ఇపుడు
నేనొక శవ పేటికను
అందున్న
నీ కోమల మార్మిక గుబురు కను రెప్పలు నిశ్చలం
సమతను పొదిమిన నీ నిర్మల హృదయ కవాటాలు నిశ్చలం
వైప్లవ్య గీతికలు ఆలపించిన నీ సుమధుర అధర
విన్యాసాలు నిశ్చలం
మరో ప్రపంచాన్ని కాంక్షించిన నీ నిమీలిత నేత్రాలు నిశ్చలం
ధిక్కారం నెలవున్న నీ ఊపిరి నిశ్చలం
నిశ్చలం నీ నిశ్చయం
అరుణారుణ రేఖల విత్తులు వెదజల్లిన నీ దోసిలి
నిశ్చలం
రేచుక్కను గురిచూపిన నీ తర్జని నిశ్చలం
అధోజగతి అక్షౌహిణి కవాతు ప్రతిఫలించే నీ కరచాలనం
నిశ్చలం
ఉక్కుపదఘట్టనల కిందా శిరమెత్తిన నీ దిటవు
సంకల్పం నిశ్చలం
మరణం కబళించలేని నీ అమరత్వం నిశ్చలం
నిశ్చలం నీ ప్రస్థానం
లంగరు త్రెంచి రేవుకు ఆవలి తీరం సూపిన నీ
కౌగిలి నిశ్చలం
ద్రోహపు కత్తుల వంతెన దాటిన నీ అడుగులు నిశ్చలం
వ్యూహపు కదనపు బాటలు వేసిన నీ నడకలు నిశ్చలం
పదుగురి చరణాన పల్లవులు దిద్దిన నీ పాదగురుతులు
నిశ్చలం
విద్యుత్తు ప్రసరించే నీ సమక్షం నిశ్చలం
ఇప్పుడూ
నేనొక శ్మశాన వాటికను
అయినా
అందున్న
నీవూ,
నీ రగల్ పిడికిలీ,
దాల్చిన దాని కొడవలీ,
చూపుడు వేలుకు పరితపిస్తున్నతపంచా,
దాని కొన అంకురించిన మెరుపూ,
దాని తుషార బిందువు ముద్దిడిన
విత్తనం
మాత్రం
మరింత పదిలం
అది
మట్టి పొరల దాగిన నేటి నిశ్చలం
రేపటి మనిమూపున
అననుమతితో భళ్ళుమనే
మనందరి నిశ్చయం
...............................
కామ్రేడ్ వీరాస్వామికీ
పదైదు ఐదు పదైదు
1 comment:
వెపన్‌లా ఉంది కవిత...
శత్రువు కోసం కాపుగాచిన మందుపాతరలా...
వీరాస్వాముడి వీరోచిత జాతరలా...
కన్నీటి కైమోడ్పులా...
రక్తచరితలా...
నాటుకుంది విల్లు గుండెల్లో..
మిత్రుడు ఇక నా జ్ఞాపకాల సందిట్లో...
- ఒమ్మి
Post a Comment