

నిప్పు చెట్టు
నదిని ఆనుకుని
ఓ చెట్టు
దాని కంటి నిండా ఆకుల బొట్లే
తీరం వెంట
ఒక్కొక్కటిగా రాల్చుతోంది
#
జ్వాల రాజుకునేది
ఈ వొరిపిడికే:
ఇది చెట్టు ప్రవచనం
నది మదికి
#
నేను ఏ చూపులకూ ఆనని
ఆఖరి ఆకును
బహుశా
నా వాళ్ళంతా
ఆనవాలే లేని జ్వాలల్లా
చని
పోయి
వుంటారు.
2
రోజులు
కనులు అలసి పోయాయి
వచ్చీ పోయే రోజులకోసం
పోయీ రాని రోజుకోసం
కనులకు వచ్చే
అలుపు కాదది
#
అయినా
ఎప్పటికీ ఇలా
రోజుల గోడలను
ఒకదాని తర్వాత మరొకటి
దాటుకు పోయే విన్యాసం
మరో ప్రభాతం కోసం
చేస్తూనే వుండాలా?
అసలు మరోసారి పొద్దు పొడుస్తుందా?
నిజంగా
మరోసారి
తెల్లవారుతుందా?
3
దారి
జీవితం పంచమని
జ్వాలనూ
మంచునూ
అర్థించాను
మంచు అక్కున చేర్చుకోలేదు
జ్వాల లీనం చేసుకోలేదు
అయినా
శిలల్లా నిటారుగా నిలిచి
పూలలా ఎదురు చూస్తూ
నా ప్రశాంత చిత్తాన్ని కోల్పోలేదు
ప్రేమలో
నన్ను నేనే కోల్పోయాను
నే కలగన్న జీవితానికీ
నే బతికిన ఓ చంచల కలకీ
మధ్య
లహరిలా... లాహిరిలా
కొట్టుకుపోతుంటే
నేను
భగ్నమై
నిరీక్షించానంతే
4
మగ కల
ఆమె అల
నేను ఆమెలా
ఆమె ముఖ చిత్రం
నా జీవన చైత్రం
ఆమె
అలా
అలలా
తీరం కనని నావలా
ముత్యపు చిప్పల అడుగున
రేవుకు తడబడిన త్రోవలా
#
ఆమె ముఖ చిత్రం
నా జీవన చైత్రం
నేను అల
ఆమె నన్ను కోల్పోయి
అలా
దీపస్థంభమై
ఎదురు చూస్తూ వుందలా
నా పిచ్చి ద్రిమ్మరి సరంగు రక్తం కోసం
5
నేలమాళిగ
మా రెప్ప పాటులో
నగరాల
మను
గడ
చింది
ముఖాల
అభిముఖాల వెనుక
మా పొలికేక:
" ప్రతి నగర శ్మశాన వాటికలో
చక్కని గుల్లల్లో
మెత్తని నత్తల్లా
వున్నాం.
నిరాకరణ నగరాల్లారా!
రండి
కనండి
కనుక్కోండి
మమ్మల్ని"
6
నిద్ర ముద్ర
ఈ రోజు
అరచేతులు చాస్తున్నాను
చావు కనురెప్పల వాలక ముందే
ఈ నేల తన సువిశాల
చర్మం కింద
నా తనువును కప్పేసి
నా చేతుల్లోనే
శాశ్వత నిద్రలోకి జారుకోక ముందే
చాస్తున్నాను
నా అరచేతులనే
The Passage Of Day and Night by Adonis (Arabic Poet)
Translated by Samuel Hazo