించని చమత్కారాన్ని పసిగట్టి మనముందుకు తీసుకువచ్చి ఆశ్చర్యచకితులను చేసే చార్లీ చాప్లిన్ టెక్నిక్. ముఖాలపై నవ్వు ఆరిన మరుక్షణం వుండబట్టలేనంత దుఃఖం ముంచుకువచ్చి కమ్ముకుని మన చేతనాచేతనలను కాల్చి కాలి కిందనేలను లాగేసుకుంటుంది. న్యూ బాంబే టైలర్స్ కతలో ఈ భీభత్సం మరింత గుచ్చకునేంతగా పరిణితితో కనిపిస్తుంది. గ్లోబలైజేషన్ గ్రామీణ జీవన చిత్రాన్ని ఎలా ఛిద్రం చేసిందో ఆగిన న్యూ బాంబే టైలర్స్ మిషన్ చప్పుడు మనకు సూదులు గుచ్చి మరీ చెబుతుంది. బాల్యాన్ని పునరర్పించుకుని, వినిర్మించుకుని బయోగ్రఫికల్ స్కెచెస్ రాసే రచయితలను తన ఇన్ ఫ్లూయెన్స్ వలయాల్లోకి లాగేసుకుని వొక పట్టాన వదలక పీల్చి పిప్పి చేసే మిట్టూరి మాంత్రికుడి కామ పంజరం నుంచి బయటపడగలిగీ ఖదీర్ నిలదొక్కుకుంటున్నాడని న్యూ బాంబే టైలర్స్ కత దర్గా మిట్ట మీద నిలబడి మరీ చాటుతోంది.

ఈ సంకలనంలో ఒక అంచున 'కానుగ పూల వాన', మరో అంచున 'ఆత్మమత్యల రుతువు' వుండటం కేవలం యాధృచ్ఛికం కాదేమో! ఈ ఇద్దరు రచయితలను (మరీ ప్రత్యేకించి చంద్రశేఖరరావును) అర్థం చేసుకునేందుకు విశ్లేషకులు ఎక్కువగా వాడుతున్న మాట మ్యాజికల్ రియలిజమ్. ఈ మ్యాజికల్ రియలిజమ్ గురించి అభంశుభం తెలియని గోపిని కరుణాకర్ గురించి  తర్వాత ప్రస్తావిస్తాను. ముందు చంద్రశేఖరరావు సంగతి.
ఇటీవలి కాలంలో వొక ధోరణిగా చాలా మంది కతకుల దృష్టిలో ఒక 'స్కూల్ ఆఫ్ రైటింగ్'గా ముందుకు వచ్చిన కతకుడు చంద్రశేఖరరావు. ఇతని కతల్లో మనల్ని తీవ్ర మైన, ఘాడమైన ఉద్వేగాలలోకి తీసుకెళ్ళే విలక్షణమైన శిల్పం-శైలి మెరుస్తాయి. విభిన్న తలాలలో విహరించి వచ్చే సమాంతర కతాగమనమూ ఉపరితలంలో తళుక్కుమంటాయి. కత లోలోతుల్లో యేకాకితనం, పరాజితుల వేదన, మానసిక సంక్షోభం, రికామీ, పశ్చాత్తాపం, నిరాశ- లాంటి అనేకానేక ఉద్వేగాలతో, మనస్తాపాలతో, మనోవేదనలతో పాత్రలు పరిచయమవుతాయి. చివరికి పరిచయస్తుల్లానే మిగిలిపోతాయి. వొక్ మాటలో చెప్పాలంటే చంద్రశేఖరరావు కతల్లో 'అనంత శోక భీకర తిమిర లోకైక పతులూ, పత్నులే' ప్రొటాగనిస్ట్ లు, ఆంటగనిస్టులు. ఇతని పాత్రలు ఎప్పుడూ ఏదో తెలియని అన్వేషణలో వుంటాయి. అయితే అన్ని రకాల సైకలాజికల్ ట్రామాలనీ, ట్రాన్స్ఫర్మేషన్లనీ తన కతలలో నిర్మొహమాటంగా ఎంబలిష్ మెంట్స్ గా ( చంద్ర శేఖరరావు తన నేపథ్యంలో చెప్పుకున్నట్టు పోస్ట్ మాడ్రన్ అందాలను అద్దడం) చక్కగా, చాకచక్యంగా వొకింత కవితాత్మకంగా అమర్చుకునే నైపుణ్య ఇతనికుంది. అందువల్లే ఇతని పాత్రల అన్వేషణ ఛద్మవేషగవేశణమైపోయింది. భావన నిజీయితీ కోల్పోయి కేవల అలంకరణగానే మిగిలిపోయింది.
ఇక తన కతలో ఎన్నెన్ని ' మెటఫరికల్ డ్రామాలు, క్యాప్సల్ లోపలి మందులాంటి మూడ్స్, కత్తి ంచున సాగే నడకలాంటి గగుర్పొడిచే విన్యాసాలు, సింబాలిక్ మీనింగ్స్, మెటఫరికల్ ట్రాప్స్, ఇంప్లాంటేషన్లు, ఇంజెక్షన్లు, ఎక్స్ ప్రెషనిస్టిక్ ట్రిక్స్, ఫ్రాంజ్ కాఫ్కాలు, గాబ్రియేలా గార్షియా మార్క్వెజ్ లు, సామ్యూల్ బెకెట్ లు, కొలాజ్ టెక్నిక్కులు' వగైరా తదితర మొదలైన దినుసులు ఎన్నెన్నేసి ఏఏ మోతాదుల్లో నర్మగర్భంగా వున్నాయో చంద్రశేఖరరావే తన నేపథ్యంలో వొప్పుకున్నందుకు నాకింకేమీ మిగల్లేదు చెప్పడానికి.
తన ట్రిక్స్ మీదా, ట్రాప్స్ మీదా ఇంతేసి 'స్పష్టత' వున్నందువల్లేనేమో బహుశా చంద్రశేఖరరావు కతలు రీడర్ ఫ్రెడ్లీనెస్ నుంచి తప్పుకుని క్రిటిక్ కాన్షియస్‌ అయిపోతాయి. శైలీ పరంగా చంద్రశేఖరరావు విశ్వనాథ సత్యనారాయణకు పోస్ట్మాడ్రన్ కొనసాగింపు. పాఠకులు వఠ్ఠి వెర్రివెంగళప్పలు, అన్నీ మనమే చెప్పేడవాలి అనుకునే వేయిపడగల రచయిత శైలికీ చంద్రశేఖరరావు వైలికీ పొంతన వుంది. సమయం వచ్చినా రాకున్నా సందర్భం వున్నా లేకున్నా తనో, తన పాత్రల చేతనో, లేదా తను ప్రేమలో పడిన పదానికి టీకాటిప్పణి, వ్యుత్పత్తర్థము, విగ్రహ వాక్యము చెప్పడంలో విశ్వనాథవారికి తీసిపోరు చంద్రశేఖరరావు. ఉదాహరణకు requium  అనే మాటకు నిఘంటువు (బ్రౌణ్యో మరోటో) చూసుకుని అర్థం వెతుక్కునేంత తెలివితేటలున్న పాఠకుడుంటాడా ఈ లోకంలో అన్న దయతో కూడిన శంక వల్ల ఆ పదానికి అర్థం చెప్పి, అక్కడికీ అర్థం కాకుండా అశేష పాఠకులు మిగిలిపోయి వుంటారన్న వల్లమాటిన ప్రేమతో కొంత వ్యాఖ్యానాన్ని పొందుపరుస్తాడు. ఇట్లాంటిదే  qnxiety neurosis అన్నమరో  ఆంగ్ల పదబంధం. దీని గురించి కూడా వైవి (అంటే యదువంశి) అనే పాత్రతో విక చాంతాండంత ఉపన్యాసం ఇప్పించి చితక్కొట్టి చెవులు మూయిస్తాడుప కతను information counter  చేసేస్తాడు చంద్రశేఖరరావు.
నిఆనికి ఆత్మహత్యల రుతువు కతకే కాదు చంద్రవేఖరరావు రాసిన లెనిన్ ప్లేస్ లోని మరే కతకూ కూడా మ్యా.జికల్ రియలిజమ్ అనే దానితో సంబంధం లేదు. 'మ్యాజికల్ రియలిజమ్ అని దేన్ని అంటారో ఇక్కడ చర్చ అనవసరం' అన్న తిరుపతిరావు చేసిన ట్రిక్ నే నేనిక్కడ ప్లే చేయదలచుకున్నాను. మరయితే చంద్రశేకరరావు ఒక ధోరణి కాదా?  అంటే ముమ్మాటికీ అవుననే సమాధానం చెప్పాలి.
సినిమాను మణిరత్నం ఎలాగయితే టెక్నికల్ వండర్ చేసి,  A mess of interdependant techinicians గా మార్చి సినిమాను  technique in itself  చేసాడో తెలుగు కతా సాహిత్యంలో చంద్రశేకరరావు కత కూడా collage of promos గా మిగిలింది.
నిజానికి ఈ కతా సంకలనంలో మిగతా కతలన్నీ ఒక ఎత్తయితే కానగపూల వాన ఎంతో ఎత్తు.
గోపిని కతలు దుస్సార, తిప్ప తీగలతో అల్లుకున్న కంగుంది దృశ్యాలు. జీవిత సేవించిన కైపులో పాడే బైరాగి పాటలు, జక్కీకు పదాలు. టెక్నిక్ పరంగా ఉపరితలంలో, ఫస్ట్ ఇంప్రెషన్ లో మ్యాజికల్ రియలిజమ్ తాలూకు అడాప్టెడ్ అంశ ఏదో వున్నట్టు తోస్తుంది. దీనిక కారణం కతలకు, విమర్శకులకు మ్యాజికల్ రియలిజమ్ స్మరణ చేయడం తెలిసినంతగా జానపద మంత్ర మార్మికత పట్ల అవగాహన, ప్రేమ లేకపోవడమే.
గోపిని కరుణాకర్ కతలన్నింటిలోనూ  అవ్వ చెప్పిన కతలను తిరిగి పిల్లలు తమ కాల్పనిక జగత్తులోంచి నడిపించి చెప్పే వొక టెక్నిక్ వుంటుంది. పసితనపు అమాయకత్వంతో పాటు భౌతిక ప్రపంచపు విభజన రేఖలు తెలీని అచ్చమైన, స్వచ్ఛమైన తాజా కంఠమొకటి వినిపిస్తుంది గోపిని కథనంలో. ఈ పసి ప్రపంచపు అమాయత్వంలో కామం-ప్రేమ, దేహం-మనసు, ఆడ-మగ, సుఖం-దుఃఖం, మంత్రం-వాస్తవం, కలిమి-లేమి, కల-నిజం లాంటి బాహ్య ప్రపంచపు సామాజిక విభజనలు, ద్వంద్వాలు వుండవుప రద్దు చేయబడతాయి. పిల్లలకు ఈ రేఖలు, శృంఖలాల గురించి అస్సలేమీ తెలీదు. ఇదే స్థితి కానగపూల వాన కతలో కురుస్తుంది. నిజానికి మాదిగ లచ్చిమి, పెదబ్బలు రెండు దేహాలు, లింగాలు, తరహాలు, కులాలు, జీవితాలు, తలాలు, దుఃఖాలు, కలలు, నిజాలు. కానీ కత మాత్రం ఇవన్నీ ఒక సారి చెరిగిపోయిన, మరోసారి పెనవేసుకుపోయిన తలంలోంచే పలుకుతుంది.
అందుకే మాదిగ లచ్చిమి, పెదబ్బలు వొక్కే వ్యక్తికి రెండు దేహాలుగానూ, లేదా రెండు శరీరాలకు ఒక్కే వ్యక్తిగానూ నిలస్తారు.
మనుషులుగా సాధించాల్సిన ఈ స్థితిని లచ్చిమి, పెదబ్బలు మిన్నాగులై, గుర్రాలై, పక్షులై, చేపలై, సీతాకోక చిలుకలై, నెళ్లయి, చామలై, ఏనుగులై, పులులై, జింకలై సాక్షాత్కరింప చేసుకుంటారుప కానగపూల వానై జలజలమంటారు. ఈ కత లోపలి దృశ్య సమన్వయంలో వున్న ఈ ఐంద్రజాలిక మార్మికత, మంత్ర వాస్తవికత, గమనంలోని అంతః స్రవంతులు, సంవిధానంలోని అంతరాల అంతరాళాలు సంఘర్షణలూ కేవలం మౌఖిక జానపద కల్పనాత్మకే, చూపుకే, కళ్ళకే, దృష్టికే సాధ్యం. అందుకే గోపిని కరుణాకర్ వర్తమాన సమయంలో, సందర్భంలో, వాతావరణంలో జానపద శైలిలో ఎపిక్ స్టోరీస్ చెప్పగల సమర్థుడు. కతలోని సీనిక్ డివిజన్, ఫ్లో, సర్ కమ్ స్టెన్సెస్ చూస్తే గోపినికున్న సినిమా పరిజ్ఞానం ఎంత లోతైనదో, పరిణితమైనదో, స్వతఃసిద్ధమైనదో అర్థం చేసుకోవచ్చు. గోపిని కరుణాకర్ గొప్ప కతకుడు, ప్రామిసింగ్ రైటర్ అని అనడం కన్నా అతను మనం కోల్పోయిన అవ్వ, జానపదం, జీవితంలోని ఇంద్రజాలం, బతుకులోని మంత్రం.
ఇంతటి వైవిధ్యమున్న కతలను రెండు అట్టల మద్య మాగిన అక్బర్ గీతలతో అందించిన విజయవాడ సాహితీ మిత్రులు ముందు ముందు విశ్లేషణలు లేకుండా సంకలనం చేస్తారని ఆశిస్తాను. విశ్లేషణ, విమర్శ సృజనాత్మక ప్రక్రియలే అయినా సృజనను శాశించే దుర్మార్గం చేస్తూ వస్తున్నాయి ఈ నేలలో. మనకు విబేధించడానికీ, ద్వేషించడానికీ మధ్య తేడా తెలియకపోవడం వల్ల కూడా విమర్శ ముసుగులో ఈ డ్యామేజ్ జరిగిపోతోంది. ఈ డ్యామేజ్ ఈ కతా సంకలనంలోని విశ్లేషణల్లోనూ తేటతెల్లమవుతోంది. కనీసం కతా విమర్శ అయినా మొహమాటపు కంచెలు దాటి స్వచ్ఛంగా, తాజాగా, దేశీగా, సాహసంగా కూడలిలో నిలబడుతుందని ఆశిద్దాం.




No comments: