Wednesday, March 18, 2015

మాటలు

పద్యం మాటున మాటలు
చేతన చేరువన మాటలు
మాటలు విప్లవాలు
మాటలు విగ్రహాలు
మాటలు జాగ్రత్త
*
ప్రియురాలితో ఏకాంతంలో పల్లవించే పురా ఫలాలు మాటలు
కలతల కారడవిన కకావికలుగ రాలిన విషగుళికలు మాటలు
గాలిలో గంధంలా పరిఢవిల్లే మాటలు
హద్దులు దాటి గంధకం తొడుక్కునే మాటలు
మాటలు జాగ్రత్త
*
మాటలు ప్రణయాలు
మాటలు ప్రళయాలు
మాటలు తోటలు
మాటలు గోడలు
మాటలు తూటాలు
మాటలు జూటాలు 
మాటలు లతలు
మాటలు విద్యుల్లతలు
మాటలు జాగ్రత్త
*
పత్తి లాంటి మాటలు
కత్తి లాంటి మాటలు
మోహావేశాలు మదిలో రచియించి ఆలపించే రాగాలు మాటలు
కాంక్ష చిరంతం వర్తించి రగిలించి పెనవేసుకునే పాదులు మాటలు 
ఒట్టి ఆగ్రహాల్లో మనాలను దిష్టిబొమ్మల్లా దగ్ధం చేసే మాటలు
నీకూ నాకూ మధ్య కోటలు మొలిపించి కందకాలు తవ్వేసే మాటలు
మాటలు జాగ్రత్త
*
మాటలు నిచ్చెనలు
సింహాసనం ఎక్కే పాదుకలు మాటలు
మాటలు పాములు
అందలం కూల్చే పాచికలు మాటలు
ప్రళయ భయంకర మౌనాలు మాటలు
నిగూఢ చేలాంచల వనాలు మాటలు
మాటలు ఎద బాటలు
మాటలు ఎడబాటులు
మాటలు జాగ్రత్త
*
మాటలు ద్రోహాలు
మాటలు అహాలు 
మాటలు ఉత్ప్రేక్షలు
మాటలు సంప్రోక్షణలు
మాటలు నీహారికలు
మాటలు అభిసారికలు
మాటలు ఉపమానాలు
మాటలు తాపమానాలు

మాటలు గాయాలు యుగాలు గాలాలు యాగాలు
మాటలు లోయలు అగాధాలు వుచ్చులు మచ్చలు

విభాతాన కదిలే మాతలి రథ చక్రాలు మాటలు
విశ్వాంతాన ఏకాకి కబోది ప్రవచనాలు మాటలు

దళారి ప్రాయ:శ్చిత్తాలు మాటలు
బేహారి పశ్చాత్తాపాలు మాటలు

కవీ !
జాగ్రత్త మాటలు........................................................
మణికొండ, 17మార్చి2015

No comments: