Wednesday, October 19, 2011

అయినా సరే

జనాలు
తమవి తప్ప
తక్కినవేవీ పట్టని మూర్ఖులు
ఒక పద్ధతీ పాడూ వుండదు.
తలా తోకా వుండదు
పోనీలే
వాళ్ళను క్షమించేసేయ్
@
నువ్వు జాలి, దయ చూపితే
జనం నిన్ను స్వార్థపరుడని అనుకోవచ్చు
నీవు ఏదో ఆశించి అలా చేస్తున్నావని
లేని పోనివి నీకు ఆపాదించి
నిన్ను నిందించనూ వచ్చు
అయినా సరే
చిటికెడు కరుణ పంచు
@
విజయం నిను వరిస్తే
కల్లబొల్లి నేస్తాలూ
కపటి శతృవులూ
నీ పంచన చేరుతారు

ఆరునూరైనా
ఓడలు బండ్లయినా
ముందుకే నడు
@
నువ్వు
నిజాయితీగా ముక్కుసూటిగా
అడుగులేస్తున్నప్పుడు
జనం నిన్ను
నిలువునా ముంచేస్తారు
అయినా సరే
తడబడకు
తగ్గకు
@
ఏళ్ళ తరబడి నువ్ నిర్మించుకున్నది
ఆగంతకులో
రాత్రికి రాత్రే
కుప్ప కూల్చేయవచ్చు
పోతే పోనీలే
కట్టడం మాత్రకు మానకు
@
నువ్వు నిలువెత్తు
నవ్వు పువ్వులా వుంటే
జనం నిను చూసి
అసూయ పడొచ్చు
కానీ
నీ నవ్వు మాత్రం చెరగనీకు
@

నేడు నువ్వు చేసిన మంచిని
జనాలు
రేపటికే మర్చిపోవచ్చు
అయినా నువ్ మంచిని మరువకు
@
లోకానికి
నువ్వు చేసేది ఏపాటిదో
అయినా సరే
చేయడం మానకు
@
ఇదంతా
నీకూ నాకూ మధ్య జరిగే విషయం అనుకునేవు
ఇది
నీకూ
దేవుడికి మధ్య
వ్యవహారం

-

మదర్ థెరిస్సా

No comments: