Monday, September 28, 2015

అడోనిస్

ఆదియందు పదం కాదు వుండింది; ప్రవాసం అని హఠం చేస్తున్న అరబ్ కవి అడోనిస్. సిరియన్ దేశస్థుడూ, పారిస్ నివాసి.  ‘నేను రాస్తున్న భాషే నన్ను ప్రవాసిని చేసింది’ అనే అడోనిస్ దైనందిన పౌర నరకంలో కన్నా అనుదిన ప్రవాస నరకంలో స్వాంతన పొందుతున్నాడు. మాతృత్వం, పితృత్వం, భాషా కూడా ఈతనికి ప్రవాసం మిగిల్చిన తోబుట్టువులే.
ప్రశ్నను పరిచితం చేసే మరో శేషప్రశ్నే కవనం అని ప్రగాఢంగా నమ్మే ఈ అరబ్ గేయకర్త పరోక్షం, ప్రవాసం కలిపి అస్తిత్వాన్ని రూపకల్పన చేస్తాయని నమ్ముతాడు. తన కవిత్వం నాందీ ప్రస్తావన లేని నిరింతర శుభ్ర నాందీ వచనమ్ గానే భావిస్తూ కవనకదనం సాగిస్తూ వున్నాడు. 1930లో పుట్టిన అద్ హో నీస్ (అదీ ఇతని పేరు ఉచ్చారణ) మన దేశ  స్వాతంత్ర్య వత్సరాన, 1947లో, తన తొలి కవితను అచ్చులో చూసి మురిసాడు. తక్కిన సమాచారమంతా గూగుల్ చేస్తే ఇతనికి ఎందుకు 1988 నుంచీ నోబుల్ సాహిత్య పురస్కారం రాకుండా నిలిచిపోయిందో అవగతమవుతుంది కొంత వరకు.
1
##

ప్రవాసం

.............
చెట్టుల్లా
నదుల్లా
పేదల్లాగే
సూర్యుడి తయారీని
నేనూ
*
ప్రవాసం ఎలా కల్పించాడో
అడగండి సూరీడినే
*
అక్షరమక్షరంగా
ప్రవాసం
రహదారుల్లో
వెదజల్లేసింది నన్ను
*
ప్రవాస భాషలు
కావు
సూర్యుడి భాషలు
*
అందుకే నేను ద్రిమ్మరిని
ప్రవాసం  నా అస్తిత్వం
##


2

వనంలో

..................
నను
వదిలేయండి
వొంటరిగా
*
పక్షులు వాలనీయ్
రాళ్ళపై రాళ్ళు పేర్చుకోనీ
వొంటరిగా వదిలేయండి
నన్ను
*
వృక్షాల ఊరేంగిపుల నడిమ
నే నడిచే వేళ
వీధుల కనురెప్పలు తెరిపిస్తాను
శాఖల ఛాయల్లో
పరాయి ప్రభాతాలు నాకు గురుతు
పగలు నా రహస్యాలకు బిరడా బిగించనీ
నను మాత్రం
వొదిలేయండి
వొకింత
వొంటరిగా
వొక కాంతి
ఎన్నడూ నను నా గూటికి
చేరవేస్తూనే వుంది
వొక గొంతుక
పలుకుతూనే వుంది.

........................

http://magazine.saarangabooks.com/2015/09/24/%E0%B0%85%E0%B0%A1%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AA%E0%B0%A6%E0%B1%81%E0%B0%B2%E0%B1%81/

Tuesday, September 22, 2015

Turn! Turn! Turn!







ప్రతీ ప్రతికీ
వొక రుతువుంది

*


స్వర్గ ఛాయన 

ప్రతి క్రతువునా
ప్రయోజనముంది

*


జననం వొక రుతువు

మరణం దాని క్రతువు

*


విత్తేందుకు వొక కాలం

పంటన వేరొకటీ

*


గాయానిది వో సమయం

మానేందుకు వొకింతా

*


కూలేందుకు వొక నిమిషం

కాసేందుకు కాసేపూ

*


వేదనకు వొక ఘడియా

హాసానికి వో విరుపూ

*


నివాళికి వొక జాము

కేళికి ఉదయం

*


కలిసి రాయి విసిరేందుకు వొక క్షణం

కలిసి రాళ్ళు పోగేసేందుకు తక్షణం

*


కౌగిలింతకు వొక రెప్పా

వదిలింతలకు మరొకటీ

*


పొందేందుకు వొక లిప్తం

కోల్పేయేందుకు ఇంకొకటీ

*


కలిమికి వొక కౌగిలి

లేమికి గిలీ

*


చీరేందుకు చిటికె

కూరేందుకు మరొకటీ

*


మౌనానికి మూత

మాటలకో కైత

*


ప్రేమకు వొక కాలం

ద్వేషానిది జాలం

*


యుద్ధం 

వొక క్రతువు

శాంతి 

నవ రుతువు

.........................................................


పరిశుద్ధగ్రంథం(Ecclesiastes మూడవ అధ్యాయం,1-8) నుంచి సంగ్రహించి అద్భుత గీతాన్ని కైగట్టిన  అమెరికన్ జానపద వాగ్గేయకారుడు కామ్రేడ్ Pete Seeger కి తీవ్ర మోహంతో ...........

Monday, September 21, 2015

తనివి

రద్దు చేసుకుంటూ వెళ్తున్నాడు 
అతనే
*

మొదటగా 
కాసిని పంక్తుల్ని

*

అపుడు 
ఆ పంక్తుల్లో 
లెఖ్ఖపెట్టని
పిట్టల్లా
రెక్కలు విదిల్చి
ఎగిరి కనుమరుగయినవి ఇవీ:

మిత్రులు
దిగుళ్ళూ
గతుకులూ
ద్రోహాలూ
మొఖాలూ

*

అతని రద్దు జాబితాలో 
తీసివేతల్లో
కొట్టివేతల్లో వున్నవి ఇవే:

ప్రాయ స్నేహాలు
వుడిగిన అనురాగాలూ
అమలిన దేహాలు

*

తరచూ 
తన రద్దు పద్దును సరిపోల్చుకుంటూ
నిర్మలంగా
చితి పేర్చుకుంటాడు 

అపుడు
నిప్పునా కాలని 
ఏకైక పదసముదాయం
మాత్రం ఇదీ:

‘‘పసందు జీవితం’’
.....................................................................

Monday, September 14, 2015

ARCHIPELAGO

పిడచకట్టుకున్న
పెదాలు
అర్రులు చాచి
ఆర్తిగా
అర్జీ వేసినట్టు


ముప్పిరిగొన్న
దేహం
అలమటించిన మలి రాతిరి
అన్నార్తి
కేకలు వేసినట్టు


నా మటుకు నాకు ఎందుకో
ఈ తక్షణం
దాహంలా
ఆకలిలా
ఆమె వేస్తోంది
మరీ
!
చిరు ద్వీప కూటమి కదా
లో జీవనం.
..........................................................