
సుమాల నడుమ
చషకంతో
వొంటరిగా
సేవిస్తూ
జాబిలిని అడిగాను
జత కట్టమని
చషకం
చషకంలో తేలియాడే
నాదొక్క
జాబిలిదొక్క బింబం
మేం ముగ్గురం... అంతే!
అరెరే
జాబిలి తాగలేదుకదా అని చింతించాను
నా నీడ అలా ఖాళీగా
నాతో అడుగులేస్తూ వుంది
అనంత మౌనంతో
సఖులెవ్వరూ లేరు సమక్షంలో
ఈ ఇద్దరి సావాసంలో
లేమి దిగులూ లేదు
యీ వుత్సవ కాలంలో
నేనూ నను చేరిన వారితో
సంబరించాలికదా
చల్లని వెన్నెలలో పాడుతుంటే
జాబిలి జత కట్టినట్టే వుంటుంది
నేనాడితే
నా నీడ నాతో సయ్యాడుతుంది
మందుకు ముందు
జాబిలి
నీడలే
నా సఖులు
మత్తెక్కిన మరుక్షణం విడిపోతాం
అయినా సరే
ఏ లౌకిక రాగ ద్వేషాల ఛాయ సోకని
వీళ్ళిద్దరే
నాకత్యంత యిష్ట సఖులు
బహుశా
ఒక నాటికి
పాలపుంతల లోపొరల్లో
మేం ముగ్గురం
మరోలా
మళ్ళీ కలుస్తాం
-లీ పో
(ఇతను క్రీస్తు శకం 701-762 మధ్య జీవించిన చైనా కవి)