*
అ/ఆ
నీ కన్నుల్లో నా అచంచల స్వప్నం
నా చూపుల్లో నీ చేలాంచల లోకం
నీ కదలికలో నా తడబడని ఛాయా
నా అడుగుల్లో నీ నిశ్చిత గమ్యం
వుండేది నిన్నా
అది నేడు లేదే
ఎందుకో
*
ఆ/అ
నీ కలయికలో దాగిన ఎడబాటు
నీ మాటల్లో రేగిన లోటు
నీ మౌనాల్లో కానని దూరాలు
నీ ఊసుల్లో తేలని భారాలు
వున్నాయి నేడు
అవి నిన్న లేవే
ఎందుకో
*
అ/ఆ
నీ రాకల్లో పసి హేమంతం
నీ కౌగిలిలో వసి వసంతం
నీ కన్నుల్లో నా దాచిన కన్నీరు
నీ కనుపాపల్లో నా సాచిన సౌష్టవం
వుండేవి నిన్నా
అవి నేడు లేవే
ఎందుకో
*
ఆ/అ
నీ నడకల్లో మార్మిక వీడ్కోలు
నీ బాసల్లో ధార్మిక శిశిరాలు
నీ ప్రేమల్లో వెలిసిన గోడలు
నీ మోహాల్లో మొలిచిన నీడలు
వున్నాయి నేడు
అవి నిన్న లేవే
ఎందుకో
...........................
మణికొండ, మే 25, 15
*అ = అతడు, ఆ = ఆమె