Wednesday, July 1, 2015

సూర్యుని నలుపు రంగు రెక్కలు.

ప్రాతినిధ్య కథ 2014 సంకలనంలోని కథల సమీక్ష
.................................................................
కథ 1 : సూర్యుని నలుపు రంగు రెక్కలు.
రచయిత : డా. వి. చంద్ర శేఖరరావు
కథ టైటిల్ అమితంగా నచ్చింది, అనడం కన్నా కథకి అమితంగా నప్పింది.
అకాలధర్మం చేసిన ఒక దళితుని కథ ఇది. అతని జీవన యానం మూడు సోర్స్ ల ద్వారా పాఠకులకు చేరుతుంది
(అంచెల, కంచెల, అగడ్తల కథన విన్యాసాల వల్ల కథ పాఠకులకు చేరువ అవడం ప్రశ్నార్థకమే.)
సోర్స్ 1 అతని కూతురు
సోర్స్ 2 అతని డైరీ
సోర్స్ 3 అతని ‘పాటల రాణి‘
20 ఏళ్ళ అతని కూతురు ‘ప్రపంచానికి ఒంటరిగా తెలిసిన’ తన నాన్న గురించి చెప్పే కథ ఇది.
మేరీ కరుణ నుంచి రాగశ్రీగా అటు పిదప ‘పాటల రాణి’ గా రూపాంతరీకరణ చెందబడిన, దాంపత్యానికి ఆవల వుండిపోయిన ఒక ప్రియరాలు చెప్పే కథ.
96 పేజీల నిడివి వుండీ, అందులోని 12 పేజీలు తప్ప తక్కిన పేజీలలోని అక్షరాలన్నీ వెలిసిపోయి, ఖాళీ ఖాళీగా వున్న అతని డైరీ చెప్పే క్రానికల్స్ ఈ కథ.
లెట్ మి కన్ ఫెస్...
ప్రాణమున్న రెండు(?) పాత్రలు చెప్పిన కథనం కన్నా... డైరీ చెప్పిన క్రానికల్స్ వల్ల ‘అతను’ మరింత దగ్గరగా అనిపిస్తాడు.
నిజానికి కథ ఏ నేరేటివ్ టెక్నీక్ తో చెప్పినప్పటికీ ఇది దశాబ్దం కాపురం చేసిన దంపతుల జీవనయానం.
దంపతుల్లో అతను దళితుడు. ఆమె ఇతర.
ఇద్దరూ విప్లవ వీచికలో దగ్గరయ్యి ‘so much alike’ గా వున్నామనుకున్న రుతువులో సహజీవించినవారే.
విప్లవకార్యాచరణ నుంచి కుల స్పృహతో బయటపడి దళిత మేధావిగా, కవిగా, పాటగాడిగా, కథకుడిగా చెందిన అతని పరిణామ క్రమాణ్ణి కథ విస్తారించింది.
ఇక అతని భార్య మాత్రం విప్లవోద్యమం నుంచే మొదలై ఆ తర్వాత కులం, వర్గం, వద్దంటూ తన కూతురితో పోట్లాడి, జన సమూహాలకు అవతల, ఆదివాసీల మధ్య చిన్న చిన్న ఉద్యమాలు నిర్మిస్తూ, కోర్టుల్లో దావాలు వేస్తూ తన ఒకనాటి సహచరుని అంతిమ యాత్రలో నలుగురి కంటా పడేందుకు కూడా ఇష్టపడని నైరూప్య, మార్మిక వ్యక్తిగా మిగిలింది.
కథకుడు అతని పాత్రతో చేసిన చెలిమి, ఆమె పాత్రతో ఎందుకు చేయలేదో తోచదు.
కథలో ఒక్క ‘పాటలరాణి’ కి తప్ప మరే పాత్రకూ నామకరణం చేయలేదు చంద్ర శేఖర రావు. కాబట్టి ఈ అనామక పాత్రలను సర్వనామం చేయాలనేది చంద్ర శేఖరరావు ప్రయత్నమని అవగతమవుతుంది.
పేరున్న ఆ ఒక్క పాత్రకీ పేరు ఎందుకో తరచూ సింగిల్ కోట్స్ లోకి ఇరికించబడిందో అర్థమవదు. పైగా ఈ పాత్ర ప్రస్తావనలో ఏదో అంతర్లీనంగానో, అప్రయత్నంగానో (బహుశా ఉద్దేశ్యపూర్వకంగా కూడా అయి వుండవచ్చు) Condescency (చిన్నచూపు, లోకువ ధ్వని) పలుకుతుంది. ఇదే చిన్న చూపు కథ చెబుతున్నప్పుడు కూతరు పాత్ర గొంతులో తన తల్లి ప్రస్తావనలోనూ కనిపిస్తుంది. బహుశా ఇది తల్లీ కూతుళ్ళ మధ్య కాలం చేసిన దూరం వల్ల కూడా కావచ్చు.
లేదా తను నాన్నలాగా నల్లగా, భూమిపుత్రిక(?)లా వున్నాను అనుకుని తండ్రి యోచన ధారను కొనసాగిస్తున్నానన్న ధీమాతో మాట్లాడే బయాస్ లోంచీ తొంగిచూసినదీ అయివుండవచ్చు.
కూతురు తండ్రి వైపు చూపించే ఆరాధ్య పూరిత మొగ్గు, తల్లి పట్ల ప్రదర్శించే dispassionate distance, ఈ రెండూ కూడా రచయిత చంద్ర శేఖర రావు ప్రకటించదలచుకున్న రాజకీయ దృక్పథానికి చెందినది.
చనిపోయిన దళిత మేధావి ఎలా బతికాడో, తనపై తానే విధించుకున్న సంచార జీవనస్రవంతిలో ఎంతమంది ఆత్మీయతానురాగాలను పొందాడో ప్రతీకాత్మకంగా కొంత, సూచన ప్రాయంగా ఇంకొంత, వాచ్యంగా మరి కొంత, కృత్రిమ వ్యాఖ్యానంలో మరింత విశదీకరిస్తూ నడుస్తుంది కథ.
అలా ఈ 20 ఏళ్ళలో తన కుటుంబం గురించి ఏనాడూ మాట్లాడకుండా పోయిన, తన ఊరిలోని స్వంత ఇంటి ముందు చప్టాపైనే జీవనం సాగించడానికి ఇష్టపడిన ఆ మహా ఒంటరి సామాజిక యానాన్ని పాఠకులకు పరిచయం చేసి మనసుల్లో ఆ పాత్ర పట్ల ఉదాత్తతను అంకురింపచేయడమే కథన ప్రధాన ఉద్దేశ్యంగా తోస్తుంది.
డైరీ ద్వారా కథా నాయకుడి గమనాన్ని వినిర్మించిన పద్ధతి మాత్రం అసమానం. మరీ ముఖ్యం రెక్కలు ఎపిసోడ్. అయితే రెక్కలు తొడిగిన కథా నాయకుడు అలా ఆకాశ వీధుల్లో విహరిస్తూ అంబేద్కర్ ను చేరుకున్న తర్వాత అతని రెక్కలు శక్తి కోల్పోవడం అనే metaphor ద్వారా చంద్ర శేఖర రావు రెండు విషయాలను చెప్పాడు. ఒకటి విప్లవ శిబిరం సమకాలిక కులస్పృహను అక్కున చేర్చుకోలేని వైకల్యానికి గురయ్యిందనీ, దళిత ఉద్యమ చైతన్యం రెక్కలు తొడిగి అంబేద్కర్ విగ్రహాల దగ్గరే శక్తులుడిగిపోయిందనీ. ఇది బలమైన రాజకీయ ప్రకటన. ప్రధాన కథలో చాలా తక్కువ నిడివే వున్నా రెక్కలు అనే ఎపిసోడ్ చదువుతున్నంత సేపూ అలెజాంద్రో జి ఇనర్రిటొ సినిమా బర్డ్ మెన్ (లేదా ది అన్ ఎక్స్ పెక్టెడ్ వర్చూ ఆఫ్ ఇగ్నోరెన్స్ ) గురుతుకు రాకమానదు. దాని ప్రభావమూ కథనంపై కనిపించకమానదు.
ఇక ఈ కథా నాయక పాత్ర ఏ దళిత మేధావి నిజ జీవన ప్రతిబింబమో కాదో పాఠకులకు పెద్దగా అవసరం లేదు. కానీ అలాంటి వాస్తవ జీవన దర్పణ భ్రమని కథకుడు పదే పదే కల్పించే ప్రయత్నం కథ ఆసాంతం సాగింది. ఫలితంగా కథానాయకుడిని పాఠకులు స్వతంత్రంగా బేరీజు వేసుకునేందుకు నిరాకరించేంతగా కథన శైలి సాగింది.
చంద్రశేఖర రావు గతంలోనూ తను కీలకం అనుకున్న, ప్రధాన చారిత్రక మలుపులు, మైలురాళ్ళు అనుకున్న కొన్ని యధార్థ సంఘటనలను, అందు పాల్గొన్న కొందరు చారిత్రక వ్యక్తులను తన కథలుగా తర్జుమా చేసే ప్రయత్నం చేసాడు. అదే అతని కథన శైలిగా సుస్థిరమయ్యింది. నిజానికి సమకాలీనతను తన గత కథల్లోలాగానే ఇందులోనూ చొప్పించేందుకు సృజనాత్మకంగా, సమర్థవంతంగా ప్రయత్నించాడు చంద్రశేఖరరావు. అయితే అతని గత ప్రయత్నాలలోని సృజన, సామర్థ్యాలకు సంబంధించిన విజయాల, వైఫల్యాల బేరీజు ఇప్పుడు అప్రస్తుతం. కానీ సూర్యుని నలుపు రంగు రెక్కలు కథ మాత్రం బలవంతంగా గుదిగుచ్చిన (ఒకచో కృత్రిమ) సన్నివేశాల, ఉద్వేగాల, భావాల, పాత్రల, సంబంధాల, దృక్పథాల, వాటి యానాల సముచ్ఛయం.


తాజా కలం:
ఇంతకీ కథానాయకుడు తన ఊరి ఇంటి ముందు వున్న చప్టాపైన పడుకునే ముందు కప్పుకునే శాలువా రంగు గాఢమైన దు:ఖపు రంగా? లేక కథ చివరిపేరాలో హడావిడిగా హఠాత్తుగా ఊరేగింపును చీల్చుకుని వచ్చి ఆమె కప్పే ఎర్ర రంగా? లేక జస్ట్ గ్యాలరీ కోసం క్లయిమాక్సా?
...........................
చింతలపల్లి అనంతు
11 జూన్ 2015
సమీక్ష లో తర్వాతి కథ ..... తలుగు

No comments: