Monday, October 10, 2011

హక్కు

చాలా అలజడి. జ్వరం. కంపరం.
అన్నిఅసేంద్రీయ విశ్వ విద్యాలయాల్లోని శాఖోపశాఖలన్నింటినీ గంపగుత్తకింద కలిపి ఒకే గొడుగు కిందకు తెచ్చారట. ఏ ఎండకా గొడుగు కామన్ సిలబస్ విడివిడిగా చెప్పేందుకు కష్టమైపోయి. ఇప్పుడు కొత్త శాఖకు కొత్త పేరు పెట్టేందుకు మల బద్దకమేసి ముద్దుగా పురావస్తు అని వ్యవహరిస్తున్నారు. అలా నామకరణం చేసిన తర్వాత మధ్యయుగాల శిలాజాలపైన యుపిఎస్ సి లోకల్ శాఖ పెట్టిన చైల్డ్ ఫ్రెండ్లీ పరీక్షలో మెదటి పది ర్యాంకులు ఎప్పటిలాగే గొడుగు యూనివర్సిటీ అమ్మాయిలవే. వాళ్ళలో ఏడుగురు ఆసిడ్ దాడికి గురైన వాళ్ళున్నారు. ఇక పద కొండో ర్యాంకు నుంచి ఇరవయ్యో ర్యాంకు వరకు ఆసిడ్ దాడులు చేసిన మన యూతే కావడమే తమాషా. వాళ్ళలో ఇద్దరు కన్నవారిని గొంతు నులిమి చంపారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తక్కిన వాళ్ళలో మరొకడు రిజల్టు వచ్చిన ముందు రోజు రాత్రే ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు.
అతని చనిపోక ముందు ఒక ఉత్తరం రాసాడు అందమైన దస్తూరీతో. ఆ ౩౩ పేజీల ఉత్తరం లో వున్న లక్ష వాక్యాలు ఒకేలా వున్నాయి.
ఆ ఆకతాయి రాసిన ఉత్తరంలోని వాక్యం ఇదీ.
"నా చావుకు నా తల్లిదండ్రులు, మాగురువులు, మా ఇటు అటు పక్కింటి వాళ్ళూ, వాళ్ళ బంధువులూ, ఇంకొంత మంది(అంటే షుమారు వంద కోట్ల మంది) పురమాయించారు."


ఇప్పుడు ఈ కేసులన్నీ త్రీ టౌన్ కమ్మ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫాల్స్ ఇన్ఫర్మేషన్ రిపోర్టుల వల్లే వెలుగు చూసాయి. 
అదే కొసమెరుపు.
ఆ రిపోర్టులే ఇప్పుడు చాలా కీలకం.
అయితే ఎవరికీ రానన్ని కష్టాలు ఒక్క పోలీసులకు మాత్రమే రావడం చాలా అన్యాయం.
ఇంతకీ విషయమేమిటంటే ఆ నివేదికల్లో ఒకటి కన్నీళ్ళు పడి, మరొకటి రక్తం మరకలు పడి కీలకమైన నాలుగు లైన్లు కనిపించకుండా పోవడంతో పోలీసుల అసలు కష్టాలు మొదలయ్యాయి.
ఇప్పుడు కన్నీళ్ళ తడిపిన ఆ లైన్లు, రక్తం చిమ్మిన ఈ లైన్లు చదవకపోతే కేసే పక్క దారి పట్టే ప్రమాదం వుంది.
కన్నీటి గురించి చిలకజోస్యం బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, రక్తం గురించి హస్త సాముద్రిక శాఖ తాపీగా సమర్పించే పంచరత్నాల గురించే ఇప్పుడు అందరి బెంగా. ఆ తర్వాత విచారణ జరిగితే గిరిగితే కుమ్మరి వీధి కోర్టు జడ్జి షణ్ముఖ రెడ్డి గారు నాలుగు సంవత్సరాల యావజ్జీవ విలాసవంత కారాగార శిక్ష విధించే అవకాశం వుందని www.కాపు సత్తా బ్లాగ్ స్పాట్ డాట్ క్రై లో సభ్య సమాజం చదవలేని లిపిలో జికె శాస్త్ర్రి అనే అనామక బ్లాగర్ ఎవరో కుమ్మేసాడని గుసగస. 

ఇక ఇంకో విద్యార్థికి తక్కిన పరీక్షలతో పాటు జెండర్ పరీక్షలూ నిర్వహిస్తున్నట్టు వినికిడి. అయినా మ్యాటర్ ఎటూ తేలనట్టే లెక్క. తేలినా నిండా మునిగినట్టే.
@
మళ్ళీ అలజడి పెరిగిపోతోంది. జ్వరం రగిలిపోతోంది.
కంపరం రెండింతలవుతోంది.
టీవీ జర్నలిస్టుల ఆకలి చావులు అంతకంతకూ పెరిగిపోతున్నాయని, డెత్ టోల్ మినిమం యాభై వేలని అన్ని టివీల్లో ఒకటే స్క్రాలింగ్.
మల్టీ నేషలన్ కంపెనీలన్నింటికీ ఉప్పు కారం పైన పదకొండు వైవిధ్యభరితమైన పేటెంట్ హక్కలు దక్కాయని బ్రేకింగ్.
ఎటియం కార్డు కొన్న వారికిచ్చే రాయితీలు రాబోతున్న వరదకాలపు రాజ్యసభ బడ్జెట్ గలాటాల్లో భారీగా తగ్గబోతున్నాయన్న పుకారు భగ్గుమంది.
ఈ పుకారుకు స్పందించిన రెడీమేడ్ నిరసకారుల ఆవేశానికి ఆహుతైన జనాల్లో నెలకు ౩౩ వేలు సాలరీ వచ్చే వలస కూలీలే ఎక్కువ మంది అట. దాదాపు ఈ దాడుల్లో 356 మంది మృత్యువాత పడ్డారని మరో తిరుగులేని వార్తా కథనం. ఎన్నడూ ఎలాంటి ఎమోషన్ కూ గురి కాని మిస్టర్ తెల్లతుండు వాగ్గేయ TV95లో ఊగిపోతూ సైగలు చేసి మరీ చర్చ గెలిచి అక్షరాల ఐదు వేల రూపాయల ప్రైజ్ మనీ ఎగరేసుకుంటూ వెళ్తూ వెళ్తూ ...
"పరిస్థితి ఎంత విషమించిందో మీరు ఇట్టే ఊహించుకోవచ్చు" అని లైవ్ కెమెరాలో చెప్పాడు.
సాఫ్ట్ వేర్ ప్రొఫషనల్స్ గత రెండున్నరేళ్ళ నుంచీ తమ జన్మ హక్కులా జరుపతున్న కరువు దాడులను సమర్థిస్తూ గే క్లబ్ వాళ్ళు లింగాయతుల హైకోర్టులో వాదించి కేసు గెలిచారు. అయితే ఈ తీర్పు చెల్లదని మరో తెలుగుదేశం జడ్జి ఏక పక్షంగా కొట్టపారేశాడట. దీన్ని కూడా సవాలు చేస్తూ లైసెన్స్ డ్ ప్రాస్టిట్యూట్స్ ముందుగా కింది కోర్టులో , ఎందుకయినా మంచిదని సుప్రీం కోర్టు లో పోలీసు ప్రయోజనాల వ్యాజ్యం వేసారట. వ్యాజ్యాలతో తగవు ఎప్పటికీ తీరదన్న నిరాశకు గురైన న్యూ డెమొకసీ రెవెల్యూషనరీ అలయెన్స్ పాలిట్ బ్యూరో సభ్యుడిగా లొంగిపోక ముందు చిలిపి పని చేసిన జడ్జి సాగర్ అలియాస్ ధర్మన్న అలియాస్ గంగులు ఆత్మ హత్య చేసుకున్నాడు. 

దాంతో ఇటు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, అటు లైసెన్స్ డ్ వేశ్యలూ ముక్త కంఠంతో గర్జించారిలా...
"మా బతుకు రెంటికి చెడ్డ రేవడి అయ్యింది బాబయ్యా."

వాడెక్కా!
ఇట్లా ఆహ్లాదంగా ఎవురన్నా సరే చించుకుని పొలికేకలు పెడితే 108 సైరన్ లాగా సమ్మగా వినిపిస్తుంది మనసుకు.

*
ఇప్పుడు 
జ్వరంతో పాటు కల మొదలైంది. కల కాదు కలలు.
"Power is like a violin. It is held by the right hand and played by the left".... అని గణేష్ బీడీ రెడాక్సైడ్ లో ముంచి   మా ఇంటి ఎదురుగా వున్న కూలిన గోడపైన ఎవరో ఎడమ చేత్తో రాస్తున్నట్టు కల.
యిలాంటదే ఇంకో కల.
కల లోపల కల పోలిన మరో కల. కలగలసిన కల.
కకావికలమైన కల కలం.
కలం చితికిన కాలంలో ఈ కల.
అలజడి...జ్వరం...కలవరం...
సడన్ గా ఫోన్ మోగుతోంది.
రింగ్ టోన్ అలవాటయినదే. పైగా అసైన్డ్ టోన్ అది.
మోత. ఎలా పెరిగిపోయిందంటే నా చెవులు ఆ డెసిబెల్స్ ని గుర్తించలేనంత.
కర్ణభేరి కనీసం నూరు సార్లు చిట్లిపోయేంత మోత.
Lift man... take my call- అంటున్నట్టు వుంది రింగ్ లోన్ హోరులో కొట్టుకుపోయిన ఆకుపచ్చని నినాదంలాంటి అవతలి గొంతు.
కలకు అడ్డం తగులుతున్న రింగ్ టోన్ మోత. కల కంటిన్యూ కాకుండా మోత.
కళ్ళు తెరుచుకోవడం లేదు.
నా రెప్పల్ని ఎవరో ఫెవికాల్ తో అతికించారు.
కల కుదిపేస్తోంది.
ఆ ఫోన్ మోత నా వంట్లోని శక్తినంతా పీల్చేస్తోంది స్లోగా.
ఎందుకు నా చెయ్యి ఫోన్ దగ్గరికి పోవడం లేదు.
ఎందుకు నాకు మెలకువ రావడం లేదు.
ఠప్ మని కళ్ళు తెరుచుకున్నాయి.
అర గంట నుంచి నా మెదడు పంపుతున్న సంకేతాలు నా కంటికి చేరకుండా దారి మళ్ళిస్తున్నారెవరో.
ఎవరు?
హమ్మయ్య ! ఇప్పుడు సిగ్నల్ అందింది.
కళ్ళు తెరుకున్నాయి.
ఫోన్ ఇంకా మోగుతోంది.
చుట్టూ చూసాను.
షిట్! అది నా ఇల్లు కాదు.
అంటే ముందు రోజు రాత్రి కూడా నేను నా ఇంట్లో పడుకోలేదా?
ఎవరో లిఫ్ట్ ఇస్తే ఇలా ఈ నగరంలో రోజుకో ఇంట్లో పడుకుంటున్నానా?
మరి నాకు రోజూ లిఫ్ట్ ఇస్తున్నది ఎవరు?
ఫోన్ ఇంకా తెగ మోగుతోంది.
నగరంలో అందరూ పడుకునే వున్నారు ఎప్పటి లాగే పట్ట పగలు.
నాదే కాదు అందరి ఫోన్లూ మోగుతున్నాయి. మోత మూడింతలు దద్దరిల్ల్లు తోంది.
బహుశా నేను ఆ క్షణం ఫోన్ ఎత్తక పోతే ఆ రింగ్ ఆగిపోయేదేమో.
బహుశా అదే ఆఖరి రింగ్ అనుకుంటా.
ఎత్తేసేయాలి. ఎలా?
ఓసినీ మెదడూ సంకేతాలు పంపు... చేతులు వెయిట్ చేస్తున్నాయి.
మోత కాదది ఝంఝ. 

కాదు కాదు గర్జన. 
వసంత కాల మేఘ గర్జన.
ఫోన్ ఎత్తేసాను.
ఎలా ఎత్తానో హేతువుకు అందలేదు కానీ ఫోన్ ఎత్తేసాను. చివరి రింగుకు నానో సెకను ముందు.
ఛ! అది ఇన్ కమింగ్ కాల్ కాదు.
"హలో"
ఇంత సేపూ అవతలి వాయిస్ హలో అంటూనే వుందా?
నీ యబ్బ! అయితే నేనే చేసానా ఫోన్. ఛ
ఒక్క కల చిందరవందర చేసింది.
ఒకే ఒక్క చెత్త కల. రాకూడని కల. రావద్దనుకున్నా వచ్చి కమ్మేసింది ఆ కల.
"హలో" అనేసాను.
ఒక్క సారి దిమ్మ తిరిగిపోయింది.
అసలు ఫోన్ ఎందుకు చేసానో గుర్తు లేదు.
అసలు ఫోను నేనే చేసానో లేదో కూడా తెలియదు.
ఏ మవుతోంది నాకు.
"హలో" అంటోంది ఇంకా అవతలి గొంతు.
బహుశా నేను మాట్లాడకపోతే ఫోన్ కట్ అయిపోయేదే.
"సార్ వున్నారా?"
ఏం అడగాలనుకున్నాను? ఏం అడిగాను? ఏం అన్నానో తెలీదు.
"బాలగోపాల్ ఇప్పుడే స్కూటర్ స్టార్ట్ చేస్తున్నాడు"
అపుడపుడే తెలవారుతుంటే హాయిగా వినిపించింది ఆ గొంతు.
*************************************************






No comments: