Tuesday, January 20, 2015

ASM

కలలోనూ
కనిపించిందీ
తనే
అనీ కదా
*
కలా పోలికా
*
ఎలా కన్నాను
తననే
కలలోనూ

నులివెచ్చగా
తెలిస్పర్శలా
గురుతెరిగిలా
గింగిరులలా
ముంగురులలా
తోచని నింగిలా
వాలిన మబ్బులా
తొడిమ తెగిన సంజెలా
వాలని రాతిరి తీగల్లా

మళ్ళీ తననే
కానాలంటే
తన కలే కనాలంటే
ఇలానే
ఇదేలా
కలనే
అడగాలా

మరి విన్నపం చేరేది
తనకా
కలకా
కలలోకీ రాని తనకా
రాలేని కలకా
నిద్దురకా
దరికా

ఇద్దరికా 
.

కలబందమ్



నేలఉసిరి పరిచిన

పరిచిత దారుల్లోంచీ

కనకాంబరాల రెమ్మలనుంచీ

లిల్లీ కోమ్మల వొంపునుంచీ

కానుగ పూ పుప్పొడినుంచీ

పున్నాగ సొంపు నుంచీ

తాటి శిఖ పింఛాల మీంచి

సంజెలో

ఆమె 

విరబోసుకున్న

బిగి బిరుసు వంకీల జుత్తులోంచీ

సూరీడుని 

తన నీడలోకే

వొంపేసుకుని

అస్తమింపచేజేసుకుంటుంది

*

ఇక అతను



క్రితం లానే

చిక్కుడు తీగల్లో వసించే చీమల్లా

రేకున దాల్చిన మొగిలి గంధంలా

నీరు ఆశించక చనే నాగజెముడులా

నిండా నీరే చవులూరే ఏటి కలబందలా

నింపాదిగా

తీక్షణతో

పిపాసిలా

నిరీక్షణ గురుతెరిగిన భిక్షువులా

ఇప్పటికీ

జాబిలి జాడకే 

తచ్చాడుతున్నాడు

అను దినాన
.

Monday, January 19, 2015

Unfriend not a friend

నీ మిత్రులు నిను కనిపెట్టాలి
నీ శత్రువులు నిన్ను గమనించాలి
 నీ అమిత్రులు నిను కాపు కాయాలి
నీ మిత్రేతరులు నిను ఒక చూపు చూడాలి
నీ కేవల పరిచితులు నీకు దిష్టి తీయాలి
నీ ఆగంతుక మిత్రులు నీవెంట నీడల్లా తచ్చాడాలి
నీ పైకి ఆయుధం విసరబడినప్పుడు
విసిరిన కన్నునీకే తెలవాలి
కొన్నిసార్లు మౌనమూ ఆయుధం కావచ్చు
నీ రక్తం చిందినపుడు
రువ్విన చేతులు నీకే కానరావాలి
 కొన్నిసార్లు నిర్లక్షమూ హంతక చేతులు తొడగవచ్చు
నీ లోతైన గాయాన్ని చేసిన దుండగుడి
మనసు నీవే గురుతెరగాలి
కొన్నిసార్లు మనసు ద్వేషానికి బహువచనం కావచ్చు
ప్రియ మిత్రమా
యుద్ధానికి సంసిధ్ధం అయిన తర్వాత
ఎదురు శిబిరంలో
మిత్రులెవరు
ఎవరు అమిత్రులు
శత్రువులెవరు
ఎవరు బంధువులు

నా ప్రియ మిత్రమా
యుద్ధానికి సిద్ధం అయిన తర్వాత
సంధించడమే తరువాయి
................................................................................................అనంతు
(దెంచనాల శ్రీనివాస్ కు)