Wednesday, July 1, 2015

వదిలెళ్ళిన జోల్ళు

ప్రాతినిథ్య కథా సంకలనం సమీక్ష - 3
కథ : వదిలెళ్ళిన జోల్ళు
రచన: మహిబెజవాడ
.................................................
‘‘జీవితం కాదు మారేది; మనం’’
- థోరో
*
ఒక తీరని కలగా మిగిలిపోయిన అద్భుతమైన కాల్పనికథే వదిలెల్లిన జోళ్ళు. జీవితంలో శరవేగంగా మాయమైపోయిన అపురూప, అరుదైన, అలవికాని అనురాగ, బాంధవ్య కుసుమాలు నజ్జ నజ్జు అయి కల్ళ ముందు నిలిచినప్పుడు కలిగే ఒక డిసూల్యూషన్ మెంట్ నుంచి పుట్టే అంతర్ నిరసనకు ప్రతి రూపమే మహిబెజవాడ మన ముందించిన ఈ సామూహిక స్వప్నం.
*
*
ఇదొక చైతన్య స్రవంతి శైలీ విన్యాసంలో సాగిన మెటారియలిస్టిక్ నేరేషన్. లేమి నుంచి కామి అయిన పాత్ర వ్యాసంగం. ఎంతో కవిత్వాత్మకంగా ఒక కొత్త బంగారు లోకాన్ని ఆవిష్కరిస్తూ మనల్ని తన వెంట తీసుకువెల్ళిన రచయిత చివరికి వచ్చే సరికి వాచ్యానికే దిగాడు. ఇలాంటి కల చెదిరిపోక తప్పదు... ఒక్కరే కంటే మాత్రం. కానీ అలా కల చెదరగొట్టడంలో కూడా రచయిత మకుటాన ప్రదర్శించిన సంయమనమే కడదాకా కాపాడుకోవాలి. అలా జరగలేదు. కథ క్రాష్ ల్యాండ్ అయింది. ఫలితంగా నోటు చుట్టూ జీవితం తిరుగుతోందని తేల్చేసింది కథ. నిజమే. రియాలిటీ బైట్స్. డబ్బులే (క్యాపిటలే) నిర్ధారిస్తోంది అంతా. కానీ అలా చెప్పడానికీ సౌందర్యం కావాలి. అయితే రచయిత మహి బెజవాడది బలమైన, నిజమైన గొంతుక అని తెలుస్తుంది కథ వింటుంటే. It is powerful and at the same time original, and thus wonderful.
*
అవును నిజంగానే శరీరం చాలా తేలికగా గాల్లో గాలిపటంలా ఎగురుతూ వుండేది.
మార్కెట్ మాంజా మన లోపలి పావురం గొంతుకోసి గాలిపటాన్ని చెట్టుకు ఉరేసింది.
లోనా, బయటా కనీస నిరసన సలపక చనిపోయే నిమిత్తమాత్రులం మనం.
*
దూరంగా కొండలు నున్నగా అచ్చం నారింజ రంగులోనే మెరుస్తూ గర్వంగా తలఎత్తుకుని భూమికే దిక్కు చూపే చుక్కానిలా నిలబడి కనబడేవి.
దురాశ పంజా మనకు బంజారా, జుబిలీ, మహేంద్రా, ల్యాంకో కొండలనే మిగిల్చింది; శపించింది.
అయినా ఎల్లాగయినా కాంక్రీట్ విల్లాల్లో బతకాలనే కలను పదిలంగా పదిమందికి పంచేసే రియల్ బ్రోకర్ గిరీ మనకు మాత్రమే సొంతం.
*
అవును అచ్చం మేఘాల వర్ణాలను తొడుక్కునేందుకు ఉవ్విళ్ళూరే నీళ్ళే అంతటా సెల పారేవి.
ఇప్పుడు జల జలగల దందా తాగే నీటికి రంగు, రుచి, వాసనా పులమింది.
హిమాలయాలనుంచి పారే రీజైకిల్డ్ ఫ్లేవర్డ్ నీల్ళనే కొందాం... తర తరాలుగా ఫ్లోరైడ్ తరాలనే, తలరాతలనే నిస్సిగ్గుగా ఇంకా ఇంకా కందాం.
*
అవును నిజంగానే నీటికన్నా నిర్మలంగా, పాలకన్నా స్వచ్ఛంగా అచ్చమైన మనుషులుండేవాళ్ళు.
ఇపుడంతా వినియోగదారులు, కొనుగోలు దారులు, ఆధార్ కార్డ్ హోల్డర్లు, పోటానుపోటీదారులు, కెరీరిస్టులు, సదా నిచ్చెనలే ఎక్కాలనుకునే పాములు, సక్సెస్ మంత్రా జపిస్తూ కిల్లింగ్ ఇన్ స్టింక్ట్ తో అనుక్షణం కట్ త్రోట్ బతకు నేరుస్తున్న తోడేలు ముఖాలుగా విడిపోయి వున్నారు మనుషులు.
*
సమూహాన్ని ఖండఖండాలుగా నరికేస్తున్నఒంటరి వీరుల ఏకాకి కుప్పలు మనుషులు.
*
గిరిగీసుకుని బరి లోకి దిగి పూర్ణ జీవితాన్ని శకలంలో దర్శించేందుకు సమాయత్తమైన కేవల పోరాటవీరులుగా మారిపోయారు మనుషులు.
*
జీవనాన చేష్టలుడిగి వనాన సాయుధులై సమరం సాగిస్తున్నారు మనుషులు.
*
కలవని తనాల అహంకారాల్లో (కంపా)అసార్ట్ మెంటలైజ్ అయిపోయి కకావికలయిపోయారు మనుషులు.
*
అవును నిజంగానే ఇళ్ళు భలే వింతగా తలుపుల్లేకుండా వుండేవి.
కానీ ఇప్పుడంతా గేటెడ్ కమ్యూనిటీస్ లోకి బిలబిలా వలసలు పోతున్నారు మనుషులు.
*
అవును ఆ ఇల్ళలో కిటికీలకు ఊచలుండేవి కావు.
ఇపుడంతా కాల్ళూ, చేతులూ, కలలూ కట్టేసే ఉక్కు ఊచలున్న విండోసే మిగుల్చుకున్నారు మనుషులు.
*
నిజంగానే మనుషులు ఆరడుగులకన్నా ఎత్తులో(పొడవులో కాదు) వుండేవారు.
ఇపుడంతా వినోదం విక్షించే మరుగుజ్జు ఊబకాయ కౌచ్ పొటాటోస్ గా పరిణామం చెందారు.
*
ఇలాంటి వింతలే మహి కథ నిండా.
మరి ఇందులో ఏవి వింతలు?
ఇప్పుడు వున్నవా? ఇప్పుడు మాయమయినవా?
*
కల. భలే బలహీనత మనిషికి.
అంతే బలం కూడా.
మహిబెజవాడ ఇదే మరో సారి గుర్తు చేసాడు.
మనిషి తన సౌఖ్యాన్ని కలగంటాడు.
అన్ని మతాల, సిద్ధాంతాల హామీ సారం అదే.
అయితే ఆ సౌఖ్యం సాంకేతికత ద్వారా (రేపటి నుంచి కాక), అనుభవాలతో(గతం తాలూకు, ప్రాకృతిక సాంగత్యాల; అంటే స్థూలంగా నిన్నటి నుంచీ) ఆశిస్తాడు.
మనిషి ఆకాంక్ష మనుగడ చారిత్రక నేపథ్యమే అది.
ఈ మానవ సహజాత ఆకాంక్షను ఛిద్రం చేసే, నిరాకరించే, నిర్ధారించే, నిర్ణయించే, శాసించే, ఆధిపత్యం చెలాయించే అన్ని ఆర్జన, దౌర్జన్య సమీకరణాలను మనిషి ధిక్కరించాలి.
మనుషులు ధిక్కరించారు.
కానీ ధిక్కరించడం అనే పోరాట రూపమే ఒంటరిగా మనలేదు.
అదే విషయాన్ని ఇలానే ప్రతి కలా మనకు చెబుతోదోందనుకుంటా.
శకలాలుగా.
శకలాల సముపార్జనే సాఫల్యం మనిషికి అంతిమ వెసులుబాటు అనుకుంటా.
ఇది సృజన నెరవేర్చాలంటే ఈ ఎరుకకు తర్ఫీదు అవసరం.
నేర్పరితనం దాని అర్హత.
నేర్పు అనివార్యం.
సమర్థత అన్ని కలల సాకారానికి గీటురాయి కాదా?
అది కనీస మనిషి మనుగడ కాదా?
అది క్యాపిటలిస్ట్ కల తాలూకు సామర్థ్యమా?
లేక తదుపరి ప్రతిపాదనా?
అన్న దానికీ సమర్థతే గీటురాయి.
తక్కినవ్నీ తమకే తెలియని, తేల్చలేని కలలు.
ప్రతిపాదనలు మాత్రమే.
తదుపరి జీవనానికీ అవి స్వాగతాలా?
వున్న, లేక లేని ప్రశ్నలకు అవి ఇప్పటికే నిరోధకాలా?
లేక కంటకాలా?
అని ప్రతి మనిషి అడుగుతూనే వుంటాడు.
తుదివరకు తన ఆలోచన ప్రయాణాన్ని మరణానికి జీవనాన్ని ఫణంగా పెట్టి మరీ.
అడగడం మనిషి మనుగడ కాబట్టి.
మెరుగైన తన తదుపరిని కనడం ఆలోచిస్తున్న ఈ మనుష జాతి అస్థిత్వం కావున.
ప్రతి తదుపరికీ ఆహ్వానమే పలుకుతుంది మనుగడ.
అత్యంత సహజాతంగా.
అయితే ప్రతి కంటకాన్నీ ఎదుర్కుంటుందా?
ప్రతి తదుపరినీ నిర్వచిస్తుందా?
ప్రతి ప్రతిదీ అనంతమైన సమ సౌఖ్యం కోసం తర్ఫీదు అయ్యేందుకు సమాయత్తం చేస్తుందా?
ఇవి కొత్తగా కల కనడం కోసం వేసుకోవాల్సాన నిర్మాణాత్మక ప్రశ్నలు.
కొత్త కలలకు కొత్త టెంప్లేట్ అవసరం.
అది అన్ అవాయిడబుల్ యాప్స్ లాగా మల్టీప్లై అయ్యేంత వైరల్ నేచర్ వున్నంత కల అవ్వడం అనివార్యం.
ఈ ప్రశ్నలు మహిబెజవాడ కనిన కల తాలూకు నే కన్న కలల ప్రశ్నలు.
*
Our ultimate desire seems to rush from simplicity to city.
‘‘గత కాలమె మేలు వచ్చు కాలము కంటెన్ ’’ అనే స్కెప్టిసిజానికి లోనవడం కాదు ఇది.
మనం మధ్యాహ్నం మన హాల్ లోని ఆపిల్ చెట్టుకింద తాపీగా టాప్ రేటెడ్ టీవీ సీరియల్ చూస్తున్నతీరికవేళల్లో మన చేతిలో అమాంతం రాలిపడిపోవడానికి ’మహోన్నత ఆదర్శ సమజీవనం‘ మాగిన పండేమీ కాదు మరి.
అందుకు మనం జోల్ళు తొడుక్కోవాలి.
కనీసం మనలోపలికి మహిబెజవాడ చూపించినట్టు వెల్ళి ఒక బంగారు కల కనేందుకయినా.
ఈ ఉక్కుపోతల్లో, ఉక్కపోతల్లో విరామమైన, తీరికయిన, తీరున్న కలివిడితనాల ఇలాంటి స్వచ్ఛమైన కల కనడం కూడా ఒక ఆంతరిక నిరసనే నా మటుకు నాకు.
మన నుంచి, ఇంటి నుంచి, మన బజారు నుంచి బయలు దేరి ఒక్క సారి బయట సన్నగా మోగుతున్న సామూహిక ధిక్కారాల స్వరాల బృందగానంలో గొంతు కలిపేందుకూ....మనం ఇప్పుడిక జోళ్ళు తొడుక్కోక తప్పదు.
’’జీవితం మారదు; కానీ దాన్ని మార్చుకునేది మాత్రం అంతిమంగా మనమే‘‘
..........................................................................
తరువాతి సమీక్ష కుప్పిలి పద్మ కథ ‘ సెకండ్ హజ్బెండ్’

No comments: