Thursday, December 4, 2014

జీరంగి


ఏకాంత చిరు పవనమొకటి
ఆమె మేని పరిమళాన్ని
నా ముకుపుటాల కనుసన్నలకే
పరివ్యాప్తం చేస్తూవుంటే
ఆమె నా స్మృత చిత్ర మాలిక నుంచి
కనుమరుగయ్యిందని 
ఎలా అనగలరు మీరు
*
అనునాసిక పలుకుచిలుక రాకడ
వొక పరిచిత సంబరం
ఆమె మవునాల్లో 
వేవేల వానకోయిలల
విభాత కుహుకుహులు
ఇంకా విస్పష్టం
*
పై పెదవి నొక్కిపట్టి
ఏటి రాగెండిని చేసి
గారంగా అందించే ఆమె అధరాలు
నా ముద్దుల పూతోటకు సతత అతిథులే ఇంకా
*
నా పిడికిలి
విచ్చుకున్నా ముడుచుకున్నా
ఆమె కర అరవిందాల గుభాళింపే నిండా
*
ఇంతటి సంధిగ్ధ కూడలిలోనూ
ఇంతటి దగ్ధానంతరమూ
ఇంచుక తుడిచిపెట్టుకుపోలేదు ఆమె
నా యోచన పథాన
*

అయినా మీ పిచ్చి కానీ
మీ ఊహల్లో
కట్టిన సమాధిలో
ఎలా సర్దుకోగలదు ఆమె

ఆమె వైశాలి
ఆమె జలపాతం
ఆమె చెలమ
ఆమె పచ్చిక
ఆమె విభాతం
ఆమె నా గతం స్వగతం

ఆమె
నా నుంచి వేరయిందే కానీ
బహుశా

ఇంకా దూరం కాలేదనుకుంటా

 ---




(మెటాలిక్ ఆకుపచ్చ రంగురెక్కల జీరంగి పురుగును అగ్గిపెట్టెలో దాచి తుమ్మ ఆకు మేతగా వేసి స్వంతపరుచుకునే వాళ్ళం నా చిన్నప్పుడు. తెల్లారేసరికి అవి తెల్లని గురవింద గింజంత గుడ్లను పెట్టేవి. జీరంగినే బింగణ్ణ అని కూడా అంటారు కర్నాటక తీరపు రాయలసీమలో. )

No comments: