Sunday, August 7, 2011

కెంపు


గుండెలో
అలజడులు అడుగులేస్తుంటే
బతికి వున్నట్టే నువ్వు

చూపులో స్వప్నాల మిణుగురులు
రెక్కలల్లార్చుతూ వుంటే
బతికి వున్నట్టే నువ్వు

ఝంఝా మారుతాల నుంచి
స్వేచ్ఛను గురుతెరుగు

సంద్రపు అలల నుంచి
స్రవంతి నేర్వు

జీవితపు అనుక్షణాన్నీ
అనంత బాహువులతో పిలు

కాలపు న్రతి కదలిక ఒక మొదలు

నీ కనుపాపల్లో
అనూహ్యత ఉరకలేస్తుంటే
నువ్ బతికి వున్నట్టే

గుండెలో
అలజడులు అడుగులేస్తుంటే
బతికి వున్నట్టే నువ్వు

(జిందగీ న మిలేగా దొబారా
ఫరాన్ అఖ్తర్ గాత్రం, జావేద్ అఖ్తర్-పద్యం-నాలుగు)

Saturday, August 6, 2011

నలుపు

ఎపుడెపుడు
దుఖపు మేఘం కమ్మేసినా
ఎపుడు బాధల నీడ పరుచుకున్నా
ఎపుడు కన్నీరు రెప్పలదాకా ఉబికినా
ఒంటరిదై మనసు ఎపుడు గాభరా పడినా
రోదిస్తావెందుకని
ఓదార్చాను హృదయాన్ని

అయినా ఇదే లోక రీతి

ఈ నిశి ఏకాకి సమయాలను
కాలం పంచేసింది
కాసిని నీకూ
కాసిన్ని నాకూ

కొంచెం దిగులు నీ వంతూ
వెలుతురు కొంచెం నా వంతూ

అయినా ఎందుకు కన్నీరు

హృదయమా
ఇవి నీ బతికిన క్షణాలు
మరి మరి
కోల్పోతావెందుకు

రెప్పపాటులో నవ రుతువు
మరి
రెప్ప చాటున కన్నీరెందుకు



(జిందగీ న మిలేగా దొబారా
ఫరాన్ అఖ్తర్ గాత్రం, జావేద్ అఖ్తర్-పద్యం-మూడు)

తెలుపు

పెదవులు దాటని సంగతి ఒకటి
కళ్ళలో తళుకుమంటుంది

ఎపుడైనా
నీ నుంచీ
నా నుంచీ
మాటలు అరువడుగుతారు
అవి తొడుక్కుని
పెదాల దాకా రెక్కలల్లార్చి
పెగిలిన గొంతును
కౌగలించుకుందామని

ఒకటి మాత్రం నిజం
అనుభవం
పల్లవించాలి

గాలిలో సోలిన గంధం
గమకమై పరిమళిస్తుంది

కబురు నీకు చేరుతుంది
ఆనవాలు నాకు అందుతుంది
లోకం నోట కూడా దాగదు
మరి ఇదేం రహస్యం


(జిందగీ న మిలేగా దొబారా
ఫరాన్ అఖ్తర్ గాత్రం, జావేద్ అఖ్తర్-పద్యం-రెండు)

నీలం

కాలం
ఘనీభవించిన నీలం
నీలి నీలి ఈ మవునాలూ

ఎక్కడా నేల ఆనదు
నింగి ఆనవాలూ లేదెక్కడ
ఉసురుసురంటున్న రెమ్మలూ ఆకులూ
గుసగుసమంటున్నాయి
ఇక్కడ
నువ్వొక్కడివే వున్నావని

నేనొక్కడ్నే

నా శ్వాస
నా గుండె లయ
ఈ తీక్షణతల్లో
ఈ ఒంటరి తనాల్లో
నేనే
ఒఖడినే

నా వునికిపై
నాకే
గొప్ప నమ్మకం కుదిరింది

(జిందగీ న మిలేగా దొబారా

ఫరాన్ అఖ్తర్ గాత్రం, జావేద్ అఖ్తర్-పద్యం 1)