Monday, December 22, 2014

జాస్మిన్ - 2



వీధి చివరన 
నా నడి రాతిరి 
ఏ అపరిచిత కుక్క మొరిగినా 

విధి చివరన 

అదే నడిరాతిరి 
పరిచిన దారి వెంట 
నీ పిలుపు 
నన్ను వెంటాడుతోంది 

*

నా ప్రియాతి కుచ్ కుచ్  
అలియాస్ ఇండీ
ప్రతి మలి రాతిరీ 
నీ అరుపై తోచి
ఆ క్షణం నన్ను 
వీధి పాలు చేస్తావే 


*

రెండు వారాలయినా నిండని

పాలు మరవని పసికూనా 
ఓ నా ఒకానొక వీధి కుక్క పిల్లా  
రేవన్ జాతి ముత్తాతలు అవ్వలు కల దానా  

నా ఇంటి సభ్యత్వం 

నా బలవంతపు అనుబంధం

*


నిజమే 

పిల్లల్ని పెంచడం 
వొక మెలకువ
వొక మెళకువ
వొక కళకువ

పిల్ల కుక్క కూనలయినా

ఏం కళ
వాటి ముఖారవిందాన
పసితనపు జీవుల కళ అది

*


హంపీ తుంగభద్రలో 

నీ తొలి ఈత
టిబి డ్యాం పార్కులో నీ సయ్యాట
బళ్ళారి రాళ్ళ దారిలో నీ బడలిక

కవన మంచం కింద

నీ దిగుల్లేని బస
కపిల్ పక్కలో సుస్సూ

నీ ఈడు పిల్లల్లో

అదే హొయలు సొగసు 
అదే పరుగు యశస్సూ
అదే జీవ కళ
తనివి తీరాను నేనూ మరళా నీలో

*

మెడన మువ్వ సవ్వడితో
నడయాడిన 
మరొక పసికూనే ఇండీ
రూపానికీ 
జాతికీ 
అది పిల్ల కుక్క కూన అంతే

*
ఇండీ నీ సభ్యత్వం 
నా బలవంతమే కాదు
నా తొందరపాటూ
నా పశ్చాత్తాపమూ 
ఇపుడు


*

నలుగురూ నాలుగు దారుల్లో
ఇల్లు వదిలి వెళ్తూంటే
యింటిని  నాలుగు రోడ్డుల 
కూడలి చేసేది 
ఇండీ

ముఖాన 

దిక్కు తోచని దిగులేదో పలికించేది

మా పరోక్షంలో 

దాని సరంజామా 
సరిపడా వుందో లేదో 
అన్నదే
ఇల్లు విడచి కదిలే 
ఆ నాలుగు జతల పాదాల వెంట
రోజంతా దిగులు

తీరా ఇల్లు చేరాక

ప్రతి కాలి జత అడుగులకై
దాని పరివేదన
దాని ఉరకలు
దాని వేషాలు
దాని నంగితనాలు
దాని గోములు
దాని వయ్యారాలు
దాని కవ్వింపులూ

పసి పిల్లలను తలపించే

మరిపించే మురుపు
దానికే స్వంతం

దాని సమక్షం ఆసాంతం

దాని సంతకం

*


ఇండీ 

నీ సభ్యత్వం
నా తలంపు అప్పుడు
నా తలొంపు ఇప్పుడు

 *


ఇండీ

ఒక ఆడ కుక్క పిల్ల
పైగా ఇంటి పిల్ల

అర డజను పిల్లా పాపలలతో

కళకళలాడాలనుకున్నాము

మా చేనులో... మా పంట వెంటా

మా కల్లంలో... మా వాము వెంటా
మా కుప్పలు వెన్నంటి
మా విశ్రాంత ఏకాంత ప్రాంతాన
మా కాపులు మా మోపులు కాచీ
కళకళలాడాలి 
అరడజను పిల్లలతో 
ఇండీ

నిండా అరడజనూ 

ఇండీనే ఈనాలి 
మేమే కనాలి

అరడజను ఇండీ అల్లరులు

మళ్ళీ కలయ తిరగాలి చుట్టూతా
కలా తీరాలి 
అలా అలా

*


ఇండీ 

నీ సభ్యత్వం
నా లేమి రికామీ 
నీ సభ్యత్వం
నా రాహిత్య సంచారం

*


కలలో ఇండీ

‘‘ పిల్లలు
 కుక్కవయినా
మీవయినా
ఒక్కటే

పిల్లలు

పెంచకపోతేనే పెరుగుతారు
పెంచకపోతేనే ఎదుగుతారు

కుక్క నుంచీ
మొక్క నుంచీ ఇదే నేర్వాలి
పదే పదే

పొదగడం మీ పని

ఎదగడం పిల్లల పని

ఒదగడమా ?  

పని మీదయినా
పిల్లలదయినా

పెంచడం 

పెంపకం
రద్దుచేస్తేనే కదా
కన్నవారవుతారు 

ఆలనా 

పాలనా 
రుద్దుతుంటేనే కదా 
లేనివారవుతారు ’’

కలలో ఇండీ గొంతు ఆగింది

మాయమైంది
కల చెదిరింది

కలలోనే ఇప్పుడు ఇండీ

కళ్ళెదుటే లేదిప్పుడు ఇండీ

*


ఇండీ అంటే ఇష్టం


యిష్టం ... వొక బాధ్యత

యిష్టం ... వొక బరువు
యిష్టం  ... వొక పరువు
యిష్టం  ... వొక రుతువు
యిష్టం  ... వొక క్రతువు
యిష్టం  ... వొక ఆస్తి
యిష్టం  ... వొక హక్కు
యిష్టం  ... వొక ఆధిపత్యం
యిష్టం  ... వొక అస్తిత్వం

యిష్టం 
 ... లీష్ లేని కుక్కపిల్ల నడివీధుల్లో
యిష్టం  ... విలాసం లేని విధికి వదిలిన ఇండీ

*


ఇండీ

నీదే విధి
నాదే వీధి
నాకు మోజు
నీకు శాపం

*


నీవు బలంగా

కోపంగా
విసుగ్గా
చికాకుతో
చలాకీగా కొరికిన
నీ లీష్
ముక్కలై రెండుగా వుంది 
నా గుండెలా 

*

‘‘ఇండీ... 

నువ్వెక్కున్నావ్?’’
..................................










Tuesday, December 16, 2014

పిల్లలూ... శవపేటికలూ


మీరు పొరబడ్డారు 
శవపేటికలు మొత్తం 
ఏడువందలా ఎనభై ఆరు  కాదు 
*
అవును అన్నీ చిన్న చిన్న శవపేటికలే
పొడవు ఒకటిన్నర తుపాకులు 
అడ్డం అర తుపాకీ కొలతలున్న చిన్ని చిన్ని శవపేటికలు

నిస్సహాయంగా
మూగగా
అల్లాను చివరి దువా కోరుతున్నట్టు 
బారులుగా నమాజు చేస్తున్నట్టు కనిపించే చిన్నారి శవపేటికలు

ఈ శవపేటికల్లో
పుట్టి పుష్కరం నిండని పిల్లలున్నారు
ఈ చిన్ని శవపేటికల్లో
ప్రతీకారం అన్న పదమే సోకని 
ఏడు... ఎనిమిది... తొమ్మిది... పది..
తరగతి గదుల్లో నిన్నటి దాకా 
అల్లరి అల్లరిగా 
గలగలా చదువుకున్న పిల్లలే వున్నారు

ఈ చిన్నారి శవపేటికల్లో
రాతిరంతా పొద్దుపోయేదాకా చదివి 
పొద్దున్నే పరీక్షలు రాసేందుకు 
ఆత్రంగా బడికి వచ్చిన పిల్లలున్నారు

మరిచాను
ఈ రోజు ఏడవ తరగతి లెక్కల పరీక్ష రాయాల్సిన చిన్నారి 
మహమ్మద్ బిలాల్ కూడా 
ఈ చిన్నారి శవపేటికల్లోనే ఎక్కడో వుండే వుంటాడు
*
మీకు సవినయంగా మనవి చేసేదేమిటంటే
ఈ శవపేటికల్లో వున్న ఈ చిన్ని పిల్లలను 
కన్నవారు 
పాక్ సైనికులే 
కానీ 
పాక సైన్యం కాదు
*
అయినా సరే మీరు 
మళ్ళీ లెక్క తప్పారు 
శవపేటికలు మొత్తం 
ఎడు ఎనిమిది ఆరు కాదు 
కేవలం 145 మాత్రమే 
*
శవపేటిక ఎంత చిన్నదయితే 
భుజాన దాని భారం వేయింతలవుతుంది
శవపేటిక ఎంత  చిన్నదయితే 
మనసున దాని ఖాళీ మహా సముద్రమే రచిస్తుంది
*
మళ్ళీ గుర్తు చేస్తున్నాను 
మొత్తం శవపేటికలు  
786 కానే కాదు 
ఎన్ని సార్లు చెబితే మీకు బోధ పడుతుంది
వాటి సంఖ్య ఏడు వందలా ఎనభై ఆరు కానే కాదని 
*
అనల్ హక్
ఈ శవపేటికల సంఖ్య 
ముమ్మాటికీ 
నూటా 
నలభై 
ఐదు 
మాత్రమే

...................................................................................................................................................................


* (ముస్లింల దైవిక నినాదమైన ‘‘బిస్మిల్లా ఇర్రెహమాన్ ఇర్రహీమ్’’ కి సంక్షిప్త రూపంగా 786 వాడుకలో వుంది.) 


(‘అనల్ హక్’ అంటే నేనే సత్యం అని అర్థం పర్షియన్ లో.
తొలిగా ఈ నినాదాన్ని వాడింది పర్షియన్ కవి మన్సూర్ హల్లాజ్)

.........................................................................................


Children and....Coffins
.......................................
You are mistaken
The number of coffins..
is not 786

*
Yes, they are all little coffins, very small coffins
One and a half rifle in length 
and half a rifle in width..
Helpless, mute
beseeching one last blessing from Allah the merciful
the coffins are arranged in an orderly fashion
like they are doing the namaaz.
In these little coffins,
lie children who lived less than a dozen years
Kids who haven't been touched by revenge
Children who till this morning
in seventh, eighth, ninth and tenth grades,
were making a racket with their mischief
and reading their texts in loud, sing song voices.
Some came to school this morning
anxious to do well in the exams.

The little boy Mohd Bilal
was supposed to take his Mathematics exam today.
He was in his seveth grade.
Look for it, you will find his coffin somewhere,
in this collection of little coffins.
One and a half rifle long and half a rifle wide.

*

I submit to your kind attention please,
The kids in these little coffins
were born to Pakistani soldiers.
But not to the Pakistani army.

*

But still, you got the number wrong again.
The total number of coffins is not 786.
The right answer is 145 ONLY

*

The smaller the coffin is,
the heavier it feels on the shoulder..by about 1000 times.
These little coffins
create a void in the heart
the size of an ocean

*

I want to remind you again please,
the total number of coffins is 145 and not 786.
How many more times should I tell you this?
Won't you understand?

Anal Haque, the number of coffins is definitely not 786.
It is 145.


Translation : Narasimha Kumar
...................................................................
(Anal Haque = I am the truth in Persian)



Monday, December 15, 2014

సల్మా కవితలు

మౌన చిలుం
నీ మాటలకై
వేచి చూస్తానా
ఓ మహా నిశ్శబ్దం
నిరాటంకంగా నిండుకుంటుంది

మౌనం...
ఎంత చిలుం పట్టినా సరే
మాటలకన్నా
మౌనాన్ని నమ్మడం
సులువు
(The Rust of Silence)icked

విడివడిన సమయాన
నీకు వీడ్కోలు చెప్పేముందు
నా వసారాలో
కాంక్ష విత్తు చల్లుతూ
వాలే సంధ్య
నీపైనా
నీ ఇంటి ముందూ
అచ్చం అల్లాగే
వాలిందో లేదో
చూడాలన్నదే
నా ఆశ
(At the time of parting)

----------------------------------------------
Salma is one of the best-known contemporary writers in Tamil. She is the author of several collections of poetry and the critically acclaimed novel Irandaam Jaamangalin Kadai (The Hour Past Midnight). A documentary film about her life, Salma, was recently made by British filmmaker Kim Longinotto.

Thursday, December 4, 2014

జీరంగి


ఏకాంత చిరు పవనమొకటి
ఆమె మేని పరిమళాన్ని
నా ముకుపుటాల కనుసన్నలకే
పరివ్యాప్తం చేస్తూవుంటే
ఆమె నా స్మృత చిత్ర మాలిక నుంచి
కనుమరుగయ్యిందని 
ఎలా అనగలరు మీరు
*
అనునాసిక పలుకుచిలుక రాకడ
వొక పరిచిత సంబరం
ఆమె మవునాల్లో 
వేవేల వానకోయిలల
విభాత కుహుకుహులు
ఇంకా విస్పష్టం
*
పై పెదవి నొక్కిపట్టి
ఏటి రాగెండిని చేసి
గారంగా అందించే ఆమె అధరాలు
నా ముద్దుల పూతోటకు సతత అతిథులే ఇంకా
*
నా పిడికిలి
విచ్చుకున్నా ముడుచుకున్నా
ఆమె కర అరవిందాల గుభాళింపే నిండా
*
ఇంతటి సంధిగ్ధ కూడలిలోనూ
ఇంతటి దగ్ధానంతరమూ
ఇంచుక తుడిచిపెట్టుకుపోలేదు ఆమె
నా యోచన పథాన
*

అయినా మీ పిచ్చి కానీ
మీ ఊహల్లో
కట్టిన సమాధిలో
ఎలా సర్దుకోగలదు ఆమె

ఆమె వైశాలి
ఆమె జలపాతం
ఆమె చెలమ
ఆమె పచ్చిక
ఆమె విభాతం
ఆమె నా గతం స్వగతం

ఆమె
నా నుంచి వేరయిందే కానీ
బహుశా

ఇంకా దూరం కాలేదనుకుంటా

 ---




(మెటాలిక్ ఆకుపచ్చ రంగురెక్కల జీరంగి పురుగును అగ్గిపెట్టెలో దాచి తుమ్మ ఆకు మేతగా వేసి స్వంతపరుచుకునే వాళ్ళం నా చిన్నప్పుడు. తెల్లారేసరికి అవి తెల్లని గురవింద గింజంత గుడ్లను పెట్టేవి. జీరంగినే బింగణ్ణ అని కూడా అంటారు కర్నాటక తీరపు రాయలసీమలో. )

Monday, December 1, 2014

నాయనా

ఇంటి తలుపు తట్టిన ప్రతిసారీ
"నాన్న వున్నాడా"
ఎదురుగా తెరుచుకుని నిలబడే ప్రశ్న ఇదే గుమ్మానికి
"లేదు...  బయటికి వెళ్ళాడు"
పసి గొంతుకలో చొప్పించిన జవాబే 
అది

"ఎప్పుడొస్తాడు?"
ఎడ తెగదు ప్రశ్న
తలపుల తలుపుల చివర.
"తెలీదు"
గురుతెరగని జవాబు మూస్తుంది తలుపు.
'ఇంటికే రావాలే నాన్న'
నా ఆకాంక్ష తలుపుకు ఇటూ
'ఇంట్లో ఉండాలే నాన్న'
ఇఛ్చ తలపుకు అటూ
వేలాడుతూనే వుంది ఇంకా
  *
నాయనా
నీ పిలుపు గాలిపటం
నీ సముఖం తైలవర్ణ చిత్రం
నాయనా
నీ పిలుపులో మెరుపు
నువ్వు తురుపూ తూరుపూ
నా నడకకూ నా నడతకూ 

*
నాయనా
నేనూ అయ్యాను నాన్నను
కానీ ఇప్పుడు
నా పిలుపు తెగిన గాలిపటం
నా సముఖం అముఖం
సమక్షం మోగని ఢమరుకం


ఉన్న పిల్లల నాన్నలు నేర్పిన నేర్చిన  గాధలు
మోయలేని
లేమి లేని
నాన్నను నేనూ
నా లోలోయల్లో
*
నమూనా నాన్నను కాలేక
నాయనకు నమూనానూ కాలేక
నాలా మిగిలానంతే
నాన్నగా లేనంతే
నాయనకూ
నాన్నకూ  నోచుకోలేదంతే

ఇక
నాన్న లేడనో
వస్తాడో రాడో తెలియదనో కాక
కరాఖండీగా చెప్పాలి తలుపులకే
ఇక రాడని నాయన
ఎప్పటికీ 


*********************
(బావ ఒమ్మి రమేశ్ బాబుకు)   
*********************

Saturday, November 29, 2014

చుంబన బింబం

బింబాన్నీ
నిజం చేయ జూసే
నీ ఐంద్రజాలిక మెలకువకువలకు
జోహార్లు

బింబ అధరాలనూ
సవాస్తవంగా నిలిపే
నిలువె త్తు
తహతహ నీదే

అణువణువునా
నినూ
నీ తపననూ
నీ తరగనూ
నీ హొయలునూ
నీ నును పదును చాతుర్యాన్నీ
ముద్దాడనా

ఇంతకూ
నా ముద్దు
చేరేదీ
చెందేదీ
నీకా
నీ బింబానికా
నీ చషకానికా
నీ అధివాస్థవిక వాసానికా
పొందిక సౌందర్యానికా
చిత్రిక సలిపిన
నీ చాకచక్యానికా


పోనీ
అందిందా
లేదా నా ముద్దు నీకూ


(మంత్ర వాస్తవిక కళాకారుడు ఆంజనేయులుకు )






Sunday, November 23, 2014

They say


When your are a child
or...
When you grow old
You are weak

#
Am neither weak nor old
Still
A child
grown
too bold.
 

కూన కలాపం



నిండా రెండూ నిండని కూన
నిండు బుట్ట తెచ్చింది 
పండు సపోటాలతో 
ప్రయాసపడి 
ఒక్కొక్కటే 
చిట్టి చేతులతో 
నేర్పుగా వడిసి పట్టుకుని 
పండు పండూ బుట్ట దించింది 

ఆరు నిమిషాల్లో 
ఖాళీ చేసింది బుట్టని 

సపోటాల చో ట 
కేరింతిలు 
బుట్ట నిండుగా 

Thursday, November 13, 2014

పూమాల

అవును
నీకొక పుష్పాన్ని ఇద్దామనుకున్నాను
నీకై పూల మాల
కానుక నేనవుదామనుకున్నాను

మెరుపుల నీ పై పెదవి వంకీ వసారాలో
నా దోసిలి నిండా
అరవిరిసిన అనామిక మొగ్గల కదంబమాలను
నీ అనునాసిక ఆఘ్రాణానికి
ధఖలు పరుద్దామనుకున్నాను
మలి జామున
గుప్పెడు పూమాలలా వికసించేద్దామనుకుని
నాకు నేను... నీకై నేను.

అవును
పూలిస్తాను నీకోసం పూచి ప్రతి పూటకూ
కనీసం రుతువుకు చెప్పకుండా
పాలిస్తాను నీ దేహం దోచి ప్రతి తోటనూ
వనాంతం లత నొచ్చుకోకుండా

లెక్కకు సరి పోలని 
నీ ఇరు కనుపాపలు
వాల్చిన రెప్పలపై 
కొండ నాగమల్లిని రచిస్తాను 
నా ముకుపుటాలతో

తడారని నీ గింగిరాల
జలతారు ప్రతి వంకీలో
సన్నజాజి అద్దుతాను
ప్రణయ జ్వాలాముఖినై
సిగ దిద్దుతాను
ముడి వేయని
నీ కేశ ఆసాంతం బొండుమల్లి మాల పరుస్తాను
ముూడు మూరలై కొలుస్తాను
ముప్పేట మురుస్తాను
ముచ్చటగా తరిస్తాను

వేసవి సాయాన
నీ జడపాయలు
నా మునివేళ్ళతో
మునిలా జత చేస్తాను
జత జడ అల్లుతాను
ఎడమ జడ అంచె అంచెన
తీగ వెలిగే కాగడా మల్లిని అమరుస్తాను
కుడి జడ నిచ్చెనలో
అంటుకట్టిన సెంటు మల్లినై మెరుస్తాను
వ్యాసాన కనకాంబరాల ఆవిరి పచ్చబొట్లు
నా అధరాగ్రాన పొడిపించి
గోంగూర పువ్వు తలపించే నీ నాభిని సూర్యకాంతని చేస్తాను
ప్రతి రెక్కలకొన
నా వ్యామోహ చాంచల్యాన్ని కమలినిగా ఆవిష్కరిస్తాను
నీ నడుంపై శెనగ పూల మాలను పోలిన ఆదిమ నిప్పు పుట్టిస్తాను
విప్ప పూయిస్తాను
డప్పుల జత రాజేస్తాను
తుడుం మోగిస్తాను
వృక్షవంశం వశం తప్పి వివశులమై వాలే జామున
పరవశ పారిజాతవనం నాటుతాను
కుహరాన
.......
14నవంబరు14, మణికొండ