Friday, June 1, 2012

లేరు

మల్లెల్లా విరియలేరు
గువ్వల్లా గూడును  దిగుల్లేక వదల్లేరు
చెట్టుల్లా శాఖోపశాఖల్లో మరణం రెపరెపలాడలేరు
వేరుల్లా చిగురు పొదిమి విస్తరించలేరు
పైరుల్లాఎదని పచ్చపొడిపించలేరు
వీధుల్లా నడక నేర్పించలేరు

ఎవ్వరీ  శాపగ్రస్తులు

జవాబుల వాకబు తెలీని గదుల్లా అడుగు కాపాడుకోలేరు
సమాధాన పరచని సమాధుల్లా కేళి రేపలేరు
మాదిగల చర్చీల గంటల్లా రెండో రాకడ ఆశీర్వచనమీయలేరు
దూదేకుల దర్గాల్లా ప్రార్థన పలిఖించి దువా వచనమీయలేరు
 
ఎవ్వరీ  ముక్త పగ గ్రస్తులు
ఎవరీ పాప భూయిష్టులు

పడి లేయలేరు అలల్లా
వడి సడి చేయలేరు గాలుల్లా
సడికీ తడికీ తాకిడికీ తెలిసీ తెలియనట్టుండలేరు తీరాల్లా
నిటారుగా నిశ్చలించలేరు కొండల్లా
స్తబ్దుగా ఫిర్యాదు సలుపలేరు లోయల్లా
వాలుగా చనలేరు వాగుల్లా
 
ఎవ్వరీ  శోక తమస్సులు
ఎవరీ పందెంలో పారని పాచికలు

వాల లేరు గువ్వల్లా కొమ్మల్లో నడిరాతిరి
గుక్కతిప్పుకోలేరు పిల్లల్లా మలిరాతిరి
పగల్లేరు మొక్క మొనన పత్తిలా కాసేప్పటి రాతిరి
ఎగరలేరు ద్రిమ్మరి కొంగల్లా తెలవారి

వెలివాడల నుడికారపు బతుకు బాటల డొంకదారులు
కనలేరు... కని చ
లేరు... చని... పోలేరు
ఎవ్వరీ మరీచిక వీచికలు
ఎవరీ అధోముఖ సూచికలు

1 comment:

భాస్కర్ కె said...

ఎవ్వరీ మరీచిక వీచికలు
ఎవరీ అధోముఖ సూచికలు
evarandi veeru,
bhaagaa raasaaru meeru.