Sunday, May 17, 2015

వేకువ

ఇపుడు
నేనొక శవ పేటికను
అందున్న
నీ కోమల మార్మిక గుబురు కను రెప్పలు నిశ్చలం
సమతను పొదిమిన నీ నిర్మల హృదయ కవాటాలు నిశ్చలం
వైప్లవ్య గీతికలు ఆలపించిన నీ సుమధుర అధర విన్యాసాలు నిశ్చలం
మరో ప్రపంచాన్ని కాంక్షించిన  నీ నిమీలిత నేత్రాలు నిశ్చలం
ధిక్కారం నెలవున్న నీ ఊపిరి నిశ్చలం
నిశ్చలం నీ నిశ్చయం

అరుణారుణ రేఖల విత్తులు వెదజల్లిన నీ దోసిలి నిశ్చలం
రేచుక్కను గురిచూపిన నీ తర్జని నిశ్చలం
అధోజగతి అక్షౌహిణి కవాతు ప్రతిఫలించే నీ కరచాలనం నిశ్చలం
ఉక్కుపదఘట్టనల కిందా శిరమెత్తిన నీ దిటవు సంకల్పం  నిశ్చలం
మరణం కబళించలేని నీ అమరత్వం నిశ్చలం
నిశ్చలం నీ ప్రస్థానం

లంగరు త్రెంచి రేవుకు ఆవలి తీరం సూపిన నీ కౌగిలి నిశ్చలం
ద్రోహపు కత్తుల వంతెన దాటిన నీ అడుగులు నిశ్చలం
వ్యూహపు కదనపు బాటలు వేసిన నీ నడకలు నిశ్చలం
పదుగురి చరణాన పల్లవులు దిద్దిన నీ పాదగురుతులు నిశ్చలం
విద్యుత్తు ప్రసరించే నీ సమక్షం  నిశ్చలం

ఇప్పుడూ
నేనొక శ్మశాన వాటికను
అయినా
అందున్న
నీవూ,
నీ రగల్ పిడికిలీ,
దాల్చిన దాని కొడవలీ,
చూపుడు వేలుకు పరితపిస్తున్నతపంచా,
దాని కొన అంకురించిన మెరుపూ,
దాని తుషార బిందువు ముద్దిడిన
విత్తనం
మాత్రం
మరింత పదిలం

అది
మట్టి పొరల దాగిన నేటి నిశ్చలం

రేపటి మనిమూపున
అననుమతితో భళ్ళుమనే
మనందరి నిశ్చయం

...............................
కామ్రేడ్ వీరాస్వామికీ

పదైదు ఐదు పదైదు

1 comment:

vommy said...

వెపన్‌లా ఉంది కవిత...

శత్రువు కోసం కాపుగాచిన మందుపాతరలా...
వీరాస్వాముడి వీరోచిత జాతరలా...
కన్నీటి కైమోడ్పులా...
రక్తచరితలా...

నాటుకుంది విల్లు గుండెల్లో..
మిత్రుడు ఇక నా జ్ఞాపకాల సందిట్లో...

- ఒమ్మి