Monday, December 1, 2014

నాయనా

ఇంటి తలుపు తట్టిన ప్రతిసారీ
"నాన్న వున్నాడా"
ఎదురుగా తెరుచుకుని నిలబడే ప్రశ్న ఇదే గుమ్మానికి
"లేదు...  బయటికి వెళ్ళాడు"
పసి గొంతుకలో చొప్పించిన జవాబే 
అది

"ఎప్పుడొస్తాడు?"
ఎడ తెగదు ప్రశ్న
తలపుల తలుపుల చివర.
"తెలీదు"
గురుతెరగని జవాబు మూస్తుంది తలుపు.
'ఇంటికే రావాలే నాన్న'
నా ఆకాంక్ష తలుపుకు ఇటూ
'ఇంట్లో ఉండాలే నాన్న'
ఇఛ్చ తలపుకు అటూ
వేలాడుతూనే వుంది ఇంకా
  *
నాయనా
నీ పిలుపు గాలిపటం
నీ సముఖం తైలవర్ణ చిత్రం
నాయనా
నీ పిలుపులో మెరుపు
నువ్వు తురుపూ తూరుపూ
నా నడకకూ నా నడతకూ 

*
నాయనా
నేనూ అయ్యాను నాన్నను
కానీ ఇప్పుడు
నా పిలుపు తెగిన గాలిపటం
నా సముఖం అముఖం
సమక్షం మోగని ఢమరుకం


ఉన్న పిల్లల నాన్నలు నేర్పిన నేర్చిన  గాధలు
మోయలేని
లేమి లేని
నాన్నను నేనూ
నా లోలోయల్లో
*
నమూనా నాన్నను కాలేక
నాయనకు నమూనానూ కాలేక
నాలా మిగిలానంతే
నాన్నగా లేనంతే
నాయనకూ
నాన్నకూ  నోచుకోలేదంతే

ఇక
నాన్న లేడనో
వస్తాడో రాడో తెలియదనో కాక
కరాఖండీగా చెప్పాలి తలుపులకే
ఇక రాడని నాయన
ఎప్పటికీ 


*********************
(బావ ఒమ్మి రమేశ్ బాబుకు)   
*********************

No comments: