1
మందు పాతరలు నాటిన దారుల
నడక కన్నా
శిథిలాల నడుమ అడుగులు
భయోత్పాతాలు
#
సాహసాలు
ప్రాయాల
ఆభరణాలు
2
కూడలిలో రాలిన పూల బాటలో
అనంత నిరీక్షణలో తడబడటం కన్నా
చూపులూ కలవని
అనితర ఎడబాటులు
దిగులు అఖాతాలు
#
చిరునామాలు
చేరని
మోహాలు
3
జ్వలిత రాత్రులు
రగిలిన యవ్వనాల సాంగత్యపు కోలాహలం కన్నా
కుశలపు కువకువలూ నోచుకోని
సాయంత్రపు తెరిచిన తలుపులు
వేదనలు
#
సావాసాలు
లెక్కించిన వాసాలు
4
మరో భవిష్యత్ కరచాలనపు భరోసా చిగురు లేని నిరాశలుడిగే
వీడ్కోలు కన్నా
అంత్యక్రియల్లాంటి కలయికలు
పెను విషాదాలు
#
చిరపరిచితులూ, అపరిచితులూ
చితులు.
5
కవితోత్సవంలో
నినాదాలు పేల్చి
నిదానాలు పేర్చిన
పద లహరులకన్నా
ప్రేయసికి ప్రేమలేఖాంతాన
వెలిసిన దస్తూరీలు
మారణహోమాలు
#
మరణాలు
చర్విత చరణాలు
6
Children
who are meant
to come,
shall come!
#
కన వీలు లేని పిల్లలు
మగర్భశ్రావాలు
7
పూవున్నొక్క రాగమయి
మధుసేవలో తరించే
భ్రమర భ్రమణాలకన్నా
రెక్కలు రాలిన సీతాకోకలు
జీవితేచ్ఛలు
#
శిశిరాలు వసంతాలు
అవిభక్త కవలలు.
...........................................................మణికొండ, 28 మార్చి, 2015................................